Dec 29, 2018


ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇల్లు
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన సీఎం చంద్రబాబు
              సచివాలయం, డిసెంబర్ 29: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లి సెంటర్ సమీపంలోని ప్రజావేదిక వద్ద శనివారం ఉదయం ప్రారంభమైన 19వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. గృహనిర్మాణంపై జరిగిన సమీక్ష సందర్భంగా జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని, రెండు,మూడు ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. జన్మభూమి నాటికి ఇల్లు లేనివారి జాబితాను సిద్ధం చేయమని జిల్లా కలెక్టర్లను ఆయన దేశించారు. 2020 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు సమకూరుస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 19,57,429 ఇళ్లు మంజూరు చేయగా, 7,45,339 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 11,61,812 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా, 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. పీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు కాగా, 43,071 పూర్తి అయ్యాయని, పీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 మంజూరు కాగా, 69,963 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ కింద హుద్‌హుద్ బాధితులకు 9,170 ఇళ్లు మంజూరు చేయగా, 8,788 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. గత 3 ఏళ్లలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద మంజూరైన 6 లక్షల ఇళ్లలో ఇంకా 60 వేల ఇళ్ల పనులు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు గృహమిత్రలను నియమించుకోమని చెప్పారు.  మెప్మా, డ్వాక్రా మహిళలను గృహమిత్రలుగా ఎంపిక చేసి,  ఇంటికి ఇంత చొప్పున వారికి గౌరవ వేతనం  ఇవ్వమని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గ్రామీణ, పట్టణ శాఖల మధ్య సమన్వయం ముఖ్యమని చెప్పారు. ఆధార్ లింకేజీ ద్వారా ఇంకా ఇళ్లులేని పేదలు 10 లక్షల మందిపైగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జన్మభూమి లోపల ఎంతమందికి ఇళ్లు లేవో అంచనా వేయాలని,  వాళ్లందరికీ జన్మభూమి కాగానే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పారు. జనవరిలో మరో 4 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేయాలన్నారు. మంచిరోజు చూసి భారీఎత్తున  మళ్లీ సామూహిక గృహ ప్రవేశాలను పండుగగా జరపాలని చెప్పారు.  అవసరాన్ని బట్టి గృహ నిర్మాణాల కోసం హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తామని చెప్పారు. గృహ నిర్మాణంలో విశాఖ విధానం ఒక బెస్ట్ మోడల్ అని, అక్కడ వెయ్యి ఎకరాలు భూ సమీకరణ విధానంలో తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఒంగోలు, ఏలూరు, కడపలలో  అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలను ఏర్పాటు చేశామని,  యూడిఏ కిందకు వచ్చిన ఈ 3 పట్టణాలలో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలన్నారు.
              కలెక్టర్ల సమావేశాలు మేధోమధనానికి ఉపకరిస్తున్నాయని,  ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా వుందన్నారు. 5 ఏళ్ల కాలంలో 19 సార్లు జిల్లా కలెక్టర్ల సమావేశాలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు.  కలెక్టర్లు అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని,   ప్రభుత్వంలోని వివిధ శాఖలకు 635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవంగా పేర్కొన్నారు. నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నామని,  పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావని, ఈ అవార్డులు మన అద్భుతమైన పనితీరుకు నిదర్శనం అన్నారు. జిల్లా, గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పనకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని, నిర్ణీత లక్ష్యాలను సాధించుకోవడంలో సానుకూల, ఆశావహ దృక్పధంతో ఉండాలన్నారు.  6వ విడత జన్మభూమి –మా ఊరు కార్యక్రమం గ్రామాలు, వార్డులలో పండగ వాతావరణంలో జరపాలని చెప్పారు. గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళికలను వెల్లడించడానికి ఈ సభలను వేదికలుగా ఉపయోగించుకోవాలని చెప్పారు.  ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సభలలో అవగాహన కల్పించాలన్నారు.

