Jul 25, 2026

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య


 

జూలై 26 ఆ మహానేత 110వ జయంతి

రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య... వంటి నేతల వరుసలో ఆయన ఉంటారు. తుది శ్వాసవరకు చేనేత రంగం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తపించిన మహానేత. ఆ రంగం అభివృద్ధి కోసం పనిచేసి ‘చేనేత కోటయ్య’గా పేరుపొందారు.  అత్యంత నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి, నిజాయితీకి, రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా చేనేత రంగాన్ని బతికించడం కోసమే కోటయ్య కృషి చేశారు. చేనేత రంగం సమస్యలు పరిష్కారం కావాలంటే, ఆ రంగానికి చెందినవారు రాజకీయంగా ఎదగవలసిన అవసరాన్ని ఆయన ఆనాడే గుర్తించారు. రాజకీయంగా ఎదుగుదలలేకపోతే అటు రాజకీయాల్లో, ఇటు సమాజంలో కూడా తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక బలం లేకపోయినా చేనేతలు తమ బలం చూపించగలిగితేనే, రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాన్ని గుర్తిస్తాయి. దానిని, కోటయ్య నిరూపించారు.   చట్ట సభకు వెళ్లగలిగితేనే చేనేత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన గట్టిగా నమ్మారు. అదే నిజం కూడా. 1946లోఆ తర్వాత 1952లో చీరాల  కాంగ్రెస్ టికెట్ కోసం కోటయ్య తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్థిక బలం లేని కారణంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించలేదు. చీరాల నియోజకవర్గంలో పోటీ చేసే ధనవంతులతో ఆర్థికంగా బలహీనుడైన కోటయ్య గెలవలేరన్నది కాంగ్రెస్ అభిప్రాయం. కారంచేడులో కమ్మ రైతులుచీరాలలో వైశ్య వ్యాపారులతో పోటీపడలేరని వారి ఆర్థిక శక్తి ముందు తట్టుకోలేరని కాంగ్రెస్ రెండు సార్లూ కోటయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో,  1952లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రకాశం పంతులు స్థాపించిన కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా కోటయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన నిజాయితీ, ప్రజాబలం ముందు ఆర్థిక బలం నిలవలేకపోయింది. ఊహించని విధంగా  చీరాలలో ఆయన ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులను మట్టికరిపించారు. వారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కోటయ్యకు ఉన్న ప్రజాబలం ముందు  అగ్రవర్ణాల వారుధనవంతులు తట్టుకోలేకపోయారు. అయితేఅప్పటి అగ్రవర్ణాల వారు కూడా కోటయ్య ప్రవర్తన, వ్యవహార శైలి చూసి, ఆయన అంటే అభిమానంగా ఉండేవారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఓడిపోతున్నవారు కూడా కోటయ్యకు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారు. కోటయ్యని అందరూ అంతగా అభిమానించేవారు. శాసనసభలో  కోటయ్య వాక్ చాతుర్యాన్ని చూసి సభలో సభ్యులు ఆశ్చర్యపోయేవారు. సభ ప్రారంభంలోనే ఒక రోజు దాదాపు  గంటసేపు చేనేత సమస్యలపై  ప్రసంగించారు. ఆయన వాగ్ధాటిని చూసి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించారు. అప్పటి మంత్రి మజ్జి తులసీదాసు ద్వారా రాయబారం పంపారు.   నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చే కోటయ్య  ఆ మాట విని భయపడ్డారు.  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించిమంత్రి పదవి కోసం పార్టీ మారడం భావ్యం కాదని  భావించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారలేదు.  ఆయన నిజాయితీకి చలించిపోయిన రాజగోపాలాచారి... ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనతో చెప్పి నీకు మంత్రి పదవి వచ్చేలా చేస్తాను’’ అని చెప్పారు. ఆయనంటే అగ్రనేతలందరికీ అంత గౌరవం.  1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే,  చీరలుదోవతులు.... వంటివి చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ముంబైబీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు. .  పద్మశాలిదేవాంగ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్న భావనతోఆ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడుకోటయ్య తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దాంతో, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

