Nov 21, 2017

రాళ్ల సీమ కాదు రతనాల సీమ


v రాయలసీమకు మహర్ధశ
v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల
v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి
v ఆసియా ఖండంలోనే భారీ ఎత్తిపోతల పథకం హంద్రీ-నీవ
v సీమలో పారుతున్న కృష్ణానది జలాలు
v 2,80,500 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం
v వేరుశనగ పంటను కాపాడిన రెయిన్ గన్ లు
v పెరిగిన భూగర్భ జలాలు
v భారీ స్థాయిలో నీటి సంరక్షణ చర్యలు
v రాయలసీమలో ‘పట్టు’
v రూ.71,356 కోట్ల పెట్టుబడులతో 231 పరిశ్రమలు
v భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు
v రాయలసీమకు 1.52 లక్షల ఇళ్లు కేటాయింపు
v చిత్తూరు జిల్లాలో రూ.లక్ష దాటిన తలసరి ఆదాయం
v అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవే
v కర్నూలులో అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌
v మంగపేటలో బైరైట్స్ ప్రాజెక్ట్ 
v పాలసముద్రం వద్ద బెల్
v తిరుపతిలో రూ.1800 కోట్లతో 77 ప్రాజెక్టులు
v 1420 మంది కింద ప్రమాద బీమా
v 2015-16 జీవీఏ టాప్ 10 మండలాల్లో అనంతపురం, తిరుపతి
v కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్
v ఉత్పాదకత పెరిగిన వృద్ధి కారక పంటలు
v సీమలో ప్రముఖ విద్యా సంస్థలు

      దీర్ఘకాలంగా కరువుతో అల్లాడుతూ రాళ్లసీమగా పేరుపడిన రాయలసీమకు  క్రమంగా మహర్ధశ పట్టనుంది. సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుండటం, మరోవైపు పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతూ రతనాల సీమగా మారుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన ప్రభుత్వం సీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మిగిలిన రాష్ట్రం మాదిరిగా రాయలసీమ కూడా వ్యవసాయాధారిత ప్రాంతం. కోస్తా ప్రాంతంతో పోలిస్తే అభివృద్ధి పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. రాష్ట్ర సగటు వర్షపాతం కంటే ఇక్కడ తక్కువ. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాన్ లోని జైసల్మీరు తరువాత అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉంది. స్వర్ణముఖి, పాలారు, కాళంగి, అరుణ, అరణియార్, కుశస్థలి, పాపాఘ్ని, బాహుదా నదులున్నా సాగునీటికి, త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది అతిపెద్ద అవరోధం. సాధారణ వర్షపాతం రాయలసీమలో 714 మిల్లీమీటర్లు కాగా, 2014-15లో 34.9 మి.మీ., 2016-17లో 30.50 మి.మీ. తక్కువగా కురిసింది. 2015-16లో మాత్రం 7.7 మి.మీ.ఎక్కువ పడింది. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు రూపొందించిన పథకాలు ఆశించిన స్థాయిలో పూర్తికాలేదు. గాలేరు-నగరి, సదాశికోన, మల్లిమడుగు నీటి పథకాలు అన్నదాతలకు వరాలు. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు-కడప కాలువ తోపాటు శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి.. మొదలైన ప్రాజెక్టులు  ఎన్నున్నా వాటి అమలులో జరిగిన జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి నిధులు కేటాయిస్తామని అప్పట్లో కాంగ్రెస్‌, బిజెపిలు హామీ ఇచ్చాయి.  రాష్ట్ర విభజనపై అధ్యయనం  చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని సూచించింది. అయితే రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సుమారు రూ.వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించింది. వాటిలో సగానికి పైగా నిధులు ఖర్చు చేశారు.  రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించేసింది.

 పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి

ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన జరిగి లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రాయలసీమను రతనాల సీమగా చేయాలన్న ప్రయత్నంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టుకు సమానంగా  ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పట్టుదలతో పూర్తి చేసింది.  కర్నూలు, కడప జిల్లాల రైతులకు అత్యంత కీలకమైన ఈ పథకం ద్వారా  కృష్ణా నది మిగులు జలాలను కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్)కు తరలిస్తారు. శ్రీశైలం డ్యాం వెనుక భాగంలో కేసీ కెనాల్ 81 కి.మీ. ప్రాంతంలో కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కృష్ణా నది మిగులు జలాల నుంచి 60 రోజుల పాటు కేసీ కెనాల్ కు 5 టీఎంసీల నీటిని పంప్ చేస్తారు. శ్రీశైలంలో 790 అడుగులకు దిగువన నీరు ఉన్నప్పటికీ ముచ్చుమర్రికి తీసుకునే అవకాశం ఉంటుంది. రాయలసీమ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకు అతి .ప్రధానమైన కె.సి. కెనాల్ కు అన్ని కాలాల్లో నీరందించాలన్న ఉద్దేశంతో దీనిని పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా కర్నూలు తాగు నీటి అవసరాలతో పాటు హంద్రీ నీవా ఎత్తిపోతలకు 8850 క్యూసెక్కులు, కేసీ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని అందిస్తారు. ఈ రెండు కాల్వల కింద రాయలసీమ జిల్లాల్లో దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 884 అడుగుల వరకు నీరుంటేనే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉంది. ఇంతకంటే తగ్గితే నీటి సరఫరా ఆగిపోతుంది.  అయితే ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో  నిల్వ 180 అడుగుల వరకు ఉన్నా ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకుని లింకు ద్వారా హంద్రీ నీవాకు అందిస్తారు. ముచ్చుమర్రిలో ఏర్పాటు చేసిన 12 పంపులతో హంద్రీ-నీవాకు నీటిని తరలిస్తారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కాల్వకు   నీటిని పంప్ చేయడానికి నాలుగు అత్యాధునిక విద్యుత్ మోటార్లను అమర్చారు.

ఆసియా ఖండంలోనే భారీ ఎత్తిపోతల పథకం హంద్రీ-నీవ
ఆసియా ఖండంలోనే  భారీ ఎత్తిపోతల పథకం హంద్రీ-నీవ సుజల స్రవంతి. 2016-17లో ఈ కాలువ ద్వారా విడుదలైన 27 టీఎంసీల నీటి వల్ల అనంతపురం జిల్లాలో సరాసరి  భూగర్భ జలమట్టం 5.02 మీటర్లకు పెరిగింది. 4.69 టీఎంసీల భూగర్భ జలం రీచార్జ్ అయింది. కాలువలు ద్వారా 95 చెక్ డ్యామ్ లకు, చెరువులకు నీరందింది. పరోక్షంగా 61వేల ఎకరాలకు  సాగునీరు లభించింది.

సీమలో పారుతున్న కృష్ణానది జలాలు
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్ళించడం వల్ల రాయలసీమలోని  జిల్లాలలో 120 టిఎంసిల కృష్ణా నది నీటిని సాగునీరు, త్రాగు నీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.  అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం భైరవాని తిప్ప, పరిగి మండలం పెన్నార్-కుముద్వతి ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది.  అనంతపురం, ఉరవకొండలలో 900 కోట్ల రూపాయలతో కమ్యూనిటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్  ద్వారా ఇరిగేషన్ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారు.  గండికోట-సీబీఆర్ లిఫ్ట్ పథకం, హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు సీమలో పారుతున్నాయి.

2,80,500 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం
రాయలసీమను దుర్భిక్ష పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు, అక్కడి నిరుపేదలు వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాల ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందేందుకు  కేంద్రం వివిధ పథకాల ద్వారా అందించే నిధులు, ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి  సంస్థ,  నాబార్డ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా) వంటి వాటి ద్వారా అందిన నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్ట్ ద్వారా ఈ 4 జిల్లాలకు ఈ ఆర్థిక సంవత్సరం(2017-18)లో 2,80,500 ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం కాగా, సెప్టెంబర్ 19 నాటికి  34,169 ఎకరాలకు అందించారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ కు కూడా నీరు విడుదల చేశారు.

భారీ స్థాయిలో నీటి సంరక్షణ
ఎత్తిపోతల పథకాలు, ఎన్టీఆర్ జలసిరి, జల సంరక్షణ, నీరు-చెట్టు పథకం, పంటకాలవలు, చెరువులు మరమ్మతు, చెక్‌డ్యామ్‌లు, అడవుల చుట్టూ కాంటూర్ కందకాలు, ఇంకుడు గుంతలు, కొండ ప్రాంతాలు, పొలాల్లో కందకాలు, పంట కుంటలు వంటివాటి ద్వారా ఎక్కడ పడిన వర్షం అక్కడే ఇంకిపోయే ఏర్పాట్లు చేశారు, చేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయమై ప్రజల్లో, రైతుల్లో అవగాహన కల్పించారు. దాంతో భారీ స్థాయిలో నీటి సంరక్షణకు పంటసజీవిని(ఫారం పాండ్లు), చెక్ డ్యామ్ లు, ఊటచెరువులు, ఇతర  కట్టడాలు కట్టారు. 2015-16 నుంచి ఈ ఏడాది మే వరకు చిత్తూరు జిల్లాలో 61,505 పంట సంజీవిని, 4,892 చెక్ డ్యామ్ లు, 133 ఊట చెరువులు, 17,270 ఇతర సంరక్షణ చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో 37,283 పంటసంజీవిని, 3895 చెక్ డ్యామ్ లు, 435 ఊట చెరువు, 22,040 ఇతరాలు, కడప జిల్లాలో 42,571 పంట సంజీవిని, 1632 చెక్ డ్యామ్ లు, 716 ఊట చెరువులు, 35,476 ఇతరాలు, కర్నూలు జిల్లాలో 30,644 పంట సంజీవిని, 2,947 చెక్ డ్యామ్ లు, 656 ఊట చెరువులు, 54,186 కందకాలు, చిన్న కుంటలు వంటి ఇతరాలు ఏర్పాటు చేశారు. దాంతో భూగర్భ జలమట్టం పెరిగింది.  

