Dec 14, 2018

ప్రత్యేక హోదాను వ్యతిరేకించినవారు గెలిస్తే సంబరాలా?

ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్

                 సచివాలయం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ  సంబరాలు చేస్తారా? అని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయంలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలిచినవారికి శుభాకాంక్షలు తెలియజేయడంలో తప్పులేదని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం, ఫ్లెక్సీలు కట్టి అభినందనలు తెలపడం, కేటీఆర్ తో డిన్నర్ లో పాల్గొనడం వంటి వాటిని ఆయన తప్పుపట్టారు. వారు అలా చేయడంలో అర్ధమేమిటని ఆయన అడిగారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినప్పుడు కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, సెంటిమెంట్ అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో రాజకీయాలు చేయడం, వారు గెలిస్తే ఇక్కడ పండగ చేసుకోవడం ద్వారా వారి నైజం తెలుస్తోందన్నారు. వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి కేటీఆర్ తో డిన్నర్ కు హాజరయ్యారని, మిథున్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి అభినందనలు తెలిపారన్నారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని వారికి సలహా ఇచ్చారు. బీజేపీకి బీ టీమ్, సీ టీమ్ లా వ్యవహరించేవారి చర్యలను ఎండగట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని ఎమ్మెల్సీ డొక్కా ప్రజలకు పిలుపు ఇచ్చారు.
              నాలుగున్నరేళ్లుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న బీజేపీకి శృంగభంగమైందన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. బీజేపీ పాలనలో రైతులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీలు అనేక బాధలు పడ్డారన్నారు. ఓ పక్క ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపితే, వారు ఇక్కడ ఇంటింటికి బీజేపీ అని ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఆయనకు మంచి సలహాలు ఇవ్వవలసిందిపోయి, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించడం త్పప్పన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రాల అధికారం, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ నాడు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైందని చెప్పారు. రాజ్యాంగ పరిధిలో రాష్ట్రాల అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...