Oct 2, 2018


మొదటి దశలో 2.08 లక్షల మందికి నిరుద్యోగ భృతి
మంత్రి నారా లోకేష్
Ø భూమి నిబంధన తొలగింపు
Ø తెల్ల కార్డు ఉంటే చాలు
Ø ప్రతి నెల 1వ తేదిన భృతి జమ
Ø నేడు సీఎం నూతన కార్యక్రమాలు ప్రకటన
Ø అర్హులకు సర్టిఫికెట్లు పంపిణీ
Ø విజయవంతంగా చైనా పర్యటన
Ø ఎలక్ట్రానిక్స్ రంగానికి షెన్ జెన్ లా ఏపీకి తిరుపతి

            సచివాలయం, అక్టోబర్1: రాష్ట్రంలో మొదటి దశలో 2.08 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం రాత్రి మంత్రి మీడియాకు నిరుద్యోగ భృతి వివరాలు తెలిపారు. నిరుద్యోగులు దరకాస్తు చేసుకోవడానికి కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా దరకాస్తు చేసుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మొత్తం 6 లక్షల మంది దరకాస్తు చేసుకోగా 2.08 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ రోజు టెస్టింగ్ కోసం 1,85,000 మంది అర్హుల బ్యాంకు ఖాతాలలో ఒక రూపాయి జమ చేసినట్లు తెలిపారు. 2వ తేదీ సెలవు అయినందున 3వ తేదీన రూ.999లు వారి ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. మిగిలిన వారికి 3వ తేదీన టెస్టింగ్ కోసం ఒక రూపాయి జమ చేస్తామని, 4వ తేదీన రూ.999లు జమ చేస్తామని వివరించారు.
                అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున అర్హులైన నిరుద్యోగులకు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితే సర్టిఫికెట్ ఇస్తారని చెప్పారు. ఆ కార్యక్రమంలో 400 మంది నిరుద్యోగులతో సీఎం మాట్లాడతారని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతారన్నారు.    ఏపీలో ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందన్నారు. భృతి పొందే నిరుద్యోగి ప్రతి నెల ఏదో ఒక్క రోజు తాము నివాసం ఉండే ప్రాంతంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయవలసి ఉంటుందన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో గానీ, పంచాయతీ కార్యాలయంలో గానీ వేలిముద్ర వేయవచ్చునని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు కూడా ఇంటికి వచ్చే వేలిముద్ర తీసుకునే సౌలభ్యం కూడా కల్పించినట్లు చెప్పారు. మొదటి నెలకు వేలి ముద్ర అవసరంలేదని, వచ్చే నెల నుంచి వేలిముద్ర తప్పనిసరి అని తెలిపారు. నిరుద్యోగ భృతికి దరకాస్తు చేసుకోవడానికి చివరి తేది అని ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రతి నెల 25వ తేదీ వరకు అందిన దరకాస్తులను పరిశీలించి అర్హులకు ఆ తరువాత నెల నుంచి భృతిని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామన్నారు. దీనిని కేవలం నిరుద్యోగ భృతి పథకంగా భావించవద్దని, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తామని, పోటీ పరిక్షలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. 2వ తేదీన ముఖ్యమంత్రి యువతకు సంబంధించి కొత్త కార్యక్రమాలు కూడా ప్రకటిస్తారని చెప్పారు. ఈ పథకంలో భూమి నిబంధన తొలగించనున్నట్లు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలునని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని స్థాయిలో మన రాష్ట్రంలో ఈ భారీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రియల్ టైమ్ గవర్నెన్స్ వారు, విద్యా, యువజన తదితర సంబంధిత ఇతర శాఖల వారి సహకారం ఎంతో ఉందని వారి సేవలను మంత్రి లోకేష్ కొనియాడారు.
విజయవంతంగా చైనా పర్యటన
            తన 7 రోజుల చైనా పర్యటన విజయవంతంగా ముగిసినట్లు మంత్రి లోకేష్ చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలలో, ఇతరత్రా మొత్తం 40 సమావేశాలలో పాల్గొన్నట్లు తెలిపారు. బ్లాక్ చైన్, డ్రోన్ వంటి టెక్నాలజీతో రాష్ట్రంలో 4వ పారిశ్రామిక విప్లవం వస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి షెన్ జెన్ ఎలాగో ఏపీకి తిరుపతి అలా అవుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్  హబ్ గా రూపొందుతుందని చెప్పారు. ఈ రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న టీసీఎల్ మన రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ కంపెనీ ద్వారా ఆరు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. ఆ కంపెనీ శంకుస్థాపన నవంబర్ ఆఖరి వారంలో జరిగే అవకాశం ఉందన్నారు. ఈ లోపల ఆ కంపెనీ డీపీఆర్ సమర్పించడం, భూమి కేటాయించడం వంటి పనులు పూర్తవుతాయని చెప్పారు. టీసీఎల్, రిలయన్స్ వంటి సంస్థలు వస్తున్న నేపధ్యంలో తిరుపతిలో మౌలిక సదుపాయాలు కల్పించే అంశమై చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. షెన్ జెన్, తైవాన్ లలో డెస్క్ లు ఏర్పాటు చేసి పరస్పర సహకారం అందించుకునే ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే మరో 3,4 నెలల్లో తాను మళ్లీ చైనా వెళతానని, కొన్ని ఎంఓయులు చేసుకువస్తానని చెప్పారు. ఎన్నికలలోపు రాష్ట్రంలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేయిస్తామన్నారు. 1994లో ఐటీ ఎలాగో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అలాగని మంత్రి లోకేష్ చెప్పారు.

సుదీర్ఘ చర్చల అనంతరం ప్రథకం ప్రవేశపెడుతున్నాం:ఎల్వీ సుబ్రహ్మణ్యం
               ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్, ఉన్నత, మాద్యమిక విద్య, యువజన సర్వీసులు తదితర శాఖల అధికారులతో సుదీర్ఘ చర్చలు, వివిధ రాష్ట్రాలలో నిరుద్యోగ భృతికి ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరుని పరిశీలించిన  అనంతరం మన రాష్ట్రంలో నిరుద్యోగభృతి పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 2న రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాలలో ఈ పథకం ప్రవేశపెట్టే కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...