Dec 16, 2018

ఐక్యత లోపమే బీసీలకు శాపం   
  
       రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం పైగా వెనుకబడిన తరగతుల(బీసీ) జనాభా ఉన్నప్పటికీ వారి మధ్య ఐక్యత లేమి కారణంగా పాలనలో తగిన వాటాను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా విభజన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. ఊహించని విధంగా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి శాసనసభలో  కాంగ్రెస్, కమ్మూనిస్టు పార్టీల సభ్యులు ఉన్నారు. నవ్యాంధ్రలో ఆ మూడు పార్టీలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా లేరు. దాంతో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. రాజకీయంగా ఇది చాలా దయనీయమైన స్థితి. ఈ క్రమంలో విభజన తరువాత బీసీల ఐక్యత కూడా దెబ్బతింది. నాయకత్వ లోపం  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐక్యత లేదు. రెండు, మూడు బీసీ సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరి దారి వారిదైంది. బీసీ ఉద్యమాలు బలహీనపడ్డాయి. భారత రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వల్ల కొంత మేలు జరిగింది. సంతోషం. అయితే వారికీ రాజకీయంగా, అధికార పరంగా తగిన ప్రాధాన్యతలేదు. ఈ వ్యవస్థలో చేసేదేమీలేక వారు దాంతోనే సంతృప్తి చెందుతున్నట్లుంది.  బీసీలకు మాత్రం ఏ రకమైన ప్రయోజనం చేకూరలేదు. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. చట్టపరంగా రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఉద్యోగ రిజర్వేషన్లు ఉన్నా, అనేక  సందర్భాలలో వాటిని ఆ వర్గాలకు చెందకుండా  ఎవరికి అనుకూలమైన రీతిలో వారు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవాలు వచ్చాయి. కంప్యూటర్ యుగం వచ్చింది. నాలుగవ పారిశ్రామిక విప్లవం రాబోతుంది. అనేక మంది జీవితాలలో మార్పు వచ్చింది. సామాజిక కుల చట్రంలో మార్పు రాకపోవడంతో బీసీల జీవనంలో మార్పులేదు. అన్నదాతలు రైతులు మాదిరిగా వస్త్ర దాతలుగా చేనేత కార్మికులు మిగిలారు. దేవాలయాలు, వివాహాలు, వేడుకలలో సంగీత వాయిద్యకారులు వారే. బంగారానికి రూపం ఇచ్చేది వారే. క్రాఫ్ చేసేది వారే. బట్టలు ఉతికేది వారే. కల్లు గీసేదీ వారే. చేపలు పట్టేది వారే. ప్రపంచం సాంకేతిక పరంగా అనూహ్యంగా మారిపోయింది. రాజ్యాధికారం అతి కొద్ది మంది చేతిలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామ క్రమంలో ఏ మాత్రం మారని బతులు బీసీలవి. అన్ని విధాల బీసీలు నష్టపోతున్నారు. వారి జీవితాలు ఏమీ మెరుగుపడలేదు.  ప్రశ్నించే గొంతు లేదు. ఉద్యమించడానికి నాయకత్వంలేదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజంలో ఎవరికి వారు తమ తమ కులాల పరంగా బలపడటానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  బీసీలుగా ఐక్యం కావడానికి  ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ నేపధ్యంలో కొద్దిమంది బీసీల ఐక్యవేదిక ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడంలేదు. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు సంఘాలుగా విడిపోయినవారిని ఏకం చేయడం కష్టంగా ఉంది. బీసీ వర్గాలకు చెందిన పెద్దలు, ముఖ్యంగా యువత ప్రస్తుత పరిస్థితులను, ఐక్యత లేమిని, నాయకత్వ లోపాన్ని, తమ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయంగా తగిన గుర్తింపు లేని స్థితిని గమనించారు. సగానికిపైగా జనాభా ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ వారిని వేధిస్తోంది.  బీసీ కులాల మధ్య ఐకమత్యంలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారికి స్పష్టమైంది.
          బీసీ కులాలకు చెందిన పెద్దలను, వివిధ సంఘాల నాయకులను కలపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలను అవకాశం ఉన్నమేరకు ఏకం చేసి బీసీల బలాన్ని చూపించాలన్న పట్టుదలతో వారుఉన్నారు.  ఎవరి కులాన్ని వారు బలోపేతం చేసుకుంటూనే అంతర్గతంగా బీసీ అన్న భావనను పెంపొందించాలన్నది వారి ఆలోచన.  వచ్చే ఎన్నికలలో ఎక్కడైనా సరే బీసీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ వ్యక్తి తెలిసినా తెలియకపోయినా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా తప్పనిసరిగా ఓటు వేయాలన్న నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు విస్తృత స్థాయిలో ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.  బీసీ సంఘం ఆధ్వర్యంలో  ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ విధంగా  బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసి, రాజకీయ పార్టీలపై వత్తిడి పెంచి  రాజకీయ భాగస్వామ్యం కోసం ఎక్కువ శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అధిక టిక్కెట్లు సాధించుకోవడంతోపాటు ఈ సారి బీసీలను ఎక్కువ మందిని గెలిపించి శాసనసభకు పంపాలని వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీసీ వర్గాలలోని  ఉత్సాహవంతులైన కొందరు యువకులు రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.   మేథావులు,పెద్దలు, ఉద్యోగులు వారిని ప్రోత్సహిస్తున్నారు.  ఆర్థిక స్థోమత అంతగాలేని మంచి నడవడిక గల అభ్యర్థులకు అర్ధిక సహాయం అందించి ప్రోత్సహించాలన్న ఉద్దేశం వారిలో ఉంది.  అంతే కాకుండా బీసీయేతరులపై ఇద్దరు బీసీలు పోటీ చేయకుండా చూడాలన్న ఆలోచనతో కూడా వారు ఉన్నారు. అధిక స్థానాలను గెలుచుకుంటేనే రాజకీయ అధికారం, పాలనలో తగిన భాగస్వామ్యం పొందగలమన్నది వారి  అభిప్రాయం. అయితే బీసీ కులాలను రాజకీయంగా ఏకం చేయడం అంత తేలిక కాదు. ఈ వర్గాలకు చెందిన పెద్దలు, కొంతమంది యువత ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కొంతమంది అంతకు మించిన రీతిలో వ్యవహరించి, వారిని తమకు అనుకూలంగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ఆర్థిక, అంగ బలం దాటికి వీరు తట్టుకొని నిలబడటం కష్టం. ఈ పరిస్థితులలో వివిధ బీసీ, కుల సంఘాల నేతలను కలపడానికి కొందరు పెద్దలు, యువకులు పూనుకున్నారు. బీసీ ఐక్యత కోసం ఇగోని, వారి వారి కులాలపై ఉన్న దురభిమాన్ని పక్కన పెట్టి, బేధాభిప్రాయాలను వదిలి ఐక్యవేదికగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఈ రకంగా బీసీలు బలోపేతమైతే రాజకీయ పార్టీలు కూడా ఈ సారి తమ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.   
-     శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...