 కోటయ్య 1952 నుండి 1972 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంఆంధ్ర రాష్ట్రంఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు.  1952-1962లో రెండు సార్లు1967- 1972 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.   1967లో  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రగడ కోటయ్య స్వతంత్ర అభ్యర్థి కొణిజేటి రోశయ్యను ఓడించారు. ఆంధ్రప్రదేశ్  రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోశయ్యకు  రైస్ మిల్లర్లుకారంచేడులోని కమ్మ వారు మద్దతు పలికారు.  డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేశారు. అయినా,  కోటయ్య విజయాన్ని ఆపలేకపోయారు.  కారంచేడులో రోశయ్యకు పదివేల ఓట్లు మెజార్టీ వస్తేఈపురుపాలెంచీరాలపేరాలలో  కోటయ్యకు మెజార్టీ రావడంతో విజయం సాధించారు. కోటయ్య అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూవారి మధ్యే ఉండేవారు. జాలర్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు.  అదే ఆయన బలం. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో  1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వివిధ శాసనసభ ఉపసంఘాలలో సభ్యుడిగా ఉన్నారు. ఏపీ రాష్ట్ర డ్రైనేజ్ బోర్డుజిల్లా నీటిపారుదల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగాఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా ప్రగడ కోటయ్య తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.  

 
1989లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రోశయ్య పోటీ చేశారు. అంతకు ముందు రోశయ్య టిక్కెట్ కోసం  ప్రయత్నిస్తుంటేకోటయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.  ‘‘ చీరాలలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. ఇది వీవర్స్ నియోజకవర్గం. ఇక్కడే వారికి పోటీచేసే అవకాశం ఉంది. వారికి ఇక్కడ అవకాశం ఇవ్వకపోతేచట్ట సభలలో వారి సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? ’’ అని గట్టిగా ప్రశ్నించారు. రోశయ్యకు మద్దతు పలకనని తెగేసి చెప్పారు. అయితే,  అప్పటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి కోటయ్యని హైదరాబాద్ పిలిపించిరాజ్యసభ ఎంపీ పోస్టు ఇప్పిస్తాననిఆ విధంగా చేనేత వర్గాలకు జాతీయ స్థాయిలో ఉపయోగపడవచ్చని కోటయ్యకి నచ్చజెప్పారు. చివరకు కోటయ్య మద్దతుతో రోశయ్య గెలిచారు. చెన్నారెడ్డి చెప్పిన ప్రకారం కోటయ్యను రాజ్యసభకు పంపారు.  1990 నుంచి 1995లో మరణించేంత వరకు కోటయ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య రాజ్యసభలో వెల్లడించిన అభిప్రాయాలుసూచనలుసలహాలను విన్న ఆనాటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతోపాటు తోటి పార్లమెంట్ సభ్యులు  సైతం అబ్బురపడేవారు. సమస్యలు వివరించే తీరు,  కోటయ్య ప్రసంగ ధాటి అందరినీ ఆకట్టుకునేవిధంగా ఉండేది. కోటయ్య చనిపోయిన తర్వాత కూడా రాజ్యసభలో ఆయన గురించి సభ్యులు అందరూ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.  1996లో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కొందరు ప్రసంగిస్తూ,  ప్రగడ కోటయ్య బతికి ఉంటే,  చేనేత రంగానికి ప్రాధాన్యత ఇవ్వని ఈ బడ్జెట్ ని   చీల్చిచెండాడేవారని తలుచుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సభలోని అధికారప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు పలికారు.

 ప్రగడ కోటయ్య రొంపేరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి, చీరాలపరిసర ప్రాంతాలలోని రొంపేరు డ్రెయిన్ పరిధిలో ఉన్న సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూములను  1954లో  నిరుపేద రైతులకు పంపిణీ చేయింశారు. కోటయ్య కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పంపిణీ అప్పుడే మొదలైంది.  చీరాలలోని రొంపేరు భూములలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి,  తోటవారిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంలో కోటయ్య కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి  ‘‘చేనేత కోటయ్య రైతు కోటయ్యగా మారిపోయారు’’ అని  ఛలోక్తి విసిరారు.  చీరాల తాలూకాలోని కుందేరు కాలువకు తూర్పున ఉన్న అనేక గ్రామాలలో వేలాది మంది పేద రైతుల ఆర్థిక ఉన్నతికి కోటయ్య తోడ్పడ్డారు. 1964లో కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి భూములకు మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలని ఆయన పోరాడారు. ఆ సమయంలో చీరాలబాపట్ల ప్రాంతాల్లోని సాగునీటి భూములు వరదల్లో మునిగిపోయాయి. దాని ఫలితంగా మిత్ర కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. మళ్ళీ 1969 మేలో చీరాల ప్రాంతంలో పెద్దఎత్తున వరదలు సంభవించిపొలాల్లో పనిచేస్తున్న 2,000 మందికి పైగా ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు చీరాలను సందర్శించినప్పుడుకోటయ్య మిత్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండామురుగునీటి పారుదల సౌకర్యాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రూ. 3 కోట్ల రుణాన్ని అక్కడికక్కడే ప్రకటించేలా చేశారు. అప్పుడేఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి సెస్ చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మురుగు నీటి బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. కృష్ణాగోదావరి  డెల్టాలలో మురుగు నీటి సౌకర్యాల మెరుగుదల కోసం పథకాలను చేపట్టారు. చీరాల మండలం తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ కోసం ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. 1962 నుంచి  తోటవారిపాలెం పరిసర ప్రాంతాల్లోని కావూరివారిపాలెంతులసీనగర్పాలిబోయినవారిపాలెం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములకు ఇది సాగునీరు అందిస్తోంది.  చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు ప్రభుత్వం దానికి 99 ఎకరాలు కేటాయించేందుకు  కృషి చేసిదానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య వ్యవహరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను కోటయ్య,  నెహ్రూకు వివరించారు. దాంతోచేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. చీరాల నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

