Jun 4, 2018


 ఇంటర్ మొదటి సంవత్సరం
కొత్త భాషా పాఠ్యపుస్తకాలు విడుదల

          సచివాలయం, జూన్ 4: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలను ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం ఉదయం విడుదల చేశారు. ఆమె విడుదల చేసినవాటిలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది మొదటి సంవత్సరం చదివేవారి కోసం మాత్రమే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మొదటి ఏడాది భాషా పాఠ్యపుస్తకాలలో సిలబస్ ని పూర్తిగా మార్చినట్లు తెలిపారు. నైతిక విలువలు, ప్రవర్తన, పర్యావరణంకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండవ సంవత్సరం చదివేవారి సిలబస్ ఏమీ మార్చలేదని, ఇప్పుడు మొదటి సంవత్సరం చదివేరు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు వారి సిలబస్ మారుతుందని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు నీట్, జేఈఈ, సీఏ వంటి ఎంట్రన్స్ పరీక్షలకు, బ్యాంకింగ్, ఎల్ఐసీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా సిలబ్ లో మార్పులు, చేర్పులు చేశామని, కొన్ని చాప్టర్లలో అదనంగా చేర్చామని, కొన్ని కొత్త చాప్టర్లు చేర్చామని చెప్పారు. బయట ప్రపంచంతో పోటీపడేవిధంగా, వారిలో కమ్మూనికేషన్ స్కిల్, అవగాహనా శక్తి పెంచేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావలసిన రీతిలో  సిలబస్ రివ్యూ కమిటీ, కరికులం అప్ గ్రేట్ కమిటీ సూచనల మేరకు సమకాలీన పరిస్థితులకు కావలసి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్ రూపొందించినట్లు తెలిపారు. అధ్యాపకులు అందరూ ఆయా సబ్జక్టులలో మాస్టర్ డిగ్రీలు, పీహెచ్ డీలు చేసినవారని కొత్త సిలబస్ బోధించడంలో ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు.  అవసరమైతే కొత్త సిలబస్ కు సంబంధించి  వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు.  జేఈఈకి ఎంకికైనవారిలో 30 వేల మంది ఏపీ విద్యార్థులే ఉన్నారని, 1,2 ర్యాంకులు మన విద్యార్థులకే వచ్చాయని చెప్పారు.
కొత్తగా చేరే విద్యార్థులందరికీ సరిపడ పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బయట మార్కెట్ లో కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటు పబ్లిషర్లు ఇంటర్ బోర్డుకు రాయల్టీ చెల్లించి, వారు కూడా ప్రింట్ చేసి అమ్ముతారని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉచితంగా ఇచ్చే పుస్తకాలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఆన్ లైన్ చదువుకునేవారికి ఈ బుక్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 5 నుంచి 5.5 లక్షల మంది విద్యార్థుల చేరే అవకాశం ఉంటుదని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 300 కాలేజీలను గత ఏడాది రద్దు చేసినట్లు తెలిపారు. కొన్ని కాలేజీలకు పెనాల్టీలు విధించినట్లు చెప్పారు. నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన కాలేజీలకు అనుమతిస్తామన్నారు.

ఆత్మహత్యల నివారణకు చర్యలు
          ఇంటర్ కాలేజీ, హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి విచారణ జరపడానికి ప్రభుత్వం నీరదా రెడ్డి, చక్రపాణి కమిటీలను నియమించిందని, వారు నివేదికలు ఇచ్చారని, వారి సూచనలు, సలహాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాలేజీలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, మధ్య మధ్యలో వారికి కొద్దిసేపు విరామ సమయం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. హాస్టల్స్ లో టీవీలు ఏర్పాటు చేయమని, తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఫోన్ అందుబాటులో ఉంచాలని, విద్యార్థులు ఫోన్ కోసం క్యూలో నిలబడకుండా ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే మానసిక శాస్త్రం అధ్యయనం చేసిన వారిని నియమించాలని ఆదేశించినట్లు చెప్పారు. రామచంద్రా మిషన్ వారు విద్యార్థుల వత్తిడి తగ్గడానికి మెడిటేషన్ లో శిక్షణ ఇస్తున్నారని, గత ఏడాది 52 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వారు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తే తరువాత విద్యార్థులే తమంతటతాము చేసుకుంటారన్నారు. మెడిటేషన్ లో శిక్షణ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సారి ఎక్కువ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రామచంద్రా మిషన్ వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారన్నారు. కొలకలూరులోని వారి శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపాల్స్ కు, టీచర్లకు కూడా శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వారి శిక్షణ వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెరిగే అవకాశం ఉంటుందని ఉదయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఆర్టీడబ్లు ప్రొఫెసర్ పి.మురళీధర్, ఇతర అధికారులు సీఓఈ వి.రమేష్, జాయింట్ సెక్రటరీలు పీవీ సుబ్బారెడ్డి, గోపాల్ రెడ్డి, ఇతర అధికారులు సికిందర్, బి.వేదవతి తదితరులు పాల్గొన్నారు.