               విభజన సమయంలో ఎదురైన సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయని, సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారని, అయితే మనం సిద్ధంగానే ఉన్నామని,  వచ్చే ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారన్నారు. కోర్టులు కూడా వస్తున్నాయని,  విమానయాన సర్వీసులు తగినన్ని లేవని, వాటిని వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారన్నారు. ఎయిర్‌షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతోందన్నారు. 2019లో పోలవరం కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పారు. ఉద్యానవన పంటలలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలోఉందని చెప్పారు.  ఇచ్చిన కాసిన్ని నీళ్లకే అనంతపురం ఉద్యాన రైతులు అద్భుత ఫలితాలను సాధించారన్నారు. రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే అది రానున్న రోజులలో హార్టీకల్చర్ హబ్‌గా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలకు  పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు రానున్న కాలంలో ప్రాథమిక రంగంలో ప్రధమంగా ఉంటాయని చెప్పారు. కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం కారణాలుగా ఆక్వా కల్చర్‌లో ప్రకాశం జిల్లా వెనుకబడిందన్నారు.  కేంద్రం సహకరించకున్నా మన కష్టంతో 10.52 శాతం వృద్ధి  రేటు సాధించినట్లు చెప్పారు.  రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వడం వల్లనే అనేక సమస్యల నుంచి గట్టెక్కగలిగామని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీళ్లు ఉన్నాయి, తీర ప్రాంతం ఉంది, అభివృద్ధికి వీలైన వాతావరణం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో అక్కడ అభివృద్ధి సాధ్యం కావడం లేదన్నారు. 
అవినీతిని చాలావరకు నియంత్రించామని, అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచామని చెప్పారు. సాంకేతికత, జవాబుదారి విధానాల వల్లనే అవినీతి నియంత్రణలో ఒక రోల్ మోడల్‌గా ఉండగలిగినట్లు పేర్కొన్నారు.
175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని,
బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్లు, బెస్ట్ నాలెడ్జ్ పార్టనర్లను తీసుకొచ్చి మెడ్ టెక్ పార్కును ఒక అత్యుత్తమ నమూనాగా నిలిపిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఇదేవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 200 ఎకరాలలో ఆర్ అండ్ డీ, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ తదితర సదుపాయాలతో దేశానికి ఒక నమూనాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనకు మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదని, నైపుణ్యం, తెలివితేటలు ఉన్నాయన్నారు.  మంచి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడానికి తగిన వసతులు ఉన్నాయని, హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 10 శ్వేత పత్రాలపై జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పెద్దఎత్తున చర్చ జరగాలన్నారు. పది రోజులలో గ్రామాలలో ప్రజానీకానికి అవగాహన కల్పించాలని చెప్పారు. నాలుగేళ్లుగా వరుసగా వృద్ది ఫలితాలలో అగ్రస్థానంలో ఉన్నామని,  2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వర్షాభావం వల్ల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోందన్నారు. సేవారంగంలో తక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఆదాయం వస్తుందని, అందువల్ల ఆ రంగంపై నిరంతరం దృష్టిపెడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. విశాఖ ఉత్సవ్ పెడితే అక్కడ హోటల్ గదులు దొరకడం లేదని, పర్యాటకంగా అభివృద్ధి చెందితే మనకు తిరుగులేదని,  వృద్ధిలో దూసుకుపోతామని చెప్పారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి కనిపిస్తున్నా సేవారంగంలో ఇంకా దూసుకువెళ్లవలసి అవసరం ఉందని, సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుంచే వస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి ప్రధానమైనవి మౌలిక సదుపాయాలని, అందులో ప్రజా సౌకర్యాలకు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంతో ముఖ్యమని చెప్పారు. దేశంలో పోటీ తత్వానికి గీటురాయి మౌలికవసతులన్నారు.

