May 7, 2019


పెండింగ్ ప్రశ్నలన్నీ రద్దవుతాయి
శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
సచివాలయం, మే 7: ప్రస్తుతం శాసనసభలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలు, సమాధానాలు అన్నీ రద్దయిపోతాయని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల కోడెల శివప్రసాద రావు చెప్పారు. శానసభా భవనంలోని తన ఛాంబర్ లో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశమైన తరువాత  అన్నీ కొత్తగా మొదలవుతాయన్నారు. ప్రస్తుత శాసనసభ భవన సముదాయం దైనందిక అవసరాలకు సరిపోవడంలేదని చెప్పారు. శాశ్వత శాసనసభ నిర్మాణం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల ఇక్కడే మరో పదివేల అడుగుల భవన నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందన్నారు. అప్పుడు పూర్తిగా మార్పులు చేస్తారని చెప్పారు.  స్పీకర్, సభ్యులు, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా, క్యాంటిన్, లైబ్రరీ, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి అన్ని పూర్తి చేస్తామని స్పీకర్ చెప్పారు.

May 6, 2019


ప్రశాంతంగా రీపోలింగ్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది
81.48 శాతం పోలింగ్

          సచివాలయం, మే 6: రాష్ట్రంలోని 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 6వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల సమస్య గానీ, శాంతి భద్రతల సమస్య గానీ తలెత్తలేదన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా తమ విధులు నిర్వహించారని అభినందించారు.  మొత్తం 5 కేంద్రాలకు 4 కేంద్రాలలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయిందని, ఒక కేంద్రంలో మాత్రం 47 మంది క్యూలో నిలబడి ఉండటంతో అక్కడ రాత్రి 7 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్లేనన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేశనపల్లిలో 89.23 శాతం పోలయ్యాయయని తెలిపారు. అక్కడ 956 మంది ఓటర్లకు 853 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 75.43 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ  1396 మంది ఓటర్లకు 1053 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 87.01 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 1070 మంది ఓటర్లకు 931 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెంలో 75.55 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. అక్కడ 1084 మంది ఓటర్లకు 819 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలోని అటకానితిప్ప పోలింగ్ స్టేషన్ లో 84.23 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 558 మంది ఓటర్లకు 470 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నరని చెప్పారు. రీ పోలింగ్ కు సంబంధించిన 5 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 5,064 మంది ఓటర్లు ఉండగా, 4,126 మంది (81.48 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు.

        మంగళవారం నుంచి కౌంటింగ్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. ప్రతి జిల్లా నుంచి పది మందిని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, విధివిధానాలు అన్ని వారికి వివరిస్తారని చెప్పారు.  వారు ఈ నెల 17న  ఆయా జిల్లాలలో ఇతర ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. ఈవీఎం ఓట్ల కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఓట్ల కంటే ఎక్కువ పోస్టల్ ఓట్లు ఉంటే వాటిని మరోసారి లెక్కిస్తారన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం విస్తీర్ణం ఆధారంగా ఎన్ని టేబుల్స్ అనేది నిర్ణయిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఏ నియోజకవర్గానికి ఎవరిని ఎంపిక చేశారో ఒక రోజు ముందు మాత్రమే తెలుస్తుందన్నారు. ఎంపికకు కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. స్థానికులు కాకూడదు, అక్కడ నివాసం ఉండకూడదు, ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ...వంటి నిబంధనలను అనుసరించి ఎంపిక చేస్తారని చెప్పారు. ఎవరికి ఏ టేబుల్ వస్తుందో ఒక గంట ముందు మాత్రమే తెలుస్తుందన్నారు. అవన్ని పరిశీలకులు నిర్ణయిస్తారని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.
               నియోజకవర్గానికి 150 మంది వరకు ఓట్ల లెక్కింపు సిబ్బంది కావలసి ఉంటుందని, 20 శాతం మందిని అదనంగా తీసుకుంటారని చెప్పారు. ఈ నెల 23వ తేదీన పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మొదట ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారని, తరువాత నియోజకర్గానికి ఓ అయిదు వీవీప్యాట్ లను ర్యాండమ్ గా ఎంపిక చేసి లెక్కిస్తారని చెప్పారు. ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ ల ఓట్లకు మధ్య వ్యత్యాసం లేకపోతే ఫలితాలను ప్రకటిస్తారన్నారు. వ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్ ఓట్లను మరొకసారి లెక్కిస్తారని, అప్పటికీ మార్పులేకపోతే వీవీప్యాట్ ఓట్లను మొత్తం లెక్కిస్తారని, ఆ లెక్క ఆధారంగానే ఫలితాలను ప్రకటిస్తారని వివరించారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఫలితాలు తెలుస్తాయని, అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు అంచల గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ద్వివేది చెప్పారు.