 
ప్రగడ కోటయ్య తన స్నేహితులతో కలిసి ఆంధ్రకేసరి ప్రకాశం ఎడ్యుకేషనల్ సొసైటి ప్రారంభించిదాని ఆధ్వర్యంలో దివంగత ఉమ్మితి శివయ్య కుటుంబ సభ్యులువారి బంధువుల ఆర్థిక సహాయంతో చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత దాని పేరుని  ఆంధ్రకేసరి ప్రకాశంప్రగడ కోటయ్య జూనియర్ కాలేజీగా మార్చారు.  చీరాల  వి.ఆర్.ఎస్.(ప్రస్తుతం వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్) కళాశాల పాలక మండలి సభ్యుడుగాదాని కోసం 60 ఎకరాలకు పైగా భూమిని సమకూర్చడంలో  కోటయ్య సహాయపడ్డారు.  బండ్ల వెంకటేశ్వర రావు  నిర్వహణలో వేటపాలెంలో జూనియర్ కళాశాలను ప్రారంభించేందుకు దోహదపడ్డారు. వేటపాలెంలో యూఎస్ఐ (United Schools Organisation of India)స్థాపించారు. బంజరు భూముల పంపిణీ ,  చీరాల సముద్ర తీర ప్రాంతంలో సేద్యపునీటి సౌకర్యం కల్పించడం,  చీరాలగుంతకల్లునెల్లూరురాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.

 

ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు  అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితేఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకే ఇచ్చారు. కోటయ్యకు  ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే సార్థకం చేసి చూపించారు. వాస్తవానికి ప్రగడ కోటయ్య ఆర్థికంగా స్థితిమంతులు ఏమీకాదు. అయినాఆయనలోని నిజాయితీనిస్వార్థంనిబద్ధతనాయకత్వ పటిమని గుర్తించి చేనేత రంగంలోని స్థితిమంతులువ్యాపారులుమాస్టర్ వీవర్లుచేనేత కార్మికులు అందరూ ఆయనకు మద్దతు పలికారు.  కోటయ్య కుటుంబం చాలా కాలం ఒక పూరి గుడిసెలోనే ఉండేవారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1960 వరకు ఆ పూరి గుడిసెలోనే ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన నాయకులకు ఆ గుడిసె బొంగులు గుచ్చుకునేవి. అప్పుడు ఆ నాయకులు ‘‘ఏంటి కోటయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నావు’’ అని అడిగేవారు. అంతటి నిజాయితీని, నిరాడంబరతను ఇప్పుడు మనం ఊహించగలమా?   కోటయ్య 1960లో నిడుబ్రోలు వీవర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో వారి అబ్బాయి ఉంటున్నారు. కోటయ్య చనిపోయేనాటికి వారి ఇంట్లో  ఫ్రిజ్ కూడా లేదు. అంత నిరాడంబరంగా ఆయన బ్రతికారు. అందుకే అభిమానులు ఆయనను  ప్రజా బంధు ప్రగడ కోటయ్యచేనేత కోటయ్యచేనేత పితబహుజన నేత... అని కొనియాడుతుంటారు.

 