పెరిగిన భూగర్భ జలాలు
ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రైతుల కృషి ఫలితంగా రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. 2016 నవంబర్ లో 15.75 మీటర్ల లోతులో ఉన్న నీరు 11.26 మీటర్లకు చేరుకున్నాయి. అంటే 4.61 మీటర్లు పెరిగాయి. చిత్తూరు జిల్లాలో 15.33 మీటర్ల నుంచి 10.17 మీటర్లకు, కడప జిల్లాలో17.52 నుంచి 11.36కు, అనంతపురం జిల్లాలో 21.35 నుంచి 17.25కు, కర్నూలు జిల్లాలో 8.81 నుంచి 5.76 మీటర్లకు పెరిగాయి. రాయలసీమలో వర్షపాతం తక్కువగా ఉన్నందున భూగర్భ జల వినియోగం అధికంగా ఉంది. 47 శాతం(కర్నూలు) నుంచి 94 శాతం(అనంతపురం) వరకు వినియోగిస్తారు. రాష్ట్రం మొత్తం మీద 13,22,981 బావులు ఉంటే, సగానికి పైగా 6,69,527 బోరు బావులు రాయలసీమలోని 4 జిల్లాల్లోనే ఉన్నాయి. అలాగే బోరు బావులకు రాష్ట్ర వ్యాప్తంగా సాలుసరి విద్యుత్ వినియోగం 10,629.02 మిలియన్ యూనిట్లు కాగా, రాయలసీమలో వినియోగం 5,746.5 మిలియన్ యూనిట్లు ఉంది. భూగర్భ జల మట్టాలను లెక్కించే ఫిజియో మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1254 ఉంటే, రాయలసీమలో 523 అమర్చారు. ప్రతి నీటిబొట్టుని ఒడిసిపట్టి నీటి సంరక్షణ,  వినియోగంలో భూగర్భ జల శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉత్తమ యాజమాన్య పద్దతులు అనుసరిస్తోంది. అలాగే ఈ 4 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ సమాజారాధిత చెరువుల యాజమాన్య పథకం(సీబీటీఎంపీ- కమ్యునిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్) కింద భాగస్వామ్య పద్దతిన జలవనరుల నిర్వహణ జరుగుతోంది. భూగర్భ జలాల ద్వారా చిత్తూరు జిల్లాలో 2,20,452 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 1,74,041 హెక్టార్లు, కడప జిల్లాలో 1,55,118 హెక్టార్లు, కర్నూలు జిల్లాలో 2,08,518 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.

కరువుతో తల్లడిల్లే రాయలసీమకు వివిధ మార్గాల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించడం, భూగర్భ జలాలు పెరగడం, బిందు సేద్యం, తుంపర సేద్యం, రెయిన్ గన్ ల వాడకం వల్ల రాయలసీమలో పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఉద్యానవన పంటల పరిధి కూడా పెరిగింది. 2016-17లో అనంతపురం జిల్లాలో 4,44,465 ఎకరాల్లో, చిత్తూరు జిల్లాలో 3,90,423 ఎకరాల్లో, కడపలో 2,78,135 ఎకరాల్లో, కర్నూలు జిల్లాలో 2,58,843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నారు.

వేరుశనగ పంటను కాపాడిన రెయిన్ గన్ లు
అనంతపురం జిల్లాలోని మెట్ట భూములలో వేరుశనగ పంటను  కాపాడటానికి 2015లో రెయిన్ గన్ ద్వారా రక్షక తడులు ఇవ్వడం ప్రారంభించారు. బోరు బావిలో నీరు బాగా ఉంది, సెంటీమీటర్ పరిధిలో 3 కిలోల వత్తిడి ఉంటే 72 అడుగుల వరకు నీటిని ఈ రెయిన్ గన్ పంపింగ్ చేస్తుంది.  ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం ఎకరా పొలంలో గంటకు 5వేల లీటర్ల నుంచి 20వేల లీటర్ల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యం గల రెయిన్ గన్ లు అందుబాటులో ఉన్నాయి. గంటకు 12 వేల నుంచి 14,400 లీటర్ల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్న రెయిన్ గన్ లను సబ్సిడీపైన రైతులకు సరఫరా చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది.

