Dec 17, 2018


ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను 
సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
                సచివాలయం, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను తాను ఆశించిన విధంగా  సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, అన్ని శాఖల సిబ్బందిని, ప్రత్యేకంగా ఆర్టీజీ సిబ్బందిని అభినందించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని ఆర్టీజీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాత్రి ఫెథాయ్ తుఫాన్ ముందు, తరువాత తీసుకున్న చర్యలను సమీక్షించారు. అత్యవసర సమయాల్లో అన్ని శాఖల్లోనూ టాప్ కేడర్ అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మంత్రులు డాక్టర్ పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్ర, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇస్రో అధికారి రాజశేఖర్, ఇతర అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తమై తుఫాన్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారని,  చురుగ్గా వ్యవహరించి క్షేత్రస్థాయిలో అందరినీ సిద్దంచేశారన్నారు. హుద్‌హుద్, తిత్లీ తుఫాను అనుభవాలతో ఫెథాయ్ తుఫాన్‌కు ముందు నుంచే అప్రమత్తం అయ్యామని చెప్పారు. తుఫానుకు ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, తరువాత రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం, పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించడం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందిలేకుండా చేయగలిగామన్నారు. ఈ తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ముందుజాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మానవ వనరులు అందుబాటులో ఉంచామని, ఇలాంటి విపత్తులకు ముందుగా సిద్ధం కావడమే ముఖ్యమని చెప్పారు. మాక్ డ్రిల్ వంటి కసరత్తులు చేయడం వల్ల ప్రజలకు భరోసా ఇచ్చినవారమైయ్యామన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వంపై వారికి నమ్మకం వస్తుందని చెప్పారు. ప్రాణనష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యుత్ సౌకర్యం ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలని  కాన్ఫరెన్స్ లో సీఎం అధికారులను ఆదేశించారు.  
 డిజాస్టర్ మేనేజ్ మెన్ట్ ఎలా చేసిందీ డాక్యుమెంటరీ చేసి ఉంచాలన్నారు.  అది రానున్న కాలంలో విపత్తులను ఎదుర్కోవడానికి  ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి విద్యుత్ స్థంభాన్ని జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఇలాంటి విపత్తుల్లో వాటి పునరుద్ధరణ సులభం అవుతుందని చెప్పారు. జరిగిన నష్టాన్ని తక్షణం అంచనా వేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ పనులు జరపాలని, ఇది మనకు ఒక రిహార్సల్స్ లాంటిదన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఈ కసరత్తు మనకు నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పారు. మాక్ డ్రిల్లింగ్ వల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా సమాయత్తమయ్యారన్నారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా లేవా అని ఫీడ్ బ్యాక్ తీసుకుంటే 95 శాతానికి పైగా ప్రజలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇలాంటి విపత్తుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని అనుకున్నామని, అలాగే చేశామని చెప్పారు. ప్రజలు చొరవ తీసుకుంటే దాని ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఇది చిన్న తుఫాను అయినప్పటికీ ఈ అనుభవాన్నిడాక్యుమెంట్ చేసి రేపటి అవసరాలకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పెనుగాలుల వేగాన్ని బట్టి జరిగే నష్టాన్ని అంచనా వేయగలగాలన్నారు. గాలి వేగం ఆధారంగా  ఎన్ని విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతాయో సరిగ్గా తెలుసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని చెప్పారు. సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకోగలిగితే విపత్తులకు ముందు మాక్ డ్రిల్ చేయడానికి వీలవుతుందని, ప్రజలు మానసికంగా సమాయత్తం అవుతారని చెప్పారు. గాలి వేగం, గాలిలో కాలుష్యం స్థాయిని అంచనా వేసే సాంకేతికతను వెంటనే అభివృద్ధి చేయండని ఆదేశించారు.  సంబంధిత అంచనా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రతిపాదనలు ఇవ్వమని అధికారులకు చెప్పారు. తుఫాన్లు, వాయుగుండం వంటివి వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎంత వర్షపాతం వుంటుందో అంచనా వేసి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని, దానివల్ల వరద నిర్వహణ సులభం అవుతుందని సీఎం చెప్పారు. మత్స్యకారులకు తిత్లీ తుఫాను సందర్భంగా ఇచ్చినట్లుగా నిత్యావసరాల ప్యాకేజ్ ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటికీ, మత్స్యకారులకు, ఇతరులకు కూడా సమానంగా ఈ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. పంట నష్టాన్ని రెండు రోజుల్లో అంచనావేసి 20వ తేదీ కల్లా పరిహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.
