Aug 7, 2018


చేనేతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
నేడు జాతీయ చేనేత దినోత్సవం
Ø చేనేత ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు యోచన
Ø రాజకీయంగా బలహీనపడిన చేనేత కులాలు
Ø ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దయనీయ స్థితి
Ø మళ్లీ తెరపైకి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్
        
  రాష్ట్రంలో చేనేత పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యే శ్రద్ధవహిస్తోంది.  వ్యవసాయం రంగం తరువాత దేశంలో అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ  దేశంలో 2.5 కోట్ల మంది, రాష్ట్రంలో 11 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.   జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది.  జాతీయ నాయకులు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో  1905, ఆగస్టు 7  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ సంఘటన ఉద్యమానికి ఊపు తెచ్చింది. దాంతో  చేనేత చిహ్నమైన రాట్నానికి జాతీయోద్యమ జెండాలో స్థానం కల్పించారు. నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడుకుతుండేవారు. ఆ విధంగా చేనేత  చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను తొలిసారి దగ్ధం చేసిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం(నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని  కేంద్ర ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.  చేనేతకు సంబంధించిన ముడి సరుకులు పెరిగిపోవడం, కేంద్రం పన్నులు విధించడంతో చేనేత వస్త్రాల ధరలు పెరిగిపోయాయి.  మిల్లు వస్త్రాల పోటీని కూడా తట్టుకోలేని పరిస్థితి. దాంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. పని దొరికినా మజూరీలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వారు అప్పుల పాలవడం, ఆకలి చావులు, ఆత్మహత్యలు వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. చేనేత కులాల మధ్య ఐక్యత కొరవడటం, నాయత్వలోపం వల్ల వారు రాజకీయంగా బాగా బలహీనపడ్డారు. చేనేత పరిశ్రమ, ఆ రంగంలోని సమస్యలపై అవగాహన ఉన్నవారు ప్రభుత్వంలో లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 19 చేనేత కులాలకు చెందిన 65 లక్షల మంది, రాష్ట్ర జనాభాలో   13 శాతం మంది ఉన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దయనీయ స్థితి వారిది. వృత్తిపరంగా, విద్యాపరంగా నిపుణులైనా, తెలివితేటల్లో మెరుగైన స్థితిలో ఉన్నా, ఆర్థికంగా వారు వెనుకబడే ఉన్నారు. అందువల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.  చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు వంటి ముడిసరుకుల సరఫరా, వాటి ధరలు,  చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాలు.... వంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రతినిధి అసెంబ్లీలో లేరు. చేనేత కులాల వారు అత్యధిక మంది ఉన్న మంగళగిరి, చీరాల వంటి చోట్ల ఆ కులాలకు చెందిన వారు ఓడిపోవడం బాధాకరం. మగ్గాల మధ్యే పుట్టిపెరిగి, చేనేత సమస్యలపై సంపూర్ణ అవగాన కలిగిన గంజి చిరంజీవి వంటి వ్యక్తి మంగళగిరి అసెంబ్లీ స్థానంలో 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం వారికి తీవ్ర నష్టం కలిగించింది. చీరాలలో కూడా ఆ వర్గానికి చెందిన పోతుల సునీతను గెలిపించుకోలేకపోయారు. వీరిలో ఏ ఒక్కరు గెలిచినా  ఈ ప్రభుత్వంలో మంత్రి అయి ఉండేవారు. చేనేత కులాల వారు తమ ప్రతినిధిని అసెంబ్లీకి పంపిచుకోలేకపోతే  ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేవు.   

4 లక్షల మందితో  చేనేత కులాల ఆత్మగౌరవ సభ
           రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా చేనేత కులాలవారు లేకపోవడ  అవమానంగా వారు భావిస్తున్నారు. చేనేత కులాల పెద్దల్లో కదలిక వచ్చింది.  అన్ని చేనేత కులాల వారు ఏకమై, నాయకత్వం కూడా ఏకతాటిపై నడిచి తమ ప్రతినిధులను శాసనసభకు పంపించాలన్న ఆలోచనలో చేనేత కులాల పెద్దలు ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ మళ్లీ జవసత్వాలు పుంజుకుంటుంది.  ఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 24న రాజమండ్రిలో జరిగిన ఆత్మీయ సభకు 14 చేనేత కులాల పెద్దలు హాజరయ్యారు. నేత వృత్తి, ఉద్యోగ, మహిళా, యువజన, విద్యార్ధి, న్యాయ, వైద్య, వాణిజ్య విభాగాలు ఏర్పాటు, రాజకీయంగా ఎదగడంపై  చర్చించారు.  రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్రంట్ ని మళ్లీ తెరపైకి తీసుకురావడంలో, రాజకీయ చైతన్యం కలిగించడంలో ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటించి చేనేత కుల పెద్దలను కలిసి, అందరినీ  ఏకం చేయడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.  రాష్ట్రంలోని చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 45 శాసనసభ నియోజకవర్గాల్లో చేనేత కులాల వారు బలంగా ఉన్నారు. అక్కడ వారు గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో ఉన్నారు. అటువంటి వాటిలో తమ బలం అధికంగా గల 15 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని  రాజకీయ పార్టీలను ఆయా కులాల పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ కులం వారు ఎక్కవ ఉంటే వారికే టిక్కెట్లు అడగాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. తమ కులాలకు సంబంధించి ఎవరికి టిక్కెట్ వచ్చినా ఫ్రంట్ తరపున నిధులు సేకరించి, వారికి సహాయపడాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వారిని గెలిపించుకోవాడానికి పార్టీలతో సంబంధం లేకుండా సంపూర్ణ మద్దతుపలకాలని తీర్మానించారు. అన్ని జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ  ఫ్రంట్ ని బలోపేతం చేస్తున్నారు. అలాగే విజయవాడలో 4 లక్షల మందితో  చేనేత కులాల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

