Dec 31, 2018


ఓటర్ ఐడీతో మొబైల్ నెంబర్ అనుసంధానం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా

v దేశంలో ఈ విధానం ప్రారంభించిన తొలి రాష్ట్రం
v 2019 ఎన్నికల కమిషన్ క్యాలండర్ విడుదల
v కొత్త ఓటర్లకు సన్మానం
v ఓటర్లకు సౌలభ్యంగా ఏర్పాట్లు
v ఇంటి నుంచి పోలింగ్ బూత్ కు మార్గం
v అత్యాధునిక టెక్నాలజీ వినియోగం
v అత్యధిక మంది ఓటింగ్ లో పాల్గొనేలా ప్రయత్నాలు
v నామినేషన్ చివరి తేదీ వరకు ఓటర్ పేరు నమోదు
v టోల్ ఫ్రీ నెంబర్ 1950

                     సచివాలయం, డిసెంబర్ 31: ఓటర్ ఐడీ(ఎలక్టొరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్)తో ఓటర్ సెల్ నెంబర్ అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా చెప్పారు. దేశంలో ఈ విధంగా అనుసందానం చేస్తున్న మొదటి రాష్ట్రం మనదేనన్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం  కొత్తగా ఓటర్లుగా చేరిన పది మందిని సన్మానించి, వారికి టాబ్ లు అందజేశారు. 2019 ఎన్నికలకు కమిషన్ క్యాలండర్ ను సిసోడియా విడుదల చేసి కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.లక్ష్మీకాంతంకు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీ కృష్ణ, సంఘం మహిళా నాయకురాళ్లకు అందజేశారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు అందరు ఓటర్లకు సెల్ ఫోన్లు, అధిక మందికి స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ విధంగా అనుసంధానం చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ కు ఎస్ఎంఎస్ ల ద్వారా నేరుగా సమాచారం పంపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. మధ్యలో మరొకరి అవసరం ఉండదని చెప్పారు. వెబ్ సైట్ లో ఓటర్ ఐడీ, సెల్ నెంబర్ అనుసంధానం చేసే ప్రక్రియ  ఒక వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే ఓటర్ కూడా మెసేజ్ లు పంపి  తనకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ మెసేజ్ పంపిన నెంబర్ ఆధారంగా అతని పేరు, తండ్రి పేరు, ఊరు పేరు, పోలింగ్ కేంద్రం అడ్రస్, పోస్టల్ పిన్ కోడ్... వంటి విషయాలన్నీ మాకు తెలిసిపోతాయని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఓటర్ కు ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ తోపాటు ఇంటి నుంచి అక్కడకు ఏ మార్గంలో వెళ్లాలో చూపించే  మ్యాప్ కూడా పంపుతామని చెప్పారు.  రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉత్తమ పాలన కోసం ఓటు హక్కు ప్రాధాన్యతను వివిధ సమాచార మాధ్యమాల ద్వారా ఓటర్లకు తెలియజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పోలైన ఓటింగ్ శాతం బాగానే ఉంటుందని, పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉంటుందని, దానిని పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాలలో ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేసేవిధంగా వారిలో చైతన్యం కలిగిస్తామని చెప్పారు. అవకాశం ఉంటే వారు ఓటు వేసే పోలింగ్ బూత్ వద్ద ఏ సమయంలో ఎంత మంది బారులు తీరి ఉన్నారో కూడా తెలియడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా చేరడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటర్లుగా చేరే యువతీ, యువకులను, దివ్యాంగులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయిలో సన్మానిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ కొత్త ఓటర్లను సన్మానించి, ట్యాబ్ లు అందజేసినట్లు చెప్పారు. ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అందులో తమ పేరు ఉందో లేదో అందరూ చూసుకొని లేని వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే చివరి రోజు వరకు ఓటర్లుగా నమోదు చేయించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తరువాత తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950కి పోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కుకు సంబంధించి ఓటర్లను చైతన్య పరచడానికి సామాజిక మాధ్యమాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నట్లు సిసోడియా చెప్పారు. జనవరి 26న ఓటర్స్ డే సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి అధిక మందిని ఓటర్లుగా చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ కేలండర్ లో కూడా ఓటర్ కు కావలసిన సమాచారం అంతా పొందుపరిచినట్లు తెలిపారు.

అవకతవకలకు తావులేకుండా 4 ఐఏఎస్ అధికారు పర్యవేక్షణ
                      ఓటర్ల జాబితాలలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో నలుగురు  ఐఏఎస్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తుంటారని, తాను కూడా వివిధ ప్రాంతాలలో పరిశీలిస్తుంటానని సిసోడియా చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధుల జాబితా ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న బోగస్ ఓటర్ల విషయం ఒక విలేకరి ప్రస్తావించగా, అన్నిటినీ పరిశీలిస్తున్నామని, రెండుమూడు చోట్ల నమోదైన వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల వారు 58 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఒక జాబితా ఇచ్చారని తెలిపారు. వాటిలో రెండు మూడు చోట్ల నమోదైన 27 లక్షల పేర్లను తొలగించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపగా పేర్లు తప్పుగా నమోదు కావడం, భర్త పేరు బదులు భార్య పేరు, భార్య పేరు బదులు భర్త పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబర్.... ఇలా వివిధ రకాలుగా తప్పుగా నమోదైన 3 లక్షల 50 వేల పేర్లను తొలగించినట్లు తెలిపారు. అనుమానాస్సదంగా ఉన్న మరో లక్షా 30 వేల పేర్లను కూడా తొలగించినట్లు చెప్పారు. ఓటర్ల నమోదులో ఎవరికీ అనుకూలత గానీ, భయపడేదిగానీ లేదని, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తామన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని, ఎన్నికలు విజయవంతంగా జరగాలని సిసోడియా ఆకాంక్షించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...