Nov 1, 2019

భూముల వివ‌రాలు


గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
అసైన్డ్భూమి : భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్భూములుగా పేర్కొంటారు. భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి బదలాయించడానికి వీలుండదు.
ఏడబ్ల్యూ భూములు : శిస్తును నిర్థారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్వేస్ట్ల్యాండ్అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
బంజరు భూమి : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
అడంగల్‌ : దీనినే పహాణి అని కూడా అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు దస్త్రం (రిజిస్టర్‌)లో నమోదు చేస్తుంటారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్అని పిలుస్తుండగా తెలంగాణాలో పహాణీగా వాడుకలో ఉంది.
చిట్టా : రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్టర్లో నమోదు చేస్తారు.
జమాబందీ : ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకు వచ్చారా లేదా అని నిర్థారించడం, గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు.
అజమాయిషీ : భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు 3లో నమోదు చేయాలి. విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.
దస్తావేజు : భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్చేయించుకోవాలి.
ఎన్కంబరెన్స్సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియ జేసే ధ్రువపత్రం. 32 ఏళ్లలోపు సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను తెలియజేస్తుంది.
ఫీల్డ్మెజర్మెంట్బుక్‌ (FMB) : దీనిని ఎఫ్ఎంబీ టిప్పన్అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి.
బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వేనిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు.
బీమెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. అర్హులైతే కొనసాగిస్తారు. అనర్హులైతే తొలగిస్తారు.
ఫసలీ : ఏటా జులై 1 తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్నిఫసలీఅంటారు. పదం మొఘల్చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.
ఎకరం : ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం). వీటిని ఎకరంగా పరిగణిస్తారు.


Oct 23, 2019


ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన తక్షణం అవస్యం

           
  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం యూరప్ మీద పడనుంది. కొన్ని ప్రధాన దేశాలు దిగుమతుల సుంకం పెంచడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడే అకాశం ఉంది. ఏదైనా ఒక సంవత్సరంలో వరుసగా మూడు త్రైమాసికాలు స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు క్షీణిస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతున్నాట్లు పరిగణిస్తారు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల  వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుంది. మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గుతుంది. దాంతో కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడుతుంది. దేశంలో 2019-20 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  5.8  శాతం వృద్ధి రేటు నమోదైంది. నరేంద్ర మోదీ హయాంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత మాత్రాన మాంద్యం ఏర్పడినట్లు కాదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించింది. దేశం మాంద్యం వైపు వెళుతోంది.   2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రపంచం అంతటిపైనా  పడింది. పటిష్టంగా ఉన్న అప్పటి భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ దానిని తట్టుకొని నిలబడగలిగింది. అప్పట్లో ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాలు అందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం భారత్‌ వివిధ అంశాలలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ ... వంటి రంగాలు బాగా క్షీణించాయి. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిని కూడా తగ్గించారు. అమెరికా, చైనా దిగుమతి సుంకాలను పెంచిన ప్రభావం యూరప్ తోపాటు ప్రపంచం అంతటా పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో ఊహించడం కష్టం. 2007-09 మధ్య తలెత్తినటువంటి ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది.  ఆ ప్రభావంతో  భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
              దానికితోడు  బడా వ్యాపార వేత్తలు అత్యంత సునాయాసంగా బ్యాంకులను మోసం చేయగలుగుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగవేయగలుగుతున్నారు. బ్యాంకుల మొండి బకాయిలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయాయి.  దేశంలో రానురాను ఉన్నత వర్గాలుపారిశ్రామికవేత్తలకే బ్యాంకులు ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. రైతులువ్యవసాయదారులుగ్రామీణ ప్రజానీకానికి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు ఆశించిన స్థాయిలో  అందుబాటులో లేవు.  బ్యాంకులు జాతీయం చేసి 50ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో  జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు నెరవేరలేదంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు భావించాలి. బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, మొండి బకాయిలు ముక్కు పిండి వసూలు చేసే వ్యవస్థ మనదేశంలో లేదు. అందువల్లనే పలువురు పారిశ్రామికవేత్తలు బ్యాంకులను అందినకాడికి దోచుకుంటున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన  కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. 2017-18లో రూ.41,167.04 కోట్లకు బ్యాంకులను మోసం చేయగా, 2018-19కి అది రూ.71,542.93 కోట్లకు పెరిగింది. ఈ మోసాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా నష్టపోతున్నాయి.  2018-19లో బడాబాబుల మోసాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.64,509.43 కోట్ల మేర నష్టపోయాయి. రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపేస్తోంది. నకిలీ పత్రాలు దాఖలు చేసి అధిక మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులకు సంబంధించి నిరర్ధక ఆస్తుల మొత్తం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంచనా.  ఒక వంద మంది లోపే లక్షల కోట్ల రూపాయలు ఎగవేసినట్లు తేలింది. ఈ ప్రకారం అతి కొద్ది మంది మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ రకమైన చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలే ప్రమాదం ఉంది. రైతులు, మధ్య తరగతివారు, చిరు వ్యాపారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ఎక్కడలేని నిబంధనలు అమలు చేస్తాయి. అదే బడా బాబులకు వచ్చేసరికి ఆ నిబంధనలను తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకొని విదేశాలకు పారిపోయే విజయ మాల్యా, నీరవ్‌ మోడీ ...లాంటి వారు ఎక్కువైపోతున్నారు. మోసపూరిత సంస్థలకు రుణాలు మంజూరు అవుతుండటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  
       ఇదిలా ఉంటే, గత మూడేళ్లలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్షా 76 వేల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేశారు. ఈ బకాయిలన్నీ 416 మంది రుణగ్రహీతలు ఎగవేసినవి కావడం గమనార్హం.  వీరంతా రూ.100 కోట్లు, అంతకు మించి ఎగవేసినవారే.  2014-15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. ఈ రకమైన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తాయి. 2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కొట్టివేతలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు విశేషాధికారాలు  ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన ఆవస్యకత కనిపిస్తోంది. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన అడ్డంకులు తొలగించి, ఉన్న చట్టాల సవరణ  లేదా కొత్త చట్టాల రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Oct 21, 2019