ఉత్పాదకత పెరిగిన వృద్ధి కారక పంటలు
వృద్ధి కారక(గ్రోత్ ఇంజన్) పంటల్లో అత్యధిక ఉత్పాదకత సాధించడంలో సీమలోని 4 జిల్లాలూ ముందున్నాయి. మామిడి ఉత్పాదకతలో కర్నూలు మొదటి స్థానంలో, చిత్తూరు 3వ స్థానంలో ఉండగా,  అరటి ఉత్పాదకతలో అనంతపురం, కడప, కర్నూలు  వరుసగా 1,2.3 స్థానాల్లో, బొప్పాయి ఉత్పాదకతలో చిత్తూరు మొదటి స్థానంలో, తీపి కమలాల ఉత్పాదకతలో కడప, అనంతపురం జిల్లాలు వరుసగా 1,2 స్థానాల్లో ఉన్నాయి. ఎండు మిర్చి, టమోటా ఉత్పాదకతలో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించయీ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద 2017-18లో రాష్ట్రం మొత్తం మీద 5,16,750 ఎకరాలకు సూక్ష్మ నీటిపారుదల సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా,  అందులో  రాయలసీమ జిల్లాల లక్ష్యం 2,80,500 ఎకరాలు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి 21,250 ఎకరాలు  కేటాయించగా, రాయలసీమలో 7,500 ఎకరాలు కేటాయించారు. అలాగే పశుగ్రాస క్షేత్రాలను కూడా ఈ జిల్లాలకు ఎక్కువగా మంజూరు చేశారు.  

 2015-16 జీవీఏ టాప్ 10 మండలాల్లో అనంతపురం, తిరుపతి
రాష్ట్రం మొత్తం మీద 2015-16 జీవీఏ (ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ) టాప్ 10 మండలాల్లో అనంతపురం(8), తిరుపతి అర్బన్(10) మండలాలు ఉన్నాయి. తలసరి ఆదాయంలో రూ.2,44,799లతో రేణిగుంట మండలం పదవ స్థానంలో నిలిచింది. రాయలసీమ జిల్లాల్లో జీవీఏ,మరి ముఖ్యంగా వ్యవసాయరంగంలో వృద్ధి రేటు క్రమక్రమంగా పెరుగుతోంది. 2014-15లో జీవిఏ కర్నూలు జిల్లాలో రూ.27,466 కోట్లు ఉండగా, 2016-17కు రూ.35,717 కోట్లకు పెరిగింది. అలాగే కడప జిల్లాలో రూ.22,043 కోట్ల నుంచి రూ.26,582కు, అనంతపురం జిల్లాలో రూ.28,637 కోట్ల నుంచి రూ.35,430 కోట్లకు, చిత్తూరు జిల్లాలో రూ.33,054 నుంచి రూ.41,012 కోట్లకు పెరిగింది.
రాయలసీమకు 1.52 లక్షల ఇళ్లు కేటాయింపు
ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రాయలసీమ జిల్లాల్లో మూడేళ్లకు మొత్తం 1,52,023 ఇళ్లు కేటాయించారు. 2016-17లో 60,145 ఇళ్లు, 2017-18లో 65,278 ఇళ్లు మంజూరు చేశారు. 2018-19కి 26,600 ఇళ్లు కేటాయించారు.

1420 మందికి ప్రమాద బీమా
ప్రధాన మంత్రి-చంద్రన్న బీమా పథకం కింద రాయలసీమలో 61.7 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించారు. మొదటి సంవత్సరంలో 16,461 సహజ మరణాలకు, 1420 ప్రమాద మరణాలకు బీమా మొత్తం మంజూరు చేశారు.

రాయలసీమలో ‘పట్టు’
పట్టుపురుగు పెంపకానికి రాయలసీమ జిల్లాల్లో అనంతపురం, చిత్తూరు ప్రసిద్ధి. ఈ రెండు జిల్లాల్లో పట్టు ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. ఇక్కడ పట్టుపురుగు పెంపకం కూడా ఎక్కువే. 2017-18లో రాష్ట్రంలో 8700 ఎకరాల్లో మల్బరీ తోటలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 6600 ఎకరాలు రాయలసీమ జిల్లాలకే కేటాయించారు. రాష్ట్రంలో వెయ్యి రీలింగ్ షెడ్డులు మంజూరు చేయగా, వాటిలో 625 రాయలసీమలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ లో కకూన్ల ఉత్పత్తి, మల్బరీ తోటల పెంపకం, ఉత్పాదకతలో చిత్తూరు జిల్లా 3వ స్థానంలో నిలిచింది.

