Dec 21, 2018


జల రవాణాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి
          
ఆంధ్రప్రదేశ్ లో జలరవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను వినియోగించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టిపెట్టాయి. రోడ్డు రవాణాలో పెరుగుతున్న వత్తిడిని దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం జలరవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. రోడ్డు రవాణాలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ని తగ్గించడానికి జలరవాణాపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్రంలో అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేస్తే, అది జల రవాణాకు ఉపయోగపడుతుంది. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలు, నదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు.  ఇందులో భాగంగా కృష్ణా,  గోదావరి నదుల మధ్య భూ సేకరణకు సంబంధించి  సర్వే కూడా పూర్తి చేశారు.   ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అంతర్గత జల మార్గం కోసం భూమిని గుర్తించారు. ఆ భూమిని సేకరించే పనిలో అధికారగణం ఉంది.   ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు. నిడదవోలు–ఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ  చేపట్టారు.  ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దేశాలలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్ వేస్ ట్రాఫిక్, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ విస్తరణ క్రమబద్దీకరణలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని 2017 నవంబర్ లో నియమించింది.  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జెసి శర్మ, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె.దుర్గా ప్రసాద్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వైఎస్.సుధాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జలరవాణా రంగం అంటే జల మార్గంలో ప్రయాణం, సరుకుల రవాణా, పర్యాటకం, వాటర్ స్సోర్ట్స్ సమ్మిళితమై ఉంటాయి.  ఈ రంగం అభివృద్ధి, విస్తరణకు, పర్యవేక్షణ, నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది.  ముఖ్యంగా బోటు ఆపరేషన్స్  (నిర్వహణ)  రెగ్యులేషన్, మానిటరింగ్, ప్రయాణీకుల భద్రత, బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, రెగ్యులేటరీ క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జలరవాణాకు సంబంధించి అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఒక వేదిక రూపొందించింది. ముఖ్యంగా జలరవాణా నిర్వహణ, నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి ఈ కమిటీ విజయవాడ,  ధవళేశ్వరంలలో పర్యటించింది. ఇందుకు సంబంధించి రేవుల శాఖ, జలవనరుల శాఖ, పర్యాటక శాఖ, ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు, వివిధ వర్గాలవారితో పలు సమావేశాలను నిర్వహించింది. అంతేగాక బోటు యజమానుల సంఘం ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశమైంది.   రాజమండ్రిలోని పుష్కర ఘాట్, ఇతర ఘాట్లను, విజయవాడలోని పున్నమి ఘాట్, పవిత్ర సంఘమం ఘాట్ ను, పులిచింతల, ముక్త్యాల, జగ్గయ్యపేటలలో జరుగుతున్న పనులను, పర్యాటక బోట్లు, వెస్సల్స్ ను పరిశీలించింది. అంతే కాకుండా పవిత్ర సంఘమం, పోలవరంలలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాలను  కూడా ఈ కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ కేరళ రాష్ట్రంలో కూడా పర్యటించి అక్కడ సంబంధింత శాఖల అధికారులతో సమావేశమై, అక్కడ చట్టాలను, అనుసరించే పద్దతులను, ఇతర పరిస్థితులను  అధ్యయనం చేసింది. దాంతోపాటు  ఢిల్లీలోని ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్లు, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ సభ్యులుతో సమావేశమై ఇన్ లాండ్ వాటర్ వేస్ రవాణాకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. ఈ కమిటీ ఈ ఏడాది మార్చిలో బోటు ప్రమాదాలపై మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.  వివిధ అంశాలను పరిశీలించిన అనంతరం కమిటీ తుది నివేదికను సెప్టెంబర్ లో  సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా  రాష్ట్రంలో జల రవాణాను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. జల మార్గం అభివృద్ధి చెందితే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.  రోడ్లపై ట్రాఫిక్ తగ్గడంతో వాతావరణ కాలుష్య, వాయు కాలుష్య తగ్గిపోతుంది.  సరుకుల రవాణా వ్యయం కూడా తగ్గుతుంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914




No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...