శాసనసభలో తనకు మద్దతు పలికేవారు పది మంది కూడా లేరనిఆర్థికంగా కూడా తాను స్థితిమంతుడిని కాదనిఅంగబలంఅర్థబలం లేనందునే తనకు మంత్రి పదవి దక్కలేదని ప్రగడ కోటయ్య తన ఆత్మకథలో రాసుకున్నట్లు, ఆయన సోదరుడి కుమారుడు ప్రగడ రాధాకృష్ణ చెప్పారు. అయితేఅది ముద్రణకు నోచుకోలేదు. తన పెదనాన్న స్వయంగా రాసుకున్న పేపర్లను తాను చూసినట్లు ఆయన తెలిపారు. ‘‘రాజగోపాలాచారి సిఫారసు చేసినా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు.  అప్పట్లో ఆ నియోజకవర్గ పరిధిలో వెంకటగిరి ఉండేది. వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నందునతనను అక్కడికి వెళ్లిప్రచారం చేసి గెలిపించమని సంజీవరెడ్డి నన్ను కోరారు. ఆయన కోరిన ప్రకారం నేను వెంకటగిరి వెళ్లి15 రోజులు అక్కడే ఉండి ఆయన తరఫున ప్రచారం చేశాను. ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినాసంజీవరెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంగబలంఅర్థబలం లేనందునే నేను మంత్రిని కాలేకపోయాను’’ అని ప్రగడ కోటయ్య స్వదస్తూరితో రాసుకున్నట్లు రాధాకృష్ణ వివరించారు. రాజకీయ నేతలు నిజాయితీగా వ్యవహరించే రోజులలో కూడా కుల బలం, అర్థబలానికి ప్రాధాన్యత ఉండేదని అర్థమవుతోంది.

 

ప్రగడ కోటయ్య మరణానంతరం  ప్రభుత్వం  అప్పటి చిత్తూరు జిల్లా  వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు  శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ అని పేరు పెట్టింది.  భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  న్యూఢిల్లీలోని చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించే దేశంలోని ఎనిమిది సంస్థలలో ఇది ఒకటి. మంగళగిరిలోని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ కు దామర్ల రమాకాంతరావుప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్ అని పేరు పెట్టారు. ఇలా రాష్ట్రంలోని  పలు విద్యా సంస్థలకుకమ్యూనిటీ హాళ్లకు,  ఇతర సంస్థలకు ప్రగడ కోటయ్య జ్ఞాపకార్థం ఆయన పేరును పెట్టారు. ఆయన గౌరవార్థం మంగళగిరిచీరాలపొన్నూరు ...తదితర అనేక ప్రాంతాల్లో ప్రగడ కోటయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.  చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతి( జూన్ 26)ని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  మానవ వనరుల అభివృద్ధివిద్యఐటీఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ అయింది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించిదానికి  ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంగళగిరి శాసనసభ్యులు కూడా అయిన లోకేష్ చెప్పారు.

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడుకోటమ్మ దంపతులకు కోటయ్య 1915జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులుఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ ) పూర్తి చేశారు. మొదట వయసు తక్కువగా ఉన్నందున కోటయ్యను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష రాయడానికి అనుమతించలేదు.  దాంతోఓ ఏడాదిపాటు నేత నేసే తన తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే  చేనేత గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు.  చిన్నతనంలో నిడుబ్రోలులో ధనవంతుల కుటుంబాలకు కోటయ్య బావి నుంచి కావిడితో మంచినీళ్లు మోసుకువెళ్లి పోసేవారు. వారు కొద్దోగొప్పో డబ్బు ఇచ్చేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైన తర్వాతబాపట్ల తాలూకా బోర్డులో ఆయన కొంతకాలంపాటు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేశారు. 1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం అయింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలుఒక కుమారుడు.

కొడుకు వెంకట శేష శయన  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసిఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవివంగర శకుంతలాదేవిఊట్ల అనసూయగుర్రం విజయలక్ష్మిదొంతంశెట్టి శ్యామలాదేవిఉడతా పద్మావతి ఆ దంపతుల కుమార్తెలు.  పెళ్లైన కొత్తలో ఆయన చీరాలలోని ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ)లో కొంత కాలం గుమస్తాగా పని చేశారు.  ఆ సమయంలో వీరి కుటుంబం చీరాలకు సమీపంలోని ఈపురుపాలెంలో నివాసం ఉంది. ఆ కొద్దికాలం తప్ప ఆయన జీవితాంతం నిడుబ్రోలులోనే ఉన్నారు. చేనేత వర్గానికి ఆరాధ్యుడైన  ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  చేనేత పరిశ్రమకార్మికులు పెద్ద దిక్కును కోల్పోయారు.  చేనేత రంగానికి సంబంధించి, చేనేత కార్మికులను ఐక్యంగా నిలిపే అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.

 

ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు

 

1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు

1949  అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు

1950  చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.

1952–1962  శాసనసభ సభ్యుడు

1955–1956  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

1959  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన,  చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్.

1962–1965  ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్

1967–1972  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు

1973–1975  న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.

1974–1980  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు

1974–1978  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

1975  రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు,  కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు

1976–1978  ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు

1990–1995  రాజ్యసభ  సభ్యుడు

 

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య

  జూలై 26 ఆ మహానేత 110వ జయంతి రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు  ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్...