Dec 6, 2018


 కియాతో ఒప్పందం
కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
§  ఏపీ, కియా మధ్య అవగాహన ఒప్పందం
§  రవాణా వ్యవస్థలో నూతన మార్పునకు శ్రీకారం
                 సచివాలయం, డిసెంబర్ 6: కియా మోటార్స్ సంస్థతో ఒప్పందం కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలోని 1వ బ్లాక్ బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన గురువారం ఉదయం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కియా మోటార్స్ సంస్థకి మధ్య ‘భవిష్యత్ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగస్వామ్యం’పై అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కారులో తొలిసారి ప్రయాణించానని, స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. కారు లోపల ఉంటే ఏసీ గదిలో ఉన్నట్లుందన్నారు. ఈ ఒప్పందంతో ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.  ప్రపంచంలోని 8వ అతి పెద్ద మోటార్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.  ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థలను పరిశీలించి ఏపీలో పూర్తి పర్యావరణ హితమైన వాహన వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు దోహదపడాలని కియా మోటార్స్‌ సంస్థను సీఎం కోరారు. కియా అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం  పూర్తిగా మారిపోయిందన్నారు. కియా తొలి కారు జనవరిలోగానీ, ఫిబ్రవరిలో గానీ బయటకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో మొదటి కారు బయటకు రావడం ఓ రికార్డుగా పేర్కొన్నారు.   ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, మిగిలిన  10 శాతం ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్ కార్లు దోహదపడతాయన్నారు. పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థను అందించడంలో సహకరించాలని కియాను సీం కోరారు.  ఏపీని సంతోషదాయక రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు కియా మనకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు. ఏపీకి కియా బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. రానున్న తరం అవసరాలకు ఉపయుక్తమయ్యే ప్రజారవాణా వ్యవస్థను తీసుకురావడంలో పరిశోధనలు, అధ్యయనంలో సహకరించేందుకు కన్సల్టెంటుగా ఉండాలని ఆ సంస్థకు సూచన చేశారు.
త్వరలో రాష్ట్రానికి 7,300 మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయని, వాటిని వ్యర్ధ సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 5 నగరాలలో వంద విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు చెప్పారు.  400 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ సైకిళ్లు, మూడు చక్రాల వాహనాలు వినియోగంలోకి వస్తాయన్నారు. తక్కువ ఖర్చుతో వీటిని నడవపవచ్చని చెప్పారు. 50 శాతం గ్రీనరీ, ప్రకృతి వ్యవసాయం వంటి వాటి ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. అమరావతిలో సీఆర్డీఏ వీటన్నిటినీ అమలు చేస్తుందని చెప్పారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ప్రముఖ ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని చెప్పారు. రానున్నకాలంలో సౌర వ్యవస్థతో పనిచేయబోతున్నామని, భవిష్యత్ లో సౌర విద్యుత్ యూనిట్‌ రూపాయిన్నరకే లభ్యం కావచ్చు, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాతావరణాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 180 దేశాలకు విస్తరించి 33 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కియా మోటార్స్ ఇక్కడ నెలకొల్పిన యూనిట్ అత్యుత్తమంగా రూపొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంద శాతం నైపుణ్యత కలిగిన, నైపుణ్యత లేని కార్మికులు లభిస్తారని చెప్పారు. సులభతర వ్యాపారం, ఉద్యోగితకు అర్హత ఉన్న వారి విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పాలసీని, 2018 ఎలక్రిట్ మొబిలిటీ పాలసీని  కూడా రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 14 ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణ హితమైన ఆధునిక రవాణా వ్యవస్థను రూపొందిస్తామని సీఎం చెప్పారు.

