Aug 31, 2018


మత ఘర్షణలకు దిగజారిన వైసీపీ

ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి విమర్శ
        సచివాలయం, ఆగస్ట్ 31: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి దిగజారిందని ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో జరిగిన నారా హమారా-టీడీపీ హమారా బహిరంగ సభలో ఫ్లకార్డులు పట్టుకొని అలజడి సృష్టించిన యువకులు వైసీపి కార్యకర్తలని తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి వారిని పంపారని చెప్పారు. అమాయకులైన పేద ముస్లిం మైనార్టీ యువకులను ఉసిగొల్పి గుంటూరు సభలో ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేయించారన్నారు. అమాయకులైన ముస్లింలను బలి చేయడానికి వైసీపీ పన్నిన కుట్ర పట్ల రాష్ట్రంలోని ముస్లింలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.   ఇతర పార్టీ బహిరంగ సభలలోకి చొరబడి అలజడి సృష్టించే సాంప్రదాయం మన రాష్ట్రంలో లేదన్నారు. తాము గానీ, ఇతర పార్టీల వారు గానీ, కమ్యూనిస్టులు గానీ అలా చేయరని చెప్పారు. మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని, ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా బిజేపీపై ముద్రపడిందని, అటువంటి పార్టీతో కలిసి వైసీపీ పని చేస్తోందని విమర్శించారు. తమపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడానికి ఆ పార్టీ అలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ముస్లింల వ్యతిరేక పార్టీ అని వారు గ్రహించారని పేర్కొన్నారు.  సెక్యులర్ అనే పదానికి వైసీపీకి అర్ధం తెలియదన్నారు. టీడీపీ బహిరంగ సభలను విచ్ఛిన్నం చేయడానికి, మత ఘర్షణలు సృష్టించడానికి ఆ పార్టీ దిగజారడం సిగ్గు చేటన్నారు.  టీడీపీ పేదవర్గాల వైపు నిలబడిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆలోచనా విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.  ముస్లింలు టీడీపీ వైపు ఉన్నారని చెప్పారు.  చంద్రబాబు నాయుడు దేశం మొత్తంలో చక్రం తిప్పుతారన్నారు.

లక్ష మందితో క్రిస్టియన్ మైనార్టీల బహిరంగ సభ
త్వరలో లక్ష మంది క్రిస్టియన్ మైనార్టీలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జూపూడి తెలిపారు. సభ జరిగే ప్రదేశం, తేదీ చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని చెప్పారు. విద్య, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటువంటి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవుల నాయకత్వం పెంపొందించడానికి ఇటువంటి సభలు ఉపయోగపడతాయని జూపూడి చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...