Oct 22, 2018


కుట్ర రాజకీయాలు మానుకోండి

కన్నాకు మంత్రి ఆనందబాబు హితవు
సచివాలయం, అక్టోబర్ 22: కుట్ర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయమై బీజేపీ వారు రిలే నిరాహార దీక్షలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి రూ.6,500 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్డు పరిధిలో ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బు చెల్లిస్తామని ముందు చెప్పి, ఏడాది తరువాత వెనక్కు తగ్గిన ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర బీజేపీ ఎంపి అని తెలిపారు. ఆ గ్రూప్ ఎందుకు ముందుకు వచ్చిందో, ఎందుకు వెళ్లిందో తెలియదన్నారు. అగ్రిగోల్డ్ ప్రధాన నిందితులు అవ్వారు సీతారామ్ ని ఐవైఆర్ కృష్ణారావు, కన్నా లక్ష్మీనారాయణలే రామ్ మాధవ్ కు పరిచయం చేశారన్నారు. ఆ సీతారామ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బంధువులని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నోయిడా-గుర్గామ్ ప్రాంతాలలో సీతారామ్ ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ పరిస్థితులలో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన కన్నా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఏదో చేశామని చెప్పుకోవడానికి కన్నా అసలు విషయాన్ని పక్క దారిపట్టిస్తున్నారన్నారు. ఆయన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వకాల్తాగా దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వారి వెనుక బాధితులు లేరన్నారు. ఈ అంశంపై సీబిఐ విచారణకు ఆదేశించమని కర్ణాటక ప్రభుత్వం కోరిందని, విచారణకు ఆదేశించలేదేం అని ఆయన ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూ.21వేల కోట్ల ఆస్తులకు అటాచ్ మెంట్ తెచ్చినట్లు చెప్పారు.
తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి కన్నా పార్టీ మారారన్నారు. వైసీపీలోకి వెళ్లవలసిన కన్నా బీజేపీలోకి మారారని విమర్శించారు. బీజేపీకి ఇక్కడ ఓట్లు లేవని, వారికి ఒక్క ఓటు కూడా రాదని, అయినా వారికి సమాధానం చెప్పవలసి వస్తుందన్నాదు.  రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన హామీలపై  వీరు కేంద్రాన్ని నిలదీయరేమని ఆయన ప్రశ్నించారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి ఆగదన్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ముందుకు వెళుతున్నారని చెప్పారు.  2050 నాటికి రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, వారి వల్లకాదన్నారు. చంద్రబాబుపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి ఆనందబాబు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...