Aug 20, 2018


అమరావతి బాండ్స్ లాభదాయకమే
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వివరణ

                సచివాలయం, ఆగస్ట్ 20: అమరావతి బాండ్స్ ద్వారా నిధులు సేకరణ ప్రభుత్వానికి  లాభదాయకమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం వారు చేసే ఆరోపణలలో నిజంలేదన్నారు. కొన్ని పత్రికల రాతలు కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్పారు. కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా రుణం ఇవ్వడానికి ఆలస్యం చేస్తుందని చెప్పారు. ఈ నేపధ్యంలో  పనులు ఆగకుండా అవకాశం ఉన్న అన్ని మార్గాలలో సీఆర్డీఏ నిధులు సేకరిస్తుందన్నారు. సంస్థ రేటింగ్ ని బట్టి బాండ్ పై  వడ్డీరేటు ఉంటుందని తెలిపారు. సంస్థ ఆదాయ మార్గాలు, వడ్డీ, అసలు చెల్లింపుల సామర్ధ్యం వంటి పలు అంశాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారని చెప్పారు.    ట్రిపుల్ ఏ రేటింగ్ అయితే ఒక రేటు, డబుల్ ఏ రేటింగ్ అయితే ఒక రేటు ఉంటుందని వివరించారు. మనకు ఏ ప్లస్ రేటింగ్ వచ్చిందని తెలిపారు. ఈ రేటింగ్ కి ఈ రోజు వడ్డీ  రేటు 10.48 శాతంగా ఉందని, మనం చెల్లించే వడ్డీ రేటు 10.32 శాతం మాత్రమేనని చెప్పారు. గ్రామీణ విద్యుత్ కార్పోరేషన్ కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉందని, ఆ సంస్థ 9.4 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోందన్నారు. మిషన్ భగీరధ ప్రాజెక్ట్ నిధులకు 10.5 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నట్లు తెలిపారు.  ఈ విధంగా బాండ్లు దేశంలోని పలు ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పోరేషన్, జీహెచ్ఎంసీ వంటివి కూడా బాండ్లు ద్వారా రుణం తీసుకున్నట్లు చెప్పారు. యుపీ విడుదల చేసిన బాండ్లకు ప్రభుత్వ సబ్సిడీలను కూడా సెక్యూరిటీగా పెట్టారని, చెక్ బౌన్స్ అయితే రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునేవిధంగా నిబంధనలు విధించారన్నారు. మనకు అటువంటి నిబంధనలు ఏమీ లేవని చెప్పారు. బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీతో పాటు భూములు కూడా తాకట్టు పెట్టవలసి ఉంటుందన్నారు. బాండ్లకు ప్రభుత్వం గ్యారంటీ మాత్రమే ఇస్తుందని, భూములు తాకట్టు పెట్టవలసిన అవసరంలేదని చెప్పారు. నూతన రాజధాని అమరావతి అనేది గ్రీన్ ఫీల్డ్ నగరమే కాకుండా రెండు పెద్ద నగరాల మధ్య ఉందని  రోడ్ షోలో వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ద్వారా అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు సేకరిస్తున్నట్లు వివరించారు.
బాండ్ల జారీలో సీఆర్డీఏ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పారు. అప్పు చేయకుండా కేంద్రంలో కూడా ఏ పనులు జరగవన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అప్పు తీసుకున్నట్లు తెలిపారు.