వేరువేరుగా బియ్యం, ఆరోగ్య కార్డులు

ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించిన మంత్రి ప్రత్తిపాటి


               సచివాలయం, జూన్ 4: బియ్యం, ఆరోగ్య కార్డులు వేరువేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఛాంబర్ లో ఉదయం సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండి ఏ.సూర్యకుమారి, కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసరావు, చంద్రన్న విలేజ్ మాల్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు, కమిటీ సభ్యులతో సమావేశమై వారి సమస్యలు చర్చించినట్లు తెలిపారు. కొత్తగా 2 లక్షల 42 వేల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటిలో కొన్ని ఉన్నవాటిలో రద్దయినవి కూడా ఉన్నట్లు తెలిపారు.  పేదవారు ఎవరూ ఇబ్బంది పడకుండా కార్డులు జారీ చేస్తామన్నారు. ఆ తరువాత కార్డులలో మార్పులు, చేర్పులు చేసి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రస్తుతం కోటి 44 లక్షల కార్డులు ఉన్నాయని, ఇప్పుడు మరో 2.42 లక్షల కార్డులు ఇస్తామని, మార్పులు, చేర్పులు చేయవలసిన కార్డులు ఇంకో 3.80 ఉన్నట్లు తెలిపారు. ఇల్లు,  ఆరోగ్యం, ఇతర లబ్ది కోసం తెల్ల కార్డులు కావాలన్న వత్తిడి పెరుగుతోందని, వరిలో చాలా మంది బియ్యం తీసుకోవడంలేదని, అందువల్ల ఆ వత్తిడి  తగ్గడానికి బియ్యం కార్డులు, ఆరోగ్య కార్డులు వేరు చేసే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. కందులు భారీ స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అందువల్ల ఒక్కో తెల్ల కార్డులకు నెలకు రెండు కిలోల నాణ్యమైన కంది పప్పు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కిలో ధర రూ.40 కాకుండా, రూ.30 లకు ఇవ్వాలన్న ఆలోచన ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకొని ఇస్తామని చెప్పారు.

83 చంద్రన్న విలేజ్ మాల్స్
రాష్ట్రంలో ప్రస్తుతం 83 చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహిస్తున్నట్లు, ఈ నెలలో మరో 71 మాల్స్ ప్రారంభించడంతో అవి 144కి చేరతాయని తెలిపారు. ఒక్కో షాపుకు రూ.15 వేల నుంచి రూ.18 వేల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు చెప్పారు. తెనాలిలో ఓ మాల్ కు రూ.18వేల రూపాయలు, హిందూపురంలో మరో మాల్ కు రూ.15వేలు వచ్చినట్లు వివరించారు. అయితే కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు బయట మార్కెట్ కు, విలేజ్ మాల్స్ కు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. వినియోగదారులకు 60 శాతం, డీలర్ కు 40 శాతం లాభం చేకూరాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొన్ని వస్తువులు ప్యాకింగ్ లేకుండా విడిగా అమ్మితే వినియోగదారుడికి తక్కువ ధరతోపాటు డీలర్ ఆదాయం పెరుగుతుందన్నారు. చౌక ధరల దుకాణాలను మాల్స్ గా మార్చడం వల్ల వారికి సరఫరా చేసే విద్యుత్ కు వాణిజ్య ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దానిని గృహ వినియోగ ఛార్జీలు వసూలు చేయాలని  డీలర్లు కోరుతున్నారని, అది న్యాయమైన కోరికేనని అన్నారు. విద్యుత్ శాఖతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కమీషన్ పెంచమని డీలర్లు కోరుతున్నట్లు తెలిపారు.   డీలర్ల తరపున ప్రతి జిల్లా నుంచి ఒకరి చొప్పున ఎంపిక చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వారితో ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.  వారికి ఈ మాల్స్ పై అవగాహన కలిగించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని విస్తరింపజేస్తామని చెప్పారు. రిలయన్స్ సంస్థతో ఒప్పందం(ఎంఓయు) చేసుకోవలసి ఉందని, ఒప్పందం కుదిరిన తరువాత మాల్స్ లో తరలించడానికి అనువైన ర్యాక్ లు, బోర్డులు వంటి వాటికి అయిన ఖర్చును వారే భరిస్తారన్నారు.

