Oct 10, 2018



ముఖ్యమంత్రి యువనేస్తం రూ.1000ల పథకం కాదు
వృత్తిపరమైన నైపుణ్యం పెంచే కార్యక్రమం
యువనేస్తం సమీక్షలో సీఎస్ అనిల్ చంద్ర పునీఠ
                       సచివాలయం, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి యువనేస్తం అనేది రూ.1000లు ఇచ్చే నిరుద్యోగ భృతి పథకం కాదని, ఇది యువతకు వృత్తిపరమైన నైపుణ్యం పెంచే కార్యక్రమమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అనిల్ చంద్ర పునీఠ చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన యువనేస్తం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు విస్తృత ప్రయోజనాలు కలిగించే విధంగా దీనిని రూపొందించారని చెప్పారు. పథకం కొత్తదైనందున ప్రారంభంలో అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, కాల క్రమంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు.
యువజన సర్వీసుల డైరెక్టర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం వివరాలు తెలిపారు. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడం ఒక్కటే కాకుండా వారు ఉపాధి పొందడానికి ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని చెప్పారు. యువత విద్యార్హత, వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమలలో అప్రంటీస్ షిప్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి సహాయపడేవిధంగా శిక్షణ, రుణాలు అందించడం, పోటీపరీక్షలకు శిక్షణ ఇప్పిస్తారని వివరించారు. యువనేస్తం వెబ్ సైట్ ద్వారా 7,85,000 మంది దరకాస్తు చేసుకున్నారని, వారిలో లక్షా 64 వేల మందిని అర్హులుగా నిర్ణయించి ఈ నెల వారికి ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు చెప్పారు. కొన్ని ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల 25వ తేదీ వరకు వచ్చిన దరకాస్తులలో అర్హులను నిర్ణయించి ఆ తరువాత నెల 1వ తేదీన వారి ఖాతాలలో నగదు జమ చేస్తారని చెప్పారు. ప్రజా సాధికార సర్వే ఆధారంగా అర్హులను నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. కనీసం డిగ్రీ విద్యార్హత, నాలుగు చక్రాల వాహనం లేని నిరుద్యోగులై ఉండాలని నిబంధనలు విధించినట్లు చెప్పారు. ఈ నెల ఇప్పటికే 83 వేల మంది అర్హులను నిర్ణయించామని, 25వ తేదీ నాటికి లక్ష మంది అయ్యే అవకాశం ఉందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు శిక్షణ భాగస్వాములు ఉన్నారని, వారికి తగినంత సిబ్బంది, వెబ్ సైట్ ఉందని చెప్పారు. అన్ని విధాల ఉపయోగపడే వెబ్ సైట్ ని రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) రూపొందించినట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి యువనేస్తం లబ్డిదారులకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వారికి శిక్షణ, అప్రటీస్ షిప్ ఇప్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ
అప్రటీస్ షిప్ కార్యక్రమం ద్వారా  కూడా యువతకు సహాయపడతామన్నారు.  జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.  గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అభ్యర్థుల నమోదు ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో  రాష్ట్రంలో 575, కాలేజీలలో 300 మొత్తం 875 శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. అక్కడ బయోమెట్రిక్ డేటా కూడా ఉన్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారికి 22 రకాల కోర్సులు ఉన్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి అయిన తరువాత సర్టిఫికెట్లు ఇస్తారని తెలిపారు.
ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబు వెబ్ సైట్ రూపొందించిన విధానం, దాని ఉపయోగాలు తెలిపారు. అభ్యర్థులు ఎక్కువగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, రెండవ ప్రాధాన్యత ఐటీకి, మూడవ ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తున్నారని వివరించారు. ఈ పథకానికి సంబంధించి మొదటి సమావేశం అయినందున విస్తృత స్థాయిలో పలు అంశాలను చర్చించారు. సీనియర్ అధికారులు సలహాలు, సూచనలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే ఏడాదికి ఎంపిక అయ్యే అభ్యర్థులకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా శిక్షణ ఇస్తే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎల్వీ సుబ్రహ్మణ్యం,  ముఖ్యకార్యదర్శులు బి.ఉదయలక్ష్మి
, ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, బి.రాజశేఖర్, ఏపీఐడీసీ వైస్ చైర్మన్ సిద్ధార్థ జైన్, కాలేజీ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ సుజాత శర్మ, గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...