Jul 26, 2026

తుది శ్వాస వరకు చేనేత కోసం తపించిన ప్రగడ కోటయ్య


చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రగడ కోటయ్య. చేనేత అంటే కోటయ్య, కోటయ్య అంటే చేనేత. ఆయన ఆలోచనలు చేనేత, శ్వాస చేనేత. జీవిత చరమాంకంలో ఆస్పత్రిలో అంపశయ్యపై ఉండి, 1995 నవంబర్‌ 26న  చనిపోవడానికి ఓ గంట ముందు కూడా చేనేత కార్మికుల సంక్షేమం గురించే కోటయ్య మాట్లాడారు.  ఆయన ఆరోగ్యం విషయమై తెలుసుకోవడానికి, అప్పటి జిల్లా కలెక్టర్ సి.ఉమామహేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. చివరి దశకు వచ్చేసినట్లు, తుది శ్వాస వదలడానికి ఎక్కువ సమయంలేదని కోటయ్యకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఆయన ఆలోచనలు చేనేత గురించే.  తన ఎంపీ కోటా నిధులను చేనేత కాలనీలలో సౌకర్యాల కోసం వినియోగించమని జిల్లా కలెక్టర్ కు చెప్పారు. అందువల్లే  చేనేత చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది.  జాతీయోద్యమంలో పాల్గొనడంతోపాటు చేనేత పరిశ్రమ, ఆ రంగంలోని కార్మికుల రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు కోటయ్య. ఆయన నిరుపేద అయినప్పటికీ   ప్రజా బాహుళ్యంలో  తనకు ఉన్న అభిమానంతో మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి,  ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ప్రగడ కోటయ్య దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యారు.  

ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు ఆచార్య ఎన్.జి.రంగా సలహా మేరకు కోటయ్య మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పిన్నింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్‌ సూపర్‌వైజర్ కోర్సు,  ఆ తర్వాత కాటన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, సిటీ & గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన కెమిస్ట్రీ సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన చదివిన  టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే  సూపర్‌వైజర్‌గా  పనిచేశారు. ఉద్యోగ రీత్యా రాష్ట్రమంతటా పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను, వారి దయనీయ స్థితిని కళ్లారా దగ్గరగా చూశారు. ఆనాటి వారి ఆకలి చావులకు చలించిపోయారు. 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి,  అన్ని జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. జీవచ్ఛవాలుగా బతుకులీడిస్తున్న చేనేత కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని కోటయ్య ఉద్యోగం మానేసి, చేనేత ఉద్యమంలోకి ఉరికారు. చేనేత రంగంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు.  ఎన్జీ రంగా ఒకసారి కోటయ్యను సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి, మహాత్మా గాంధీని పరిచయం చేశారు. చేనేత, ఖాదీ గురించి ఆయన గాంధీకి పూర్తిగా వివరించారు. 1941లో బ్రిటీష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన థామస్‌ కమిటీకి చేనేత రంగ సమస్యలపై కోటయ్య వంద పేజీల మెమొరాండాన్ని అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘానికి దామర్ల రమాకాంత రావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. చేనేత కార్మికులను రాజకీయంగా చైతన్య పరచడం కోసం 1945లో గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1947-52 ప్రాంతంలో దాదాపు నాలుగేళ్లు నిడుబ్రోలు నుంచి ఆయన చేనేతవారపత్రికను కూడా నడిపారు.  
 
