Aug 7, 2018


అమరావతిలో నిర్మాణాలు మొదలుపెట్టాలి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సీఎస్ దినేష్ కుమార్ ఆదేశాలు


           సచివాలయం, ఆగస్ట్ 7 : రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్ధేశించిన గడువులోపల  నిర్మాణాలు ప్రారంభించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సీఆర్డీఏ భూములు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ భూములు కేటాయింపు జరిగి, డబ్బు చెల్లించనివారు రెండు నెలల లోపల చెల్లించాలని ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణాలు మొదలు పెట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కొన్ని సంస్థల వారు 15 రోజుల లోపల, మరికొన్ని సంస్థల వారు నెల రోజుల లోపల డబ్బు చెల్లిస్తామని చెప్పారు. కొంత మంది నెల రోజుల లోపల, ఇంకొతమంది డిసెంబర్ లో నిర్మాణాలు మొదలు పెడతామని తెలిపారు. కొంత మంది అదనంగా భూమి కావాలని అడిగారు. అది సాధ్యం కాదని సీఎస్ చెప్పారు. భూముల కేటాయింపు, నగదు చెల్లింపులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సీఆర్డీఏ అధికారులను సంప్రదించమని చెప్పారు.
         ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదో చెప్పమని అడిగారు. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమన్నారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రోడ్లు, ప్రభుత్వ గృహాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఆ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. ఏఏ  పనులు  ఎంతవరకు జరిగాయో ఫొటోలు ప్రదర్శించారు. హైకోర్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. త్వరలో నిర్మాణాలు మొదలుపెడతారన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలవవలసి ఉందని చెప్పారు. భూములు కేటాయించిన 57 సంస్థలకు నిర్మాణాల విషయమై లేఖలు రాసినట్లు తెలిపారు.  కొందరు స్పందించినట్లు కూడా వివరించారు.   రిజర్వు బ్యాంకు, పోస్టల్, నిఫ్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్, సీబిఐ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, విదేశీవ్యవహారాల శాఖ, ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, సిండికెట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ,  ఎల్ఐసీ, ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్,  ఎఫ్ సీఐ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అనుమతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని త్వరలో నిర్మాణాలు మొదలు పెడతామని కొన్ని సంస్థల ప్రతినిధులు చెప్పారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...