Jul 13, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -6

                                                                    ఆంధ్రజ్యోతి మేనేజ్ మెంట్

నేను జర్నలిస్టుగా దాదాపు 11 సంస్థలలో పనిచేశాను. వాటన్నిటిలో అప్పటికి, ఇప్పటికీ ఆంధ్రజ్యోతి నెంబర్-1, ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్. ఆంధ్రజ్యోతి అంటే, ఇక్కడ స్పాట్ న్యూస్. నాది స్పాట్ న్యూస్ అపాయింట్ మెంట్. నేను ఆంధ్రజ్యోతి-విశాఖ లాంచింగ్ ఎడిషన్ లో రూ.2వేల జీతానికి చేరి, రూ.3 వేలు పెరిగే వరకు పని చేశాను. నేను రాజీనామా చేసిన తర్వాత, అప్పటి వరకు నాకు  మిగిలిపోయిన సెలవులు నెలా 15 రోజులకు రూ.4,500 ఇచ్చారు. దాదాపు నా 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎక్కడా మిగిలిపోయిన సెలవుల జీతం ఇంత ఇవ్వలేదు. మిగిలిన సెలవుల జీతం ఇచ్చినట్లే గుర్తు లేదు. 

ఇక్కడ స్పాట్ న్యూస్ క్లర్క్ మేరి కుమారి గారి గురించి చెప్పాలి. నాకు ఇప్పటికీ  సీఎల్స్, సిక్ లీవ్స్, ఈఎల్స్ పెట్టే విధానం తెలియదు. ఈ సెలవులు పెట్టే విషయంలో ఒక్కో సంస్థలో హెచ్ఆర్ విధానం ఒక్కోలా ఉంటుంది. ఒక రకమైన సెలవు తర్వాత, ఇంకో రకమైన సెలవు పెట్టకూడదని, ఎక్కువ రోజులు పెట్టాలంటే ఒక రకమైన సెలవు, తక్కువ రోజులైతే ఒక రకమైన సెలవు అని ఉంటాయి.  సెలవులు ఎలా పెట్టాలో తెలియక, సెలవులు పెట్టే సమయంలో   మేరి కుమారి గారిని విసిగిస్తుండేవాడిని. నా పరిస్థితి కొద్ది రోజులు చూసి, చివరికి ఆమె ఇలా చెప్పారు. ‘‘మీకు ఎప్పటి నుంచి ఎప్పటి ఎప్పటి వరకు ఎన్ని రోజులు  సెలవు కావాలో రాసి, కింద సంతకం చేసి నాకు ఇవ్వండి. అక్కడ ఏ సెలవు రాయాలో నేను చూసుకుంటాను. సెలవుల విషయంలో మీకు నష్టం జరగకుండా నేను చూసుకుంటాను’’ అని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి లీవ్ లెటర్ లో నేను ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నానో, అదే రాసేవాడిని. ఏ సెలవో రాసేవాడిని కాదు. చివరకు నేను ఆంధ్రజ్యోతిలో రాజీనామా చేసి, విశాఖలోనే వార్తలో చేరారు. 15 రోజులు తర్వాత, ఆంధ్రజ్యోతి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘ఆంధ్రజ్యోతిలో మిగిలిపోయిన మీ సెలవులకు డబ్బు ఇవ్వమని హెడ్ ఆఫీసు(విజయవాడ) నుంచి మెసేజ్ వచ్చింది. వచ్చి తీసుకు వెళ్లండి’’ అని చెప్పారు. మిగిలిపోయిన సెలవులు అంటే వెయ్యి రూపాయలో, 15 వందల రూపాయలో వస్తాయని అనుకుంటూ ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లాను. నెలా 15 రోజులు సెలవులు మిగిలిపోయాయని రూ.4.500లు ఇచ్చారు. నాకు అన్ని సెలవులు మిగలడానికి ప్రధాన కారకురాలు మేరి కుమారి గారు.  ఆంధ్రజ్యోతిలో నేను మానివేసే సమయంలో తీసుకున్న జీతం రూ.3 వేలు. ఆ సమయంలో ఊహించని విధంగా నెలా 15 రోజుల జీతం, అంత డబ్బు అందుకొని నేను ఎంత ఆనందించానో మాటలలో చెప్పడం చాలా కష్టం. మీరే ఊహించుకోండి. దటీజ్ ఆంధ్రజ్యోతి.

ఆంధ్రజ్యోతిలో ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్(ఏపీఎల్), దాని అనుబంధ సంస్థ స్పాట్ న్యూస్‌పై ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని అపాయింట్ చేసుకునేవారు. ఏపీఎల్ వారికి, స్టాట్ న్యూస్ వారికి జీతంలో, నైట్ డ్యూటీ అలవెన్సులలో చాలా వ్యత్యాసం ఉండేది. అప్పట్లో నైట్ డ్యూటీ అలవెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడా లేదనుకుంటా. నా అపాయింట్ మెంట్ స్పాట్ న్యూస్. జీతం కూడా ఏపీఎల్ వారికి 1వ తేదీనే ఇచ్చేవారు. మాకు ఆలస్యంగా ఇచ్చేవారు. 