                ప్రపంచ బ్యాంకు వడ్డీ 4 శాతం అని చెబుతారని, వాస్తవానికి దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని, ఇబ్బందులు కూడా ఎక్కువని చెప్పారు. ప్రపంచ బ్యాంకు వద్ద రుణం తీసుకుంటే గ్యారంటీ ఇచ్చినందుకు కేంద్రానికి రెండు శాతం అదనంగా చెల్లించాలని, దానికి విదేశీ కరెన్సీ సమస్య కూడా ఉందని, విదేశీ కరెన్సీ విలువ పెరిగితే దానిని రాష్ట్రప్రభుత్వమే భరించాలని వివరించారు. ఈ విధంగా దానికి కూడా ఎక్కువ ఖర్చులు అవుతాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు రూ.3253 కోట్లు రుణం ఇస్తే, కేంద్రం రూ.1394 కోట్లు సమకూర్చవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రుణాన్ని కూడా ప్రపంచ బ్యాంకు ఇంతవరకు విడుదల చేయలేదని చెప్పారు. అభివృద్ధి నిరోధకులు ఫిర్యాదులు చేయడంవల్లే ఇలా జరిగిందన్నారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి రుణం తీసుకుంటే ఏడాదికైతే 10.15 శాతం, రెండేళ్లకైతే 10.25 శాతం, మూడేళ్లకైతే 10.3 శాతం వడ్డీరేటు చెల్లించాలని తెలిపారు. ఈ బాండ్స్ కు మనం చెల్లించేది 10.32 శాతమేనని చెప్పారు. ఈ బాండ్లకు చెల్లించే వడ్డీ విషయంలో కూడా కొందరు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. రెండు వేల కోట్ల రూపాయలకు పదేళ్లలో చెల్లించే వడ్డీ రూ.1,573 కోట్లు మాత్రమేనని తెలిపారు. అయిదు సంతవ్సరాల వరకే వడ్డీ చెల్లిస్తామని, ఆ తరువాత వడ్డీతోపాటు ఏడాదికి 20 శాతం చొప్పున అసలు కూడా చెల్లిస్తామని ఆ విధంగా వడ్డీ చెల్లింపు ఏడాదికేడాది తగ్గుతూ ఉంటుందని వివరించారు. ప్రతిపక్షం వారు పదేళ్లకు వడ్డీ లెక్క కట్టి ఎక్కువ వడ్డీ అవుతుందని లెక్కలు చెబుతున్నారన్నారు. 2015 నుంచి టాక్స్ ఫ్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల కోసం ప్రయత్నిస్తున్నామని, కేంద్రం అనుమతించలేదని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచన చేసే సీఆర్డీఏ ఈ బాండ్లు విడుదల చేసిందని కుటుంబరావు చెప్పారు.   ఈ బాండ్ల వ్యవహారం అంతా పారదర్శకంగానే జరిగిందని, ఇక ముందు కూడా జరుగుతుందన్నారు. ఇందులో పెట్టుబడిపెట్టే వారిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది బ్లాక్ మనీ అర్ధంపర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవంలేదని చెప్పారు. బ్లాక్ మనీ బాండ్లలో పెట్టడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 27న బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్ లో పెట్టుబడి పెట్టినవారి అందరి పేర్లు ఉంటాయని, అందరూ చూడవచ్చునని చెప్పారు. ఎరేంజర్ ఫీ 0.85 శాతం ఇస్తున్నామని, ఈ విషయంలో చేస్తున్న ఆరోపణల్లో కూడా వాస్తవం లేదన్నారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రాసెసింగ్ ప్రక్రియ అంతా పారదర్శికంగా జరిగినట్లు చెప్పారు. సెబీలో టాప్ 20 రిజిస్టర్ మర్కెంటైల్ బ్యాంకులకు పంపినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియకు 16 బ్యాంకులు హాజరైనట్లు చెప్పారు. గుజరాత్ పెట్రోలియం కార్పోరేషన్ 1.5 శాతం, కృష్ణా బోర్డు 1.6 శాతం ఎరేంజర్ ఫీ చెల్లించినట్లు వివరించారు. ఇక్కడ 0.85 శాతం మాత్రమేనన్నారు.   అమరావతి బాండ్స్ ద్వారా సేకరించిన నిధులను దేనికైనా వినియోగించుకోవచ్చు అనే విషయంపై కూడా కుటుంబరావు వివరణ ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలో అంటే అమరావతి అభివృద్ధికి  రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ... వంటి వాటికి వినియోగించుకోవచ్చని వివరించారు. అంతేగానీ ఈ నిధులను రైతుల రుణమాఫీకి, డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇవ్వడానికి... వంటి వాటికి ఉపయోగించుకోవడానికి వీలులేదని కుటుంబ రావు స్సష్టం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...