ప్రజా సాధికార సర్వే కొనసాగింపు
               ప్రజా సాధికార సర్వేలో నమోదు కాకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు కాదని మంత్రి చెప్పారు. అందువల్ల ఆ సర్వే కింద నమోదు కానివారు, తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి, దానిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆ సర్వే పరిధిలోకి రానివారు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 12 లక్షల 50వేల ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగ జరుపుకోవడానికి రంజాన్ తోఫాలు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ తోఫాలో 8కిలో 100 గ్రాముల నాణ్యమైన సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లో సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్ సందర్భంగా తమ ప్రభుత్వం రూ.14.51 కోట్ల విలువైన ఆహార పదార్ధాలు ఇచ్చినట్లు మంత్రి పుల్లారావు వివరించారు.

నాణ్యత లేని సరుకులు వెనక్కు ఇచ్చివేశాం
                  సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు, ఇతర అంశాలను దృష్టిలోపెట్టుకొని ప్రస్తుతానికి చంద్రన్న విలేజ్ మాల్స్ ని తాలూకా కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సరుకులు రవాణా చేయడానికి లారీలు వెళ్లే రహదారులు ఉండాలన్నారు. సరుకుల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. హోల్ సేల్ వ్యాపారులు నాణ్యతలేని సరుకులు రవాణా చేస్తే తిరిగి వారికే ఇచ్చివేస్తామన్నారు. రంజాన్ తోఫా కింద ఇచ్చే సరుకుల విలువ రూ.485లు అని, అవి రూ.245లకు వచ్చినట్లు వివరించారు. సేమ్యా నాణ్యత బాగోపోతే తిరిగి ఇచ్చివేసినట్లు తెలిపారు. టెండర్ లోనే ఆ నిబంధనలన్నీ పేర్కొన్నట్లు చెప్పారు.

ప్రకృతి వ్యవసాయానికి అపూర్వ స్పందన
Ø   పర్యావరణానికి, భూసారానికి రక్షణ          
Ø   దిగుబడి ఎక్కువ  రైతుకు ఆదాయం అధికం
Ø  వినియోగదారులకు ఆరోగ్యానికి రక్షణ  ఆస్పత్రి బిల్లు తక్కువ
Ø   ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతుల్లో ఉత్సాహం
Ø   జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధినేతల ప్రశంసలు
Ø   సుభాష్ పాలేకర్ ని దేవుడిగా అభివర్ణించిన రైతులు
        
