Dec 26, 2018


రాయలసీమకు మహర్దశ
27న కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి  శంకుస్థాపన
v ఫలించిన సీమవాసుల చిరకాల వాంఛ
v 4 జిల్లాల్లో పారిశ్రామికీకరణ 

            పారిశ్రామిక ప్రగతితో రాయలసీమకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి నీటిబొట్టుని ఒడిసిపట్టి నీటి సంరక్షణ,  వినియోగంలో భూగర్భ జల శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉత్తమ యాజమాన్య పద్దతులు అనుసరిస్తోంది. దాంతో సాగునీటి సౌకర్యం మెరుగుపడటం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలలో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది.  మరోవైపు పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాల్లో  250కి పైగా పరిశ్రమలు నిర్మాణ పనులు, యంత్రాల బిగింపు, ట్రయిల్ ప్రొడక్షన్, ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఇంకా రెండు వందలకు పైగా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరకాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ప్రపంచంలోని 8వ అతి పెద్ద మోటార్  కంపెనీ  కియా మోటార్స్ సంస్థ  అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. మరో రెండు, మూడు నెలల్లో ఈ సంస్థ ఇక్కడ తయారుచేసే తొలి కారు రోడ్డెక్కనుంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి పరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో 6 వేల ఎకరాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద  వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా సోలార్‌ పార్కు    నెలకొల్పారు.చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. వంద కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరంలో ఇప్పటికే 22 దేశాలకు చెందిన 70 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం, జపాన్ ఇండస్ట్రియల్ కోపరేటివ్ ఏజన్సీల సహకారంతో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్(సీబీఐసీ) వల్ల సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ జోన్ లో కొత్త ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్ పరిధిలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు, అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతాలు పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైనవిగా గుర్తించారు. కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)ను కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు.
వీటన్నిటికీతోడు అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవే  భూసేకరణ పనులు ముమ్మరమయ్యాయి. దేశంలోనే అత్యంత పొడవైన, మలుపులు లేని ఆరు వరుసల 393.59 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.27,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
              విభజన చట్టంలో భాగంగా కేంద్రం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసి ఉంది. ఇది సీమ ప్రజల చిరకాల వాంఛ. అయితే ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో సీమలో ఉద్యమం నడిచింది.  స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నవంబర్ లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి కర్మాగారం నిర్మించాలని తీర్మానించారు. ప్రభుత్వం దీనిని ఒక సవాలుగా తీసుకుని  వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకుందిరాయలసీమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వేస్తున్న ముందడుగుగా దీనిని భావించవచ్చు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 వేల కోట్లు కేటాయించింది.  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించాలని నిర్ణయించారు. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఈ కర్మాగారం  కోసం 3,147 ఎక‌రాల భూమిని కేటాయించారు. ఈ నెల 27న దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు.  భవిష్యత్ లో ప్రైవేటు సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ గా  ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా  ప్రభుత్వానికి ఉంది.  బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించడంతోపాటు అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని కూడా భావిస్తోంది. ఇతర పరిశ్రమల స్థాపనతోపాటు ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా పూర్తి అయితే సీమ అభివృద్ధి చెందడంతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుంది.