                అంతకు ముందు కియా మోటార్స్ ఎండీ కూక్యూ షిమ్ మాట్లాడుతూ అనంతపురంలోని తమ ప్లాంట్ నుంచి మొదటి మోడల్ కారు 2019లో బయటకు వస్తుందని చెప్పారు. తమ సంస్థ 15వ ఉత్పత్తి కేంద్రం అనంతపురంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా 3 లక్షల కార్లు తయారవుతాయని, ప్లాంట్ నిర్మాణానికి 1.1  బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడిపెడుతున్నట్లు వివరించారు.  తమ సంస్థ పది వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్ పై దృష్టి పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, అటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నూతన టెక్నాలజీ కియాలో ఒక భాగంగా ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంతో భారత వినియోగదారుల జీవన విధానంలో మార్పు వస్తుందని షిమ్ అన్నారు. షిమ్ తెలుగులో నమస్కారంతో తన ప్రసంగం మొదలుపెట్టి ధన్యవాదాలుతో ముగించారు. సమావేశం ప్రారంభంలో కియా మోటార్స్ ప్రతినిధి వివేక్ గోస్వామి తమ సంస్థ తయారు చేసే విద్యుత్ కార్ల విశిష్టతలను వివరించారు.
         అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ రెడ్డి  సమక్షంలో రాబోయే తరం పర్యావరణ రవాణా ఒప్పంద పత్రాలపై ఏపీఐఐసీ ఎండి అహ్మద్ బాబు,  కియా మోటార్స్‌ ఎండి కూక్యూ షిమ్ సంతకాలు చేసి, పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కియా మోటార్స్ రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చడం చేస్తుంది. ఈ సందర్భంగా కియా మోటార్స్ సంస్థ అత్యంత ఆధునికమైన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లు మూడింటిని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు ప్రకటించింది. కారు తాళం చేయిని కూక్యూ షీమ్ సీఎం చంద్రబాబుకు అందజేశారు.
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
             అంతకు ముందు సచివాలయం మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన  విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ని, కార్లను జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సంస్థ ఎండి విద్యుత్ కార్లకు సంబంధించిన పూర్తి సమాచారం సీఎంకు వివరించారు. సీఎం కారుకు విద్యుత్ చార్జింగ్ కూడా పెట్టారు. ఆ తరువాత విద్యుత్ కారులో సీఎం సచివాలయంలోని 1వ బ్లాక్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కారుకు ఉన్న ఫీచర్స్ అన్ని అడగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఎనర్జీ, మౌలికసదుపాయలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకుపల్లి,  ఎంపీ కొనకళ్ల నారాయణ,  ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ లక్ష్యాలు సాధించండి
వివిధ శాఖల అధికారులకు మంత్రి యనమల ఆదేశాలు
                  
  సచివాలయం, డిసెంబర్ 5: ఆదాయంలో లక్ష్యాలు సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించమని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో  బుధవారం ఉదయం జరిగిన వివిధ శాఖాధిపతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగదారులకు సౌకర్యంగా ఉండేవిధంగా   చలానాల ద్వారా చెల్లింపు నిబంధనలు సులభతరం చేయాలని మంత్రి ఆదేశిచారు.  రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్, అటవీ శాఖల ఆదాయ వృద్ధి రేటు పెరుగుదలను  సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు, రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్ శాఖల ఆదాయం ఆశాజనకంగా ఉండగా, మైనింగ్, అటవీ శాఖల ఆదాయం వృద్ధి రేటు తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. జీఎస్టీ, మైనింగ్ రాయల్టీ, వనరుల లభ్యత, కోర్టు కేసులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయల్టీ, పన్నులు,  సీఎఫ్ఎంఎస్, ఎర్రచందనం, సామాజిక వనాలు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో  రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమారు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఎక్సైజ్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ నరసింహ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే బడ్జెట్ లో 7 అంశాలకు ప్రాధాన్యత
2019-20 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి యనమల సమావేశం

v పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక అసమానతల తొలగింపు, రైతుల
v సంక్షేమం, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యున్నతి
v సామాన్యులపై భారం పడకుండా ఆదాయం పెంపు యోచన
v నగదు నిర్వహణలో నూతన పద్దతుల ద్వారా రూ.వందల కోట్లు ఆదా

               సచివాలయం, డిసెంబర్ 5: వచ్చే ఏడాది బడ్జెట్ లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం 2019-20 బడ్జెట్ రూపకల్పనపై జరిగిన సమావేశంలో మంత్రి కొన్ని అంశాలను నిర్ధేశించారు. బడ్జెట్ తయారీకి సంబంధించి, ప్రాధాన్యతా రంగాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక అసమానతల తొలగింపు, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యున్నతిని దృష్టిలోపెట్టుకుని బడ్జెట్ రూపొందించాలని మంత్రి చెప్పారు. సామాన్యులపై భారం పడకుండా ఆదాయ మార్గాల పెంచేయోచన చేయాలన్నారు. పూర్తి బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆదాయ వ్యయాలను సమీక్షించారు. టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ, నగదు నిర్వహణ, నగదు సర్దుబాట్లు, వడ్డీ చెల్లింపులు, పెట్టుబడి నిల్వలు, ఇరిగేషన్ బకాయిలు, వివిధ నియోజకవర్గాల్లో పరిపాలనా అనుమతులు, ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల, సీఎఫ్ఎంఎస్ తదితర అంశాలను చర్చించారు. నగదు నిర్వహణలో
కొత్త పద్దతులు, సమర్థ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వందల కోట్లు ఆదా చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కార్యదర్శి పియూష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Dec 4, 2018


ఎస్సీ,ఎస్టీల కోసం దేశంలో ఎక్కడాలేనన్ని పథకాలు
మంత్రి నక్కా ఆనందబాబు
              సచివాలయం, డిసెంబర్ 4: ఎస్సీ,ఎస్టీల కోసం దేశంలో ఎక్కడాలేనన్ని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు  సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన ఎస్సీ, ఎస్టీల పథకాల వివరాలు  వెళ్లడించారు. దళితులను, గిరిజనులను పైకి తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పేర్కొన్నారు. 2014 నుంచి జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద రూ.29,025.85 కోట్లు కేటాయించి, రూ.26,922.92(92.75శాతం) కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కింద రూ.11,228.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.   ప్రతి నెల నోడల్ ఏజన్సీలను సమావేశపరచి, సమీక్ష చేసి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్ఞాన భూమి పోర్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రతినెలా స్కాలర్ షిప్స్ అందే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లలో 14,34,723 మంది మెట్రిక్ అనంతర విద్యార్థులకు రూ.2,447.85 కోట్లు ఉపకారవేతనాల రూపంలో అందజేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.47 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.761.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మెట్రిక్ పూర్వ ఉపకారవేతనాల కింద 1,08,072 మంది 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.79.63 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ ఏడాది లక్షా 14 వేల మంది కోసం 21.68 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 9, 10 తరగతికి చెందిన 3,54,690 మంది విద్యార్థులకు రూ.99.37 కోట్లు అందజేసినట్లు చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద 4 ఏళ్లలో రూ.126.31 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది బడ్జెట్ లో రూ.42.57 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మెట్రిక్ పూర్వ వసతి గృహాలలోని విద్యార్థులు గత సంవత్సరం పదవ తరగతిలో 90.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. లక్షా 5వేల మందికి 4 ఏళ్లలో రూ.1225.92 కోట్లు ఖర్చు చేసినట్లు, ఈ ఏడాది రూ.437.83 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి, నైపుణ్యాభివృద్ధి వంటి పథకాల కింద కూడా భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకం కింద గతంలో ఇచ్చే రూ.10 లక్షలను రూ.15 లక్షలకు పెంచినట్లు చెప్పారు.
           ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించామని, ఇప్పటి వరకు 11,752 ఎస్సీ కులాల జంటలకు రూ.80 కోట్లు అందజేసినట్లు చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనానికి ఎగ్జిక్యూటివ్ ఏజన్సీగా ఉన్న ఏపీఐఐసీకి 20 ఎకరాల భూమిని కేటాయించి, రూ.97.69 కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు. చర్మకారులకు పింఛన్, పనిముట్లు, పెట్టుబడి నిధి, డప్పు కళాకారులకు పింఛన్ వంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 188 గురుకుల విద్యాలయాల్లో 1,07,000 విద్యార్థులు చదువుతున్నారని, గత సంవత్సరం ఈ విద్యాలయాల్లో చదివిన 232 మంది నీట్ లో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 45 మంది విద్యార్థులు నేపాల్, చైనా, జపాన్, అమెరికా, దుబాయ్ దేశాలను సందర్శిచారన్నారు. అక్కడ పని చేసే కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల జీతాలు పెంచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార సంస్థ ద్వారా వివిధ ఆర్థిక పథకాలను అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,07,257 మంది లబ్దిదారులకు రూ.2124.30 కోట్ల వ్యయం, రూ.1162.54 కోట్ల సబ్సిడీతో స్వయం ఉపాధి, పశుసంవర్థక, భూమి ఆధారిత, భూమి కొనుగోలు వంటి  పథకాలను అమలు చేశారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా షెడ్యూల్ కులాల కార్పోరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్ డీసీ, ఎన్ఎస్ కెఎఫ్ డీసీ పథకాల ద్వారా 485 ఇన్నొవా కార్లు, 294 రవాణా వాహనాలు, 200 ట్రాక్టర్లు, 660 డ్రెయిన్ క్లీన్ మిషన్లు, 350 పాసెంజర్ పవర్ ఆటోలు పంపిణీ చేసినట్లు వివరించారు. విశాఖ, ఏలూరు, తిరుపతి, అనంతపురంలలో రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

గిరిజన సంక్షేమ శాఖ పథకాలు
                గిరిజన సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి ఆనందబాబు చెప్పారు. షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక కింద 4 ఏళ్లలో రూ.10,033.44 కోట్లు కేటాయించగా, రూ.8,949.54 కోట్లు(89.20 శాతం) ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కింద రూ.4,176.61 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వీరికి ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి, భూమి కొనుగోలు, చిన్ననీటి పారుదల, నైపుణ్యాభివృద్ధి, ఎన్ఎస్ టీఎఫ్ డీసీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించినట్లు చెప్పారు.
నాలుగేళ్లలో 2,41,345 మంది మెట్రిక్ అనంతర విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో రూ.364.01 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రూ.112.27 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 4 ఏళ్లలో 5 నుంచి 8వ తరగతి చదివే 18,397 మంది విద్యార్థులకు రూ.2.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.1.91 కోట్లు కేటాయించారు. 4 ఏళ్లలో 9,10 తరగతి విద్యార్థులు 1,01,051కి రూ.42.32 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.34.86 కోట్లు కేటాయించారని చెప్పారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఎంపికైన అభ్యర్థికి 9 నెలల పాటు రూ.10,000 చొప్పున స్టైఫండ్, మరో రూ.2వేలు ఏక మొత్తం గ్రాంట్ గా ఇస్తున్నట్లు తెలిపారు. వీరికి కూడా అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యా నిధి, ఉచిత విద్యుత్(జగ్జీవన్ జ్యోతి పథకం), చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వారి కోసం రాష్ట్రంలో ప్రీ-మెట్రిక్ హాస్టళ్లు 405 నిర్వహిస్తున్నారని, వాటిని దశల వారీగా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నామని, ఇప్పటి వరకు 179 మార్చినట్లు వివరించారు. గత సంవత్సరం ఈ హాస్టళ్లలో చదివే పదవ తరగతి విద్యార్థులు 91.38 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. ఇంటర్ నుంచి పీహెచ్ డీ వరకు చదువుకునే విద్యార్థినీ విద్యార్థుల కోసం 158 వసతి గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 55,575 మంది విద్యార్థులతో 184 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు ఇంటి నిర్మాణం కింద ఈ ఏడాది అదనంగా రూ.383.85 కోట్లు అందజేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవే కాకుండా పైప్ లైన్, పోషకవిలువలు పెంపొందించే పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేదరికంపై గెలుపు పథకంలో భాగంగా ఈ ఏడాది16,232 మందికి లబ్ది చేకూర్చేవిధంగా రూ.139.48 కోట్లు కేటాయించారని మంత్రి ఆనందబాబు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, డైరెక్టర్ రామారావు,  ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ స్మృతివనంపై వారం వారం సమీక్ష
