Aug 24, 2018

కేంద్రంపై కూడా సీబీఐ విచారణ కోరండి
జీవీఎల్ ని డిమాండ్ చేసిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి

జగన్-పవన్ మోడీకి జోడెద్దులు   

          సచివాలయం, ఆగస్ట్ 24: కేంద్రంలో, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా అవినీతి జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొందని, అందువల్ల కేంద్రంపై కూడా సీబిఐ విచారణ కోరమని జీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని జీర్ణించుకోలేక జీవీఎల్ తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాలలోని వివిధ శాఖల మధ్య కేంద్రం పెట్టిన పోటీలో ఏపీలోని పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమలు వంటి శాఖలు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సరళతర వ్యాపార విధానం)లో కూడా ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఇవన్నీ కేంద్రం ఇచ్చినవేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పీడీ ఖాతాలపై తెలిసీ తెలియని విధంగా మాట్లాడుతున్నారన్నారు. పీడీ ఖాతాలు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పారు. ఇవి ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం ఏర్పాటు చేసుకున్న ఖాతాలు మాత్రమేనని తెలిపారు. ఈ ఖాతాలలో అవినీతి జరిగే అవకాశంలేదన్నారు. ఈ ఖాతాలపై సీబీఐ విచారణ జరిపించమని కోరడం హాస్యాస్పదం అన్నారు. సీబీఐ విచారణ జరిపినా గుండుసున్నా మిగులుతుందన్నారు. కాగ్ నివేదికలో అవినీతి జరిగినట్లు పేర్కొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీబీఐ విచారణ జరిపించమని జీవీఎల్ కోరాలన్నారు.
రూ.9,500 కోట్లకు బ్యాంకులను ముంచి లండన్ పారిపోయన విజయ మాల్యా గురించి గానీ, అనేక బ్యాంకులను ముంచిన లలిత్ మోడీ, నీరబ్ మోడీ గురించి గానీ ఈ జీవిఎల్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై సీబీఐ విచారణ వేశారా? అని అడిగారు. వారానికి ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వారికి అలవాటైపోయిందన్నారు. కొందరు రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటాయని చెప్పారు. రాజకీయంగా పొత్తులు పెట్టుకున్నా, స్నేహంగా ఉన్నా పెళ్లిళ్లుగా పేర్కొనడం, పెళ్లిళ్ల భాష మాట్లాడటం ప్రతిపక్షం వారికి అలవాటైందన్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చలనం కలిగించారన్నారు. వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పారు. మమతా బెనర్జీ, మాయావతి, దేవగౌడ, మూలాయం సింగ్, నితీష్, కమ్యూనిస్టులు అందరితో మాట్లాడతారన్నారు. అవసరమైతే మాయావతిని ఇక్కడకు రప్పిస్తామన్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటానికి అందరి మద్దతు లభిస్తుందని చెప్పారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామన్నారు. బీజేపీ 102, కాంగ్రెస్ 88 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

జగన్-పవన్ మోడీకి జోడెద్దులు
ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి తన సంకల్ప యాత్రలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే వారితో కలుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని బీజేపీ స్పష్టం చేసిందని, అటువంటి పార్టీతో వైసీపీకి స్నేహం ఏమిటని ప్రశ్నించారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదని, ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడు కావాలా? అవినీతికి పాల్పడిన జగన్ కావాలా? నేను కావాలా?’ అని పవన్ కల్యాణ్ అడుగుతున్నారన్నారు. జగన్-పవన్ ఇద్దరూ మోడీకి జోడెద్దులులాంటివారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
చంద్రబాబు పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పవన్ చెంపలేసుకొని చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో  కూడా ఒక్క బీజేపీ తప్ప అందరూ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పినవారేనని  జూపూడి పేర్కొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...