Oct 23, 2019


ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన తక్షణం అవస్యం

           
  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం యూరప్ మీద పడనుంది. కొన్ని ప్రధాన దేశాలు దిగుమతుల సుంకం పెంచడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడే అకాశం ఉంది. ఏదైనా ఒక సంవత్సరంలో వరుసగా మూడు త్రైమాసికాలు స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు క్షీణిస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతున్నాట్లు పరిగణిస్తారు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల  వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుంది. మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గుతుంది. దాంతో కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడుతుంది. దేశంలో 2019-20 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  5.8  శాతం వృద్ధి రేటు నమోదైంది. నరేంద్ర మోదీ హయాంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత మాత్రాన మాంద్యం ఏర్పడినట్లు కాదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించింది. దేశం మాంద్యం వైపు వెళుతోంది.   2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రపంచం అంతటిపైనా  పడింది. పటిష్టంగా ఉన్న అప్పటి భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ దానిని తట్టుకొని నిలబడగలిగింది. అప్పట్లో ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాలు అందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం భారత్‌ వివిధ అంశాలలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ ... వంటి రంగాలు బాగా క్షీణించాయి. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిని కూడా తగ్గించారు. అమెరికా, చైనా దిగుమతి సుంకాలను పెంచిన ప్రభావం యూరప్ తోపాటు ప్రపంచం అంతటా పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో ఊహించడం కష్టం. 2007-09 మధ్య తలెత్తినటువంటి ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది.  ఆ ప్రభావంతో  భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
              దానికితోడు  బడా వ్యాపార వేత్తలు అత్యంత సునాయాసంగా బ్యాంకులను మోసం చేయగలుగుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగవేయగలుగుతున్నారు. బ్యాంకుల మొండి బకాయిలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయాయి.  దేశంలో రానురాను ఉన్నత వర్గాలుపారిశ్రామికవేత్తలకే బ్యాంకులు ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. రైతులువ్యవసాయదారులుగ్రామీణ ప్రజానీకానికి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు ఆశించిన స్థాయిలో  అందుబాటులో లేవు.  బ్యాంకులు జాతీయం చేసి 50ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో  జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు నెరవేరలేదంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు భావించాలి. బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, మొండి బకాయిలు ముక్కు పిండి వసూలు చేసే వ్యవస్థ మనదేశంలో లేదు. అందువల్లనే పలువురు పారిశ్రామికవేత్తలు బ్యాంకులను అందినకాడికి దోచుకుంటున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన  కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. 2017-18లో రూ.41,167.04 కోట్లకు బ్యాంకులను మోసం చేయగా, 2018-19కి అది రూ.71,542.93 కోట్లకు పెరిగింది. ఈ మోసాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా నష్టపోతున్నాయి.  2018-19లో బడాబాబుల మోసాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.64,509.43 కోట్ల మేర నష్టపోయాయి. రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపేస్తోంది. నకిలీ పత్రాలు దాఖలు చేసి అధిక మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులకు సంబంధించి నిరర్ధక ఆస్తుల మొత్తం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంచనా.  ఒక వంద మంది లోపే లక్షల కోట్ల రూపాయలు ఎగవేసినట్లు తేలింది. ఈ ప్రకారం అతి కొద్ది మంది మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ రకమైన చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలే ప్రమాదం ఉంది. రైతులు, మధ్య తరగతివారు, చిరు వ్యాపారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ఎక్కడలేని నిబంధనలు అమలు చేస్తాయి. అదే బడా బాబులకు వచ్చేసరికి ఆ నిబంధనలను తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకొని విదేశాలకు పారిపోయే విజయ మాల్యా, నీరవ్‌ మోడీ ...లాంటి వారు ఎక్కువైపోతున్నారు. మోసపూరిత సంస్థలకు రుణాలు మంజూరు అవుతుండటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  
       ఇదిలా ఉంటే, గత మూడేళ్లలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్షా 76 వేల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేశారు. ఈ బకాయిలన్నీ 416 మంది రుణగ్రహీతలు ఎగవేసినవి కావడం గమనార్హం.  వీరంతా రూ.100 కోట్లు, అంతకు మించి ఎగవేసినవారే.  2014-15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. ఈ రకమైన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తాయి. 2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కొట్టివేతలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు విశేషాధికారాలు  ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన ఆవస్యకత కనిపిస్తోంది. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన అడ్డంకులు తొలగించి, ఉన్న చట్టాల సవరణ  లేదా కొత్త చట్టాల రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...