నాకు తెలిసినంతలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎడిటోరియల్ స్టాఫ్ ని, రిపోర్టర్స్ ని చాలా గౌరవంగా, మర్యాదగా చూసుకునేది. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోయినా, ఇబ్బందికరంగా అనిపించినా ఉద్యోగం నుంచి తొలగించేదికాదు.  కలకత్తాకో, మద్రాస్ కో ట్రాన్స్ ఫర్ చేసేవారు.  అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారు విశాఖ వచ్చినప్పుడుల్లా ఎడిటోరియల్ స్టాఫ్ తో మీటింగ్ పెట్టేవారు. అందరికీ అప్సరా హోటల్ నుంచి బిర్యానీ వచ్చేది. ప్రతి మీటింగ్ లో నేను ఏదో ఒకటి ఆయనను అడిగేవాడిని. ఆయన చాలా సింపుల్ గా సమాధానాలు చెప్పేవారు. ఒకసారి, ‘‘సార్, ఏపీఎల్ వారికి, స్పాట్ న్యూస్ వారికి జీతంలో చాలా వ్యత్యాసం ఉంది.’’ అని అడిగాను. ‘‘అందుకోసమే గదా స్పాట్ న్యూస్ పెట్టింది’’ అని ఆయన సింపుల్ గా సమాధానం చెప్పారు. ‘‘ఆ వ్యత్యాసాన్ని తక్కువగా ఉండేట్లు చూడండి’’ అని అడిగాను. ‘‘చూస్తాం’’ అని మాత్రమే సమాధానం చెప్పారు. మరోసారి, ‘‘ఏపీఎల్ వారికి 1వ తేదీనే జీతం ఇచ్చారు. 5వ తేదీ వచ్చినా మాకు జీతం ఇవ్వలేదు సార్’’ అని చెప్పారు.  అప్పుడు మా స్టాఫ్ లో కొందరు ‘‘నాగార్జున ఏంటి ఇలా అడిగారు’’ అనుకున్నారు. అయితే, ఎండీ గారు మాత్రం  వెంటనే ఆ రోజే జీతం ఇప్పించే ఏర్పాటు చేశారు. ఇంకోసారి, ఎండి గారు వచ్చినప్పుడు, ఆ సమయంలో ఎడిటోరియల్ స్టాఫ్ ని తీసుకునే ఉద్దేశం ఉంది. విజయనగరం జిల్లాలో ఓ గ్రామీణ విలేకరి. పేరు గుర్తులేదు. అతను వార్తలు చాలా చక్కగా రాసేవారు. డెస్క్ లో పెన్ను పెట్టే అవకాశంలేకుండా ఏ వార్త ఎంత రాయాలో అంతే రాసేవారు. అటువంటి వ్యక్తిని డెస్క్ లోని తీసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. అదే విషయం నేను ఎండీ గారికి చెప్పాను. నేను చెప్పినదంతా విని, ఆయన అక్కటే మాట అన్నారు. ‘‘తీసుకోండి, పడేది మీరేకదా’’అని అన్నారు. అంటే, అతను బాగా రాయలేకపోతే, ఇబ్బందిపడేది మేమేకదా అన్నది ఆయన  ఉద్దేశం. ఆ తర్వాత ఆ విలేకరిని డెస్క్ లోకి తీసుకున్నాం. కొంత కాలం తర్వాత అతను ఆర్టీసీ కండక్టర్ గా సెలక్ట్ అయి వెళ్లిపోయారని చెప్పారు. 

ఇప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా చాలా వరకు ఆ పద్దతులనే అనుసరిస్తోంది. కరోనా సమయంలో దాదాపు రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసు హైదరాబాద్  సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను. ఎడిటోరియల్ స్టాఫ్ కి అదే మర్యాద, జీతం 5 నుంచి 8వ తేదీ మధ్యలో అందరికీ ఇచ్చేవారు. చాలా హాయిగా పని చేసుకున్నాను. నేను ఉన్న సమయంలో ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ స్టాఫ్ తో  ఒకసారి సమావేశమయ్యారు.  వాస్తవానికి అక్కడే రిటైర్ అవుదామని అనుకున్నాను. కుటుంబ అవసరాల రీత్యా నేను మంగళగిరిలో ఉండవలసి ఉన్నందున, నాకు ఇష్టంలేకుండానే, బాధపడుతూ రాజీనామా చేసి వచ్చాను. 