మంత్రి నక్కా ఆనంద బాబు
               సచివాలయం, డిసెంబర్ 4: రాజధాని అమరావతిలో నిర్మించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులను ఇకనుంచి వారం వారం సమీక్షిస్తానని సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ స్మృతి వనం పనులను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. స్మృతి వనం వద్ద గ్రౌండ్ లెవెల్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు మంత్రికి చెప్పారు. ఒక పక్క అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, 20 అడుగుల పెడస్ట్రల్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.  విగ్రహం చుట్టూ తిరగడానికి అనుకూలంగా కొంత ఖాళీ ప్రదేశం ఉంటుందని, విగ్రహం క్రింద లైబ్రరీ వస్తుందని, అలాగే 3500 సీటింగ్ సామర్ధ్యం గల ఓ కన్వెన్షన్ హాలు నిర్మిస్తామని తెలిపారు. విగ్రహంలోని అన్ని భాగాలు తల, పుస్తకం, వేళ్లు, కాళ్లు వంటి వాటి కొలతలను అధికారులు మంత్రికి వివరించారు. 5 అడుగుల నమూనా విగ్రహం  ఈ నెల 10న వస్తుందని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న విగ్రహం తరహాలో దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్మృతి వనం నమూనాలను, అక్కడ జరుగుతున్న పనులను,  వివిధ కోణాలలో అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని చూపించారు. అలాగే చైనాలో బుద్ధ విగ్రహం, ముంబైలో శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను, న్యూయార్క్ లోని లిబర్టీ విగ్రహాన్ని చూపించారు.  చైనా నుంచి తెప్పిస్తే లోహ విగ్రహం విడిభాగాలు మాత్రమే పంపుతారని, రాష్ట్రంలో తయారు చేస్తే మొత్తం ఒక్కటిగా తయారు చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో కూడా ముగ్గురు శిల్పులు ఉన్నట్లు తెలిపారు.  నమూనా విగ్రహాన్ని మాథూరామ్ అర్ట్ సెంటర్ వారు తయారు చేసినట్లు చెప్పారు.
              ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ విగ్రహం తయారీ, వినియోగించే లోహం, ముఖ కవళికల వంటి విషయాలలో జాగ్రత్త వహించాలని చెప్పారు. విగ్రహం తయారీకి సంబంధించి రాష్ట్రంలోని శిల్పులను సంప్రదించమని ఆదేశించారు. విగ్రహం దీర్ఘకాలం మన్నికగా ఉండేవిధంగా రూపొందించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విగ్రహం రూపకల్పన, హావభావాల విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్మృతి వనం పనులలో వేగం పెంచమని చెప్పారు. విగ్రహం తయారీ సంస్థలు, విగ్రహం ఏర్పాటు చేసిన తరువాత దాని శుభ్రత, నమూనా విగ్రహం మొదలైన అంశాలను చర్చించారు. సమావేశంలో సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, డైరెక్టర్ ఎం.రామారావు, ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ జీఎస్ ఆర్ కెఆర్ విజయ్ కుమార్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.

Dec 2, 2018


  ఆత్మాభిమానం గల ఓ చేనేత కార్మికుడు-
కుటుంబానికి చేదోడుగా నిలిచే కూతుళ్లు
             సందుపట్ల భూపతి ‘చేనేత బతుకు’ సమీక్ష
      
ఆత్మాభిమానం గల చేనేత కార్మికునితోపాటు కుటుంబాలకు చేదోడుగా నిలిచే కూతుళ్లను హైలెట్ చేస్తూ  కథ, నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు, చేనేత సందుపట్ల భూపతి కథలు రాశారు. చేనేత మన దేశ వారసత్వ సంపద. భారతీయ సంస్కృతితో ముడిపడినది చేనేత. స్వాతంత్ర్యోద్యమంలో కూడా చేనేత కీలక భూమిక పోషించింది. దేశంలో వ్యవసాయం తరువాత ఇప్పటికీ అత్యధికమంది ఆదారపడి జీవించేది చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత రంగం వడిదుడుకులు, చేనేత కార్మికుల దుస్థితితోపాటు నడుస్తున్న చరిత్రలోని అనేక సామాజిక అంశాలను స్పృశించుతూ భూపతి రాసిన కథలు, వ్యాసాలు, గీతాల సంపుటే ‘చేనేత బతుకు’ పుస్తకం. ఇందులో వివిధ పత్రికలలో ప్రచురితమైన 12 కథలు, 8 వ్యాసాలు, 12 గీతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యత గల చేనేత కార్మికులు మన దేశంలో ఉన్నారు. అగ్గిపెట్టెలో పెట్టేంత సన్నటి చీరని నేయల కళాకారులు వారు. వారి బతుకుదెరువుని మెరుగుపరచడంతోపాటు ఆ కళని కాపాడుకోవలసిన అవరసరాన్ని భూపతి గుర్తు చేశారు. చేనేత రంగం, అభ్యుదయ భావాలు, ప్రేమానుబంధాలు, మానవ సంబంధాలు, హేతువాద దృక్పదం, యువతుల ధైర్యసాహసాలు, యువత చెడు వ్యసనాలు, కుల రహిత సమాజం వంటి విభిన్న అంశాలపై ఈ  కథలు రాశారు.
