Dec 26, 2018


రాయలసీమకు మహర్దశ
27న కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి  శంకుస్థాపన
v ఫలించిన సీమవాసుల చిరకాల వాంఛ
v 4 జిల్లాల్లో పారిశ్రామికీకరణ 

            పారిశ్రామిక ప్రగతితో రాయలసీమకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి నీటిబొట్టుని ఒడిసిపట్టి నీటి సంరక్షణ,  వినియోగంలో భూగర్భ జల శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉత్తమ యాజమాన్య పద్దతులు అనుసరిస్తోంది. దాంతో సాగునీటి సౌకర్యం మెరుగుపడటం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలలో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది.  మరోవైపు పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాల్లో  250కి పైగా పరిశ్రమలు నిర్మాణ పనులు, యంత్రాల బిగింపు, ట్రయిల్ ప్రొడక్షన్, ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఇంకా రెండు వందలకు పైగా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరకాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ప్రపంచంలోని 8వ అతి పెద్ద మోటార్  కంపెనీ  కియా మోటార్స్ సంస్థ  అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. మరో రెండు, మూడు నెలల్లో ఈ సంస్థ ఇక్కడ తయారుచేసే తొలి కారు రోడ్డెక్కనుంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి పరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో 6 వేల ఎకరాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద  వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా సోలార్‌ పార్కు    నెలకొల్పారు.చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. వంద కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరంలో ఇప్పటికే 22 దేశాలకు చెందిన 70 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం, జపాన్ ఇండస్ట్రియల్ కోపరేటివ్ ఏజన్సీల సహకారంతో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్(సీబీఐసీ) వల్ల సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ జోన్ లో కొత్త ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్ పరిధిలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు, అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతాలు పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైనవిగా గుర్తించారు. కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)ను కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు.
వీటన్నిటికీతోడు అనంతపురం - అమరావతి  ఎక్స్ ప్రెస్ హైవే  భూసేకరణ పనులు ముమ్మరమయ్యాయి. దేశంలోనే అత్యంత పొడవైన, మలుపులు లేని ఆరు వరుసల 393.59 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.27,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
              విభజన చట్టంలో భాగంగా కేంద్రం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసి ఉంది. ఇది సీమ ప్రజల చిరకాల వాంఛ. అయితే ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో సీమలో ఉద్యమం నడిచింది.  స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నవంబర్ లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి కర్మాగారం నిర్మించాలని తీర్మానించారు. ప్రభుత్వం దీనిని ఒక సవాలుగా తీసుకుని  వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకుందిరాయలసీమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వేస్తున్న ముందడుగుగా దీనిని భావించవచ్చు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 వేల కోట్లు కేటాయించింది.  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించాలని నిర్ణయించారు. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఈ కర్మాగారం  కోసం 3,147 ఎక‌రాల భూమిని కేటాయించారు. ఈ నెల 27న దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు.  భవిష్యత్ లో ప్రైవేటు సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ గా  ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా  ప్రభుత్వానికి ఉంది.  బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించడంతోపాటు అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని కూడా భావిస్తోంది. ఇతర పరిశ్రమల స్థాపనతోపాటు ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా పూర్తి అయితే సీమ అభివృద్ధి చెందడంతోపాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుంది.

-   శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...