ఆ తర్వాత నేను పనిచేసిన వాటిలో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు యాజమాన్యం నాకు బాగా నచ్చింది. చెన్నైలో  ఆ గ్రూపునకు సంబంధించిన ఏపీవీక్లీ.కామ్ కు చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా పనిచేశాను. అక్కడ  నాకు ఒకసారి జీతం పెరిగింది. నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, జీతం అందుకునే సమయంలో మాత్రమే ఎవరికైనా  జీతం ఎంత పెరిగిందో తెలిసేది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అలా కాదు, నెల ముందే తెలుస్తుంది. ఒకసారి నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ సక్సేనా గారు నా వద్దకు వచ్చి, ‘‘Please come to my cabin’’ అన్నారు. వాస్తవానికి ఆఫీస్ బాయ్ చేత కబురు చేయవచ్చు. కానీ, ఆయనే నా వద్దకు వచ్చారు. ఆయనతోపాటు కేబిన్ కు వెళ్లిన తర్వాత, ఎదురుగా కుర్చీ చూపించి, కూర్చోమన్నారు. నేను కూర్చున్న తర్వాత, సొరుగులో నుంచి ఒక లెటర్ తీసి, ‘‘వచ్చే నెల నుంచి మీకు జీతం  పెరుగుతుంది’’ అని చెప్పి, ఆ లెటర్ నా చేతికి ఇచ్చి, అభినందించారు. వచ్చే నెల నుంచి నా జీతం ఎంత పెరుగుతుందో ఆ లెటర్ లో రాసి ఉంది. సునీల్ సక్సేనా అంతటి వ్యక్తి నా పట్ల అంత మర్యాదగా ప్రవర్తించడం, వచ్చే నెల నుంచి పెరిగే జీతం నాకు ముందుగానే తెలియజేయడం, అభినందనలు తెలపడం... నాకు చాలా ఆనందం కలిగించాయి. జీతం పెరిగిన సమయంలో ఎక్కడా నేను అంతటి గౌరవం పొందలేదు. సాక్షిలో నాకు న్యూస్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇచ్చి, ఒక్కసారిగా జీతం రూ.5 వేలు పెంచారు. అక్కడ కూడా జీతం అందుకున్న సమయంలోనే ప్రమోషన్ వచ్చినట్లు, జీతం పెరిగినట్లు తెలిసింది. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలోనే మరో సంఘటన, ఓ రోజు  నేను డెస్క్ లో పని చేసుకుంటున్న సమయంలో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ నుంచి ఓ క్లర్క్ నా వద్దకు వచ్చి, హ్యాపీ బర్త్ డే అని చెప్పి, నాకు ఓ గ్రీటింగ్ కార్డు అందించి, నా చేతిలో ఓ కిలో స్వీట్ ప్యాకెట్ పెట్టారు. ఆ సమయంలో నేను ఎంత ఆనందించానో, అంత ఆశ్చర్యపోయాను.  ఆ సంస్థలో ప్రతి ఒక్కరి పుట్టిన రోజున చెన్నైలో పేరు పొందిన ఓ పెద్ద స్వీట్ షాపు నుంచి ఓ కిలో స్వీట్స్ తెప్పించి, గ్రీటింగ్ కార్డుతో కలిపి ఇస్తారు. వాస్తవానికి ఆ రోజు నా పుట్టిన రోజు కాదు. నేను మెట్రిక్ పరీక్షలు రాసే సమయంలో మా రామూ మాస్టార్ రాసిన తేది అది. అదే నా బయోడేటాలో ఉంటుంది. ఆ ప్రకారం,  ఆ రోజు  నాకు గ్రీటింగ్స్ తెలిపారు. పుట్టిన రోజు పేరుతో అంతటి ఆత్మీయ అభినందనలు మరే సంస్థలోనూ అందుకోలేదు. అయితే, ఆధాన్, పొలిటికోస్ సంస్థలలో మాత్రం మెయిల్ కు గ్రీటింగ్స్ పంపారు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  కూడా నాకు ఉద్యోగం మానడం, సురేష్‌ని వదిలిపెట్టి రావడం ఇష్టంలేదు. అప్పట్లో హైదరాబాద్ లో చదువుకుంటున్న  మా అబ్బాయి కోరికపై  అక్కడ రాజీనామా చేసి,  సాక్షి లాంచింగ్ కంటే ముందే హైదరాబాద్ లో సాక్షి.కామ్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరాను. 

నేను పనిచేసిన సంస్థలలో ఆంధ్రజ్యోతి, సాక్షి, ఐ అండ్ పీఆర్ (అవుట్ సోర్సింగ్ సంస్థ), ఆధాన్ మాత్రమే పీఎఫ్ చెల్లించాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సమయంలో చెల్లించిన పీఎఫ్ వల్ల నాకు జీవితంలో ఎంతో మేలు జరిగింది. ఆ పీఎఫ్ పెట్టుబడిగా పెట్టడం వల్ల ఆ ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాను.

No comments:

Post a Comment

ఆంధ్రజ్యోతి పరివారం -7

మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి మానవ, స్నేహ, తోటి ఉద్యోగులతో సంబంధాల అంశం ఇది. మోహన్ రావు-శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ నాకు విశాఖ-ఆంధ్రజ్యోతిలోనే ప...