-   శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Dec 21, 2018


జల రవాణాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి
          
ఆంధ్రప్రదేశ్ లో జలరవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను వినియోగించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టిపెట్టాయి. రోడ్డు రవాణాలో పెరుగుతున్న వత్తిడిని దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం జలరవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. రోడ్డు రవాణాలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ని తగ్గించడానికి జలరవాణాపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్రంలో అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేస్తే, అది జల రవాణాకు ఉపయోగపడుతుంది. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలునదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు.  ఇందులో భాగంగా కృష్ణా,  గోదావరి నదుల మధ్య భూ సేకరణకు సంబంధించి  సర్వే కూడా పూర్తి చేశారు.   ఉభయ గోదావరికృష్ణా జిల్లాల్లో అంతర్గత జల మార్గం కోసం భూమిని గుర్తించారు. ఆ భూమిని సేకరించే పనిలో అధికారగణం ఉంది.   ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు. నిడదవోలుఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలుఏలూరుతాడేపల్లిగూడెంలలో భూసేకరణ  చేపట్టారు.  ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దేశాలలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్ వేస్ ట్రాఫిక్, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ విస్తరణ క్రమబద్దీకరణలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని 2017 నవంబర్ లో నియమించింది.  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జెసి శర్మరిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె.దుర్గా ప్రసాద్రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వైఎస్.సుధాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జలరవాణా రంగం అంటే జల మార్గంలో ప్రయాణం, సరుకుల రవాణా, పర్యాటకం, వాటర్ స్సోర్ట్స్ సమ్మిళితమై ఉంటాయి.  ఈ రంగం అభివృద్ధి, విస్తరణకు, పర్యవేక్షణనియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది.  ముఖ్యంగా బోటు ఆపరేషన్స్  (నిర్వహణ)  రెగ్యులేషన్, మానిటరింగ్, ప్రయాణీకుల భద్రతబోట్ల రిజిస్ట్రేషన్లైసెన్సింగ్, రెగ్యులేటరీ క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జలరవాణాకు సంబంధించి అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఒక వేదిక రూపొందించింది. ముఖ్యంగా జలరవాణా నిర్వహణనియంత్రణ తదితర అంశాలకు సంబంధించి ఈ కమిటీ విజయవాడ,  ధవళేశ్వరంలలో పర్యటించింది. ఇందుకు సంబంధించి రేవుల శాఖజలవనరుల శాఖపర్యాటక శాఖఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియారెవెన్యూపోలీస్ తదితర శాఖలువివిధ వర్గాలవారితో పలు సమావేశాలను నిర్వహించింది. అంతేగాక బోటు యజమానుల సంఘం ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశమైంది.   రాజమండ్రిలోని పుష్కర ఘాట్ఇతర ఘాట్లనువిజయవాడలోని పున్నమి ఘాట్పవిత్ర సంఘమం ఘాట్ నుపులిచింతలముక్త్యాలజగ్గయ్యపేటలలో జరుగుతున్న పనులనుపర్యాటక బోట్లు, వెస్సల్స్ ను పరిశీలించింది. అంతే కాకుండా పవిత్ర సంఘమంపోలవరంలలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాలను  కూడా ఈ కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ కేరళ రాష్ట్రంలో కూడా పర్యటించి అక్కడ సంబంధింత శాఖల అధికారులతో సమావేశమై, అక్కడ చట్టాలను, అనుసరించే పద్దతులను, ఇతర పరిస్థితులను  అధ్యయనం చేసింది. దాంతోపాటు  ఢిల్లీలోని ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్లునేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ సభ్యులుతో సమావేశమై ఇన్ లాండ్ వాటర్ వేస్ రవాణాకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. ఈ కమిటీ ఈ ఏడాది మార్చిలో బోటు ప్రమాదాలపై మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.  వివిధ అంశాలను పరిశీలించిన అనంతరం కమిటీ తుది నివేదికను సెప్టెంబర్ లో  సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా  రాష్ట్రంలో జల రవాణాను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. జల మార్గం అభివృద్ధి చెందితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.  రోడ్లపై ట్రాఫిక్ తగ్గడంతో వాతావరణ కాలుష్య, వాయు కాలుష్య తగ్గిపోతుంది.  సరుకుల రవాణా వ్యయం కూడా తగ్గుతుంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ 9440222914




Dec 19, 2018


ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామి ప్రమాణస్వీకారం
                    
సచివాలయం, డిసెంబర్ 19: శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం డాక్టర్ మోపురుగుండు తిప్పేస్వామి చేత శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు తీర్పు ప్రకారం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా  ప్రమాణం చేశారు.

