Aug 8, 2018


బీసీల అభ్యర్థులకు

అన్యాయం చేసిన ఏపీపీఎస్సీ అధికారులు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
Ø ఎంపిక తీరులో అవకతవకలు వెల్లడి
Ø బీసీ రిజర్వేషన్ల అమలుతీరుపై విచారణకు డిమాండ్

         సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీపీఎస్సీ నియామకాలలో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, బీసీ రిజర్వేషన్ల అమలు తీరుపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సచివాలయంలోని 1వ బ్లాక్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫిర్యాలు విభాగంలో వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి పరసా రంగనాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు, బీసీ సంక్షేమ శాసనసభా కమిటీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఉదయలక్ష్మికి కూడా ఈ వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ  కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకులు ప్రాతిపదికగా భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల విషయంలో నిబంధనలను అధికారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు  తమకు అనుకూలంగా మలుచుకొని అమలు చేస్తున్నారని ఆరోపించారు. వినతి పత్రం పూర్తి పాఠం..... ఖాళీల భర్తీ విషయంలో తొలుత ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ  చేసి, ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయాలి. ఆ విధంగా చేస్తే బీసీలలో అత్యధిక మార్కులు వచ్చిన వారు కొందరు ఓపెన్ కేటగిరి పోస్టులు పొందే అవకాశం ఉంటుంది. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి పోస్టులు భర్తీ చేసినప్పుడు వరుస క్రమంలో ఆ తరువాత ర్యాంకులు పొందినవారికి అవకాశం వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా జరిగే ఖాళీల భర్తీ  ఈ విధంగా జరగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి  గతంలో ఏపీపీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసేది. వాటికి ఆ రిజర్వేషన్ వర్గాల వారే పోటీపడి, మంచి ర్యాంకులు సాధించినవారు  పోస్టులు పొందేవారు.  2016లో మాత్రం తాజా పోస్టుల భర్తీకి, బ్యాక్ లాగ్ (క్యారీ ఫార్వర్డ్) పోస్టుల భర్తీకి ఒకే నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్, నీటి పారుదల మొదలైన శాఖలలో 748 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ (6/2016) విడుదల చేసింది. ఈ ఖాళీలలోనే బ్యాక్ లాగ్ ఖాళీలు కూడా ఉన్నాయి. అలాగే మునిసిపల్, పబ్లిక్ హెల్త్  వంటి శాఖలలో ఖాళీగా ఉన్న  149 ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్)   పోస్టుల భర్తీకి కూడా మరో నోటిఫికేషన్ (09/2016) విడుదల చేసింది. ఇందులో కూడా బ్యాక్ లాగ్, తాజా పోస్టులు రెండూ ఉన్నాయి. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులకు వేరువేరుగా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అర్హులకు మెయిన్ పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితా తయారు చేశారు. ఆ మెరిట్ జాబితా ప్రకారం ఏపీపీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఓపెన్ క్యాటగిరిలో ఎంపిక కావలసిన బీసీ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోయారు. బ్యాక్ లాగ్ ఖాళీలో ఎంపికయ్యారు. ముందు ఓపెన్ క్యాటగిరి ఖాళీలను భర్తీ చేస్తే ఆ అభ్యర్థులు ఓపెన్ లో ఎంపికయ్యేవారు. బ్యాక్ లాగ్ లో కొందరు బీసీ అభ్యర్థులకు అవకాశం వచ్చేది. బ్యాక్ లాగ్, తాజా ఖాళీల భర్తీకి ఒకే నోటిఫికేషన్ విడుదల సరైన పద్ధతి కాదు. ఒక వేళ అలా జారీ చేసినా, ముందు ఓపెన్ కేటగిరిలోని ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలి. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి భర్తీ చేయాలి. అలా చేసినప్పుడు జాబితాలో ముందున్న రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులు ఓపెన్ కేటగిరిలో ఎంపికవుతారు. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు ఎంపికవుతారు. ఇక్కడ అలా జరగకుండా ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావలసిన అభ్యర్థులు బ్యాక్ లాగ్ లో ఎంపికయ్యారు. వాస్తవానికి ఆ అభ్యర్థులు ఓపెన్ లో ఎంపికై ఉంటే, బ్యాక్ లాగ్ పోస్టులకు మరి కొందరు బీసీ అభ్యర్థులు ఎంపికయ్యేవారు. ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం వల్ల బీసీ అభ్యర్థులు అనేక పోస్టులు నష్టపోయారు. బ్యాక్ లాగ్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్ష, ఎంపిక కూడా వేరుగా నిర్వహించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.  రెండిటికి కలిపి నోటిఫికేషన్ విడుదల చేయడం, ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. 