అల్లక తాతారావుకు ఆత్మీయ సన్మానం
             

         

          చేనేత బతుకు చిత్రాన్ని పాట రూపంలో జైపూర్‌లో ఆలపించిన చేనేత కార్మికులు, కవి, రచయిత, మదుర గాయకుడు అల్లక తాతారావుకు విశ్వశాంతి కళాపరిషత్ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలోని పొట్లాబత్తుల లక్ష్మణరావు వస్త్రాలయం పైన  ఆదివారం రాత్రి ఆత్మీయ సన్మానం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్  ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో అక్టోబర్ 4,5,6 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రేమాండ్ ఎంటీవీ ఇండియా మ్యూజిక్ సమ్మిట్-2019 సందర్భంగా రేమాండ్ వారు చేనేత-ఖాదీ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో కశ్మీర్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్ చేనేత కళాకారులు చేనేత గీతాలను ఆలపించారు. ప్రముఖ బిల్డర్  ఇంజమూరి శ్రీనివాసరావు ప్రోత్సాహం, సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అల్లక తాతారావు  రెండు తెలుగు రాష్ట్రాల తరపున ఆ కార్యక్రమంలో పాల్గొని  చేనేత బతుకు గీతం ఆలపించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని కళాకారులు ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు.
            సభా కార్యక్రమానికి ముందు పలువురు కళాకారులు పాటలు, పద్యాలు ఆలపించారు. ఇంజమూరి శ్రీనివాసరావు, అల్లక తాతారావులను జొన్నాదుల బాపూజీ శాలువలతో సన్మానించారు. సభానంతరం అల్లక తాతారావును పలువురు పూలమాలతో, శాలువలతో సన్మానించారు. కథ,నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు, చేనేత కార్మికుడు సందుపట్ల భూపతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇంజమూరి శ్రీనివాసరావు, పొట్లాబత్తుల లక్ష్మణరావు, కృష్ణార్జున బోధి, రేఖా కృష్ణార్జున రావు, జొన్నాధుల బాపూజీ, గుత్తికొండ ధనుంజయ, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివ శంకరయ్య, గోలి సీతారామయ్య, కంచర్ల కాశయ్య, గోలి మధు తదితరులు పాల్గొన్నారు.

Oct 13, 2019


ఆకురాతి కిషోర్‌కు డాక్టరేట్

       

   
హైదరాబాద్: గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్‌కు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదాన చేసింది. యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో ఘనంగా జరిగింది. ‘వాలిడేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటిలిజెన్స్ విత్ ఆస్ట్రోలజీ’ అనే అంశంపై పరిశోధన చేసిన కిషోర్‌కు ఈ స్నాతకోత్సవంలో  డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆకురాతి వెంకట కృష్ణారావు, భారత స్వరాజ్యలక్ష్మిల కుమారుడైన కిషోర్ గుంటూరులోనే విద్యాభ్యాసం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన కిషోర్ ఉద్యోగం చేస్తూనే ఆ తరువాత ప్రైవేటుగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా సుందరం ఫైనాన్స్ కంపెనీలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుందరం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్‌గా పని  చేస్తున్నారు. కిషోర్-బాల సరస్వతిల కుమార్తె మానస గుంటూరులోనే ఎంబిబిఎస్ చదువుతోంది. ఈ వయసులో కూడా ఉద్యోగం చేస్తూ చదువు, పరిశోధన పట్ల ఆసక్తితో యూనివర్సిటీకి పరిశోధన పత్రం సమర్పించి కిషోర్ డాక్టరేట్ సాధించడం అభినందనీయం.