            చేనేత కులాల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేనేత ప్రాధాన్యతను గుర్తించి, ఆ రంగంలోని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తోంది. పోతుల సునీతకు శాసన మండలిలో స్థానం కల్పించింది.  ఈ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నిధులు సమకూరుస్తోంది. దేశంలో మొదటిసారిగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం  గుర్తింపు కార్డులు ఇచ్చింది.  సహకార సంఘాల ద్వారా 1,18,622 మందికి, వ్యక్తిగతంగా 1,44,950 మందికి మొత్తం 2,63,572 మందికి కార్డులు అందజేసింది.  చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఆకలి చావులు నిరోధించడానికి వారి రుణాలు మాఫీ చేసింది. ఉపాధి కోసం రుణాలు అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పలు పథకాల ద్వారా వారిని ఆదుకుంటోంది.  ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4 ఏళ్లలో చేనేత కార్మికుల రుణ మాఫీ పథకం  ద్వారా   రూ.110 కోట్ల రుణాలు  మాఫీ చేసింది.  ఆ విధంగా 23,353 మంది రుణ విముక్తులయ్యారు.  వృద్దాప్య పించను రూ.200 నుండి రూ.1000 కు పెంచింది. వయోపరిమితిని కూడా 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. అదనంగా  25వేల మందికి పించన్ మంజూరు చేసింది. మొత్తం 87,677  మందికి వృద్ధాప్య పెన్షన్ అందజేస్తోంది. మరో  10,583 మందికి పించన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.   బ్లాక్ లెవల్ చేనేత క్లస్టర్ల ద్వారా   33,446 మంది చేనేత కార్మికులకు రు.15.80 కోట్ల మేర లబ్ది చేకూరింది.  వడ్డీ సబ్సిడీ పథకం ద్వారా 55,500 మందికి రు.16.86 కోట్లు మంజూరు చేసింది. నేత కార్మికుల ఆర్ధిక సహాయ పథకం  క్రింద  23,582 మందికి రు.26.62 కోట్లు పంపిణీ చేశారు. మర మగ్గాల కార్మికులకు విద్యుత్ సబ్సిడీ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 42,592 మంది చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీగా రు.17.59 కోట్లు విడుదల చేశారు. హ్యంక్ యారన్, డైస్ కెమికల్స్ వంటి ముడి సరకుల కొనుగోలుపై  జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ డీసీ), ఆప్కో నుంచి  20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం క్రింద 66,900 మంది రు.20.08 కోట్లు లబ్ది పొందారు. సహకార చేనేత కార్మికుల పొదుపు నిధి క్రింద 18,091 చేనేత కార్మికులు రు.6.38 కోట్ల మేర లబ్ది చేకూరింది.  ముద్ర పథకం ద్వారా 10,209 మంది నేత కార్మికులకు బ్యాంకులు  రు.52.27 కోట్లు మంజూరు చేశాయి.

చేనేత ఫైనాన్స్ కార్పోరేషన్ యోచన
  చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత పైనాన్స్ కార్పోరేషన్ లేక చేనేత ఆర్థిక మండలి ఏర్పాటుచేయాలన్న యోచనలో  ఉంది.  త్వరలోనే దీనికి ఒక రూపు ఏర్పడే అవకాశం ఉంది.  చేనేత కులాలలోని పేదలు, కార్మికుల సంక్షేమానికి ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత అధికారులు దీనికి సంబంధించి  విధివిధానాలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ కార్పోరేషన్  ద్వారా   చేనేత  వృత్తికి ఆర్ధిక సహాయం, వడ్డీలేని రుణాలు, రాయితీతో కూడిన రుణాలు,  కార్మికుల పిల్లల చదువులకు, ఆడపిల్లల వివాహానికి, చేనేత బజారుల ఏర్పాటుకు, వ్యాపార విస్తరణ, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్ధిక సహకారం, నేత కార్మికులకు ఆరోగ్య భద్రత, వృత్తి భద్రత, బీమా భద్రత, మరణించిన కార్మికుని దహన సంస్కారాలు వంటి వాటికి సహాయం అందిస్తారు. ఈ కార్పోరేషన్ కు ప్రభుత్వం రూ.1000 కోట్లు  కేటాయించే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన చేనేత కార్మిక కుటుంబాల అభ్యున్నతికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  చేనేత కులాలకు చెందిన ఎంపీలు కిష్టప్ప, రేణుక, ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి మురుగడు హనుమంతరావు, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, పెడన మునిసిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్,  శల కోటివీరయ్య, విశ్వనాధ్, జగ్గారపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, గుత్తికొండ ధనుంజయ, రాజపంతుల నాగేశ్వరావు వంటివారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కార్పోరేషన్ కు అధిక నిధులు కేటాయించడానికి కూడా వారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. చేనేత వృతితో నేరుగా సంబంధం ఉన్నవారిని కార్పోరేషన్ చైర్మన్, డైరెక్టర్లుగా నియమిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.  

-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914,
ఫొటోలు: నందం వీరాంజనేయులు (బుజ్జి)




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...