Aug 23, 2018


భారీ స్థాయిలో రెవెన్యూ సంస్కరణలు

Ø రాష్ట్ర చరిత్రలో ముఖ్య ఘట్టం భూసేవ పైలెట్ ప్రాజెక్ట్
Ø భూ సమస్యలకు పరిష్కారం
Ø ఇక భూ వివాదాలకు చెక్
Ø ప్రజల ముంగిటకే సేవలు
Ø ప్రతి భూమికి 11 అంకెల భూధార్ సంఖ్య
Ø భూ యాజమాన్యానికి రక్ష
            
           ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మరో ముందడుగు వేసింది.  తొలిసారిగా ఇంక్రిమెంటల్‌ జియో-రిఫరెన్స్‌ మోడ్‌ (ఐజీఎమ్‌) టెక్నాలజీ సాయంతో భూముల  కొలతల చిక్కులకు పక్కా పరిష్కారం కనుగొంది.  భూమి, ఆస్తి వివాదాలకు చెక్‌ పెట్టనుంది. గ్రామాలలో భూమి కొలతలు, హద్దులు, హక్కు సమస్యల వల్ల వివాదాలు తలెత్తి కొట్లాట్లకు దారి తీసి గ్రామీణ వాతావరణం కలుషితం అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కుటుంబాలు విడిపోవడం,  గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగడం వంటి సంఘటనలు అందరికీ తెలిసినవే. వీటికి తోడు భూమి వివరాలు, పాస్ పుస్తకం వంటివి కావాలంటే రెవెన్యూ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేదు. దశాబ్దాల కాలంగా రెవెన్యూ శాఖపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని తొలగించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. భారీ స్థాయిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి, సాంకేతికను అందిపుచ్చుకొని  మీ ఇంటికే మీ భూమిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడ నుంచైనా ఆన్ లైన్ లో భూమి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే పేరు లేదా ఆధార్ నెంబర్ లేదా  సర్వే నెంబర్ ద్వారా భూమి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఇంకో అడుగు ముందుకు వేసి ప్రజాధనం ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూసేవ (భూధార్‌) పైలెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ, భూ కమతాలకు సంబంధించి ఇదో విశిష్ట ప్రాజెక్ట్.  రోజురోజుకు అనేక మార్పులతో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వినియోగించుకోకపోతే వెనుకబడే పరిస్థితి ఉంది. టెక్నాలజీ వినియోగంలో ముందున్న ఏపీ భూములు, ఆస్తుల లావాదేవీల్లో  అక్రమాలకు కళ్ళెం వేసేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో  క్రయవిక్రయాలన్ని ఎంటర్ అవుతాయి.   దక్షిణాసియాలోనే తొలిసారిగా భూములను కూడా సాంకేతికత పరిధిలోకి తీసుకొస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిని కంప్యూటరైజేషన్‌ చేసి ప్రజల ముంగిట మెరుగైన సేవలు అందించే క్రమంలో భూముల వివరాలన్నీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏప్రిల్ 11న భూసేవ వెబ్‌సైట్‌ను, భూధార్ కార్డును ఆవిష్కరించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
                 కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. మొదటి భూధార్ కార్డును కృష్ణా జిల్లా ఉయ్యూరు పురపాలక సంఘానికి చెందిన కానూరి శిరీషకు, రెండవ కార్డు కొణతాల రాజేశ్వరికి అందచేశారు. అక్టోబర్ 2నాటికి రాష్టవ్యాప్తంగా దీనిని విస్తృతపరుస్తారు. ప్రతి భూకమతానికి, పట్టణ ఆస్తులకు, పంచాయతీల్లోని ఆస్తులకు ఒక విశిష్ట సంఖ్య భూధార్‌ను కేటాయిస్తారు.  మనిషికి ఆధార్ తరహాలో భూమి గుర్తింపునకు 11 అంకెల భూధార్ సంఖ్య కేటాయిస్తారు. తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్ అనే రెండు దశల్లో ఈ సంఖ్యను కేటాయిస్తారు. దీనివల్ల భూ యజమానులకు 20 సేవలు అందుబాటులోకి వస్తాయి.  రెవెన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, అటవీ శాఖలతో అనుసంధానం చేస్తారు. భూ యాజమాన్య మార్పిడిలో అక్రమాలకు తావులేకుండా ఆస్తుల పరిరక్షణకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద భూధార్ కేటాయింపు, నవీకరణ, భూ ప్రాథమిక సమాచారం, ముందస్తు భూ సమాచారం, భూ యాజమాన్య మార్పిడి (అర్బన్, పంచాయతీ), ఆథరైజేషన్, వ్యవసాయేతర ఉపయోగాలకు భూ మార్పిడి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, మార్కెట్ విలువ, ధ్రువీకరించిన లేఅవుట్ల వివరాలు, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువల తాజా మదింపు, పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల నిర్వహణ, అటవీ హక్కుల రికార్డుల సమాచారం వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. భూసేవ ప్రాజెక్టు ద్వారా 2.84 కోట్ల వ్యవసాయ భూములకు, 50 లక్షల పట్టణ ఆస్తులకు, 85 లక్షల గ్రామీణ ఆస్తులకు భూధార్‌ను కేటాయిస్తారు. ఇది అమలులోకి రావడం రాష్ట్ర చరిత్రలో  ముఖ్యమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తే  ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. మనిషి కనురెప్పలు, వేలిముద్రల ద్వారా ఆధార్ వచ్చింది. భూధార్‌ను జియో ట్యాగింగ్ వ్యవస్థ ద్వారా తీసుకొస్తున్నారు.

