Aug 20, 2018


పంచాయతీ శాఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సమావేశంలో
ఆర్థిక మంత్రి యనమల అధికారులకు ఆదేశం
స్మార్ట్ గ్రామాలకు నిధుల కొరతలేదు: మంత్రి లోకేష్

                   సచివాలయం, ఆగస్ట్ 20: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే స్మార్ట్ గ్రామాల అభివృద్ధి పనులలో మొదట పంచాయతీరాజ్ శాఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రి, ఫౌండేషన్ చైర్మన్ యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఇతర శాఖల పనులు చేపట్టమని చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ కు చెందిన సిమెంట్‌ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, పంచాయతీరాజ్, అంగన్‌వాడి, మండల భవనాల నిర్మాణం, పార్కులు, వాటర్ ప్లాంట్స్, సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, శ్మశానాల మరమ్మతులు ... వంటి వాటికి తొలిప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు.  దాతల నుంచి నిధులు సేకరించడానికి ప్రత్యేక ఖాతా తెరవమని ఆదేశించారు. దాతల నుంచి నిధులు ఎక్కువ రాబట్టడానికి ప్రయత్నించమని చెప్పారు. కార్పోరేట్ కంపెనీలు చేపట్టే పనులు కూడా పంచాయతీరాజ్ శాఖ అనుమతితో ఫౌండేషన్ పరిధిలోనే జరగాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు దాతలు ఉండేలా
స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి యనమల చెప్పారు.

స్మార్ట్ గ్రామాలకు నిధుల కొరతలేదు: మంత్రి లోకేష్
             పంచాయతీరాజ్ శాఖ మంత్రి, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నారా లోకేష్ మాట్లాడుతూ స్మార్ట్ గ్రామల అభివృద్ధికి నిధుల కొరత లేదని చెప్పారు. దశలవారీగా మొత్తం 12,918 గ్రామా పంచాయతీలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సమావేశంలో అధికారులు కోరినమీదట దాతలు ఇచ్చిన విరాళాలకు సమంగా ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం, ఇతర పనులకు రూ.75 లక్షలు గ్రాంట్ మంజూరు చేశారు. స్మార్ట్ గ్రామాల పథకం కింద ఫౌండేషన్  గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, అంగన్‌వాడి భవనాల నిర్మాణం, మొక్కలు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, శ్మశానాల మరమ్మతులు, పంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీగోడలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటి 260 పనులు చేస్తున్నట్లు వివరించారు.  ఏ గ్రామంలో ఏఏ పనులు చేపడుతున్నామో, దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా  పూర్తి వివరాలు స్మార్ట్ ఏపీ వెబ్ సైట్ లో పొందుపరిచాలని అధికారులను ఆదేశించారు. దాతలు ఏ పని చేయించదలచుకున్నారో దానిని ఎంచుకోవచ్చున్నారు. ఒక పనికి అయ్యే ఖర్చులో దాత 50 శాతం నిధులు ఇస్తే తమ శాఖ మిగిలిన 50 శాతం నిధులను గ్రాంట్ గా ఇస్తుందని చెప్పారు. ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ ఒక్క క్లిక్ తో అమ్మకాలు జరిపినట్లు, డొనేషన్లు కూడా ఒక్క క్లిక్ తో ఆన్ లైన్ లో రాబట్టాలన్నారు. దాతలు నుంచి వంద కోట్ల రూపాయలు రాబడితే పంచాయతీరాజ్ శాఖ నుంచి వంద కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేస్తామని  మంత్రి లోకేష్ చెప్పారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా 12,918 గ్రామాలకు  అవసరం ఉన్న పనులను గుర్తించి, ఆన్ లైన్ లో ఉంచాలని చెప్పారు. విదేశాల్లో ఉన్న దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వివిధ కంపెనీలు సులభంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నిధులు నేరుగా ఇచ్చేందుకు వెబ్ సైట్ లో అవకాశం కల్పించాలని చెప్పారు.  ప్రవాస ఆంధ్రులు అనేక మంది డొనేషన్లు ఇస్తున్నారని, ఇంకా అనేక మంది ముందుకు వస్తున్నారని ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ డాక్టర్ వేమూరి రవి చెప్పారు.
             స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చెయ్యడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.  స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పనులు జరుగుతున్న 28 గ్రామాలను మోడల్ స్మార్ట్ విలేజెస్ గా తీర్చిదిద్దాలని, ఇప్పటికే గుర్తించిన 600 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టి, అవసరమైన మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని  తీర్మానించారు. వచ్చే రెండు నెలల్లో స్మార్ట్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా  విదేశాల్లో ఉన్న దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వివిధ కంపెనీల నుండి వంద కోట్లు సమీకరించి, ప్రభుత్వం భాగంగా వంద కోట్లు కేటాయించి, రెండు వందల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 2,400 మంది దాతలు  స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్లో భాగస్వాములు అయినట్లు అధికారుల తెలిపారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రంజిత్ బాషా, జాయింట్ డైరెక్టర్ ఇందిర, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...