Jul 13, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -7



మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి

మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే పరిచయం. అక్కడే మేం మంచి స్నేహితులమయ్యాం. మోహన్ రావు ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ నుంచి విశాఖకు ట్రాన్స్ ఫర్. ఆంధ్రజ్యోతి-హైదరాబాద్ లో నా క్లాస్ మేట్ తిప్పావఝ్జుల కుమార్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తొలుత కుమార్ రిఫరెన్స్ తో మోహన్ రావు నాకు పరిచయం. ఆ పరిచయం స్నేహంగా మారి, ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి మాత్రం నాకు విశాఖలోనే పరిచయం. మేమిద్దరం విశాఖలోనే ఆంధ్రయూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ పూర్తి చేసిన విషయం మీకు తెలుసు.

విశాఖ-ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారిలో ఎక్కువ మంది జీతాలపై బతికేవాళ్లమే. నాకు మాత్రం రూ.2 వేలు జీతం. శ్రీనివాసరెడ్డి కూడా స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. అందువల్ల అతనికీ దాదాపు నా అంతే వచ్చేది. మోహన్ రావు ఏపీఎల్ అపాయింట్ మెంట్ అందువల్ల నాకంటే ఎక్కువగా ఉండేది. అందరికీ మనీ మేనేజ్ మెంట్ తెలుసు. చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకునేవాళ్లం. అదీగాక, విశాఖ కొత్త, అక్కడ ఆఫీసులో వాళ్లు తప్ప బయట వాళ్లు ఎవరూ పెద్దగా తెలియదు. ఆ రూ.2వేలు జీతంతో మేమిద్దరం, మాకు ఇద్దరు పిల్లలు నలుగురం చాలా సంతోషంగా బతికేవాళ్లం. శుక్రవారం ఆఫ్. ప్రతి శుక్రవారం అందరం రామకృష్ణ బీచ్ కు వెళ్లేవాళం. అప్పుడు కైలాసపురం నుంచి బీచ్ కి ఆర్టీసీ బస్ చార్జి రూ.2లు ఉండేది. ఒకటే టిక్కెట్. నాకు ఫ్రీ పాస్ ఉండేది. పిల్లలకు టికెట్ లేదు. జీవితం సాఫీగానే సాగేది. ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే ఎవరికైనా సమస్య.  ఎవరికైనా ఇబ్బంది వస్తే, మిషన్ సెక్షన్ లో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన వద్ద వడ్డీకి తీసుకునేవారు.  అతని పేరు గుర్తు లేదు. లావుగా ఉండేవారు. జీతాలు ఇచ్చే రోజున అక్కడే ఉండి, వడ్డీ లేదా అసలు వసూలు చేసుకునేవారు.  చాలా మంది అతని వద్ద వడ్డీకి అప్పు తీసుకునేవారు. వడ్డీ రూ.3లు. నేను కూడా రెండు మూడుసార్లు తీసుకున్నట్లు గుర్తు. వెయ్యి, రెండు వేలు మాత్రమే తీసుకునేవాడిని. ఎందుకంటే మళ్లీ తిరిగి చెల్లించడం కష్టం గదా. అదీగాక అప్పు తీర్చేదాక నాకు నిద్రపట్టదు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించడం నాకు అలవాటు. అందువల్ల నా మిత్రులకు నేనే అప్పు ఇచ్చేవాడిని గానీ, నేను ఎవరి వద్ద అప్పు తీసుకునేవాడిని కాదు.    నాకు ఎప్పుడైనా అత్యవసరం అయితే, నేను రూ.2ల వడ్డీకి ప్రయత్నించేవాడిని. ఒకసారి ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆపరేషన్. మిషన్ సెక్షన్ అతని అడిగాను, ఆ సమయంలో అతని వద్ద కూడా లేవు. చాలా మంది వద్ద ప్రయత్నించాను. ఆఫీసులో ఎక్కువ మంది, నాకు సన్నిహితంగా ఉండేవారందరూ ఆ జీతాలతో బతికేవారే. అందువల్ల వారిని అడగలేదు.  