Aug 29, 2018


నరేగాతో గ్రామీణాభివృద్ధి
v పలు అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం
v 2 ఏళ్లలో 1340 మోడల్ గ్రామాల లక్ష్యం
v భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యత
v 4 ఏళ్లలో రూ.23,141 కోట్ల వ్యయం


            గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా-ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) గ్రామీణులకు పని దినాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతే కాకుండా ఈ పథకం అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోల్చితే   పలు అంశాలలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరంలో వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య(6,33,081) విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్(5,40,248) రెండవ స్థానంలో, చత్తీస్ గడ్ (3,09,907) మూడవ స్థానంలో నిలిచాయి. పంట సంజీవనిలో ఏపీ మొదటి స్థానంలో, జార్ఖండ్ 2, తెలంగాణ 3వ స్థానంలో ఉన్నాయి. 1,64,023 వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్ హెచ్ఎల్-ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లిట్రిన్స్) నిర్మించి ఏపీ ప్రథమ స్థానంలో, తమిళనాడు(51,136) 2వ స్థానం, గుజరాత్ (38,650) 3వ స్థానంలో నిలిచాయి. అనుసంధాన శాఖలు రూ.2,646 కోట్లు మెటీరియల్ కు ఖర్చు చేసి ఏపీ మొదటి స్థానంలో, రూ.1,847 కోట్లో పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో, రూ.1,549 కోట్లతో మధ్య ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయిఈ పథకం కింద రూ.6,149 కోట్లు ఖర్చు చేసి రెండవ స్థానంలో నిలిచింది. అలాగే వర్మీ కంపోస్ట్ గుంతల సంఖ్యలో, అంగన్ వాడీ కేంద్రాల సంఖ్యలో, రోడ్డుకు ఇరువైపుల మొక్కల పెంపకంలో రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఈ పథకానికి సంబంధించి మొత్తం 10 సూచికల్లో నాలుగింటిలో మొదటి స్థానం, మరో 4లో 2వ స్థానం, ఇంకో రెండు సూచికల్లో ఏపీ 4వ స్థానం సాధించింది.

           పేదవారికి ఒకొక్కరికి ఏడాదికి కనీసం 100 రోజులు, కరువు సమయంలో 150 రోజుల పనిదినాలు తగ్గకుండా ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 153 రకాల కార్యకలాపాలకు ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది.  గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థిర ఆస్తులు సమకూర్చడం, పేదలకు మెరుగైన జీవన వనరులు సమకూర్చడం, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం వంటి పలు కార్యక్రమాలను నరేగా నిధులతో చేపడుతున్నారు. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, తాగునీరు, అంగన్‌వాడి భవనాల నిర్మాణం... వంటి మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున చేపట్టారు.  అలాగే చెరువులు, పంట సంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, మొక్కలు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, శ్మశానాల మరమ్మతులు, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పంచాయతీ భవనాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు ఇప్పటికే వందల సంఖ్యలో శాశ్విత భవనాలు నిర్మించారు. ఇంకా అనేక భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పథకం నిధులతో గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పాఠశాల విద్య, మత్స్య, పశు సంవర్ధక, జల వనరులు, సెర్ప్, మెప్మా, వ్యవసాయ, ఉద్యాన శాఖ తదితర శాఖలు పనులు చేయిస్తున్నారు. మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం, ఆట స్థలాలు ఆటలకు అనువుగా అభివృద్ధి చేయడం, గోవులకు  గోకులంనిర్మాణాలు చేపట్టారు.
               రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. గ్రామాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.  తక్కువ సమయంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు.   పథకం నిధులతో రెండేళ్లలో రాష్ట్రంలో 1340 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం, సింగరాజుపాలెం తదితర 11 గ్రామాల్లో పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా పూర్తి చేశారు.
4 ఏళ్లలో రూ.23,141 కోట్ల వ్యయం
               ఈ పథకం కింద నాలుగేళ్ల 3 నెలల్లో అంటే 2014-15 నుంచి 2018-19 ఆగస్ట్ వరకు రాష్ట్రంలో రూ.23,141.35 కోట్లు ఖర్చు చేశారు. 92.38 కోట్ల పనిదినాలు కల్పించారు. వేతనాల కింద రూ.13,284 కోట్లు చెల్లించారు. మెటీరియల్ కు రూ. 8,541.19 కోట్లు వ్యయం చేశారు. 3.70 కోట్ల కుటుంబాలకు పని కల్పించారు. పంట సంజీవనీ పథకం కింద 5,60,654 సేద్యపు నీటి కుంటలు, 14,28,565 ఇంకుడు గుంటలు తవ్వారు. 8,43,070 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. 5,092 అంగన్ వాడీ కేంద్రాలు, 1,906 గ్రామ పంచాయతీ భవనాలు, 369 మండల స్త్రీ శక్తి భవనాలు నిర్మించారు. 18,857 కిలోమీటర్ల సిసి రోడ్లు వేశారు. ఈ విధంగా ఈ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి జరుగుతోంది.   
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...