Oct 5, 2018


ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఐటి దాడులు
ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం
ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్న బీజేపీ
బీజేపీ, వైసీపీ ఒక్కటై రాష్ట్రానికి ద్రోహం

           సచివాలయం, అక్టోబర్ 5: ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు వస్తున్నాయంటే ఐటీ దాడులతో భయపెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ, అమిత్‌షా కంటే ముందు ఈడీ, ఐటి శాఖలు ఆయా రాష్ట్రాలకు వస్తున్నాయన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు.  విపక్షాల మనో ధైరాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్నది బీజేపీ ఉద్దేశంగా పేర్కొన్నరు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం  చేసిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టడంతో కక్షగట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. వ్యవస్థలను తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.  తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఐటీ దాడులతో భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకోవాలని కుట్రపన్నతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్నారు. మోడీ ఆటలు ఏపీలో సాగవని చెప్పారు. తగిన ఆధారాలతో దాడులు చేస్తే తమకు అభ్యంతరంలేదని, ఎన్నికల సమయంలో ఇటువంటి దాడులు చేయించడాన్నే తాము తప్పుపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను పక్కదారి పట్టించేందుకు, విపక్షాలను భయపెట్టే దిగజారుడు రాజకీయాలకు మోడీ పాల్పడుతున్నారన్నారు. స్వతంత్రంగా ఎవరి నేతృత్వంలో పనిచేయాల్సిన అవసరం లేని సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని విమర్శించారు. నిర్థిష్టమైన ఆధారాలు లేనప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే దాడులు చేస్తున్నారన్నారు.
                  తమిళనాడులో శశికళ ఇంటిపై దాడులు, 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో తీర్పు, లాలూప్రసాద్‌ దాణా కుంభకోణం, పశ్చిమబెంగాల్‌లో మంత్రులపై సీబీఐ దర్యాప్తు వంటి ఎన్నో అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థల విషయంలో కేంద్రం జోక్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్రమోడీ తీరని నమ్మకద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో వైసీపీ, జనసేనతో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకొని కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. బీజేపీ చేయిస్తున్న దాడులను వైసీపీ సమర్ధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ ఒక్కటై రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.  అటు తెలంగాణలో కేసీఆర్‌తో రహస్య ఒప్పందం చేసుకొని ప్రతిపక్షాలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తెలంగాణలో మహా కూటమి ఏర్పడటంతో కేసీఆర్, నరేంద్ర మోడీ భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. దీంతో విపక్షంలో ఉన్నవారిపై, బలమైన నేతలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి దాడులు రాజకీయ కక్ష సాధింపేనని, దానికి కొనసాగింపుగా ఏపీలోను ఐటి దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అవినీతి, అక్రమాలపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెగేసి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రింట్‌ మీడియాలో కూడా ఐటి దాడుల విషయం వచ్చిందంటే వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో అర్థమౌతోందన్నారు. ఒకరిద్దరిని టార్గెట్‌ చేసినంత మాత్రాన కేంద్రానికి మోకరిల్లబోం అని, కర్నాటకలో కూడా ఇదేవిధమైన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నారని చెప్పారు.  
ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసి మోడీ నియంతృత్వ ధోరణికి స్వస్తి చెప్పవలసి అవసరం ఉందన్నారు. బీజేపీ పప్పులు రాష్ట్రంలో ఉడకవని హెచ్చరించారు. బీజేపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ, బీజేపీ శకం ముగిసింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని జూపూడి విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...