Aug 17, 2018


గిరిజన ప్రాంతాల్లో విద్యపై ప్రత్యేకశ్రద్ధ
అధికారులను ఆదేశించిన సీఎస్
రోడ్లు, వైద్యం, మొబైల్ సౌకర్యాలపై సంతృప్తి
           సచివాలయం, ఆగస్ట్ 17: గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి, అక్షరాస్యత పెంపుపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని ఆ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో  ఆయన మాట్లాడారు. ప్రతి నివాస ప్రాంతానికి పాఠశాల అందుబాటులో ఉండేవిధంగా, డ్రాప్ అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో  రోడ్లు, మొబైల్, వైద్య సౌకర్యాలు మెరుగుపడటంపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. తాను మొట్టమొదట సారిగా పార్వతీపురం ఐటీడీఏ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాము చాలా దూరం నడిచి వెళ్లేవారమని చెప్పారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్డు సౌకర్యం చాలా మెరుగుపడిందని, ఇంకా మెరుగుపడవలసి అవసరం ఉందని చెప్పారు.  జాతీయ స్థాయిలో రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు, అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో కూడా వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పారు. మలేరియా, డెంగూ వంటి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు.
           గిరిజన నివాస ప్రాంతాలన్నింటికీ బ్యాంకింగ్ సౌకర్యంతోపాటు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అదేశించారు. మండల పరిషత్ పాఠశాలు, గిరిజన  పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాల పనితీరు, నరేగా పనులను సమీక్షించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం కోసం, గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ లభించేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయమని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి గిరిబాట పేరన ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆ నిధులతో త్వరలో పనులు మొదలుపెడతామని అధికారులు సీఎస్ కు వివరించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, డైరెక్టర్ గందం చంద్రుడు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...