Oct 8, 2018


శాఖల మధ్య సమన్వయంతో 100 శాతం ఇ-ఆఫీస్
కార్యదర్శుల సమావేశంలో సీఎస్
Ø విభజన సమస్యలు అధిగమించడానికి  అధికారులు అంకిత భావంతో కృషి
Ø ఇ-ప్రగతి, ఆర్టీజీ, పేపర్ లెస్ ఆర్యాలయాలపై సమీక్ష
Ø నియామకాల నిబంధనలలో మార్పులకు కమిటీ
Ø ఇ-ప్రగతిపై మరో కమిటీ
Ø సేవల్లో నాణ్యత ఎంతపెరిగితే ప్రజల సంతృప్తి అంతపెరుగుతుంది
            
              సచివాలయం, అక్బోబర్ 8: శాఖల మధ్య సమన్వయంతో 100 శాతం ఇ-ఆఫీస్ సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అధికారులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జరిగిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన తరువాత రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొందని, అధికారుల అందరి సహకారంతో సమస్యలను అధిగమించినట్లు చెప్పారు. ఈ సమయంలో అధికారుల అంకితభావంతో చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో  సాంకేతికత చోటు చేసుకున్న నేపధ్యంలో శాఖల పనితీరులో మార్పు వచ్చిందని, అందువల్ల  నూతన నియామకాలకు సంబంధించి విద్యార్హతలు, నియమ నిబంధనలు మార్చవలసి ఉందన్నారు. ఇందు కోసం ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ సిబ్బందికి సాంకేతిక శిక్షణ కోర్సులు నిర్వహించాలని చెప్పారు. దీనిని తప్పనిసరి చేయాలన్నారు. ఇ-ప్రగతికి సంబంధించి కూడా ఐటీ కార్యదర్శి కన్వీనర్ గా 15 శాఖల కార్యదర్శులతో మరో కమిటీని నియమించాలని నిర్ణయించారు. ప్రతి శాఖలో ఒక అధికారికి ఇ-ఆఫీస్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. సేవలలో నాణ్యత ఎంత పెరిగితే ప్రజల సంతృప్తి స్థాయి అంత పెరుగుతుందన్నారు. సంబంధిత ఆరు శాఖల మధ్య పరస్పర సహకారంతో ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
పథకాలు, అంశాల వారీగా ఫిర్యాదులను విభజించాలని, ఆయా శాఖల సలహాలు, సూచనల మేరకు ‘పీపుల్స్ ఫస్ట్’ కార్యక్రమంలో ప్రజలను అడిగే ప్రశ్నలలో మార్పులు చేర్పులు చేయాలని ఆర్టీజీ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు సత్యనారాయణ, ఐటీ శాఖ వారి సహకారంతో ఇ-ప్రగతి, ఇ-ఆఫీస్ పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రజల సంతృప్తి, కుటుంబ వికాసం, అన్న క్యాంటిన్ల నిర్వహణ, ప్రజాపంపిణీవ్యవస్థ, గ్రామదర్శిని తదితర అంశాలను సీఎస్ సమీక్షించారు.

ఇ-ప్రగతి, ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్రభుత్వ సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ 2015 నుంచి ఇ-ప్రగతి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 14 ప్యాకేజీలు, 70 కాంపొనెంట్స్, 7 మిషన్లతో  ఈ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. 1999 నుంచి ఇ-సేవ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇ-ప్రగతి దృష్టిలోపెట్టుకొని హెచ్ఆర్ పాలసీని రూపొందించాలన్నారు. వారం పది రోజుల ఇండక్షన్ కోర్సులు ఉద్యోగులు అందరికీ తప్పనిసరి చేయాలన్నారు. ఉద్యోగి స్థాయినిబట్టి లెవన్స్ నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు. సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి సిబ్బందిలో సెల్ఫ్ అసెస్ మెంట్ ఉండాలన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ సూక్ష్మ స్థాయిలో ప్రజల నుంచి సమాచారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకునే అత్యంత శక్తివంతమైన విభాగంగా రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)ని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా 9 పథకాలు అమలు చేస్తున్నట్లు, మరో 4 పథకాలు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు మాట్లాడుతూ మారుతున్న వ్యవస్థలో ఉన్నత పాఠశాల స్థాయి నుంచే విద్యాశాఖ కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టాలని సలహా ఇచ్చారు. ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ డిజిటల్, ఇ-లిటరసీ గురించి వివరించారు. నియామకాలకు సంబంధించి అర్హతలు, నియమ నిబంధనలు దాదాపు 200 వరకు ప్రతిపాదించినట్లు చెప్పారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్ వేర్ కోర్సులు చేయవలసి ఉంటుందన్నారు. 50 ఏళ్లు దాటిన వారికి మినహాయింపు ఉంటుదని చెప్పారు. కర్నాటకలో ఇటువంటి శిక్షణ తప్పనిసరి చేశారని తెలిపారు. శిక్షణ పూర్తి చేయకపోతే అక్కడ ఇంక్రిమెంట్లు నిలిపివేస్తారని చెప్పారు.

          ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఆర్టీజీ, ప్రజలే ముందు, డ్యాష్ బోర్డు నిర్వహణ గురించి వివరించారు. ఆర్టీజీ 24 గంటలు, ఏడు రోజులు పని చేస్తుందని చెప్పారు. 1100 ద్వారా ప్రతి అంశానికి సంబంధించి ప్రజల సంతృప్తికి, అసంతృప్తికి కారణాలు కూడా తెలుసుకుంటామన్నారు. ప్రతి కాల్ రికార్డ్ అవుతుందని చెప్పారు. ప్రతి గ్రామానికి సంబంధించి, 130 ప్రభుత్వ పథకాలు, పాఠశాల స్థాయిలో ఉపాద్యాయుల పనితీరు, చౌకధరల దుకాణస్థాయిలో సమాచారం సేకరిస్తామని చెప్పారు. జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ ఇ-ఆఫీస్ నిర్వహణ, దానిని ఉపయోగించి విధానం వివరించారు. ఇ-ఆఫీస్ కు సంబంధించి సచివాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో మొత్తం 14 యూనిట్లు ఉన్నట్లు తెలిపారు. 32 శాఖలు, 87 శాఖాధిపతుల కార్యాలయాలు ప్రత్యేక యూనిట్లుగా విభజించినట్లు వివరించారు. ప్రతి జిల్లాకు ఒక సర్వర్ ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతి శాఖకు ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారన్నారు. అడ్మినిస్ట్రేటర్ కు ప్రత్యేక రైట్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓ కోడ్ ఉంటుందని, ప్రతి శాఖకు 1500 ఖాతాలు ఉంటాయని తెలిపారు. కార్యదర్శి, శాఖాధిపతులకు మాత్రమే ఖాతా క్రియేట్ చేసే అధికారం ఉంటుందన్నారు. అధికారులు ఆఫీస్ మెయిల్ ఐడీని వ్యక్తిగతంగా వాడవద్దని చెప్పారు.
           ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పూనం మాలకొండయ్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యకార్యదర్శులు ఏ.ఆర్.అనురాధ, బి.ఉదయలక్ష్మి, కె.ప్రవీణ్ కుమార్, జి.అనంతరామ్, అజయ్ జైన్, ఎస్ఎస్ రావత్, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా, ప్లానింగ్ విభాగం సీఈఓ సంజయ్ గుప్త, అడిషనల్ సెక్రటరీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...