సమాన పనికి సమానవేతనం - ఉద్యోగి తిరుగులేని హక్కు



కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్

        అమరావతి, మే 6 : రాష్ట్రంలో పని చేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం ఒక ప్రకటలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు ప్రభుత్వ సొసైటీలు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు యూనివర్శిటీలలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.  వీరంతా వివిధ రకాల పేర్లతో కాంట్రాక్ట్, ప్రభుత్వం నియమించిన పలు ఏజన్సీల ద్వారా 3 నుంచి 18 ఏళ్లుగా పనిచేస్తున్నాని వివరించారు. పలు శాఖలలో అనేక మంది అత్యంత అనుభవం, అత్యున్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు. వారంతా అణచివేత, అవమానాలకు గురవతున్నారు. కాంట్రాక్ట్ ఏడాది వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తుంటారు. అందువల్ల వీరికి ఉద్యోగ భద్రత ఉండదు. ఎన్ని ఏళ్లు చేసినా ఏ బ్యాంకు వీరికి రుణం కూడా ఇవ్వదు.  ఇతర ఏ సౌకర్యాలు పొందలేరు. ఇన్ని ఏళ్లుగా వీరంతా ప్రభుత్వ విభాగాలలో పని చేస్తున్నా తగిన వేతనం ఇవ్వడంలేదు. వారు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారికి ఆరోగ్య కార్డులు లేవు. బీమా సౌకర్యం లేదు.  వారికి సెలవులు దొరకండా కూడా అతి కష్టం.  జీతాలు కూడా అతి తక్కువగా అత్యంత దారుణంగా ఇస్తున్నారు. కొన్ని  ఏజన్సీలు వారికి జీతాలు సరిగా ఇవ్వరు. ఆలస్యంగా ఇస్తారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటివాటిని సక్రమంగా చెల్లించరు. తక్కువ జీతాలు ఇవ్వడం సమాన పనికి సమావేతనం అన్న సూత్రానికి ఇది విరుద్ధం.  ప్రభుత్వమే ఇన్ని ఏళ్లుగా ఉద్యోగులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగించడం అన్యాయం. అక్రమం. ఇక ప్రైవేటే సంస్థలలోని అక్రమాలను ప్రభుత్వం ఏం అదుపు చేయగలదని శంకరరావు ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల వేతనాలు వర్తించవని పంజాబ్‌ - హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఒకే పనికి ఒకే వేతనంఅని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందని తెలిపారు.

ఉద్యోగులకు దక్కవలసిన ప్రయోజనాలు దక్కకుండా చేయడానికే ప్రభుత్వాలు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే బాధ్యతలు నిర్వహిస్తూఒకేరకమైన పనిచేస్తున్న ఇద్దరి వేతనాల్లో ఒకరు శాశ్వతమనీ మరొకరు తాత్కాలికమనీ అంటూ వివక్ష చూపడం కుదరదనీ సంక్షేమ రాజ్యంలో అస్సలు కూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎవ్వరూ ఇష్టపూర్వకంగా తక్కువ వేతనానికి పనిచేయరనీ గత్యంతరం లేని స్థితిలో కుటుంబ పోషణ కోసం తమ ఆత్మగౌరవాన్నీహుందాను విలువనూ తగ్గించుకొని ఇందుకు సిద్ధపడతారని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేవిధమైన పనిచేసే వారి వేతనాల్లో తేడాలు ఉండటమంటే అది వారి శ్రమను దోచుకోవడమూ అణచివేయడమూ అవుతుందని న్యాయస్థానం విశ్లేషించింది. భారత రాజ్యాంగంలోని 141వ అధికరణాన్ని గుర్తుచేస్తూ ఉద్యోగి పర్మినెంటా కాంట్రాక్టా అనే దానితో నిమిత్తం లేకుండా సమానపనికి సమానవేతనం పొందడమన్నది ఉద్యోగి తిరుగులేని హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒక సంస్థలో ఒకే విధమైన పనిచేస్తున్న వారందరికీ సమానవేతనం ఇవ్వాలని 1976 కార్మికచట్టంలో ఉంది. ప్రభుత్వ చట్టాలను, సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి అర్హతల ఆధారంగా పర్మినెంట్ చేసి, వారికి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, వారు  పని చేసే చోట తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని శంకరరావు కోరారు.