   ముఖ్యంగా ‘మగ్గం బతుకు’ అనే కథలో చేనేత కార్మికుని దుస్థితితోపాటు ఆడపిల్ల కుటుంబానికి ఎంత సాయంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ఆడపిల్ల అయితే తల్లికి, మగ పిల్లవాడైతే తండ్రికి సహాయపడతారనేది నానుడి. ఆడపిల్ల పుడితే భయపడే రోజులు పోయాయి. వారు కూడా, వారు కూడా ఏంటి కొన్ని కుటుంబాలలో మగపిల్లల కంటే ఆడపిల్లలే చదువులో ప్రతిభ చూపుతున్నారు. కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటున్నారు. ఈ కథలో మల్లేశ్వరి పాత్ర కూడా అటువంటిదే. లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అబార్షన్లు చేయించుకోవాలనేవారికి కనువిప్పు కలిగించే రీతిలో రాసిన  ఈ చిన్న కథలో జీవితంలోని అనేక అంశాలను కళ్లకు కట్టారు. మనిషి ఔన్నత్యాన్ని చాటే చెప్పారు. ఓ చేనేత కార్మికుడు ఆత్మాభిమానంతో బతికే తీరుని వివరించిన గొప్ప కథ ఇది. అలాగే ‘ఉపాధి’ కథలో కూడా ఓ ఆడపిల్ల కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడుతుందో తెలియజెప్పారు.  సమాజ క్షేత్రంలో మానవ సంబంధాలు రిక్తమవుతున్న వేళ ఓ రచయిత, ఓ కవి వాస్తవాలవైపు దృష్టిపెట్టి తన కలాన్ని ఎలా ఝుళిపించాలో ‘కథనం దొరికింది’ కథలో వివరించారు. సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే మోసాలను తెలియజెబుతూ ‘కనువిప్పు’, ‘ఇదోరకం విద్య’  కథల ద్వారా హెచ్చరించారు.  ఆడపిల్లలు ఝాన్సిరాణీ, రుద్రమదేవి, ఆదిశక్తిలా ఉండాలని ‘భలే అమ్మాయిలు’ కథలో సూచించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన ‘హేతువు’ కథలో భూతాలు, దెయ్యాలు లేవని, నిజమైన దెయ్యాలు భూతవైద్యులేనని, వారి మోసపూరిత కటనని కూడా వివరించారు. ‘ఆదర్శమా వర్థిల్లు’, ‘ఉపాధి’ కథలు కుల రహిత సమాజం, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తూ రాశారు. దురలవాట్లకు బానిసైతే బతుకు దుర్బరమవుతుందని ‘మారిన మనసు’ కథలో హెచ్చరించారు. ఒక రచయిత తన రచనను అచ్చు రూపంలో చూసుకోవడానికి ఎంత తపన పడతాడో ‘చిత్తగించవలెను’ కథ ద్వారా వివరించారు. మనిషి కేంద్రంగా సమాజ జీవన వాస్తవికత సంఘర్షణల నుంచి వస్తువుని స్వీకరిస్తూ రచయిత దృక్పదం నుంచి  కథ వెనుక గల లక్ష్యాన్ని స్థానీయత, నాటకీయత, క్లుప్తత, భావసరళత, శిల్పపరంగా అక్షర శరాలను సంధిస్తూ..కథను చివరికంటా చదివించే కొసమెరుపు ముగింపు రచయిత సృజించగలిగితే అలాంటి కథల్ని పాఠకలోకం తప్పక ఆస్వాదిస్తుందని యువ రచయితల భుజంతట్టి మరీ చెప్పారు.