చిత్తూరు జిల్లాలో రూ.లక్ష దాటిన తలసరి ఆదాయం
తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే 2014-15లో కడప జిల్లాలో రూ.93,044 ఉండగా, 2016-17లో రూ.1,19,224కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో రూ.82,516 నుంచి రూ.1,09,141కి, కర్నూలు జిల్లాలో రూ.77,293 నుంచి రూ.99,116కు, అనంతపురం జిల్లాలో రూ.74,287 నుంచి రూ.97,912కు పెరిగింది.

వ్యవసాయంలో అగ్రగామి శింగనమల
రాష్ట్రంలో 2015-16 గణాంకాల ఆధారంగా  నియోజకవకర్గాల వారీగా జీవీఏ లెక్కించారు.   వ్యవసాయంలో అనంతపురము జిల్లా  శింగనమల అగ్రగామిగా నిలిచింది. ఉద్యానవన పంటల వల్ల సింగనమల అత్యధిక జీవీఏ సాధించింది.  రాష్ట్ర స్థాయిలో వ్యవసాయం, ఉద్యానవన పంటల వల్ల అత్యధిక జీవీఏ సాధించి సింగనమల 4వ స్థానం దక్కించుకుంది. రాళ్లసీమ పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో తెలిసిపోతుంది.

రూ.71,356 కోట్ల పెట్టుబడులతో 231 పరిశ్రమలు
రాయలసీమలో 231 పరిశ్రమలు జీ1,జీ2,జీ3,జీ4, వై దశలో అంటే నిర్మాణ పనులు, యంత్రాల బిగింపు, ట్రయిల్ ప్రొడక్షన్, ఉత్పత్తి దశలో ఉన్నాయి. రూ.71,356 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించే ఈ పరిశ్రమల వల్ల 1,25,647 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా రూ.1,52,722 కోట్ల పెట్టుబడులతో 202 పరిశ్రమలు పరిశీలన, అనుమతుల దశలో ఉన్నాయి. ఈ పరిశ్రమల స్థాపన జరిగితే మరో 5,67,298 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాయలసీమలో తిరుపతి, కడప, పుట్టపర్తిలలో విమానాశ్రయాలు ఉన్నాయి. వీటికి తోడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు, చిత్తూరు జిల్లా కుప్పంలలో విమానాశ్రయాలు నిర్మించనున్నారు.

సీమలో ప్రముఖ విద్యా సంస్థలు
రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. తిరుపతిలో ఐఐటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కలినరీ స్కిల్స్, చిత్తూరులో ఐఐఎస్ఈఆర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటయ్యాయి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ-ప్లస్ గ్రేడ్ తో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. 

కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను సోలార్ విద్యుత్ హబ్ గా రూపొందించనుంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో 6 వేల ఎకరాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద  వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా సోలార్‌ పార్కు’    నెలకొల్పారు. ఈ ఏడాది మార్చిలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. ఉపాధి అవకాశాలు పెరిగాయి.  ఈ పార్కులో పని చేసే వెయ్యి మందిలో  800 మంది కర్నూలు ప్రాంతం వారే ఉన్నారు.  ఒకే చోట 1000 మెగావాట్లతో లార్‌ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించడం ఒక ప్రత్యేకత.  ఇది ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణం.  ఎన్.టి.పి.సి. ద్వారా అనంతపురం జిల్లాలోని అల్ట్రా మెగా సోలార్‌ పార్కు నుంచి మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే దీనిని  అభివృద్ధిపరిచారు.  కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద మంజూరీ చేసిన సోలార్‌ పార్కుల్లో ఈ పార్కు ఏప్రిల్‌ 2016లో ఉత్పత్తి ప్రారంభించిన మొట్టమొదటి సోలార్‌ పార్కుగా దేశంలో రికార్డులోకి ఎక్కింది.  రెండవ దశలో మరో 750 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఏపి జెన్ కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపడుతోంది. ఇదే జిల్లా మైలవరం ఎంపిటిసి, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాల ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు.  దేశంలోనే మొదటిసారిగా వంద మెగావాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు.

అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవే
అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవేకు కావలసిన  భూసేకరణపై ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే అత్యంత పొడవుగా, మలుపులు లేకుండా 393.59 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.27,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో దీని నిర్మాణం కీలకం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. దీని నిర్మాణ బాధ్యతను కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అప్పగించింది.  2019 నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఈ రహదారితో రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. రాయలసీమకు  ఈ రహదారి ద్వారా బెంగళూరు, చెన్నయ్‌, హైదరాబాద్‌ ప్రధాన నగరాలకు అనుసంధానం ఏర్పడుతుంది.  అమరావతికి ప్రయాణ కాలం, దూరం కూడా గణనీయంగా తగ్గుతాయి. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఇది కీలకమవుతుంది.

పరిశ్రమల వెల్లువ
కేంద్ర ప్రభుత్వం, జపాన్ ఇండస్ట్రియల్ కోపరేటివ్ ఏజన్సీల సహకారంతో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్(సీబీఐసీ)ను అభివృద్ధి పరచనున్నారు. ఈ జోన్ లో కొత్త ఆర్థిక మండళ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కారిడార్ పరిధిలో చిత్తూరు జిల్లా ఏర్పేడు, అనంతపురం జిల్లా హిందూపురంలను పారిశ్రామికీకరణకు అత్యంత అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ జిల్లా మేజర్ ఆటో క్లస్టర్ గా అభివృద్ధి చెందనుంది. కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)ను కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,  5వేల మంది సామర్ధ్యం కలిగిన కన్వెన్షన్ సెంటర్, ఇంక్యుబటేషన్ సెంటర్, మామిడి అభివృద్ధి మండలి, అరటి అభివృద్ధి మండలి, చిత్తూరులో ఇన్ లాండ్ కంటెయినర్ డిపో,  చిత్తూరు బ్రౌన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పబ్లిక్,  ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్కులు, అనంతపురం,  కర్నూలు జిల్లాల్లో క్వార్ట్జ్, సినికాన్ ఇసుక, గ్రానైట్ వంటి కంపెనీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.  చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో టెక్స్ టైల్ రంగాన్ని అభివృద్ధిపరుస్తారు. ఏపీఐఐసీ కర్నూలు జిల్లాలో 41,672 ఎకరాల్లో,  చిత్తూరు జిల్లాలో 30,299 ఎకరాల్లో, కడప జిల్లాలో 18,940, అనంతపురం జిల్లాలో 18,733 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనుంది. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో 87.48 ఎకరాల్లో రూ.21.5 కోట్ల వ్యయంతో ఇంజనీరింగ్ క్లస్టర్ ని, చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో వంద ఎకరాల్లో రూ.39.85 కోట్లతో సిల్క్, గార్మెంట్స్ క్లస్టర్ లను అభివృద్ధి చేస్తోంది.  ఈ రెండు క్లస్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ(సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖ ఒక్కొక్కదానికి రూ.8 కోట్లు గ్రాంట్ అందజేస్తుంది. ఏపీఐఐసీ రెండవ దశలో కడప జల్లా పులివెందుల, ఎర్రగుంట్లలలో ఇంజనీరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది. అలాగే చిత్తూరు జిల్లా పీలేరులో సిల్క్, గార్మింట్ క్లస్టర్, అనంతపురం జిల్లా రాయదుర్గంలో గార్మెంట్ క్లస్టర్, కర్నూలు జిల్లా బేతం చర్లలో స్లాబ్ పాలిషింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో స్థలాలను పరిశీలిస్తోంది. ప్రజలు, పరిశ్రమలు వాడి పారవేసే వ్యర్థాలు పెరిగిపోతుండటం వల్ల ఏర్పడే భూమి, నీరు, గాలి కాలుష్యాన్ని నివారించేందుకు  తిరుపతిలో 6 మెగావాట్లు, అనంతపురంలో 4 మెగావాట్లు, కర్నూలులో ఒక మెగావాట్ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి ప్లాంట్లను ప్రభుత్వం నెలకొల్పనుంది.

కర్నూలు జిల్లాలో అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌
            కర్నూలు జిల్లాలో 700 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఇక్కడ జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ అల్ట్రా మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసింది. గుజరాత్‌ అంబుజా రూ.240 కోట్లతో మొక్కజొన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్మించనుంది. ఈ జిల్లాలో ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ వారు  మిస్సైల్ రీసెర్చ్ ల్యాబ్ ని, అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కెబిఐసిలో భాగంగా కర్నూలు జిల్లా ఒర్వకల్లులో మెగా పరిశ్రమల హబ్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ జిల్లాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది.

