Oct 4, 2018


కుటుంబ ఆస్తులు ప్రకటించే ఏకైక సీఎం చంద్రబాబు
కన్నాపై విరుచుకుపడిన హిదాయత్
               సచివాలయం, అక్టోబర్ 4: దేశంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ఏపీ రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ చెప్పారు. తరచూ చంద్రబాబుని విమర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆయన  తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నా వంటి వ్యక్తి నిజాయితీపరుడైన చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మివేసిన విధంగా ఉందన్నారు. 16 ఏళ్లు మంత్రిగా ఉన్న కన్నా అవినీతి చర్యల వల్ల గుంటూరు జిల్లా ప్రతిష్ట మసకబారిందన్నారు. ఆనాడు కన్నా ఆంధ్ర మధుకోడాగా పేరు పొందాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారి అవినీతి ఏజంట్ గా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో దూరి అమిత్ షాకు ఏజంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి సిఫారసుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవడం కన్నా అవినైతిక రాజకీయానికి నిదర్శనం అన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుని విమర్శించే నైతిక అర్హత కన్నాకు లేదన్నారు. కన్నా అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని హిదాయత్ డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించడంలో, బినామీ పేర్లతో వ్యాపారం చేయడంలో ఆయన వైఎస్ కుటుంబానికి ఏమాత్రం తీసిపోరని విమర్శించారు. కన్నా కుటుంబ సభ్యులు 2004-2014 మధ్య భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా కంపెనీలు నడిపే స్థాయికి ఎదిగారన్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో సర్వే నెంబర్ 23, 24లో వెంకటాచలం దేవస్థానానికి చెందిన 58 ఎకరాల భూమిని కన్నా అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
యువత భవిష్యత్ కు ఉపయోగపడే విట్, అమృత్, కియో వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.50 లక్షలు, రూ.కోటి చొప్పున అత్యంత పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయిస్తే అవినీతి జరిగిందని కన్నా గుండెలు బాదుకుంటున్నారని, ఆయన చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా నెల్లూరు జిల్లా తడ మండలం మాంభట్టు గ్రామంలో అపాచి బోల్టుల కంపెనీకి ఎకరా ఒక్క రూపాయి చొప్పున 96 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. పది వేల మందికి ఉపాధి కల్పిస్తామన్న ఆ కంపెనీ వంద మందికి కూడా కల్పించలేదన్నారు. ఈ భూ ప్రపంచంలో ఎకరా రూపాయికి ఇచ్చినవారు ఎవరైనా ఉన్నారంటే అది కన్నా ఒక్కరేనని అన్నారు. క్ననా కుమారుడు నాగరాజు 10 కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అతి తక్కువ సమయంలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టే స్థోమత కన్నా కుటుంబానికి ఎక్కడ నుంచి వచ్చిందని అడిగారు. ఎంఏపీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, కౌషిక్ ఐరన్ ఓర్, కౌషిక్ స్టోన్స్, కౌషిక్ రిసోర్సెస్, కామధేను స్టోన్స్, ట్రైడెక్ లేబరేటరీస్, యుపిఎల్ పాలిమార్, కౌషిక్ లైమ్ ప్రొడక్ట్స్, కన్నా మోటార్స్, అరుణాచల్ పవర్, కన్నా ఇన్ఫోసిస్టమ్స్ కంపెనీల్లో కన్నా కుమారుడు నాగరాజు డైరెక్టర్ గా ఉన్నట్లు వివరించారు. 2010లో విశాఖలోని విశాఖ ఫార్మాసిటీలో ఎంఎస్ ఫార్మాకు కేటాయించిన భూమిని రద్దు చేయించి కన్నా కుమారుడు డైరెక్టర్ గా ఉన్న ట్రైడాగ్స్ లేబరేటరీకి అత్యంత తక్కువ ధరకు భూములు కేటాయించారని తెలిపారు.
జగన్ తో జైలుకు వెళ్లవలసిన కన్నా ఎవరినో పట్టుకొని తప్పించుకున్నారని చెప్పారు. గుంటూరులో కన్నా గెలుపు కోసం అక్కడ పార్టీ బాధ్యులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి ఎవరో అనామకుని ఇన్ ఛార్జిగా పెట్టారన్నారు. 15 మంది ఎంపీలను పంపి తన కేసుల నుంచి బయట పడటానికి జగన్మోహన రెడ్డి బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ప్రజలు పూర్తి పరిజ్ఞానంతో ఉన్నారని, వారికి అన్ని తెలుసునని చెప్పారు. బీజేపీ, వైసీపీలను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటన్నారు. కన్నా కడప వెళ్లి అక్కడ ప్రాంతీయవాదం రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని హిదాయత్ మండిపడ్డారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...