Dec 18, 2018


అందరికి అందుబాటులో ఎన్నికలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా
Ø రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం
Ø దివ్యాంగులకు  ఓటు వేసే సౌకర్యం
Ø కావలసిన వీల్ చైర్లకు ఏర్పాట్లు
Ø బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్
               సచివాలయం, డిసెంబర్ 18: ఎన్నికలు అందరికి అందుబాటులో ఉండేవిధంగా, అందరూ ఓటు వేసే సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రకాష్ సిసోడియా చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం సిసోడియా అధ్యక్షతన అందరికీ అందుబాటులో ఎన్నికలపై 9 మంది సభ్యులతో కూడి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్టీరింగ్ కమిటీలను జిల్లా స్థాయిలో, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దివ్యాంగులు, అంధులు, మూగ,చెవుడు గలవారు అందరూ పోలింగ్ స్టేషన్ కు రావడానికి, ఓటు వేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇటువంటివి అన్నీ చూసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక నోడల్ అధికారి ఉంటారని, అయితే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో కమిటీ సభ్యుల సలహాల మేరకు నిర్ణయించవలసి ఉందని చెప్పారు. బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవిఎం)లో కూడా బ్రెయిలీ లిపి ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్లు అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవిధంగా చూడాలన్నారు. ఇంకా కొన్ని మొదటి అంస్తులో ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించమని చెప్పారు. జిల్లాలో అటువంటి పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చమన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలలో ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో కేటగిరీల వారీగా పూర్తి వివరాలు తయారు చేయమని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, పాఠశాలు కాని భవనాలు ఎన్ని ఉన్నాయో కూడా వివరాలు సేకరించమని చెప్పారు. పోలింగ్ బూత్ లున్న పాఠశాలలకు ఏవైనా మరమ్మతులు చేయించవలసి ఉంటే చేయించమని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.  

             రాష్ట్రంలో దివ్యాంగులు, అంధులు, మూగ,చెవిటి వారు మొత్తం 12 లక్షల మంది ఉన్నారని, 5.5 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. అయితే వీరిలో ఎంత మంది ఓటర్లుగా నమోదు అయ్యారో, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారో లెక్క తెలిస్తే వారికి కావలసిన రవాణా, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందని చెప్పారు. వీల్ చైర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయో లెక్క తేలిస్తే, ఎన్ని కొనుగోలు చేయాలో తెలుస్తుందన్నారు. ఓటర్లలో ఇటువంటివారిని ఇప్పటి వరకు 2.72 లక్షల మందిని గుర్తించామని, గుర్తింపు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. వారు లైన్ లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా లోపం ఉన్నట్లు వారంతట వారుగా నమోదు చేయించుకోవాలని, బలవంతంగా చేయకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వారి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి వారితో ఎన్నికల సమయంలో ఒక యాడ్ రూపొందించి టీవీలో ప్రచారం కల్పించుదామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డితోపాటు పలువురి క్రీడాకారులను సభ్యులు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే 18 ఏళ్లు దాటిన వారిని ఓటర్లుగా చేర్పించాలని, ఆ బాధ్యతలను కాలేజీ ప్రిన్పిపాల్స్ కు అప్పగించమని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ పరిధిని జీయోఫెన్సింగ్ ద్వారా గూగుల్ మ్యాప్ లో గుర్తించాలని చెప్పారు.  ప్రతి రెండు నెలలకొకసారి ఈ కమిటీ సమావేశమవుతుందని సిసోడియా చెప్పారు. ఇంకా ఈ కమిటీలో పంచాయతీరాజ్ తదితర మరో 5 శాఖలకు చెందిన వారిని సభ్యులుగా చేర్చనున్నట్లు ఆయన తెలిపారు.

            మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ, సాంఘీక సంక్షేమ, విద్య, రోడ్లు భవనాల శాఖల అధికారులు, విజువల్లీ ఛాలెంజడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, డెఫ్ అండ్ డమ్ ఏపీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి కమిటీలో దివ్యాంగులు, అంధులు, మూగ,చెవిటి వారు ముగ్గురూ సభ్యులుగా ఉంటే మంచిదని, ఓటు వేసే విధానం గురించి వారికి శిక్షణ ఇవ్వాలని, గత ఎమ్మెల్సీ ఎన్నికలలో అంధుల వెంట సహాయకులను అనుమతించలేదని, అందుకు తగిన అదేశాలు ఇవ్వాలని వారు  కోరారు.  దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ రాజా మాట్లాడుతూ కొన్ని వీల్ చైర్లు తమ వద్ద ఉన్నాయని, కావలసిన చైర్ల సంఖ్య చెబితే కొనుగోలు చేస్తామని చెప్పారు. సమావేశంలో విజువల్లీ ఛాలెంజడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...