Dec 18, 2018


అందరికి అందుబాటులో ఎన్నికలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా
Ø రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం
Ø దివ్యాంగులకు  ఓటు వేసే సౌకర్యం
Ø కావలసిన వీల్ చైర్లకు ఏర్పాట్లు
Ø బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్
               సచివాలయం, డిసెంబర్ 18: ఎన్నికలు అందరికి అందుబాటులో ఉండేవిధంగా, అందరూ ఓటు వేసే సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రకాష్ సిసోడియా చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం సిసోడియా అధ్యక్షతన అందరికీ అందుబాటులో ఎన్నికలపై 9 మంది సభ్యులతో కూడి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్టీరింగ్ కమిటీలను జిల్లా స్థాయిలో, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దివ్యాంగులు, అంధులు, మూగ,చెవుడు గలవారు అందరూ పోలింగ్ స్టేషన్ కు రావడానికి, ఓటు వేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇటువంటివి అన్నీ చూసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక నోడల్ అధికారి ఉంటారని, అయితే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో కమిటీ సభ్యుల సలహాల మేరకు నిర్ణయించవలసి ఉందని చెప్పారు. బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవిఎం)లో కూడా బ్రెయిలీ లిపి ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్లు అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవిధంగా చూడాలన్నారు. ఇంకా కొన్ని మొదటి అంస్తులో ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించమని చెప్పారు. జిల్లాలో అటువంటి పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చమన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలలో ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో కేటగిరీల వారీగా పూర్తి వివరాలు తయారు చేయమని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, పాఠశాలు కాని భవనాలు ఎన్ని ఉన్నాయో కూడా వివరాలు సేకరించమని చెప్పారు. పోలింగ్ బూత్ లున్న పాఠశాలలకు ఏవైనా మరమ్మతులు చేయించవలసి ఉంటే చేయించమని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.  

             రాష్ట్రంలో దివ్యాంగులు, అంధులు, మూగ,చెవిటి వారు మొత్తం 12 లక్షల మంది ఉన్నారని, 5.5 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. అయితే వీరిలో ఎంత మంది ఓటర్లుగా నమోదు అయ్యారో, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారో లెక్క తెలిస్తే వారికి కావలసిన రవాణా, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందని చెప్పారు. వీల్ చైర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయో లెక్క తేలిస్తే, ఎన్ని కొనుగోలు చేయాలో తెలుస్తుందన్నారు. ఓటర్లలో ఇటువంటివారిని ఇప్పటి వరకు 2.72 లక్షల మందిని గుర్తించామని, గుర్తింపు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. వారు లైన్ లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా లోపం ఉన్నట్లు వారంతట వారుగా నమోదు చేయించుకోవాలని, బలవంతంగా చేయకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వారి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి వారితో ఎన్నికల సమయంలో ఒక యాడ్ రూపొందించి టీవీలో ప్రచారం కల్పించుదామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డితోపాటు పలువురి క్రీడాకారులను సభ్యులు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే 18 ఏళ్లు దాటిన వారిని ఓటర్లుగా చేర్పించాలని, ఆ బాధ్యతలను కాలేజీ ప్రిన్పిపాల్స్ కు అప్పగించమని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ పరిధిని జీయోఫెన్సింగ్ ద్వారా గూగుల్ మ్యాప్ లో గుర్తించాలని చెప్పారు.  ప్రతి రెండు నెలలకొకసారి ఈ కమిటీ సమావేశమవుతుందని సిసోడియా చెప్పారు. ఇంకా ఈ కమిటీలో పంచాయతీరాజ్ తదితర మరో 5 శాఖలకు చెందిన వారిని సభ్యులుగా చేర్చనున్నట్లు ఆయన తెలిపారు.

            మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ, సాంఘీక సంక్షేమ, విద్య, రోడ్లు భవనాల శాఖల అధికారులు, విజువల్లీ ఛాలెంజడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, డెఫ్ అండ్ డమ్ ఏపీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి కమిటీలో దివ్యాంగులు, అంధులు, మూగ,చెవిటి వారు ముగ్గురూ సభ్యులుగా ఉంటే మంచిదని, ఓటు వేసే విధానం గురించి వారికి శిక్షణ ఇవ్వాలని, గత ఎమ్మెల్సీ ఎన్నికలలో అంధుల వెంట సహాయకులను అనుమతించలేదని, అందుకు తగిన అదేశాలు ఇవ్వాలని వారు  కోరారు.  దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ రాజా మాట్లాడుతూ కొన్ని వీల్ చైర్లు తమ వద్ద ఉన్నాయని, కావలసిన చైర్ల సంఖ్య చెబితే కొనుగోలు చేస్తామని చెప్పారు. సమావేశంలో విజువల్లీ ఛాలెంజడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. 

