Dec 27, 2018


ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశే లక్ష్యం
మంత్రి ఫరూక్
           సచివాలయం, డిసెంబర్ 27: ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశే లక్ష్యంగా తాము అహర్నిశలు శ్రమిస్తున్నట్లు  వైద్యవిద్య, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఏపీ మెడ్ టెక్ జోన్, ఆహారభద్రత, మైనార్టీ సంక్షేమం, సాధికారత  శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. శాసనసభ భవనం కమిటీ హాలులో గురువారం ఉదయం జరిగిన వైద్యాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కల్పించడానికి మీరందరు సేవాభావంతో పని చేయాలని డాక్టర్లందరినీ కోరారు. పేదలకు ఉచిత వైద్యం కల్పించాలని, జబ్బులు, ఆసుపత్రులు అంటే ప్రజలు భయపడకూడదన్నారు. వైద్యం కోసం ఎవ్వరూ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు రాకూడదన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు గత సంవత్సరం కంటే  ఈ సంవత్సరం దాదాపు రెండింతల బడ్జెట్ అంటే      రూ.8,463.51 కోట్లు కేటాయించారని తెలిపారు. ఏ తల్లి, ఏ బిడ్డ చనిపోకూడదని, మాతృ శిశు మరణాలని గణనీయంగా తగ్గిచాలని కోరారు. సీఎం కోరినట్లు 2019 మార్చి  నాటికి మాతృమరణాలను  ప్రస్తుతమున్న  67 నుంచి 50 కి తగ్గించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ క్రిందకు అన్ని రకాల కాన్పులను తీసుకువస్తున్నామని చెప్పారు.  2,3 రోజులలో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.  ఆషా వర్కర్లకు ప్రోత్సాహాలతో కలిపి నెలకు  రూ.8,600 వరకు ఇస్తున్నామని, వారితో మంచిగా పనిచేయించుకొని మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్నారు. టి.బి. పేషెంట్లకు పౌష్టికాహారం  కోసం నెలకు రూ.500 ఇస్తున్నామని తెలిపారు. పోలియోను నిర్మూలించినట్లు  టి.బి, కుష్ఠు రోగాలను కూడా అంతమొందించవలసిన అవసరం ఉందన్నారు. కాన్సర్ కి కారణం అయ్యే గుట్కాను ప్రజలు వాడరాదని, ఫుడ్ సేఫ్టీ అధికారులు  వాటి అమ్మకాలను అడ్డుకోవాలని కోరారు. కొందరు దొంగ డాక్టర్లు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని, ఇక ముందు అటువంటి ఆస్పత్రులు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.  
              వచ్చే జన్మభూమి కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రజలకు ఆరోగ్య విద్యను అందించాలన్నారు. ఊబకాయం పెరుగుతున్నందున తగు జాగ్రత్తలు వారికి వివరించాలని  కోరారు. జన్మభూమి కార్యక్రమములకు డాక్టర్లు  తప్పకుండ హాజరుకావాలని, అలాగని ఆస్పత్రులు  మూత పడకుండా పిజి స్టూడెంట్స్ ని,  ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల డాక్టర్లను వినియోగించుకొని తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.   ముఖ్యమంత్రి  బాల సురక్షా పథకం క్రింద ఇప్పటి వరకు 20.5 లక్షల మంది బాల బాలికలకు స్కానింగ్ చేసినట్లు తెలిపారు. 0-18 సంవత్సరాల  బాల బాలికలందరిని స్కానింగ్ చేసి వారికి  ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. 104, 108 సేవలను కూడా సక్రమంగా నిర్వహించి, ఫిర్యాదులు లేకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. తప్పు చేసే సర్వీస్ ప్రొవైడర్స్ పై జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి అత్యాధునిక సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న విధంగా  ఇతర రాష్ట్రంలో ఎక్కడా లేవని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది కృషి వల్ల  రాష్ట్రానికి 24 అవార్డులు లభించాయని,  ఈ అవార్డుల సాధన కోసం కృషి చేసిన  అందరికి ధన్యవాదాలు తెలిపారు.  సమావేశంలో వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్,  ఎన్టీఆర్ వైద్యసేవ, డ్రగ్ కంట్రోల్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...