             ఇక తన వ్యాసాలలో దేశంలో చేనేత రంగం దుస్థితి, చేనేత కార్మికుల బతుకు, ఈ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మొత్తం మీద మనిషితనాన్ని  తన రచనలలో చేనేత కార్మికుల దయనీయ స్థితితోపాటు సముద్ర తీర సోయగాలను కూడా వర్ణించారు. అన్నదాత రైతైతే వస్త్రదాత నేతన్న అంటూ కదలవోయి నేతన్నా, కదలిరా నేత కార్మిక, లే లేవరో నేతన్నా!, నేతకళ జీవకళ  వంటి గీతాలు ఇందులో ఉన్నాయి.
ఎప్పుడూ ప్రేమ గీతాలు రాసే ఆచార్య ఆత్రేయ
‘‘ గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు.... అని సందేశాత్మక లలిత గీతాలు రాసినట్లు  అభ్యుదయ కథలు, నాటికలు, గీతాలు రాసే భూపతి సన్నజాజీ పూసేవేళ ..., నీ చెదరని చిరునవ్వు..... వంటి భావ గీతాలు కూడా రాశారు. అన్నిటికంటే ముఖ్యం కేవలం రెండవ తరగతి మాత్రమే చదువుకున్న  చేనేత కార్మికుడైన భూపతి తన జీవితానుభవంతో  కులమతాలు లేని సమసమాజం కోరుకుంటూ ఇంతటి గొప్ప కథలు రాయడం విశేషం.

పుస్తకం పేరు: చేనేత బతుకు
రచయిత పేరు: సందుపట్ల భూపతి,
పుస్తకం ధర: రూ.80/- పేజీలు : 90
ప్రతులకు : సందుపట్ల భూపతి,  ఇంటి నెంబర్ 3/03(74ఏ), గండాలయ పేట, మంగళగిరి-522503, సెల్ నెంబర్: 9603569889
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Dec 1, 2018


చేనేత వర్గాలపై ప్రధాన పార్టీల కన్ను
v ప్రభావితం చేయగల నియోజకవర్గాల గురించి ఆరా
v చేనేత కులాల ఐక్యతకు ఆ వర్గాల నాయకుల కృషి  
v బీసీ నాయకుల మద్దతు కోరిన చేనేత కుల నాయకులు
v ఈ సారి ఎక్కువ టిక్కెట్లు దక్కించుకునే అవకాశం   
                    

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కదలికలు మొదలయ్యాయి. రెండు, మూడు నెలల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. అలాగే కుల సంఘాలు కూడా ఏ పార్టీ తరపునైనా సరే అవకాశం ఉన్నమేరకు తమతమ కులాలకు ఎక్కువ  టిక్కెట్లు దక్కించుకోవడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కుల వ్యవస్థ వేళ్లూనుపోయిన ఈ సమాజంలో కుల ప్రస్థావనలేకుండా రాజకీయం నడవదు. ఏ రాజకీయ పార్టీ అయినా కుల ప్రాతిపధికన టిక్కెట్లు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పద్మశాలీలతోపాటు 19 చేనేత కులాలకు చెందిన వారు 75 లక్షలకుపైగా ఉన్నారు. అయినా ఒక్కరు కూడా శాసనసభుకు ప్రాతినిధ్యం వహించడంలేదు. దాంతో వారిలో పట్టుదల పెరిగింది. ఆ కులాల వారందరూ ఈసారి తమవారిని గెలిపించుకోవాలన్నా గట్టిపట్టుదలతో ఉన్నారు. రాజకీయ భాగస్వామ్యం కోసం చేనేత కులాలవారు ఏకమవుతున్నారు. వారిలో పద్మశాలీలు, దేవాంగులు ఎక్కువగా ఉంటారు. ముందు ఈ రెండు కులాలవారు ఏకమవడం ముఖ్యం. వీరు ఏకమైతే మిగిన కులాలవారు వారితో కలవడం తేలికవుతుంది. రాజకీయంగా వారు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. చేనేత రంగం రోజురోజు దిగజారుతోంది. చట్ట సభలలో చేనేత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కరువయ్యారు.  దాంతో వారి సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి అవకాశం లేకుండా పోయింది.  