ఆడపిల్లని హైలెట్ చేసిన ‘చేనేత బతుకు’
           
  ప్రముఖ కథ, నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు సందుపట్ల భూపతి ఆడపిల్లని హైలెట్ చేస్తూ కథలు రాశారు. ఆడపిల్లలు కుటుంబానికి ఎంత అండగా ఉంటారో తెలియజెప్పారు. చేనేత దేశ వారసత్వ సంపద. భారతీయ సంస్కృతితో ముడిపడినది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఇప్పటికీ అత్యధికమంది ఆదారపడి జీవించేది చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత రంగం వడిదుడుకులు, చేనేత కార్మికుల దుస్థితితోపాటు నడుస్తున్న చరిత్రలోని అనేక సామాజిక అంశాలను స్పృశించుతూ రాసిన కథలు, వ్యాసాలు, గీతాల సంపుటే ‘చేనేత బతుకు’ పుస్తకం. ఇందులో వివిధ పత్రికలలో ప్రచురితమైన 12 కథలు, 8 వ్యాసాలు, 12 గీతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యత గల చేనేత కార్మికులు మన దేశంలో ఉన్నారు. అగ్గిపెట్టెలో పెట్టేంత సన్నటి చీరని నేయల కళాకారులు వారు. వారి బతుకుదెరువుని మెరుగుపరచడంతోపాటు ఆ కళని కాపాడుకోవలసిన అవరసరాన్ని భూపతి గుర్తు చేశారు. చేనేత రంగం, అభ్యుదయ భావాలు, ప్రేమానుబంధాలు, మానవ సంబంధాలు, హేతువాద దృక్పదం, యువతుల ధైర్యసాహసాలు, యువత చెడు వ్యసనాలు, కుల రహిత సమాజం వంటి విభిన్న అంశాలపై ఈ 12 కథలు రాశారు.
   ముఖ్యంగా ‘మగ్గం బతుకు’ అనే కథలో చేనేత కార్మికుని దుస్థితితోపాటు ఆడపిల్ల కుటుంబానికి ఎంత చేదోడువాదోడుగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ఆడపిల్ల అయితే తల్లికి, మగ పిల్లవాడైతే తండ్రికి సహాయపడతారనేది నానుడి. ఆడపిల్ల పుడితే భయపడే రోజులు పోయాయి. వారు కూడా, వారు కూడా ఏంటి కొన్ని కుటుంబాలలో మగపిల్లల కంటే ఆడపిల్లలే చదువులో ప్రతిభ చూపుతున్నారు. కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటున్నారు. ఈ కథలో మల్లేశ్వరి పాత్ర కూడా అటువంటిదే. లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అబార్షన్లు చేయించుకోవాలనేవారికి కనువిప్పు కలిగించే రీతిలో రాసిన  ఈ చిన్న కథలో జీవితంలోని అనేక అంశాలను కళ్లకు కట్టారు. మనిషి ఔన్నత్యాన్ని చాటే చెప్పారు. ఓ చేనేత కార్మికుడు ఆత్మాభిమానంతో బతికే తీరుని వివరించిన గొప్ప కథ ఇది. అలాగే ‘ఉపాధి’ కథలో కూడా ఓ ఆడపిల్ల కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడుతుందో తెలియజెప్పారు.