              వర్ష ప్రభావం ఉన్న అన్ని గ్రామాల్లో వెంటనే క్లోరినేషన్ చేయించమని ఆదేశించారు. అంటురోగాలు వ్యాపించకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈ వర్షపు నీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నారు. వాన నీరు వృధాగా సముద్రంలో కలవకుండా చెరువులకు మళ్లించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఫెథాయ్ తుఫాన్ ముందు జాగ్రత్తలు, సహాయ చర్యల్లో పాల్గొన్న 15 మంది మంత్రులను, 51 మంది ఐఎఎస్ అధికారులను, వివిధ శాఖల సిబ్బందిని ప్రభుత్వం తరపున అభినందిస్తున్నట్లు  ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పని ఎక్కువగా లేనందున అందర్నీ వెనక్కి రప్పిస్తున్నామని,  రేపటి నుంచి జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొ్ంటుందని చెప్పారు. విపత్తుల్లో ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంటోందని, ఇదే స్పూర్థి నిరంతరం కొనసాగాలన్నారు. 12వ తేదీన ఇది తుఫానుగా మారుతుందని అంచనా వేసి అప్పటి నుంచి సంసిద్ధంగా ఉన్నామని,  సమర్ధంగా, వాస్తవ సమయంలో ఎదుర్కొన్నామని తెలిపారు. ఏరోజు ఈ తుఫాన్ తీరం దాటుతుందో విశ్లేషించుకున్నట్లు తెలిపారు. తీరాన్ని తాకే సరైన సమయం, కదలికలు, ప్రదేశాల్ని సరిగ్గా అంచనా వేయగలిగినట్లు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం తుఫాన్ తుని-యానాం మధ్యలో తీరాన్ని తాకుతుందని తెలుసుకోగలిగామని, ప్రకాశం జిల్లాలో 50 మంది జాలర్లు సముద్రంలోకి వెళ్లి రాలేదని తెలిసి వెంటనే అప్రమత్తమయ్యామని చెప్పారు. వినూత్న సాంకేతిక విధానాలను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. తుఫాన్ సంసిద్ధతపై ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి దాదాపు నూరు శాతం సంతృప్తి ఫలితాలు వచ్చాయని చెప్పారు. తుఫాన్ సమాచారం అందరికీ అందిందా అని అడిగితే 99.28 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. తాగునీరు, ఆహారం సక్రమంగా అందిందా అని అడిగితే 99.36 శాతం మంది, సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై 93 శాతం మంది, వైద్య సదుపాయాల కల్పనపై 98.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వివరించారు.
                      1400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఫెథాయ్ తుఫాన్‌ను అంచనావేయగలిగామని ఆర్టీజీ సీఈవో అహ్మద్ బాబు సీఎంకు వివరించారు. దాన్ని చిన్న డిప్రెషన్‌గా ఉండగానే గుర్తించగలిగామన్నారు. యానాం నుంచి తుని లోపల ఉండగా తుఫాన్ కదలికల్ని సరిగ్గా అంచనా వేశామని చెప్పారు. 57 వేల మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనం అందించామన్నారు.  14 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా అని తెలిపారు. 300 గొర్రెలు శీతల గాలులకు చనిపోయాయని చెప్పారు. తుఫాన్ వేగం కంటే ముందుగానే అధికార యంత్రాగం కదిలి ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ అవంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మి.మి. అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.  297 టెలికామ్ టవర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
తుఫాన్ సహాయక చర్యల్లో 2 వేల మంది సిబ్బందిని భాగస్వాముల్ని చేశామని తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేకాధికారి, కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ సీఎంకు తెలిపారు. ఎక్కడా మత్స్యకారులు ఇబ్బంది పడలేదన్నారు. చేపల పడవల్ని సురక్షితంగా వెనక్కి తెప్పించామని చెప్పారు. ఈ తుఫాన్‌లో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగిందన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం దెబ్బతిని రోజుల తరబడి అంథకారంలో ఉండే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 460 డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసి ఉంచామని, తాత్కాలిక విద్యుత్ దీపాలను సిద్ధం చేశామని వివరించారు. 538 తుపాన్ సహాయక శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇస్రో అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ యానాం-కాకినాడ మద్య తీరాన్ని తాకుతుందని ముందురోజే అంచనా వేయగలిగామని చెప్పారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిశా దిశగా కదులుతున్న ఫెథాయ్ క్రమేణ బలహీన పడుతూ పయనిస్తోందని తెలిపారు. రానున్న 24 గంటల్లో విశాఖ-శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు. రేపు ఉదయానికి 60, 70 డ్రోన్లు పంపించి నష్టం వివరాలు తెలుసుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఎక్కడ అవసరమో అక్కడికే డ్రోన్లను పంపించమని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రులు పి. నారాయణ, చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. అమలాపురం ప్రాంతంలో కొబ్బరిచెట్టు విరిగిపడటంతో ఒకరికి గాయాలయ్యాయని,  వెంటనే అసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ శాఖకు ఈ తుఫాన్ పెద్ద రిలీఫ్ ఇచ్చిందని మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్  చెప్పారు. 89 సబ్ స్టేషన్లు (33 కేవి) తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతింటే, 84 సబ్ స్టేషన్లను వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. 379 విద్యుత్ స్థంభాలు దెబ్బతింటే అందులో 146 స్థంభాలను పునరుద్దరించినట్లు తెలిపారు. తుఫాన్ సహాయక శిబిరాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి ఈరోజంతా పర్యవేక్షించామని, గంటల వ్యవధిలోనే యథాతధ స్థితికి తీసుకురాగలిగామని మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. విశాఖలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ ఆచూకీ గల్లంతయ్యిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై అధికారులు నావికా సిబ్బందితో మాట్లాడినట్లు సీఎం చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారన్నారు.
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి
హైదరాబాద్ నుంచి రాజధానికి వస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించారని,  వారి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతూ ఆ ఉద్యోగుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.  రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...