మంగపేటలో బైరైట్స్ ప్రాజెక్ట్ 
కడప జిల్లాలో టెక్స్ టైల్స్ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కడపలో గతంలో బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన స్థలంలో ఉక్కు కర్మాగారం, మంగపేటలో బైరైట్స్ ప్రాజెక్ట్  నెలకొల్పే అవకాశాలు  ఉన్నాయి.

పాలసముద్రం వద్ద బెల్
          రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) యంత్రపరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రూ.500 కోట్లతో నిర్మించే దీనికి గత ఏడాది శంకుస్థాపన కూడా చేశారు. దీనికి 900 ఎకరాల భూమిని కేటాయించారు.  ఇక్కడ రక్షణ రంగానికి చెందిన భారీ యంత్రాలు, రాడార్లు మొదలుకొని చిన్నచిన్న యంత్ర పరికారాలను తయారు చేస్తారు. దీని వల్ల  ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది.  పాలసముద్రంలోనే  ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్, ఇదే జిల్లాలో భారత్ ఎలక్ట్రానిక్ సంస్థ వారు డిఫెన్స్  ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు.  అమెరికన్ హిల్లార్డ్ కంపెనీ రూ.3,600 కోట్ల పెట్టుబడితో అనంతపూర్ లో 650 మెగావాట్ల సౌర విద్యుత్, విండ్ పవర్ సెక్టార్ ను స్థాపించేందుకు అంగీకారం తెలిపింది. అనంతపురంలో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాలో కియా మోటార్స్ వారు రూ.12,735 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

తిరుపతిలో రూ.1800 కోట్లతో 77 ప్రాజెక్టులు
చిత్తూరు జిల్లాలో తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపికైంది. త్వరలో ఇక్కడ రూ.1600 కోట్లతో 77 ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే  శ్రీసిటీలో జపాన్ కు చెందిన అగ్రగామి వాహన తయారీ సంస్థ ఇసుజు 107 ఎకరాల స్థలంలో కార్ల తయారీ ప్లాంట్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ ఏడాదికి 50,000 వాహనాల  తయారీ సామర్థ్యం కలిగి ఉంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 1,20,000 వాహనాలకు పెంచాలన్నది ఇసుజు మోటార్స్ ఇండియా లక్ష్యం. ఈ సంస్థ దశల వారీగా రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మాండెల్జ్ ఇంటర్నేషనల్(క్యాడ్బరీ) చాక్లెట్ ఫ్యాక్టరీని కూడా శ్రీసిటీలో ప్రారంభించారు. 134 ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడితో తొలి దశ నిర్మాణం చేపట్టారు. ఆసియా-పసిఫిక్ లోనే అతిపెద్ద చాక్లెట్ కర్మాగారంగా దీనిని తీర్చిదిద్దుతారు.  నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎంజెడ్),తోపాటు ఎలక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఆటో క్లస్టర్, సెరామిక్ క్లస్టర్ ను, బహుళ ఉత్పత్తుల ఫుడ్ పార్క్ ను కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇదే జిల్లాలలో శ్రీకాళహస్తి, ఏర్పేడులలో పారిశ్రామిక నోడ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కుప్పంలో రూ.700 కోట్లతో రోజుకు 100 మెట్రిక్ టన్నుల  ప్రాసెసింగ్ సామర్ధ్యంతో రష్యా భాగస్వామ్యంతో  కూరగాయలు, పండ్ల శుద్ధి కర్మాగారం ఏర్పాటు కానుంది. రష్యాకు చెందిన నెవ్‌సాక్యా-కో రష్యా’, రాష్ట్రానికి చెందిన శివసాయి గ్రూప్ సంయుక్తంగా  నెలకొల్పే ఈ కర్మాగారంలో టొమాటోతో పాటు ఉల్లి, మిర్చిని  ప్రాసెసింగ్ చేస్తారు.  నెవ్‌సాక్యా-కో రష్యాకంపెనీ సెయింట్ పీటర్స్ బర్గ్ కేంద్రంగా దిగుమతులు, పంపిణీ వ్యాపారంలో రష్యా అంతటా విస్తరించింది. ఏటా 3.6 లక్షల టన్నుల ఉత్పత్తుల దిగుమతి సామర్ధ్యం ఈ కంపెనీకి ఉంది. శివసాయి గ్రూప్  తొమ్మిదేళ్లుగా ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో, ప్రత్యేకించి ఆహార శుద్ధి రంగంలో, పండ్ల ఎగుమతిలో  రష్యాతో కలసి పనిచేస్తోంది.  ఈ జిల్లాలో 7,898 కోట్లతో 1307 పరిశ్రమలను నెలకొల్పగా, 47,533 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రూ.24,746 కోట్ల వ్యయంతో మరో 2430 యూనిట్లు రానున్నాయి. తద్వారా మరో 50వేల మందికి ఉపాధి లభిస్తుంది. బెల్జియం వ్యాపారవేత్తలు తిరుపతిలో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, థీమ్‌ పార్కులను ఒకే చోట నిర్మించాలన్న ప్రతిపాదనతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. క్లౌడ్ రాక్ సంస్థ, ఆర్కిటెక్ట్ డొమైన్ డాట్ కామ్ కంపెనీలు తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.  చిత్తూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడి రీజియన్ ఏర్పాటు చేస్తారు.  ఈ రీజియన్ లో నివాస ప్రాంతాలతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తులు, ప్రజోపకరణాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సేవలు అందుబాటులో ఉంటాయి. పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమీకృత టౌన్ షిప్ ల వంటివి కూడా ఉంటాయి. 