                 సమాజ క్షేత్రంలో మానవ సంబంధాలు రిక్తమవుతున్న వేళ ఓ రచయిత, ఓ కవి వాస్తవాలవైపు దృష్టిపెట్టి తన కలాన్ని ఎలా ఝుళిపించాలో ‘కథనం దొరికింది’ కథలో వివరించారు. సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే మోసాలను తెలియజెబుతూ ‘కనువిప్పు’, ‘ఇదోరకం విద్య’  కథల ద్వారా హెచ్చరించారు.  ఆడపిల్లలు ఝాన్సిరాణీ, రుద్రమదేవి, ఆదిశక్తిలా ఉండాలని ‘భలే అమ్మాయిలు’ కథలో సూచించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన ‘హేతువు’ కథలో భూతాలు, దెయ్యాలు లేవని, నిజమైన దెయ్యాలు భూతవైద్యులేనని, వారి మోసపూరిత కటనని కూడా వివరించారు. ‘ఆదర్శమా వర్థిల్లు’, ‘ఉపాధి’ కథలు కుల రహిత సమాజం, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తూ రాశారు. దురలవాట్లకు బానిసైతే బతుకు దుర్బరమవుతుందని ‘మారిన మనసు’ కథలో హెచ్చరించారు. ఒక రచయిత తన రచనను అచ్చు రూపంలో చూసుకోవడానికి ఎంత తపన పడతాడో ‘చిత్తగించవలెను’ కథ ద్వారా వివరించారు. మనిషి కేంద్రంగా సమాజ జీవన వాస్తవికత సంఘర్షణల నుంచి వస్తువుని స్వీకరిస్తూ రచయిత దృక్పదం నుంచి  కథ వెనుక గల లక్ష్యాన్ని స్థానీయత, నాటకీయత, క్లుప్తత, భావసరళత, శిల్పపరంగా అక్షర శరాలను సంధిస్తూ..కథను చివరికంటా చదివించే కొసమెరుపు ముగింపు రచయిత సృజించగలిగితే అలాంటి కథల్ని పాఠకలోకం తప్పక ఆస్వాదిస్తుందని యువ రచయితల భుజంతట్టి మరీ చెప్పారు.
             ఇక తన వ్యాసాలలో దేశంలో చేనేత రంగం దుస్థితి, చేనేత కార్మికుల బతుకు, ఈ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మొత్తం మీద మనిషితనాన్ని  తన రచనలలో చేనేత కార్మికుల దయనీయ స్థితితోపాటు సముద్ర తీర అందాలను కూడా వర్ణించారు. అన్నదాత రైతైతే వస్త్రదాత చేతన్న అంటూ కదలవోయి నేతన్నా, కదలిరా నేత కార్మిక వంటి గీతాలు ఇందులో ఉన్నాయి.
ఎప్పుడూ ప్రేమ గీతాలు రాసే ఆచార్య ఆత్రేయ
‘‘ గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు.... అని సందేశాత్మక లలిత గీతాలు రాసినట్లు  అభ్యుదయ కథలు, నాటికలు, గీతాలు రాసే భూపతి సన్నజాజీ పూసేవేళ ..., నీ చెదరని చిరునవ్వు..... వంటి భావ గీతాలు కూడా రాశారు. అన్నిటికంటే ముఖ్యం కేవలం రెండవ తరగతి మాత్రమే చదువుకున్న  చేనేత కార్మికుడైన భూపతి తన జీవితానుభవంతో  కులమతాలు లేని సమసమాజం కోరుకుంటూ ఇంతటి గొప్ప కథలు రాయడం విశేషం.

