Oct 19, 2018


కాలేయ వ్యాధుల నియంత్రణకు విస్తృత ప్రచారం
అధికారులను ఆదేశించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
                   
            సచివాలయం, అక్టోబర్ 19: వైరస్ వల్ల వచ్చే కాలేయ సంబంధిత వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టి, ప్రజలకు అవగాహన కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైరల్ కాలేయ సంబంధిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్.వి.హెచ్.సీ.పీ-నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం) రాష్ట్రంలో అమలుపై తమ శాఖ అధికారులతో ఆమె చర్చించారు. ఈ రకమైన వ్యాధులను 2030 నాటికి దేశంలో నియంత్రించవలసిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. త్రాగునీరు, ఆహారం ద్వారా హెపటైటిస్ ఏ వైరస్(హెచ్ఏవి), ఇ వైరస్ వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి, సి వైరస్ లు హెచ్ఐవీ మాదిరిగా రక్తం, రక్తం సంబంధిత ద్రవాలు, స్త్రీ-పురుషులు కలవడం ద్వారా, తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంది. బి, సి వైరస్ ల వల్ల మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన లివర్ శక్తి కోల్పోయి సెర్రోసిస్ గా మారుతుంది. ఆ తరువాత క్రమంగా క్యాన్సర్ కు దారి తీస్తుంది. ఈ వైరస్ లు సోకిన వారిలో 96 శాతం మంది మృతి చెందే ప్రమాదం ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఈ వైరస్ ల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పూనం మాలకొండయ్య నిర్ణయించారు. వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, స్వచ్ఛభారత్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యాధి నిర్థారణ కేంద్రాలను అభివృద్ధిపరచాలన్నారు. కర్నూలు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలోని మెడికల్ కాలేజీలలో చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. విస్తృతమైన ప్రచారం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నవంబర్ 1 లోపల ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హెచ్.బి. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకురావలని చెప్పారు. పుట్టిన ప్రతిబిడ్డకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. అవసరమైనవారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్సకు చర్యలు చేపట్టాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు విధిగా పరీక్షలు చేయించాలన్నారు. ఆటో డిజబుల్ సిరంజిలను విస్తృతంగా వాడుకలోకి తీసుకురావాలన్నారు. పారిశుద్ధ్యం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాల గురించి ప్రచారం చేయాలని చెప్పారు. గ్రామాలలో త్రాగునీటిని పరీక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలులో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న పంజాబ్ రాష్ట్రంలో నియంత్రణకు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయమని పూనం ఆదేశించారు.  
               రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేయడం, సాధించవలసిన లక్ష్యాలను, రాష్ట్ర నోడల్ కేంద్రం ఏర్పాటు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్స్ సీల అభివృద్ధి, మొడల్ చికిత్సా కేంద్రాలు, అందుబాటులో ఉండవలసిన సిబ్బంది, జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రాలు, మందులు, డిస్పోజబుల్ సిరంజిలు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...