Aug 13, 2018


వ్యక్తిగతం కాదు వెసులుబాటు ఖాతా
పీడీ అకౌంట్ పై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వివరణ
             సచివాలయం, ఆగస్ట్ 10: పీడీ(పర్సనల్ డిపాజిట్) ఖాతా అనేది వ్యక్తిగతం కాదని, బ్యాంక్ ఖాతా కాదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన పూర్తిగా ఆర్థిక శాఖ నియంత్రణలో నిర్వహించే వెసులుబాటు కలిగిన ఖాతా అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర వివరణ ఇచ్చారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంస్తులోని సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. పీడీ ఖాతాలను ఆయా సంస్థల పేరుతో మాత్రమే నిర్వహిస్తారని, వ్యక్తిగతంగా నిర్వహించరని తెలిపారు. సంస్థతోపాటు ప్రభుత్వం కలసి నిర్వహించే సంయుక్త ఖాతా అని తెలిపారు. ఇది లోపభూయిష్టమైన ఆర్థిక నిర్వహణ కాదని, సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణగా పేర్కొన్నారు. ఈ ఖాతాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం అదనంగా వడ్డీ చెల్లించవలసి అవసరం ఉండదని, వడ్డీ భారం తగ్గుతుందని తెలిపారు. ఏదైనా ఒక పనికి కేటాయించిన సొమ్ముని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తే 3 శాతం వడ్డీ మాత్రమే ఇస్తారని చెప్పారు. ఏదైన ఇతర చెల్లింపులకు అవసరమైతే అదే బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే 8 శాతం వడ్డీ చెల్లించవలసి ఉంటుందన్నారు. పీడీ ఖాతా నుంచి సర్ధుబాటు చేసుకుంటే వడ్డీ చెల్లించవలసిన అవసరమే లేదని వివరించారు. ఇవి అధికారులు, సర్పంచ్ లు నిర్వహించే వ్యక్తిగత ఖాతాలుగా కొంతమంది అపోహపడుతున్నారని, అందువల్ల వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.  ప్రతి సంస్థకు సొంత ఆడిట్ విధానం ఉంటుందని, ఆ ప్రకారం ఆడిటింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ ఖాతా నుంచి కోటి రూపాయలు దాటిన ప్రతి చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయిలో నియంత్రణ విధానం లేదని, సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) ని ప్రవేశపెట్టిన తరువాత ఆ విధానం అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. పీడీ ఖాతాల నిర్వహణ, వడ్డీ ఖర్చులను తగ్గించుకునే విధానాన్ని కాగ్ వారికి వివరించామని, వారికి అర్ధమైందని చెప్పారు. పంచాయతీ స్థాయి నుంచి ఆర్థిక శాఖ వరకు ఒక్కో బిల్లు చెల్లించే విధానాన్ని బిల్లులతో సహా చూపిస్తూ పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దేశంలో ఇంత సమగ్ర సమాచారం అందించే రాష్ట్రం ఏపీ ఒక్కటేనని తెలిపారు.
పీడీ ఖాతాలు మన ఒక్క రాష్ట్రంలోనే నిర్వహించడంలేదని, దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఖాతాల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఎక్కువ, ఒక్కో రాష్ట్రంలో తక్కువ ఉండవచ్చునన్నారు. మన రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉన్నందున, 13 వేల పీడీ ఖాతాలు ఉంటాయని, మళ్లీ అదనంగా ఖాతాలు తెరువవలసి వస్తే ఇంకా పెరుగుతాయని వివరించారు. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల సొంత నిధులు, ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక గ్రాంట్ల నిధులు కలిసిపోకుండా ఒక్కో గ్రామ పంచాయతీకి మూడు ఖాతాలు కేటాయిస్తారన్నారు. 1వ ఖాతాలో సొంత నిధులు, 2వ ఖాతాలో ఆర్థిక సంఘం నిధులు, 3వ ఖాతాలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 72,652 ఖాతాలు నిర్వహించేవారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి 43,374 ఖాతాలు, తెలంగాణకు 29,236 ఖాతాలు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులను వేరు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 13,199 పీడీ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13వ ఆర్థిక సంఘానికి తెరిచిన ఖాతాల్లోనే రెండు నిధులను కలిపి వేస్తోందన్నారు. ఏజీ నివేదిక ప్రకారం 2018 మార్చి 31 నాటికి  ఏపీకి చెందిన 57,455 పీడీ ఖాతాల్లో   రూ. 29,909 కోట్ల నిధులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 12,822 ఖాతాలను తొలగించినట్లు చెప్పారు. ఆ ఖాతాల కాలపరిమితి పూర్తి కావడం, ఆ ఖాతాలలో నిధులు లేనందున వాటిని తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహణలో ఉన్న పీడీ ఖాతాల సంఖ్య 44,633కు తగ్గినట్లు చెప్పారు. వాటిలో  పంచాయతీల ఖాతాలు 25,836, యుఎల్బీ(అర్బన్ లోకల్ బాడీస్) ఖాతాలు 348, సివిల్ కోర్టుల డిపాజిట్ ఖతాలు 610, విద్యా సంస్థలవి 800, చీఫ్ ప్లానింగ్ అధికారి డిపాజిట్ ఖాతాలు 800 ఉన్నట్లు వివరించారు. వాటితోపాటు కార్పోరేషన్, సొసైటీలు, ఫంక్షనల్ డిపాజిట్ ఖాతాలు, ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ సీఈఓలు, డీఆర్డీఏ ఖాతాలు వంటివి ఉన్నట్లు తెలిపారు. పీడీ ఖాతాలలో నిధుల పారదర్శకత కోసం ఏపీలో 2014లోనే పీడీ అకౌంట్ పోర్టల్ ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇది వర్చువల్ బ్యాంకింగ్ విధానంగా పనిచేయడమే కాకుండా అన్ని పీడీ ఖాతాల లాదేవీలను పకడ్బంధీగా, అత్యంత పారదర్శకంగా ఉంచుతుందన్నారు.
గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో పీడీ ఖాతాలు తక్కువ ఉన్నట్లు ఏజీ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 153 పీడీ ఖాతాలు ఉన్నట్లు కాగ్ పేర్కొందని, ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే  ఆ తరువాత 4272 ఖాతాలు తెరిచినట్లు వారు చెప్పినట్లు వివరించారు. అనేక రాష్ట్రాలు ఏపీ విధానాలనే అనుసరిస్తున్నట్లు తెలిపారు. ట్రెజరీలలో కాకుండా బ్యాంకులలో జమచేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయన్నారు. అన్ని పథకాలకు వేరువేరు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని ఒత్తిడి చేస్తోందని, కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే బ్యాంకు ఖాతాలకు బదులుగా ట్రెజరీలలో నిధులు ఉంచుతున్నట్లు తెలిపారు. మిగిలిన లావాదేవీల తరహాలోనే ట్రెజరీలలో పీడీ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఖాతాల నిర్వహణ వల్ల నిధుల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని రవిచంద్ర వివరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...