 ప్రజలలో అన్ని విషయాలలో 100 శాతం సంతృప్తి స్థాయి ఫలితాలు రావాలని,  సుస్థిర వృద్ధి సాధించాలని, పేదలకు ఆదాయం పెరగాలని చెప్పారు. హెల్త్  అండ్ న్యూట్రీషన్‌లో ప్రభుత్వ సేవలను మెరుగుపర్చవలసిన అవసరం ఉందన్నారు.   ప్రైవేట్ భాగస్వాములు అందించే సేవలపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. వ్యర్ధ పదార్థాల సేకరణకు అవసరమైన సంఖ్యలో వాహనాలు అందించామా లేదా అనేది కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.  తాగునీటికి టెండర్లు పిలిచారని,  రూ.15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, 3 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ సహా గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తున్నామని, చేసిన పనులను సక్రమరీతిలో ప్రజలకు తెలియజేయగలగాలని చెప్పారు. డాటెడ్ భూములు, ఎస్టేట్ భూముల సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

 పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒకటే
పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒకటే...శాఖలే వేర్వేరు. సమన్వయంతో్ అన్ని శాఖలూ ఏకోన్ముఖంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.  చిరుధాన్యాల వాడకంపై ప్రజలను చైత్యన పరాచాలని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో రాగుల వినియోగం బాగుందని, అందువల్ల  వారిని ప్రోత్సహించాలని, ఆరోగ్యం పెంచే ఆహారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.  మధుమేహం పెంచే ఆహారం ఆరోగ్యకరం కాదని, ప్రభుత్వం సరఫరా చేసే ఆహారం ప్రజల ఆరోగ్యం మరింత పెంచేదిగా ఉండాలని ఆయన అన్నారు. 17,15,571 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు,  రైతులకు రూ.2,640కోట్లు చెల్లించినట్లు తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కేవలం చర్చించి ఉపయోగం లేదు, అమలుచేసి వాస్తవరూపంలోకి తీసుకొచ్చినప్పుడే వాటికి సార్ధకత చేకూరుతుందని అన్నారు.  అర్హులు అందరికీ రేషన్ సక్రమంగా అందించాలని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించాలని సీఎం చెప్పారు.  డీలర్లకు చెల్లింపులు సక్రమంగా చేయండని, రేషన్ సరిగ్గా పంపిణీచేసేలా పర్యవేక్షించండని సీఎం ఆదేశించారు.  ఏడాదిలో ప్రతినెలా వేలిముద్ర పడనివాళ్ల జాబితా రూపొందించి, వాళ్లందరికీ డోర్ డెలివరి చేయమని ఆదేశించారు. బయో మెట్రిక్ లో లోపాలు, ఐరిస్ లో లోపాల వల్ల కార్డుదారులకు ఇబ్బందులు ఉండకూడదని, ఇలాంటివి ఏమన్నా ఉంటే నాలుగైదు శాతం కూడా ఉండవని, అటువంటి లోపాలు కూడా నివారించాలని చెప్పారు. రేషన్ డీలర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు.  వచ్చే నెలలో రేషన్ పంపిణీలో 90శాతం సంతృప్తి ప్రజల్లో రావాలన్నారు. ఈ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో స్ప్లిట్ రేషన్ కార్డులు అందించాలని ఆదేశించారు. స్ప్లిట్ కార్డులు జారీచేసే అధికారం కలెక్టర్లదేనని, అర్హులు అందరికీ అందజేయాలని చెప్పారు. ధాన్యం సేకరణ, చెల్లింపులు పారదర్శకంగా జరగాలని, అటు రైతులకు న్యాయం జరగాలని, ఇటు రైస్ మిల్లర్లు కూడా క్రమశిక్షణగా వ్యవహరించాలని, ఎంత ధాన్యం తీసుకున్నారో, అంత బియ్యం మిల్లర్లు ఇవ్వాలని, ఈ విధానం సక్రమంగా పాటించాలని సీఎం స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 21,565 దరకాస్తులు రాగా, అందులో 14,414 దరకాస్తులను ఆమోదించామని, 4,538 దరకాస్తులను తిరస్కరించామని, 12.1 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు పౌరసరఫరా శాఖ కమిషనర్  రాజశేఖర్ చెప్పారు. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీలో 95శాతం సంతృప్తి వచ్చినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర గిరిజన ఏజెన్సీలలో కిరోసిన్ లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు ప్రస్తావించారు. కిరోసిన్ లేకపోవడం వల్ల  కూరాకుల రైతులు పడే కష్టాలను, వారి చిన్న చిన్న కమతాలు, వారు మోసుకెళ్లే చిన్న పంపుసెట్లు గురించి మంత్రి రంగారావు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 25వేల లోపే ఉంటాయని, బ్లూ కిరోసిన్ లేకపోతే వైట్ కిరోసిన్ ఇవ్వాలని, దానివల్ల సబ్సిడి రూ.2 కోట్లు అయినా ఇబ్బందిలేదని సీఎం చెప్పారు.  జనవరినుంచి గుడిసెల్లో నివాసించే గిరిజనులకు ఐటిడిఏ ద్వారా  కిరోసిన్ అందించాలని ఆదేశించారు. పించన్ల కోసం కొత్తగా వచ్చిన 2.65 లక్షల దరఖాస్తులను జన్మభూమిలోపు తనిఖీ చేసి అర్హులకు మంజూరు పత్రాలు అందజేసి, ఫిబ్రవరి నుంచి పించన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  గిరిజనులకు పించన్ల వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గించామని, దీనికి సంబంధించి వచ్చిన 60 వేల దరఖాస్తులు వెంటనే పరిశీలించి, వారికి కూడా ఫిబ్రవరి నుంచి పించన్లు అందేలా చూడాలని చెప్పారు.