పుస్తకం పేరు: చేనేత బతుకు
రచయిత పేరు: సందుపట్ల భూపతి,
పుస్తకం ధర: రూ.80/- పేజీలు : 90
ప్రతులకు : ఇంటి నెంబర్ 3/03(74ఏ), గండాలయ పేట, మంగళగిరి-522503,
సెల్ నెంబర్: 9603569889
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Dec 17, 2018


ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను 
సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
                సచివాలయం, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను తాను ఆశించిన విధంగా  సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, అన్ని శాఖల సిబ్బందిని, ప్రత్యేకంగా ఆర్టీజీ సిబ్బందిని అభినందించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని ఆర్టీజీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాత్రి ఫెథాయ్ తుఫాన్ ముందు, తరువాత తీసుకున్న చర్యలను సమీక్షించారు. అత్యవసర సమయాల్లో అన్ని శాఖల్లోనూ టాప్ కేడర్ అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మంత్రులు డాక్టర్ పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్ర, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇస్రో అధికారి రాజశేఖర్, ఇతర అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తమై తుఫాన్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారని,  చురుగ్గా వ్యవహరించి క్షేత్రస్థాయిలో అందరినీ సిద్దంచేశారన్నారు. హుద్‌హుద్, తిత్లీ తుఫాను అనుభవాలతో ఫెథాయ్ తుఫాన్‌కు ముందు నుంచే అప్రమత్తం అయ్యామని చెప్పారు. తుఫానుకు ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, తరువాత రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం, పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించడం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందిలేకుండా చేయగలిగామన్నారు. ఈ తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ముందుజాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మానవ వనరులు అందుబాటులో ఉంచామని, ఇలాంటి విపత్తులకు ముందుగా సిద్ధం కావడమే ముఖ్యమని చెప్పారు. మాక్ డ్రిల్ వంటి కసరత్తులు చేయడం వల్ల ప్రజలకు భరోసా ఇచ్చినవారమైయ్యామన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వంపై వారికి నమ్మకం వస్తుందని చెప్పారు. ప్రాణనష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యుత్ సౌకర్యం ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలని  కాన్ఫరెన్స్ లో సీఎం అధికారులను ఆదేశించారు.  
 డిజాస్టర్ మేనేజ్ మెన్ట్ ఎలా చేసిందీ డాక్యుమెంటరీ చేసి ఉంచాలన్నారు.  అది రానున్న కాలంలో విపత్తులను ఎదుర్కోవడానికి  ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి విద్యుత్ స్థంభాన్ని జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఇలాంటి విపత్తుల్లో వాటి పునరుద్ధరణ సులభం అవుతుందని చెప్పారు. జరిగిన నష్టాన్ని తక్షణం అంచనా వేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ పనులు జరపాలని, ఇది మనకు ఒక రిహార్సల్స్ లాంటిదన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఈ కసరత్తు మనకు నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పారు. మాక్ డ్రిల్లింగ్ వల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా సమాయత్తమయ్యారన్నారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా లేవా అని ఫీడ్ బ్యాక్ తీసుకుంటే 95 శాతానికి పైగా ప్రజలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇలాంటి విపత్తుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని అనుకున్నామని, అలాగే చేశామని చెప్పారు. ప్రజలు చొరవ తీసుకుంటే దాని ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఇది చిన్న తుఫాను అయినప్పటికీ ఈ అనుభవాన్నిడాక్యుమెంట్ చేసి రేపటి అవసరాలకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పెనుగాలుల వేగాన్ని బట్టి జరిగే నష్టాన్ని అంచనా వేయగలగాలన్నారు. గాలి వేగం ఆధారంగా  ఎన్ని విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతాయో సరిగ్గా తెలుసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని చెప్పారు. సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకోగలిగితే విపత్తులకు ముందు మాక్ డ్రిల్ చేయడానికి వీలవుతుందని, ప్రజలు మానసికంగా సమాయత్తం అవుతారని చెప్పారు. గాలి వేగం, గాలిలో కాలుష్యం స్థాయిని అంచనా వేసే సాంకేతికతను వెంటనే అభివృద్ధి చేయండని ఆదేశించారు.  సంబంధిత అంచనా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రతిపాదనలు ఇవ్వమని అధికారులకు చెప్పారు. తుఫాన్లు, వాయుగుండం వంటివి వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎంత వర్షపాతం వుంటుందో అంచనా వేసి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని, దానివల్ల వరద నిర్వహణ సులభం అవుతుందని సీఎం చెప్పారు. మత్స్యకారులకు తిత్లీ తుఫాను సందర్భంగా ఇచ్చినట్లుగా నిత్యావసరాల ప్యాకేజ్ ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటికీ, మత్స్యకారులకు, ఇతరులకు కూడా సమానంగా ఈ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. పంట నష్టాన్ని రెండు రోజుల్లో అంచనావేసి 20వ తేదీ కల్లా పరిహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.
