Oct 23, 2018

కేంద్రం, ప్రతిపక్షాలకు పట్టని తుఫాను బాధితుల బాధలు
మంత్రి కాలవ శ్రీనివాసులు
                   సచివాలయం, అక్టోబర్ 23: శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధితుల బాధలు అటు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రతిపక్షాలకు గానీ పట్టడంలేదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక పక్క వరదలు, కరువుతో రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తోందన్నారు. సహాయపడవలసిన కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అక్కడే మకాంవేసి సహాయక చర్యలు పర్వవేక్షించారని చెప్పారు. వేలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయి, తిండి కూడా లేక అల్లాడుతున్న పరిస్థితులలో ప్రభుత్వం సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల పైకప్పుల కోసం 10వేల సిమెంట్ రేకులు, టార్పాలిన్ లు సరఫరా చేసినట్లు చెప్పారు. నిత్యావసర వస్తువులు అందజేసినట్లు తెలిపారు. 12 రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. 40 వేల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, నేలకొరిగి భారీ నష్టం సంభవించినట్లు తెలిపారు.  రాష్ట్రం నలుమూలల నుంచి 11 వేల మంది విద్యుత్ కార్మికులు, అధికారులు రాత్రి పగలు పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారని చెప్పారు. 50వేల మంది ఇళ్లు కోల్పోయారని, 16వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయని వివరించారు. పండ్లు, జీడి తోటలతో కళకళలాడిన ప్రాంతం కోలుకోలేని స్థితికి చేరడం బాధాకరం అన్నారు. అధికారులు వారం రోజులలో నష్టం వివరాలు సేకరించారన్నారు. ఈ నెలలోనే నష్టం పరిహారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితులలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తుఫాను సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. బాధితులకు నమ్మకాన్ని కలిగించి, భరోసా ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డికి బాధితులను పరామర్శించడానికి అవకాశం గానీ, ఓపిక గానీ, తీరిక గానీ లేదా? అని మంత్రి కాలవ ప్రశ్నించారు.  సొంత పత్రికలో విషపూరిత రాతలు రాసి బాధితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ తున్నారన్నారు. కష్టం వచ్చినప్పుడు బాధితులకు నాయకులు ఉన్నారన్న భావన కలిగించాలన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగడమే వారి పని అన్నారు. తక్షణం చేపట్టిన సహాయక చర్యలు కనిపించడంలేదా? అని అడిగారు. కేంద్రం సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు 3వ రోజునే ప్రధాన మంత్రి వచ్చారని, వెయ్యి కోట్ల రూపాయలు సహాయం ప్రకటించారని, అయితే రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ కూడా రాలేదని, ఏరియల్ సర్వే కూడా చేయలేదన్నారు.  ఒక్క అధికారిని కూడా పంపలేదని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు కేంద్రానికి, ప్రతిపక్షానికి ఎందుకు పట్టడంలేదని ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డి గానీ, పవన్ కల్యాణ్ గానీ కేంద్రాన్ని ఎందుకు అడగరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నారన్నారు. నష్టం జరిగిన దానికి సమానంగా కాకపోయినా గతంలో కంటే ఎక్కువగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం తక్షణం స్పందించాలని, సహాయం అందించడానికి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితులలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉండి, బాధితులకు ఉపయోగపడేవిధంగా వ్యవహరించాలని మంత్రి కాలవ హితవు పలికారు.
కోర్టు తీర్పుని గౌరవిస్తాం
పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పుని గౌరవిస్తామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. రిజర్వేషన్లు, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయినట్లు తెలిపారు. తమ పార్టీ తొలి నుంచి స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...