ప్రభుత్వ లబ్ది అర్హులకే అందాలని,  అత్యధిక కుటుంబాలకు సంక్షేమం చేరువ కావాలని, ఒకే కుటుంబంలో రెండు పించన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పేదరికం, మానసిక వైకల్యం, శారీరక వైకల్యం ప్రాతిపదికన అర్హతలను నిర్ణయించాలని చెప్పారు. స్కూల్ శానిటేషన్ లో ఇవ్వాల్సిన రూ.100కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.  మధ్యాహ్న భోజనం, డ్వాక్రా మహిళా సంఘాలకు చెల్లించాల్సిన మొత్తాలు వెంటనే ఇవ్వాలని, బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం తగదని,  ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు.  మనం చేసే కష్టం కూడా కనబడాలని, గ్రామసభల్లో మనం చేసినవి అన్నీ చెప్పాలని, ఇన్ని అవార్డులు వచ్చాయంటే మన పనితీరును అవే చెబుతాయన్నారు.  కుటుంబ స్థాయిలో ఏం చేశామో,  గ్రామ/వార్డు స్థాయిలో ఏం చేశామో ప్రతి గ్రామంలో స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ ఏడాది చంద్రన్న బీమా’ 56,783 క్లెయిమ్స్ వచ్చాయని,. 49,596 క్లెయిమ్స్ పరిష్కారం అయినట్లు, రూ.750 కోట్లు లబ్దిదారులకు అందజేసినట్లు వివరించారు. ఈ ఏడాది 3,640 కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు. ఈ నాలుగేళ్లలో 1.98 లక్షల దరఖాస్తుదారులకు రూ.2,409 కోట్ల సాధారణ బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుకకు 41,151 దరఖాస్తులు అందాయని, 39,602 పెళ్లిళ్లు జరిగాయని,  33,528 మందికి 100 శాతం, 2,315మందికి 20 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు.  ముఖ్యమంత్రి యువనేస్తం కింద డిసెంబర్ నెలలో 3,31,723 మందికి రూ.80.77 కోట్లు పెన్షన్ రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు అర్హులు 4 లక్షలకు చేరుకుంటారని అంచనాగా సీఎం చెప్పారు. యువత నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం తరఫున అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  ఇంజనీరింగ్ పట్టభద్రులలో మన రాష్ట్రమే ముందుందని, నైపుణ్యాభివృద్ధిలో ముందున్నామని, ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనిపై మరింత దృష్టిపెట్టి దేశంలో మన రాష్ట్రమే ముందుండేలా శ్రద్ధపెట్టాలన్నారు.  యువతను ప్రోత్సహించడంలో అధికార యంత్రాంగం మరింత శ్రద్ద చూపాలన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమలు, సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  పెథాయ్ తుపాను కారణంగా 7, 8 రోజులు  వేటకు వెళ్లని గుంటూరు, విజయనగరం జిల్లాలలోని  మత్స్యకారులకు కూడా  ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లు కోరగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...