Oct 9, 2018


పారిశుద్ధ్యం మెరుగు, కార్మికుల సమ్మె పరిష్కారానికి చర్యలు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
·       సీఎస్, డీజీపీలతో సీఎం సమీక్ష
·       279 జీఓ వల్ల కార్మికులకే ప్రయోజనం
·       కాంట్రాక్ట్ కాలపరిమితి తరువాత ఏజన్సీలు మాత్రమే రద్దు
·       కార్మికులను ఒక్కరిని కూడా తొలగించరు
·       అవసరమైతే అదనపు కార్మికుల నియామకం
              
                 సచివాలయం,అక్బోబర్ 9: మున్సిపల్ అవుడ్ సోర్సింగ్ కార్మికులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ హామీ ఇచ్చారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని  సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తనతో, డీజీపీ ఆర్పీ ఠాకూర్ తో కలిసి సరిస్థితిని సమీక్షించారని చెప్పారు. కార్మికుల శ్రేయస్సుని, పారిశుద్ధ్య పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని సమస్యను పరిష్కరించాలని సీఎం చెప్పారన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని, విధానాన్ని రద్దు చేయమనడం భావ్యం కాదన్నారన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు సరస్పర సహకారంతో పనిలోకి వచ్చే కార్మికులకు రక్షణ కల్పించాలని సీఎస్ ఆదేశించారు. పోలీసుల సహకారంతో పరిస్థితిని అదుపులో ఉంచాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడ్డుకునే సందర్భాలలో పోలీసుల సహకారం తీసుకోవాలని కమిషనర్లకు చెప్పారు. పారిశ్యుద్ధ్యం అనేది అత్యవసర సర్వీసు అయినందున సేవలు అందించడంలో రాజీ పడవద్దన్నారు. ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, మెప్మా బృందాలు, సాధికార మిత్ర, సంకల్ప సొసైటీల వంటివారి సహకారంతో పారిశుద్ధ్య పనులు సజావుగా జరిగేవిధంగా చూడాలన్నారు. అలాగే ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా అవగాహన కల్పించలని చెప్పారు. 279 జీఓ వల్ల కార్మికులకే ప్రయోజనం అని చెప్పారు. ఏజన్సీల కాంట్రాక్ట్ కాలపరిమితి 3 ఏళ్లు తీరిన తరువాత ఏజన్సీ రద్దవుతుంది గానీ, కార్మికులను తొలగించరని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఎటువంటి నష్టం జరగనివ్వం అని సీఎస్ చెప్పారు. ఈ విషయాలన్నీ కార్మికులకు వివరించి వారికి నచ్చజెప్పాలన్నారు.  డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ సమ్మెలో పాల్గొనే కార్మికులు ఎక్కువ మంది కలిసే చోట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. అవసరమైన ప్రతిచోట బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పారు. మునిసిపల్ అధికారుల కోరిన ప్రతి చోట సరైన రీతిలో పోలీసుల సహకారం  అందివ్వాలన్నారు.  
               
             మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ 279 జీఓ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిని రూపొందించామన్నారు. ఈ జీఓ దాదాపు 8 నెలల నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 55 మున్సిపాలిటీలలో ఇది అమలవుతున్నట్లు తెలిపారు. ఈ జీఓ వల్ల కార్మికులకు రక్షణ లభిస్తుందన్నారు. కార్మికులు అదనంగా ఉన్నాసరే ఒక్క కార్మికుని కూడా తొలగించరని, అవసరమైన చోట అదనంగా కార్మికులకు తీసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించినదీ లేనిదీ పరిశీలించిన తరువాతే ఏజన్సీలకు డబ్బు చెల్లిస్తామని చెప్పారు. కార్మికులకు ప్రతినెల 5వ తేదీన జీతాలు తప్పనిసరిగా చెల్లించాలని ఈ జీఓ పొందుపరిచినట్లు తెలిపారు. 16 మున్సిపాల్టీలలో సమ్మె జరగడంలేదని కన్నబాబు చెప్పారు.  పర్మినెంట్ కార్మికులు ఎవరూ సమ్మె చేయడంలేదని, అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా కొందరు సమ్మెలో పాల్గొనలేదని తెలిపారు. సమ్మె జరిగే మున్సిపాలిటీలలో అదనపు సిబ్బందిని రోజువారీ వేతనంపై పనిలోకి తీసుకున్నట్లు చెప్పారు. కళ్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి చోట్ల ఆయా యాజమాన్యలే పారిశుద్ధ్యానికి తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాలని కోరారు. అటువంటి చోట్ల ఆయా ప్రాంగణాలలోనే కంపోస్టింగ్ యూనిట్లను, హోం కంపోస్టింగ్ ని కూడా ప్రోత్సహించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు. 279 జీఓపై కూడా అవగాహన కల్పించాలని కన్నబాబు అన్నారు.  మెప్మా ఎండీ చినతాతయ్య మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో మెప్మా సిబ్బంది పూర్తిగా సహకరిస్తారని చెప్పారు.  
                 
                    జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు మాట్లాడుతూ ఎస్పీలు, పోలీస్ సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల అదనపు సిబ్బందిని తీసుకొని పనులకు ఆటంకంలేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక నాయకుల సహకారం సంపూర్ణంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్పీలు మాట్లాడుతూ విధులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకునే వారిని అరెస్ట్ చేసి, కేసులు పెట్టామని, ఆ తరువాత వారిని అడ్డుకోవడం తగ్గిపోయిందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో మునిసిపల్ పరిపాలన శాఖ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...