వాస్తవానికి నేను అడిగితే ఇచ్చేవారు ఇద్దరు ఉన్నారు. మా మామగారిని అడిగితే ఇచ్చేవారే. వాళ్ల వద్ద తీసుకోవడం నాకు ఇష్టంలేదు. నా పెళ్లి జరిగిన తర్వాత వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పెళ్లి రోజుకు బట్టలు కుట్టిస్తామన్నా, వద్దని నేనే కుట్టించుకున్నాను. నా పెళ్లికి వాళ్లు బట్టలు కుట్టించడం ఏమిటి? అని అనుకునేవాడిని. అది నా స్వభావం. మా బావ, మేనత్త కొడుకు, మా అమ్మ చిన్నమ్మ కొడుకు, మా పెదనాన్న అల్లుడు బిట్రా ముకుందరావుని అడిగితే ఇస్తారు. అయితే, ఆయనతో ఓ సమస్య. నేను అవసరంలో ఉన్నానని తెలిస్తే చాలు అడక్కుండానే ఇస్తారు. తిరిగి ఇస్తే తీసుకోరు. ‘‘నాకు నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తారు. నా భార్యకు ఆపరేషన్ జరిగే రోజు తర్వాతి రోజే అన్నవరంలో ఆయన కూతురు పెళ్లి. ఆ సమయంలో ఆయనను అడగటం బాగోదని నేను అడగలేదు. అలాగే, ఆమె ఆపరేషన్ కు సిద్దమయ్యాం. ఈఎస్ఐ ఆస్పత్రి- ఆపరేషన్ ఫ్రీ. అయినా, కొంత డబ్బు చేతిలో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే, ఆపరేషన్ కు సిద్ధమయ్యాం. ఉదయం ఆస్పత్రికి ఆఫీస్ స్టాఫ్ చాలా మంది వచ్చి పలకరించి వెళ్లారు. చివరికి మోహన్ రావు - శ్రీనివాసరెడ్డి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరూ డ్యూటీకి వెళ్లాలి.  చివరకు మోహనరావు నా జేబులో రూ.2 వేలు పెట్టి ‘‘అవసరం అవుతాయోమో ఉంచుకో’’ అని చెప్పి వెళ్లిపోయాడు.   మోహనరావు వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసరెడ్డి ‘‘నాగార్జునా నాది ఓ పోజిటివ్ బ్లడ్. ఎవరికైనా డొనేట్ చేయవచ్చు. నీ మిసెస్ కి ఆపరేషన్ గదా బ్లడ్ ఏమైనా అవసరమైనే నేను ఇస్తాను. నేను సెలవు పెట్టి వచ్చాను. సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాను’’ అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ఈఎస్ఐలో సూర్యాకాంతం అనే డాక్టర్ ఉండేవారు. ఆమె విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ పేరు సూర్యాకాంతం, అందుకనే ఆమె పేరు ఇప్పటికీ గుర్తు ఉంది.

ఆపరేషన్ జరిగిన తెల్లారి, వాళ్ల అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత మా బావ ఆస్పతికి వచ్చి, పలకరించి, నేను అడగకుండానే ‘‘అవసరం అవుతాయి ఉంచుకో’’ అని నాకు రూ.3 వేలు ఇచ్చి వెళ్లారు.  ఆ తర్వాత కొంత కాలానికి మోహన్ రావుకు వడ్డీ లేకుండా అసలు రూ.2 వేలు ఇచ్చేశాను. మా బావకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే, ఇచ్చినా ఆయన తీసుకోడు. పైగా ‘‘నాకు నువ్వు తిరిగి డబ్బులు ఇవ్వడం ఏమిటిరా?’’ అని అరుస్తాడు. ఆపరేషన్ జరిగిన రోజు సంఘటనలు నేను చాలా మందికి చాలా సార్లు చెప్పాను.

(అయిపోయింది)

No comments:

Post a Comment

ఆంధ్రజ్యోతి పరివారం -7

మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే ప...