         దీనికి ఉపయోగించే ఐజీఎమ్‌ టెక్నాలజీని గ్రౌండ్‌ ట్రూతింగ్‌ టెక్నాలజీ అని కూడా అంటారు. సర్వే, జియోరిఫరెన్స్‌ అనేది అవసరాన్ని బట్టి వినియోగించుకుంటారు.  సీఓఆర్‌ఎస్‌(కార్స్‌) అనేది ఐజీఎమ్‌లో  అత్యాధునికమైన కీలకమైన విభాగం. ఇది నిరంతరం పనిచేసే రిఫరెన్స్‌ స్టేషన్‌. ఇది మరో 30 నెటవర్క్‌ రిఫరెన్స్‌ స్టేషన్లతో అనుసంధానమై 24 గంటలూ పనిచేస్తుంది. శాటిలైట్‌ డేటాను నిశితంగా పరిశీలించి వాస్తవికమైన అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సర్వే పాయింట్లను అందిస్తుంది. దీనివల్ల డీజీపీఎస్ తోపాటు రోవర్స్‌ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. తొలుత ఈ ప్రాజెక్టు కోసం డీజీపీఎస్ లను 13 నుంచి 43 కు, రోవర్స్‌ ను 26 నుంచి 100కు పెంచుతారు. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్స్‌ ను ఏర్పాటు చేస్తారు. అనంతరం ఔట్‌సోర్సింగ్‌ ద్వారా జియో రిఫరెన్స్‌ వర్క్‌ ను చేపడతారు. రెండోదశ కింద నిరంతరం పనిచేసేలా రిఫరెన్స్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అనంతరం తొలిదశలో ఏర్పాటైన సిస్టమ్స్‌ ను సీఓఆర్‌ఎస్ కు మారుస్తారు. ఇక్కడి నుంచే అసలు ప్రక్రియ మొదలవుతుంది. రియల్‌ టైమ్‌ జియోట్యాగింగ్‌ ద్వారా ఏ భూమి ఎవరిదో? దాని నంబరు ఏమిటో? ఏ సమయంలో ఏ పంట పండించారో? ప్రస్తుతం ఆ భూమి ఎలా ఉందో? ఒకవేళ ఆస్తులయితే.. అవి ఎవరివో క్షణాల్లో చెప్పేలా రూపొందించినదే భూధార్‌ప్రాజెక్ట్.  ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భూమి, ఆస్తి తగాదాల సమస్యలు పరిష్కారమవుతాయన్నది ప్రభుత్వ భావన. మనిషికి ఆధార్‌ కార్డ్ లా భూమిని గుర్తించడానికి భూధార్‌ కార్డ్ ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఉంటే భూ యాజమాన్య మార్పిడిలో  అక్రమాలకు అవకాశం ఉండదు. ముందు ముందు భూమికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఏకతాటిపైకి తీసుకువస్వారు. ఆ విధంగా భూ సంబంధిత ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతాయి.  ఈ పథకం ముఖ్య ఉద్దేశం అదే.  ప్రజా సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...