              వర్ష ప్రభావం ఉన్న అన్ని గ్రామాల్లో వెంటనే క్లోరినేషన్ చేయించమని ఆదేశించారు. అంటురోగాలు వ్యాపించకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈ వర్షపు నీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నారు. వాన నీరు వృధాగా సముద్రంలో కలవకుండా చెరువులకు మళ్లించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఫెథాయ్ తుఫాన్ ముందు జాగ్రత్తలు, సహాయ చర్యల్లో పాల్గొన్న 15 మంది మంత్రులను, 51 మంది ఐఎఎస్ అధికారులను, వివిధ శాఖల సిబ్బందిని ప్రభుత్వం తరపున అభినందిస్తున్నట్లు  ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పని ఎక్కువగా లేనందున అందర్నీ వెనక్కి రప్పిస్తున్నామని,  రేపటి నుంచి జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొ్ంటుందని చెప్పారు. విపత్తుల్లో ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంటోందని, ఇదే స్పూర్థి నిరంతరం కొనసాగాలన్నారు. 12వ తేదీన ఇది తుఫానుగా మారుతుందని అంచనా వేసి అప్పటి నుంచి సంసిద్ధంగా ఉన్నామని,  సమర్ధంగా, వాస్తవ సమయంలో ఎదుర్కొన్నామని తెలిపారు. ఏరోజు ఈ తుఫాన్ తీరం దాటుతుందో విశ్లేషించుకున్నట్లు తెలిపారు. తీరాన్ని తాకే సరైన సమయం, కదలికలు, ప్రదేశాల్ని సరిగ్గా అంచనా వేయగలిగినట్లు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం తుఫాన్ తుని-యానాం మధ్యలో తీరాన్ని తాకుతుందని తెలుసుకోగలిగామని, ప్రకాశం జిల్లాలో 50 మంది జాలర్లు సముద్రంలోకి వెళ్లి రాలేదని తెలిసి వెంటనే అప్రమత్తమయ్యామని చెప్పారు. వినూత్న సాంకేతిక విధానాలను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. తుఫాన్ సంసిద్ధతపై ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి దాదాపు నూరు శాతం సంతృప్తి ఫలితాలు వచ్చాయని చెప్పారు. తుఫాన్ సమాచారం అందరికీ అందిందా అని అడిగితే 99.28 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. తాగునీరు, ఆహారం సక్రమంగా అందిందా అని అడిగితే 99.36 శాతం మంది, సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై 93 శాతం మంది, వైద్య సదుపాయాల కల్పనపై 98.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వివరించారు.
                      1400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఫెథాయ్ తుఫాన్‌ను అంచనావేయగలిగామని ఆర్టీజీ సీఈవో అహ్మద్ బాబు సీఎంకు వివరించారు. దాన్ని చిన్న డిప్రెషన్‌గా ఉండగానే గుర్తించగలిగామన్నారు. యానాం నుంచి తుని లోపల ఉండగా తుఫాన్ కదలికల్ని సరిగ్గా అంచనా వేశామని చెప్పారు. 57 వేల మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనం అందించామన్నారు.  14 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా అని తెలిపారు. 300 గొర్రెలు శీతల గాలులకు చనిపోయాయని చెప్పారు. తుఫాన్ వేగం కంటే ముందుగానే అధికార యంత్రాగం కదిలి ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ అవంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మి.మి. అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.  297 టెలికామ్ టవర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
తుఫాన్ సహాయక చర్యల్లో 2 వేల మంది సిబ్బందిని భాగస్వాముల్ని చేశామని తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేకాధికారి, కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ సీఎంకు తెలిపారు. ఎక్కడా మత్స్యకారులు ఇబ్బంది పడలేదన్నారు. చేపల పడవల్ని సురక్షితంగా వెనక్కి తెప్పించామని చెప్పారు. ఈ తుఫాన్‌లో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగిందన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం దెబ్బతిని రోజుల తరబడి అంథకారంలో ఉండే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 460 డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసి ఉంచామని, తాత్కాలిక విద్యుత్ దీపాలను సిద్ధం చేశామని వివరించారు. 538 తుపాన్ సహాయక శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇస్రో అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ యానాం-కాకినాడ మద్య తీరాన్ని తాకుతుందని ముందురోజే అంచనా వేయగలిగామని చెప్పారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిశా దిశగా కదులుతున్న ఫెథాయ్ క్రమేణ బలహీన పడుతూ పయనిస్తోందని తెలిపారు. రానున్న 24 గంటల్లో విశాఖ-శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు. రేపు ఉదయానికి 60, 70 డ్రోన్లు పంపించి నష్టం వివరాలు తెలుసుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఎక్కడ అవసరమో అక్కడికే డ్రోన్లను పంపించమని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రులు పి. నారాయణ, చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. అమలాపురం ప్రాంతంలో కొబ్బరిచెట్టు విరిగిపడటంతో ఒకరికి గాయాలయ్యాయని,  వెంటనే అసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ శాఖకు ఈ తుఫాన్ పెద్ద రిలీఫ్ ఇచ్చిందని మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్  చెప్పారు. 89 సబ్ స్టేషన్లు (33 కేవి) తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతింటే, 84 సబ్ స్టేషన్లను వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. 379 విద్యుత్ స్థంభాలు దెబ్బతింటే అందులో 146 స్థంభాలను పునరుద్దరించినట్లు తెలిపారు. తుఫాన్ సహాయక శిబిరాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి ఈరోజంతా పర్యవేక్షించామని, గంటల వ్యవధిలోనే యథాతధ స్థితికి తీసుకురాగలిగామని మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. విశాఖలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ ఆచూకీ గల్లంతయ్యిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై అధికారులు నావికా సిబ్బందితో మాట్లాడినట్లు సీఎం చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారన్నారు.
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి
హైదరాబాద్ నుంచి రాజధానికి వస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించారని,  వారి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతూ ఆ ఉద్యోగుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.  రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.