May 4, 2019


రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు
 గంట ముందు వెళ్లడానికి అనుమతి
               సచివాలయం, మే 4: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం ఒక గంట ముందు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాశ్విత ఉద్యోగులు అందరితోపాటు  ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. మే నెల 6 నుంచి జూన్ నెల 5వ తేదీ వరకు ఆ రెండు రోజులతోపాటు అన్ని పని దినాలలో ముస్లిం ఉద్యోగులు తమ మత పరమైన ఆచారాలు నిర్వర్తించడానికి సాయంత్రం ఒక గంట ముందు కార్యాలయం, పాఠశాల వదిలి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో వారి  సేవలు తప్పనిసరి కానివారందకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

May 3, 2019

నీరుగారిన విద్యార్ధి ఉద్యమాలు

  విద్యార్థి సంఘ ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బలహీనపడటం అటు రాజకీయంగాఇటు సామాజికంగా ప్రమాదరకం. విద్యార్థులు విద్యతోపాటు దేశభక్తిసమాజాభివృద్ధి ఆలోచనలుసేవాతత్పరతను పెంపొందించుకోవాలి. కొన్ని ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది.  ప్రభుత్వాల వింత పోకడల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాక ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలను గాడిలో పెట్టడానికి బలమైన, శక్తివంతమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలి. విద్యావ్యవస్థవిద్యా విధానాలలో మార్పుల వల్ల విద్యార్థి ఉద్యమాలు నీరుగారాయి. విద్యార్థులలో పూర్వపు చైతన్యం కొరవడింది. స్వాతంత్ర్యానికి ముందుతరువాత కూడా దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాలు నడిచాయి. రాజకీయ మార్పులకుసమసమాజాభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. గతంలో విద్యార్ధులు అనేక ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు. అటు రాజకీయ నాయకులకుఇటు సమాజానికి  ఆదర్శంగా నిలిచారు. అన్ని రాజకీయ పార్టీలలో పేరు ఘడించిన రాజకీయ నాయకులందరూ విద్యార్థి ఉద్యమాల నుంచే వచ్చారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ  వారు నైతిక విలువలతో కూడిన రాజకీయ నాయకులుగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమముఖ్యంగా వామపక్ష విద్యార్థి ఉద్యమ నేపధ్యం కలిగిన వారు కులమతాలకు అతీతంగా సామాజిక చైతన్యం కలిగినవారుగా ఎదిగారు. అనేక విద్యార్థి సంఘాలు క్రియాశీలకంగా ఉండటంపోటీలు పడటం వల్ల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. రాజకీయఇతర సమస్యలను ఎదుర్కొనే సమర్థులుగా తయారయ్యేవారు. ఉత్తమ శ్రేణి నాయకత్వం తయారవడానికి విద్యార్థి సంఘాలు దోహదపడతాయి. ఆ దశలో వారికి కులమత వ్యత్యాసాలు తెలియవు. అభ్యుదయ భావాలు అవలర్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పథం కలిగించి, సమసమాజ స్థాపనకు కృషి చేసేవి. సమాజం పుట్టుకపరిణామక్రమంకులాల ఏర్పాటుకు చారిత్రక నేపధ్యంమానవతా విలువలుకులంకంటే మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక అంశాలను ఆయా పార్టీల పెద్దలు వివరించేవారు.
                విద్యావ్యవస్థబోధనలో వచ్చిన మార్పులుకుప్పలుతెప్పలుగా ఏర్పడిన కాలేజీ వల్ల కాలక్రమంలో విద్యార్థి ఉద్యమాలు బలహీనపడ్డాయి. విద్యా బోధనలో నాణ్యత కూడా తగ్గింది. కాలేజీ యాజమాన్యాలు చేసే వికృత చేష్టల వల్ల విద్యార్థులలో చదువు తప్ప ఇతరిత్రా చైతన్యం నశించింది. అటు రాజకీయంఇటు సామాజిక అంశాల పట్ల అవగాహన కూడా తగ్గింది. ఫీజుల పేరుతో సర్టిఫికెట్లను కూడా ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాల తీరుకు నిరసన తెలిపే పరిస్థితులు కూడా లేవు. పరిస్థితులు అంత