చేనేత పరిశ్రమకు చాలినంత నూలు సరఫరా చేయాలని,  ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలన్న డిమాండ్‌తో 1950లో  కోటయ్య చేనేత కాంగ్రెస్‌ తరఫున సమర శంఖం పూరించారు. మద్రాసులో 75 రోజులపాటు  సత్యాగ్రహ  ఉద్యమం నడిపారు. దాదాపు పది వేల మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు. చివరకు కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత వర్గాల కోసం కోటయ్య రేపల్లెలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసి, రైలులో బళ్లారి జైలుకు తరలిస్తుండగా,  ప్రతి రైల్వేస్టేషన్‌లో  భారీ సంఖ్యలో చేనేత కార్మికులు అడ్డుపడ్డారు.  ప్రతి రైల్వేస్టేషన్‌లో రైలుని నిలిపివేయడంతో, అది బళ్లారి చేరే పరిస్థితి కనిపించలేదు. అధికారుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న  ప్రకాశం, కోటయ్యని అప్పటి రాజధాని కర్నూలుకు తీసుకురమ్మని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి  ప్రకాశం పంతులు ‘‘ఏందిరా కోటయ్య, నీ సమస్య ఏమిటి?’’ అని అడిగారు.  చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత ఉత్పత్తుల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోటయ్య డిమాండ్ చేశారు. దాంతో, అప్పటికప్పుడే చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ప్రకాశం పంతులు రూ.50 లక్షలు విడుదల చేశారు. దటీజ్ ప్రగడ కోటయ్య.

చేనేత సమస్యలపై నిజాయితీగా పోరాడే నేతగా  ఆ నాటి కాంగ్రెస్ అగ్రనేతలందరి వద్ద ప్రగడ కోటయ్య గుర్తింపు పొందారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిగా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వరకు అందరితోనూ కోటయ్య మాట్లాడి చేనేత సమస్యలు పరిష్కరించారు.  1975లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకంలో చేనేత కార్మికులకు ఉపయోగపడే అంశాలను కూడా ఒక పాయింట్ లో చేర్చేందుకు ఇందిరా గాంధీని కోటయ్య ఒప్పించారు. చీరాల సహకార  స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు విశేష  కృషి చేసి, దానికి వ్యవస్థాపక చైర్మన్‌గా కోటయ్య ఉన్నారు. ఈ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను  ప్రధానికి కోటయ్య వివరించారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.  ఢిల్లీలో జరిగిన అఖిల భారత చేనేత మహాసభలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మాట్లాడుతూ, ‘‘చేనేత సమస్యలు నాకు చెప్పి ప్రయోజనంలేదు.  ప్రగడ కోటయ్యకు చెబితే, ఆయనకు తెలుస్తాయి. ఆయన నిద్రపోతున్నా లేపి, సమస్యలు చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ఏది చెబితే అది మేం చేస్తాం’’ అని చెప్పారు. ప్రధాని అంతటి వ్యక్తి అలా చెప్పారంటే కోటయ్యకు, చేనేతకు  ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీలలో కూడా చేనేత అంటే కోటయ్య పేరే గుర్తుకు వస్తుంది. భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా ఆయన శ్రీలంక, బ్రిటన్,  చైనా, హాంకాంగ్ తదితర దేశాలలో పర్యటించి, అక్కడ చేనేత రంగాన్ని అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య చివరి వరకు చేనేత రంగం సంక్షేమం కోసమే తపించారు.    

గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న  రెండవ కుమారుడుగా జన్మించారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1931లో  ఆయన నిడుబ్రోలులో తన పాఠశాల విద్య(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పూర్తి చేశారు. చదువుకునే సమయంలోనే తండ్రి వద్ద ఆయన చేనేత గురించి పూర్తిగా తెలుసుకున్నారు.  1931లో బాపట్లకు చెందిన ఊట్ల పుండరీకాక్షుడు  కుమార్తె  ఇందిరా దేవితో  కోటయ్య వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు వెంకట శేష శయన  బీటెక్ పూర్తి చేసి, ఎన్టీపీసీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  పడవల భారతీదేవి, వంగర శకుంతలాదేవి, ఊట్ల అనసూయ, గుర్రం విజయలక్ష్మి, దొంతంశెట్టి శ్యామలాదేవి, ఉడతా పద్మావతి వారి కుమార్తెలు. చేనేతను బతికించడం కోసం చివరి వరకు తపించిన ప్రగడ కోటయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే 1995 నవంబర్‌ 26న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.  చేనేత నేత కోటయ్య జయంతిని ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం.

- శిరందాసు నాగార్జున రావు,  సీనియర్ జర్నలిస్ట్- 9440222914.

 

No comments:

Post a Comment