Dec 26, 2018

ఉక్కు రాష్ట్రం కానున్న ఆంధ్రప్రదేశ్
v 27న కడప జిల్లాలో శంకుస్థాపన
v ఎం.కంబాలదిన్నెలో 3,147 ఎకరాల కేటాయింపు
v తీరం వెంట మరొకటి నెలకొల్పాలన్న ప్రతిపాదన
             

           విశాఖలో భారీ ఉక్కు కర్మాగారంతోపాటు రాష్ట్రంలో మరో రెండు ఉక్కు కర్మాగారాలు రానున్నాయి. రాయలసీమలో ఒక కర్మాగారం స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, సముద్ర తీరంలోనే మరొకటి నెలకొల్పడానికి చైనాకు చెందిన కంపెనీ ముందుకొచ్చింది. ఈ రెండిటి స్థాపన పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీరంతోపాటు తీరం వెంట భూగర్భంలో కూడా ఖనిజాలు నిల్వ ఉన్నాయి. ఈ వనరులన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే స్వర్ణాంధ్రగా మారుతుంది. గతంలో పాలకులందరూ ఒక్క హైదరాబాద్ పైనే దృష్టిపెట్టి దానిని అద్వితీయంగా అభివృద్ధి చేశారు. అపారంగా వనరులు ఉండిఅభివృద్ధికి అవకాశం ఉన్నా ఆంధ్ర ప్రాంతంపై అంతగా శ్రద్ధ చూపలేదు. ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల అభిష్టానికి పూర్తి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టడంవిడిపోయిన పరిస్థితుల నేపధ్యంలో అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి కసి పెరిగింది.  ఉన్న వనరులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అవకాశం ఉన్న మేరకు సమంగా పంపిణీ చేసిఅన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉంది.  రాష్ట్రంలోని 13 జిల్లాలలోని మారుమూల ప్రాంతాలతో సహా  ప్రాథమిక సౌకర్యాలుమౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వివక్ష చూపుతుండటంతో వాటిని కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. విభజన ఒప్పందంలో భాగంగా కేంద్రం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసి ఉంది.  ఈ విషయంలో  కేంద్రం జాప్యం చేస్తోందన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ నేపధ్యంలో  రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన సమగ్ర ఉక్కు కర్మాగార నిర్మాణం కడప జిల్లాలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ ఉక్కు కర్మాగారం నిర్మించాలని తీర్మానించారు.  రాయలసీమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వేస్తున్న ముందడుగుగా దీనిని భావించవచ్చు. ప్రభుత్వం దీనిని ఒక సవాలుగా తీసుకుని  వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 వేల కోట్లు కేటాయించింది.  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించనున్నారు. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఈ నెల 27న దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ  కోసం 3,147 ఎక‌రాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు.  భవిష్యత్ లో ప్రైవేటు సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ గా  ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా  ప్రభుత్వానికి ఉంది.  బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించడంతోపాటు అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని కూడా భావిస్తోంది.
                  ఒకవైపు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సన్నాహాలు చేస్తుంటేమరోవైపు భారీ ఉక్కు పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించేందుకు చైనాకు చెందిన ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు డిసెంబర్ 19న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఏడాదికి 7.2 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ఆసక్తి చూపుతోంది.  ఇందు కోసం సముద్ర తీరం వెంట ఏదైనా పోర్టు సమీపంలో రెండు వేల ఎకరాల భూమిని కేటాయించాలని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎంను కోరారు. చైనా-ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్‌ మెంట్ ప్రాజెక్టు కింద వారు పెట్టుబడులు పెట్టదలిచారు. ఆసియా దేశాలతో వాణిజ్యంభారత దేశంలో ఉక్కుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అత్యంత అనుకూల ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకుంది. ముడి ఇనుముబొగ్గు గనులకు సంబంధించి ఆ కంపెనీ ఆస్ట్రేలియాతో ఒప్పందం కూడా చేసుకుంది.  ఈ కంపెనీలో వివిధ దేశాల్లోని పలు సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికతో  రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు అందిస్తామనిఅన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నవరత్నాలలో ఒకటిగా ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది. దేశంలో ఇదొక్కటే సమగ్ర ఉక్కు కర్మాగారం.  కడప జిల్లాతోపాటు సముద్ర తీరానికి సమీపంలో చైనా సంస్థ మరో ఉక్కు కర్మాగారం స్థాపించితే ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా తయారవడంతోపాటు రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఇవి తోడ్పడతాయి.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...