Aug 27, 2018


కేరళ వరదబాధితులకు
గుంటూరు జిల్లా నుంచి 10వేల కిట్లు
ట్రక్ లకు పచ్చ జెండా ఊపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
              సచివాలయం, ఆగస్ట్ 24: కేరళ వరద బాధితులకు రాష్ట్రం నుంచి అందిస్తున్న సహాయంలో భాగంగా గుంటూరు జిల్లా వాసులు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన 10వేల కిట్లను శుక్రవారం ఉదయం ఆ రాష్ట్రానికి పంపారు. ఈ కిట్ల లోడుతో వెళుతున్న ట్రక్కులకు సచివాలయం 1వ బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా దాతలను, కలెక్టర్ కోన శశిధర్ ని, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. ఒక కుటుంబానికి కావలసిన ముఖ్యమైన 30 వస్తువులను మూత ఉన్న బక్కెట్ లో ఉంచి  కిట్ గా తయారు చేశారు. ఈ కిట్ల మొత్తం విలువ రూ.1.5 కోట్లని, ఒక్కో కిట్ ఖరీదు రూ.1400 రూపాయలని అధికారులు చెప్పారు. ఈ బక్కెట్లలో చీర, టవల్, లుంగీ, నైటీ, పళ్లెం, గ్లాస్, గెరిట, కందిపప్పు, పంచదార, ఉప్పు, కాపీ పొడి, సబ్బులు, టూత్ పేస్ట్, బ్రెష్ లు, గొదుమ పిండి, టార్చ్ లైట్, పసుపు, కారం, కొబ్బరి నూనె, కొవ్వొత్తులు, దోమల మందు కాయిల్స్ వంటి వాటిని ఉంచారు. ఇటువంటి పదివేల బక్కెట్లను పది ట్రక్కులలో నింపి కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు పంపుతున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అక్కడ 4 లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనట్లు తెలిపారు. వారికి కావలసినవి ఏమిటో తెలుసుకొని ఈ కిట్లు తయారు చేసినట్లు చెప్పారు. సంఘం డైరీ తరపున ఎమ్మెల్యే నరేంద్ర 10,800 లీటర్ల టెట్రా ప్యాకెట్ పాలను అందజేసినట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలలు నిల్వ ఉంటే ఈ పాలను కూడా కేరళ పంపినట్లు తెలిపారు. ఈ కిట్లతోపాటు గుంటూరు జిల్లా ప్రజల తరపున బాధితులకు ‘‘మీరు తొందరగా కోలుకోవాలి’’అని ఒక సందేశం కూడా పంపినట్లు చెప్పారు. ఈ ట్రక్కులు సకాలానికి బాధితులకు చేరే విధంగా రవాణాలో ఎటువంటి ఆటంకాలు కలుగ కుండా పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ అధికారులను పంపినట్లు వివరించారు. దాతలు ఇంకా సహాయం అందజేయడానికి ముందుకు వస్తున్నరని, మరోసారి కూడా ఇటువంటి ట్రక్కులు పంపుతామని కలెక్టర్ చెప్పారు.

జేఐటీఓ 6వేల దుప్పట్ల సహాయం
జైన్ ఇంటర్ నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఐటీఓ) విజయవాడ ఛాప్టర్ వారు రూ.21 లక్షల విలువ చేసే ఆరు వేల దుప్పట్లను కేరళ బాధితులకు పంపారు. ఆ దుప్పట్లను జేఐటీఓ చైర్మన్ రమేష్ జైన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించారు. సీఎం వారిని అభినందించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సహాయసహకారాలు అందించడంలో తమ సంస్థ ముందుంటుందని రమేష్ జైన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, మంత్రి నక్కా ఆనందబాబు, ఆర్టీజీ సీఈఓ బాబు.ఏ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...