దయనీయంగా మారిపోయాయి. వామపక్ష రాజకీయ పార్టీలు కూడా విద్యార్ధి ఉద్యమాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ ప్రభావం పార్టీల ఎదుగుదలపై స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధి సంఘాలను ఈ విధంగా వదిలివేస్తే ఆ పార్టీలు బలహినపడడటమే కాకుండా సమాజానికి ముఫ్పు అనేది ఆయా పార్టీల పెద్దలు గ్రహించవలసి ఉంది. విద్యార్ధి సంఘాలు, ఉద్యమాలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాలలోకి వచ్చేవారు తగ్గిపోయారు. ఉత్తమ నాయకత్వం కొరవడింది.  రౌడీలుగూండాలువ్యాపారవేత్తలుకులాల పేరుతో రెచ్చగొట్టేవారు  రావడం మొదలై రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రజా సేవకంటే, ధనం దండుకోవడానికే ప్రాధాన్యత పెరిగింది. విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. సామాజిక పరంగా కూడా విద్యార్థులలో చైతన్యంఅవగాహన పూర్తిగా తగ్గిపోయాయి. విద్యార్థి దశలోనే వారు కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మానసికంగా కలుషితమవుతున్నారు. సామాజిక స్పృహ లేకుండాపోతోంది. కనీస మౌలిక వసతులుఅర్హత కలిగిన బోధకులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోవడం కూడా ఇటువంటి మార్పులు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 
                     1936 నుంచి దేశంలో విద్యార్ధి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జేఎన్టీయూ నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియావిశాఖలోని ఆంధ్రా యూనివర్సి వరకు అనేక యూనివర్సిటీలు పలు ఉద్యమాలకు వేదికలుగా నిలిచాయి. రాజకీయ ఉద్యమాలతోపాటు శాస్త్రీయ విద్యావిధానం అమలుకు,  స్త్రీ వాదం బలపడటానికిదళితబహుజనకులాతీత,మతాతీత ఉద్యమాలు అనేక నిర్వహించారు. విశ్వజనీన భావన ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. నేడు విద్యార్థుల ఆత్మహత్యలు, పరువు హత్యలు, అరాచక శక్తుల ఆగడాలకు విద్యార్థినులు బలవడాలు అనేకం జరుగుతున్నాయి. ఏనాడైతే విద్యార్ధి ఉద్యమాలు బలపడతాయో ఆనాడే ఇటువంటి చర్యలకు చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. మళ్లీ అందరూ, అన్ని స్థాయిలలో విద్యార్ధి ఉద్యమాలను నిర్మించి, సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన అవసరం ఉంది. రాజకీయ మేథావులైన పెద్దలు ఆలోచించాలి.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Apr 26, 2019


2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల సేకరణ

             సచివాలయం, ఏప్రిల్ 26: కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోని జనాభా లెక్కలను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఆధారంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఇక్కడ జీఓ జారీ చేశారు. ఆ జీఓ ప్రకారం  దేశమంతా 2021 మార్చి 1వ తేదీ  00.00 గంటల సమయాన్ని ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలను సేకరిస్తారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలోని మంచు గడ్డకట్టే కొండ ప్రాంతాలలో మాత్రం అంతకంటే ముందుగానే 2020 అక్టోబర్ 1వ తేదీ 00.00 గంటలను ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలు సేకరిస్తారు.


Apr 24, 2019

ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్ మహీంద్ర రూ.20 లక్షల విరాళం


అమరావతి, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కి టెక్ మహీంద్ర సంస్థ రూ.20 లక్షల రూపాయలు అందజేసింది. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం సంస్థ విసి కెవిఆర్ సుబ్రహ్మణ్యం   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిసి చెక్కుని అందజేశారు.