శ్రీసిటీతో భారీగా ఉపాధి అవకాశాలు
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. వంద కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరానికి 26 దేశాలకు చెందిన 106 కంపెనీలు రావడానికి తమ సంసిద్ధత తెలిపాయి. 22 దేశాలకు చెందిన 70 పరిశ్రమలు ఇప్పటికే వచ్చాయి. దేశవిదేశాలకు చెందిన  85 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 40 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికే 25 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీనిని దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా రూపొందించాలన్నది ప్రభుత్వ  ముఖ్య ఉద్దేశం. ఆసియాలోనే అతిపెద్ద మాండలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ (క్యాడ్‌ బరీ) తయారీ కేంద్రాన్ని ప్రారంభించాయి.  వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పిన  చాక్టెట్ ఫ్యాక్లరీలో 1600 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి  ఉపాధి కల్పిస్తున్నారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ‘మేక్ ఇన్ ఇండియా-మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’లో భాగంగా 134 ఎకరాలలో ఈ కర్మాగారాన్ని నిర్మిచారు. క్యాడ్‌బరీ చాక్లెట్లు, బిస్కెట్లు, గమ్ అండ్ క్యాండీ, బెవరేజెస్, క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్, క్యాడ్‌బరీ సెలబ్రేషన్స్, సీడీఎం సిల్క్, బోర్న్ విటా, పెర్క్, ఫైవ్ స్టార్ చాక్లెట్, జెమ్స్, క్యాడ్‌బరీ బోర్నవిల్లే తదితరాలను ఈ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన క్యాడ్‌బరీ కంపెనీ 2020 నాటికి 2 లక్షల 50 వేల టన్నుల చాక్లెట్ల ఉత్పత్తి ని సాధించడం లక్ష్యం పెట్టుకుంది. రూ.1200 కోట్ల పెప్సికో బెవరేజ్ ప్లాంట్ తోపాటు 11 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ షామీ ఇక్కడ తమ  ప్లాంట్‌లో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్‌ ప్లాంట్‌లో షామీ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తుండటంతో  ఈ ప్రత్యేక ఆర్థిక మండలి(స్పెషల్ ఎకనామిక్స్ జోన్-ఎస్ఇజెడ్)లో ఉపాధి అవకాశాలు బాగా పెరిగిపోయాయి.

నీటిపారుదల సౌకర్యం, భూగర్భ జలాల పెరుగుదల, రుణ మాఫీ, రైతు ఉత్పాదక సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాల్లో సాయం అందిస్తుండటంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తులు పెరుగడంతోపాటు రాయలసీమవాసుల ఆదాయం కూడా పెరుగుతోంది. అలాగే పారిశ్రామికీకరణ వల్ల భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగంలో ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే రాయలసీమ ముఖచిత్రం మారిపోవడం ఖాయం.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

-          

1 comment:

  1. చక్కని కధనం.... రాయలసీమలో ప్రస్తుతం వున్న భారీ పరిశ్రమల గురించి రెండు వాక్యాలు రాసివుంటే ఇంకా బాగుండేది. బ్రెజిల్ దేశానికి చెందిన గెర్డావ్ స్టీల్స్ అనతపురం జిల్లా తాడిపత్రి లో 3500 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాదునిక శ్తీల్ కర్మాగారాన్ని నడుపుతుంది. బ్రెజిల్ దేశం ఆసియా ఖండం లో పెట్టిన అతిపెద్ద పెట్టుబడి ఇది. సుమారు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాదిని కల్పిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం రాబొయే పరిస్రమలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది గాని వున్న వాటిగురించి పట్టించికోవడం లేదు అనేది నిర్వివివాద అంశం.
    K S S Bapujee
    8179081601

    ReplyDelete

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...