Aug 1, 2018


వేగం పుంజుకున్న
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు



Ø ఏడీబీ రుణం రూ.5 వేల 544 కోట్లు
Ø రూ.537 కోట్లు విడుదల
Ø విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో  4 పారిశ్రామిక క్లస్టర్లు
Ø జక్కంపూడి ప్రాంతంలో ఎకనామిక్ సిటీ


ప్రణాళికాబద్ధంగా, స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు విధానాలు  రూపొందించింది. భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడం ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఇందులో భాగంగా పారిశ్రామిక కారిడార్లు, పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తారు.  ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ),స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపీబీ)లను ఏర్పాటు చేశారు. పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్దతిలో బహుళ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన పార్కులు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చేపట్టిన  చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ)విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ), కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)లలో వీసీఐసీ పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంట భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ఈ కారిడార్ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం ఇదే కావడంతో అభివృద్ధికి అవకాశాలు మెండు.  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం, నిరంతరం విద్యుత్ సరఫరా వల్ల పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.  దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటి కారిడార్ ఇది.  భవిష్యత్ లో ఇది కీలకమైన తూర్పు ఆర్థిక  కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  ఇది శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు విస్తరించి ఉంటుంది. 2500 కిలో మీటర్ల కారిడార్ ఇది. ఈ కారిడార్ ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంమచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో నాలుగు పారిశ్రామిక క్లస్టర్ ప్రాంతాలను (నోడ్స్) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మొదటి దశ కింద విశాఖపట్నం, శ్రీకాళగహస్తి-ఏర్పేడుల్లో పారిశ్రామిక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తీరం వెంట రోడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  ఈ కారిడార్ లో భారీ స్థాయిలో పెట్టుబడులకు, లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంచనా. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వీసీఐసీపై అధ్యయనం చేసి భారీగా రూ.5,544 కోట్లు రుణం అందించడానికి అంగీకారం తెలిపింది. ఈ రుణాన్ని రెండు దశలలో అందజేస్తుంది.  ఇప్పటికే సుమారు రూ.537 కోట్లు రుణం విడుదల చేసింది. విద్యుత్, నీటిసరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు తొలిదశ 2019 నాటికి పూర్తవుతుంది. తొలిదశలో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.   రెండవ దశ 2022 నాటికి పూర్తి అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 840 మిలియన్ డాలర్లు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ప్రగతిని, పనుల పురోగతిని స్వయంగా చేసేందుకు, అధికారులతో సమీక్షించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షులు వెన్కాయ్ ఝాంగ్ తమ అధికార బృందంతో జూలైలో రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చారు. జూలై 19న  అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తో భేటీ అయ్యారు. ప్రాజెక్ట్ పురోగతిపై వారు చర్చించారు. గుర్తించిన నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని,  ఆయా పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. త్వరితగతిన ఈ కారిడార్ ఏర్పాటుకు వీలుగా తమ బ్యాంకు నుంచి అన్ని విధాలా తగిన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఝాంగ్  సిఎస్ కు చెప్పారు.  విజయవాడ శివారులోని జక్కంపూడి ప్రాంతంలో ఎకనామిక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టారు.  ఇది దేశానికే ఒక రోల్ మోడల్ ప్రాజెక్టు అవుతుందన్నది అధికారుల భావన. ఇందులోనే హౌసింగ్, ఎకనామిక్ సిటీ సంయుక్తంగా ఉంటాయి. ఈ కారిడార్ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పోటీ వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు, మౌలికసదుపాయాలతోపాటు స్థానిక వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయి.  విశాఖపట్నం, నక్కపల్లి, కాకినాడ ప్రాంతాలను  పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్ వెస్ట్ మెంట్ రీజియన్స్ (పీసీపీఐఆర్)గా అభివృద్ధి చేస్తారు.
      విశాఖ, చిత్తూరు ప్రాంతాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడి రీజియన్లగా అభివృద్ధి చేస్తున్నారు.  ఈ రీజియన్లలో నివాస ప్రాంతాలతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తులు, ప్రజోపకరణాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సేవలు అందుబాటులో ఉంటాయి. పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమీకృత టౌన్ షిప్ ల వంటివి కూడా ఉంటాయి. రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. జల రవాణాకు అవకాశం ఉన్నందున సాగర తీరంలో ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకున్నాయి.  ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సముద్ర తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా రూపొందుతుంది. మెరైన్ ఉత్పత్తుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. సముద్ర ఉత్పత్తులతో తయారు చేసే ‘రెడీ టూ ఈట్’ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలోపెట్టుకొని ఆ రకమైన యూనిట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కావడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. 
-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ – 9440222914



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...