అటు పార్లమెంట్ లోగానీ, ఇటు ఏపీ శాసనసభలో గానీ చేనేత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. చట్ట సభలలో చేనేత గళం విప్పడానికి ఈ వర్గానికి రాజకీయ వారసత్వం కరువైంది.  చేనేత ఓటర్లు గణనీయంగా ఉన్నా ఏపీ శాసనసభలో 175 మంది సభ్యులలో  ఆ వర్గానికి చెందిన ఒక్కరు కూడా లేరు. ప్రస్తుత ఎన్నికలు, రాజకీయ వ్యవస్థలో చట్టసభకు పోటీ చేసి గెలిచేటంతటి ఆర్థిక స్తోమత కూడా వారికిలేదు.  అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, కర్నూలు జిల్లా నుంచి బుట్టా రేణుక మాత్రమే పార్లమెంటులో ఉన్నారు. రాష్ట్ర శాసనసభలో ఎవరూలేకపోవడంతో వారి పరిస్థితిని గమనించి శాసనమండలిలో  ఈ వర్గానికి చెందిన పోతుల సునీతకు అవకాశం కల్పించారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో 18 వరకు శాసనసభ స్థానాలు  చేనేత కులాలకు దక్కాలి.  కనీసం 10 మంది చేనేత కులాల నుంచి ఎమ్మెల్యేలుగా వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని  భావిస్తున్నారు. ఈ అంశాలను గుర్తించిన ఆ కులాల పెద్దలు రాష్ట్రంలో చేనేతకు చెందిన పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ మొదలైన కులాలవారినందరినీ  కలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేనేత కులాలన్నీ ఏకమైతే తప్ప ఫలితం ఉండదని వారికి అర్ధమైంది. చేనేత కులాలు ఎవరికి వారు తాము ఎక్కువ మందిమి ఉన్నామంటే తాము ఎక్కవమందిమి ఉన్నాం  అని వాదించుకుంటూ పోతే సాధించేది ఏమీ లేదని, అందరం నష్టపోతామని వారికి అర్ధమైంది. ఆ విధమైన మాటలు ఐక్యతకు విఘాతం కలిగిస్తాయన్నది వారి భావన. అలా మాట్లాడేవారి నోటికి కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ భాగస్వామ్యం ఉంటేనే నిలదొక్కుకోగలుగుతామని నిర్ణయానికి వచ్చి  అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయ భాగస్వామ్యం కోసం ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్ల సంపాదనలో బీసీ నాయకుల సహకారం కూడా తీసుకుంటున్నారు. వారు కూడా చేనేత వర్గానికి పూర్తి సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. బలీయమైన శక్తిగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ టిక్కెట్లు పొంది,  గణనీయంగా శాసనసభ స్థానాలు గెలుచుకోవాలన్న  గట్టి పట్టుదలతో ఉన్నారు. చేనేత వర్గానికి చెందిన వ్యక్తి ఏ పార్టీ తరపున పోటీ చేసినా  మద్దతు పలికి గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చేనేత వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడనుంది. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, ప్రజారాజ్యం మూడు ఈ వర్గాలపై దృష్టిసారించాయి. ఈ వర్గం ప్రభావితం చేయగల నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నాయి. దాదాపు 15 శాసనసభ, 5 లోక్ సభ స్థానాల్లో వీరి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తేలింది. ఆ నియోజకవర్గాల్లో మూడు పార్టీల తరపున ఈ సారి గణనీయంగా సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ అయినా సరే చేనేత వర్గానికి చెందిన ఏ కులం వారికి టిక్కెట్ ఇచ్చినా వారిని గెలిపించుకోవాలన్న గట్టిపట్టుదలతో చేనేత వర్గ నాయకులు ఉన్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914