             ఏపీపీఎస్సీ 09/2016 నోటీఫికేషన్ కు సంబంధించి జోన్-2లో పోస్ట్ కోడ్ -1(పీసీ-01) బీసీ-బీ జనరల్  బ్యాక్ లాగ్ ఖాళీని 113వ ర్యాంకు సాధించిన బీసీ-బీ అభ్యర్థితో నింపారు. అదే జోన్ లో అదే పోస్టుకు సంబంధించిన తాజా ఖాళీలను 117, 132, 139 ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో నింపారు. మంచి ర్యాంకు సాధించిన రిజర్వ్ డ్ అభ్యర్థి రిజర్వ్ డ్ ఖాళీలోనూ, అంతకంటే తక్కువ ర్యాంకులు సాధించిన వారు ఓపెన్ కేటగిరిలో ఎంపికయ్యారు.  జోన్ – 2లో 111వ ర్యాంకు పొందిన బీసీ-డీ అభ్యర్థితో బ్యాక్ లాగ్ ఖాళీని నింపారు. తాజా ఖాళీలలో బీసీ-డీ ఖాళీలు లేవు. ముందు ఓపెన్ కేటగిరి ఖాళీలను భర్తీ చేస్తే ఆ అభ్యర్థి ఓపెన్ లో ఎంపికయ్యేవారు. బ్యాక్ లాగ్ లో మరో బీసీ-డీ అభ్యర్థికి అవకాశం వచ్చేది. ఇక్కడే మరో తప్పు జరిగింది. జోన్-1కు చెందిన 169వ ర్యాంక్ సాధించిన బీసీ-డీ అభ్యర్థిని నాన్-లోకల్ కేటగిరి కింద జోన్-2లో ఎంపిక చేశారు. నాన్ లోకల్ కేటగిరి ఖాళీని భర్తీ చేసేటప్పుడు ఆ జోన్ లోని అభ్యర్థులందరికంటే మెరుగైన ర్యాంకు సాధించిన అభ్యర్థితో ఆ ఖాళీని నింపాలి. 111వ ర్యాంకు సాధించిన అభ్యర్థి ఉండగా, 169వ ర్యాంకు వచ్చిన నాన్ లోకల్ అభ్యర్థితో ఆ ఖాళీని నింపారు. బ్యాక్ లాగ్ పోస్టులు ముందు భర్తీ చేయడం వల్ల ఇలా జరిగింది. జోన్-3లో పీసీ-01 బ్యాక్ లాగ్ పోస్ట్ ని 43వ ర్యాంకు సాధించిన బీసీ-బీ అభ్యర్థితో నింపారు. ఓపెన్ కేటగిరిలో అదే పోస్ట్ కు సంబంధించిన తాజా ఖాళీలను 46,78,83,85 ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో నింపారు. అత్యధిక మార్కులు సాధించి ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావలసిన అభ్యర్థులను అన్యాయంగా బ్యాక్ లాగ్ పోస్టులలో ఎంపిక చేశారు.  జోన్-4లో పీసీ-01 ఖాళీని 73వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని బీసీ-బీ నాన్ లోకల్ కేటగిరిలో ఎంపిక చేశారు. 84, 88, 119,129 ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేశారు. ఈ జోన్ లో మాత్రం అన్నీ తాజా ఖాళీలే. 73వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని రిజర్వేషన్ కేటగిరి పోస్టుకు ఎంపిక చేశారు. ఆ తరువాత ర్యాంకులు సాధించిన వారిని ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేశారు. అధిక మార్కులతో మంచి  ర్యాంకులు వచ్చిన బీసీ అభ్యర్థులతో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేశారు.
మరో నోటిఫికేషన్ ఖాళీల భర్తీ కూడా అంతే !
             మరోనోటిఫికేషన్ (06/2016) ద్వారా ఖాళీల భర్తీ కూడా ఇదే విధంగా జరిగింది. జోన్-1లో బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -1 (పీసీ-01)ని 43వ ర్యాంకు సాధించిన బీసీ-డీ అభ్యర్థితో నింపారు. తాజా ఖాళీలను ఓపెన్ కేటగిరిలో 64, 70 ర్యాంకుల వారితో నింపారు. జోన్-1లో పీసీ-03 బ్యాక్ లాగ్ ఖాళీని 368వ ర్యాంక్ వచ్చిన లోకల్ బీసీ-బీ అభ్యర్థితో నింపారు. 422, 441 ర్యాంకులు సాధించిన బీసీ-బీ అభ్యర్థులను నాన్-లోకల్ కేటగిరిలో ఎంపిక చేశారు. వాస్తవానికి నాన్-లోకల్ వారికి లోకల్ వారికంటే మంచి మార్కులు రావాలి. బ్యాక్ లాగ్ పోస్టు ముందు నింపడం వల్ల బీసీ-బీ అభ్యర్థి అవకాశాన్ని కోల్పోయారు. జోన్-1లోనే బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -5ని 199వ ర్యాంకు సాధించిన బీసీ-ఏ అభ్యర్థితో నింపారు. తాజా ఖాళీలు ఓపెన్ కేటగిరిలో 214, 297, 320, 332, 335, 343, 354 ర్యాంకులు సాధించినవారిని ఎంపిక చేశారు. జోన్-2లో బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -3 ని 204వ ర్యాంక్ వచ్చిన బీసీ-ఏ అభ్యర్థితో నింపారు. అదే జోన్ లో అదే పోస్ట్  తాజా ఓపెన్ కేటగిరి ఖాళీలను 237, 252, 314, 315 ర్యాంకుల వారితో నింపారు. ఈ రకమైన ఏపీపీఎస్సీ నియామకాలకు బాధ్యులు ఎవరు? అధిక మార్కులు వచ్చిన బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ పోస్టులకు తోసేసి, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేయడం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారని శంకర రావు వివరించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని బీసీ అభ్యర్థులకు న్యాయం చేయమని ఆయన కోరారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...