Dec 27, 2018


అవసరమున్న శాఖలకు అదనపు నిధులు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశంలో 
మంత్రులు నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్ కుమార్
     వంద శాతం నిధులు ఖర్చు చేసిన కార్మిక శాఖ         
                    సచివాలయం, డిసెంబర్ 27: అవసరమున్న శాఖలకు 2018-19 ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి అదనపు నిధులు కేటాయించాలని మంత్రులు నక్కా ఆనంద బాబు, కిడారి శ్రావణ్ కుమార్ లు నిర్ణయించారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం ఈ ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నోడల్ ఏజన్సీల 22వ సమావేశం జరిగింది. నిధుల కేటాయింపు, వ్యయాలను మంత్రులు సమీక్షించారు. షెడ్యూల్ కులాల కాంపొనెన్ట్ కింద 22 శాఖలకు చెందిన 43 విభాగాలకు ఈ ఏడాది రూ.11,228.11 కోట్లను కేటాయించగా, 2018 డిసెంబర్ 25 నాటికి రూ.5,930.04 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.  బడ్జెట్ కేటాయింపులో ఇది 52.81 శాతం అని వారు పేర్కొన్నారు.  9 శాఖలు 50 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేశాయని, కార్మిక శాఖ వంద శాతం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 81 శాతం, కుటుంబ సంక్షేమశాఖ 75 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ 69 శాతం, నీటి పారుదల శాఖ 64 శాతం ఖర్చు చేశాయని వివరించారు. గిరిజన ప్రాంతాలలోని గర్బిణీలు, పిల్లలు, అంగన్ వాడీ కేంద్రాలకు రానివారి కోసం చంద్రన్న గిరి పోషణ పథకం కింద పౌష్టికాహారం ఇంటి వద్దే అందించే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 
              ఖర్చు చేయని  శాఖల నుంచి నిధులను సేకరించి, ఇతర శాఖలకు బదిలీ చేయాలని మంత్రులు  నిర్ణయించారు. పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి పారుదల శాఖలకు అదనంగా నిధులు కేటాయించాలని, సాంఘీక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాలకు 20 కంప్యూటర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ లో ఇంగ్లీష్ భాష, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు. ఎస్ సీసీ కింద అమలు చేస్తున్న పథకాలను మంచి పేరున్న సంస్థ ద్వారా సర్వే చేయించాలని మంత్రులు నిర్ణయించారు. అన్ని శాఖలు తమకు కేటాయించిన సబ్ ప్లాన్  నిధులను ఖర్చు చేయాలని మంత్రులు ఆదేశించారు. వివిధ శాఖలు ప్రతిపాదించిన కొత్త పనులకు వారు ఆమోదం తెలిపారు. కొత్త పథకాలలో భాగంగా ఏజన్సీ  ప్రాంతాలలో నివసిస్తున్న ఒక్కో గిరిజన కుటుంబానికి చలిని తట్టుకునేందుకు రెండు  రగ్గులను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాలలో నడుపుతున్న అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లల మానసికాభివృద్ధికి ఆటవస్తువులు పంపిణీ చేయాలని తీర్మానించారు. ఐటిడిఏ ముఖ్య కేంద్రాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత కావలసిన అదనపు సహాయం అందించడానికి మంత్రులు అంగీకరించారు.  ఆర్ అండ్ బీ శాఖ ద్వారా నిర్మిస్తున్న ప్రధాన రోడ్లు, నిర్వహణ, మరమ్మతుల కొరకు, ముఖ్య ప్రదేశాల సుందరీకరణ పనులు రూ.232 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలోని 13 వేలకు పైగా ఉన్న గృహ నిర్మాణ లబ్దిదారులకు 2017-18లో ఇచ్చిన విధంగానే అదనపు సహాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సహాయం రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా.  పనులు పూర్తి అయిన వాటికి బిల్లులు త్వరగా చెల్లించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.  డప్పు కళాకారులకు డప్పుతోపాటు దుస్తులు, గజ్జలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గిరిజన భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అరకు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం పెదలబూడులో ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించలాని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలోని రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.  మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశానికి తాను తొలిసారిగా హాజరయ్యానని, శాఖలో జరుగుతున్న పనులను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సిద్ధార్ధ జైన్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్ కుమార్, సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్, మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ కమిషనర్ కన్నబాబు, జీసీసీ ఎండి బాబురావు నాయుడు, డీఐజీ ఎల్.కె.వి. రంగారావు, ట్రైకార్ ఎండి రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...