 యోగ సంస్కృతం యూనివర్సిటీ స్నాతకోత్సవం
            హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ 11వ కాన్వకేషన్ ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, డాక్టరేట్లు ప్రదానం చేశారు. గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్ కుమార్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ బివికె శాస్త్రి, వైస్ ఛాన్సలర్ ఎన్.వి.ఆర్.ఏ.రాజా, కిమ్స్ సీఈఓ డాక్టర్ బి.భాస్కర రావు, డాక్టర్ ఎస్. బిక్కం చంద్, వేద, ఆగమ ప్రవీణ అవధూత రాజయోగి, స్కోప్ సంస్థ చైర్మన్ డాక్టర్ కాశ్యప్ కె ప్రభాకర్, తమిళనాడులోని జెకెఆర్ ఆస్ట్రో రీచర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయ లక్ష్మి, వేదిక్ సైన్స్ జాతీయ సంస్థకు చెందిన లక్ష్మీ నారాయణ, చైతన్య గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సురేష్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్ విఆర్టే రాజా తదితరులు పాల్గొన్నారు.

Oct 7, 2019

బలీయమైన సంస్కృతి
Ø గార్బా, దాండియా నృత్యాలు
Ø దసరా సందర్భంగా 28న విజయవాడలో మెగా ఈవెంట్
Ø దుర్గాదేవి-మహిషాసురునికి మధ్య జరిగే యుద్ధానికి ప్రతీకగా దాండియా
       
    సంస్కృతి, భాష చాలా బలీయమైనవి. ఏ ప్రాంతం వారైనా వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. జీవితాంతం వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, బతుకుదెరువు కోసం ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా వాటిని అనుసరిస్తూ ఉంటారు. మన తెలుగు వారు అమెరికా, దుబాయ్ .. వంటి దేశాలలలో నివాసం ఉంటున్నా సంక్రాంతి, బతకమ్మ వేడుకలు జరుపుకుంటుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ ల నుంచి వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు విజయవాడలో దసర ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడంతోపాటు వారి సంప్రదాయ  గార్బా, దాండియా నృత్యాలను అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు, మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటుంటారు. వారి సంస్కృతిని ముందు తరాలవారికి అందిస్తుంటారు. క్రియేటివ్ సోల్ నేతృత్వంలో దాండియా మెగా ఈవెంట్ పేరుతో రెండేళ్ల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో  నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం చిన్న పిల్లలు మొదలుకొని  యువతీ యువకులకుపెద్దలకు బెంజి సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపడానికి లక్షల విలువైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. విలువైన బహుమతులు గెలుచుకునేందుకు వారు పోటీలుపడి మరీ వారి సంప్రదాయ నృత్యాలను అభ్యాసం చేస్తున్నారు. ఇందు కోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కొందిన శిక్షకులను రప్పించి వారికి  21 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమంలో పురుషుల విభాగంలో సౌరవ్మహిళల విభాగంలో మయూరిఉత్తమ వేషధారణ విభాగంలో రితిక అగ్రభాగాన నిలిచి బహుమతులు అందుకున్నారు. మెగా ఈవెంట్ లో గుజరాతీ సంగీత కళాకారుల పాటలతోపాటు వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం వినిపిస్తారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులుహోరెత్తించే వాద్యాలతోపాటు  ప్రత్యేకంగా డిజైన్ చేసిన గుజరాతీ దుస్తులువస్త్రాలుఆభరణాలుకళాకృతులుచిత్రలేఖన ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు.
                సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బాదాండియా నృత్యరీతులను ఈ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేస్తారు. కళలతో దేశసమైఖ్యతను చాటాలన్నది  గుజరాతీరాజస్ధానీ పడతుల ముఖ్య ఉద్దేశం. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారు.  అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నాపెద్ద కలిసి అత్యంత ఉత్సాహంగా ఈ నృత్యం చేస్తారు.  క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనానేహాజైన్, ప్రధాన టైటిల్  స్పాన్సర్  జిఎం మాడ్యులర్ ఈ ఈవెంట్ నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
-     శిరందాసు నాగార్జున – 9440222914

Sep 25, 2019


‘ఒకే దేశం - ఒకే భాష’ సాధ్యమేనా?

             ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకే ఎన్నికలు - ఒకే కార్డు,  ఒకే విధమైన రిజర్వేషన్ విధానం -  దేశ పౌరులందరికీ (స్త్రీపురుషులిద్దరికీ) సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను, ఒకే పోటీ పరీక్ష ..... మాదిరిగా ఒకే భాష సాధ్యమేనా? వేల సంవత్సరా నుంచి  పలు ప్రాచీన భాషలకు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న  మన దేశంలో అది సాధ్యం కాదు. హిందీ దివస్‌ సందర్భంగా ఒకే దేశం-ఒకే భాష అని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ‘‘యావత్‌ భారతావనిని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలి. 2020 నుంచి హిందీ దివస్‌ను ఘనంగా జరుపుకుంటాం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా హిందీకి మంచి గుర్తింపు తీసుకొస్తాం’’ అన్న షా మాటలను దేశ వ్యాప్తంగా సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె అధినేత స్టాలిన్, సినీ హీరో కమల్ హాసన్, ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ వంటి పలువురు తప్పుపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. మాతృభాషాభిమానం మెండుగా ఉన్న దక్షిణాది, ముఖ్యంగా తమిళనాడు నుంచి తీవ్రస్థాయిలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని డిఎంకే పార్టీ వర్గాలు హెచ్చరించాయి. కర్ణాటకలో అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషాభిమానులు రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 'ఒకే దేశం-ఒకే భాష' ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాగా  ఏచూరి పేర్కొన్నారు. దేశమంటే కేవలం హిందీ, హిందుత్వ కాదని.. వాటి కంటే  భారత్‌ ఎంతో విశాలమైందని అసదుద్దీన్ పేర్కొన్నారు. భారతీయులందరి భాష  హిందీ మాత్రమే కాదని, ఇక్కడ ఎన్నో సంస్కృతులు, ఎన్నో మాతృభాషలు ఉన్నాయని, ముందు వాటి అందాన్ని, భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంటూ వ్యాఖ్యానించారు.  షా వ్యాఖ్యలు భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదాన్ని తెస్తాయని స్టాలిన్ హెచ్చరించారు. హిందీ భాషను దేశమంతా బలవంతంగా రుద్దాలనుకోవడం ముర్ఖత్వమని  ఎండీఎంకే అధ్యక్షుడు వైగో వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే హిందీ వద్దనుకునే రాష్ట్రాలు భారత్‌లో ఉండే పరిస్థితి లేదని  హెచ్చరించారు. జల్లికట్టుపై ఆందోళన కేవలం ఓ నిరసనలా సాగిందని, భాషా పోరాటం దానికంటే మహోగ్రంగా ఉంటుందని, అటువంటి మహోగ్ర భాషాపోరాటాన్ని భారత్ కోరుకోదని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

              పరిపాలనా సౌలభ్యం కోసం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని అంశాలు ఒకే రకంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలనాపరమైన అంశాలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండటం వల్ల వ్యయం తగ్గుతుంది. జమిలీ ఎన్నికలైతే ప్రభుత్వానికి, పార్టీలకు ఖర్చు తగ్గుతుంది. విద్యాపరంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు వంటివి  ఒకటే ఉంటే విద్యార్థులకు ఖర్చు తక్కువ, సౌలభ్యంగా ఉంటుంది. అలాగే చట్టాలు, పన్నులు, గుర్తింపు కార్డులు, కొన్ని సర్టిఫికెట్లు... వంటివి ఒకే రకంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ’ఏక్తా భారత్‘ భావన కూడా నెలకొంటుంది. అయితే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు విషయంలో అది సాధ్యం కాదు. ఆ రకమైన ఆలోచన మంచిదీ కాదు. మన దేశంలో 122 భాషలు, 19,500 మండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులకు నిలయం భారత్. వీటికి తోడు ఇక్కడ వేళ్లూనుకున్న వేల కులాలు ఉన్నాయి.
దేశంలోని పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం తయారు చేయడం కోసం డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ తోపాటు దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది.  భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్  మూడేళ్ల కాలం అవిశ్రాంతంగా శ్రమించారు.  ఆయన కృషి ఫలితంగా 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దేశంలోని 22 షెడ్యూల్‌ భాషలకు రాజ్యాంగంలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 29 పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛను కల్పిచింది. రాజ్యాంగ రూపకల్పనలో మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తలకు విఘాతం కలిగించే విధంగా షా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై అనేకమంది ధ్వజమెత్తుతున్నారు. దేశంలో హిందీ భాషతో పాటు ప్రాచీనంగా ఉన్న అనేక భాషలు ఉన్నాయి. దక్షిణాధి భాషలు అంతకంటే ఎక్కువ ప్రాచీనంగా ఉన్నాయి. భాష, సంస్కృతి చాలా బలీయమైనవి. హిందీ రాజభాషగా గుర్తింపు పొందినా ప్రాంతీయ భాషలకు కూడా తగిన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది.  హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే గతంలో మాదిరి ఉధృతంగా మాతృభాషా ఉద్యమాలు జరుగుతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914