Oct 31, 2018


ప్రత్యేక రక్షణ దళం సైకిల్ ర్యాలీ
జాతీయ సమైక్యతా దినం
                
                సచివాలయం, అక్టోబర్ 31: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సమైక్యతా దినంలో భాగంగా బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దళం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 300 మంది పాల్గొన్న  ఈ ర్యాలీకి ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు  నాయకత్వం వహించారు. ఈ ర్యాలీ ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట, సీఎం నివాసం, మంతెన సత్యనారాయణ ఆశ్రమం, వెంకటపాలెం, మందడం మీదగా సచివాలయం చేరింది. నలుగురు దళానికి సంబంధించిన ప్రత్యేక దుస్తులు ధరించి రెండు మోటార్ సైకిళ్లపైన ర్యాలీకి ముందుభాగంలో ఉన్నారు. వారిలో ఒకరు జాతీయ జెండా, మరొకరు దళం చిహ్నంతో ఉన్న జెండా పట్టుకున్నారు. ర్యాలీ జరిగిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది. సచివాలయం వద్దకు చేరిన ర్యాలీకి సచివాలయంలోని రక్షణ దళ సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ర్యాలీని సచివాలయం 2వ బ్లాక్ వద్ద కొద్దిసేపు నిలిపి కమాండెంట్ నరసింహారావు రెండు సార్లు శంఖం ఊదారు. ర్యాలీలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. ఆయన ఎక్కువసేపు శంఖం ఊదడం అందరినీ ఆకట్టుకుంది. సచివాలయం లోపల ర్యాలీ నిర్వహించి,  గేటు వద్ద మంచినీరు త్రాగి భారత్ మాతాకి జై, జై భారత్ మాతా... అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన మార్గంలోనే ర్యాలీని కొనసాగించారు. దాదాపు 50 కిలో మీటర్లు సాగిన ఈ ర్యాలీని మళ్లీ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకొని ముగించారు. ర్యాలీ కొనసాగినంత సేపు ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా ఉండటం విశేషం. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్లు పి.సత్యం, కె.కృష్ణమూర్తి, కె.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...