      
   ఆంధప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడి తీవ్రంగా భూసారం దెబ్బతినడంతోపాటు తీవ్రంగా నష్టపోయిన రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్) వైపు మళ్లుతున్నారు. ఉద్యానవన పంటల రైతులు కూడా ఈ పద్దతిలోనే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల భూమికి, పర్యావరణానికి, ఆ ఉత్పత్తులు ఆహారంగా తీసుకునే మానవాళికి ప్రమాదం. ప్రకృతి వ్యవసాయం ఒక్కటే దీనికి పరిష్కారం.  అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు పెరుగుతోంది. ఈ పద్దతి సాగు చేయడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. సహజసిద్ధంగా భూమి నుంచి లభించే సారంతో దిగుబడులు పెరుగుతాయి. నీటి వినియోగం కూడా తక్కువే. నెల రోజుల పాటు వర్షం కురవకపోయినా పంట తట్టుకోగలుగుతుంది. ప్రతికూల వాతావరణంలో కూడా పంటలు పండుతాయి. తద్వారా మానవాళికి రసాయనికంగా కలుషితం కాని ఆహారం అందించగలుగుతాం. పర్యావరణానికి రక్షణ లభిస్తుంది. వినియోగదారులకు ఆస్పత్రి బిల్లు కూడా తగ్గుతుంది.  ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అనే అంతర్జాతయ సంస్థలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దానికి తోడు మన దేశంలో, రాష్ట్రంలో ఈ ప్రకృతి వ్యవసాయానికి పితామహుడైన సుభాష్ పాలేకర్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ విధానం వల్ల లాభాలను చెప్పి రైతులలో అవగాన కల్పించి, వారిని చైతన్యవంతులను చేసే బాధ్యతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయకుమార్ కు అప్పగించింది.  రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయన దీనిని  ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.

          రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో జడ్ బీఎన్ఎఫ్ ని ప్రవేశపెట్టి, 2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లలో మంచి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో లక్షా 63వేల మంది రైతులు 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నారు.  ప్రభుత్వం కూడా 2018ని  ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.     ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం దేశంలో నెంబర్ 1 గా నిలిచింది. 2021-22 నాటికి రాష్ట్రంలో  అన్ని మండలాలలోని 7.5 లక్షల మంది  రైతులకు దీనిని  చేర్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2023-24 నాటికి 12,924 అన్ని గ్రామ పంచాయతీలలో 60 లక్షల రైతు కుటుంబాలను ఈ కార్యక్రమం కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  2025-26 నాటికి ఏపీలో సాగుచేసే మొత్తం ప్రాంతం జడ్ బీఎన్ఎఫ్ పరిధిలోకి తీసుకురావాలన్న కృతనిశ్ఛయంతో ఉంది. ఈ క్రమంలోనే జూన్ 2 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగుచేసే రైతులు, రైతు మహిళలు 8వేల మందితో  సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే పలు సంస్థల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. వారంతా ఇక్కడ హాజరైన రైతులను, వారి పండించిన వివిధ రకాల ఉత్పత్తులను  చూసి ఆశ్చర్యపోయారు. ఇంత భారీ స్థాయిలో జరిగే ఉత్పత్తిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రత్యేక శ్రద్ధను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పలువురు  తమ అనుభవాలను, వారికి వచ్చిన లాభాలను వివరించారు.

          ముఖ్య అతిధిగా విచ్చేసి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నూతన విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. వీరి పట్టుదల, శ్రమ, చంద్రబాబు వంటి సమర్ధుడైన నాయకుడు ఉన్నందున ఈ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం, అంతర్జాతీయంగా వివిధ సంస్థల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారన్న   ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా రైతులు 21వ శతాబ్ధంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభిస్తారన్నారు. వీరు అనుసరించే విధానాలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అమలు చేయవచ్చని చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్ మాట్లాడుతూ విప్లవాత్మక మార్పుకు ఏపీలో నాంధి పలికారన్నారు. ఇక్కడ పాలేకర్ వ్యవసాయ విధానం ఒక సమూహ ఉద్యమంగా చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ఈ సదస్సుకు 8 వేల మంది హారజరు కావడం, ఈ వ్యవసాయ విధానాన్ని లక్షా 60 వేల మంది అనుసరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన సరైన తీరిలో ఖర్చు చేశారన్నారు.  ప్రపంచ  బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఫండ్ వంటి సంస్థలు ఏపీకి నిధులు సమకూర్చాలన్నారు. ఇండోనేషియా  మాజీ మంత్రి డాక్టర్ కుంటోరో మాట్లాడుతూ ఈ విధానంలో సన్న, చిన్నకారు రైతులకు భద్రత ఉంటుందన్నారు. ఇండోనేషియాలో కూడా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థతో కలసి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్  సంస్థ చైర్మన్ సన్నీ వర్గీస్ మాట్లాడుతూ రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇక్కడ రైతులను, వారు పండించిన పంటలను స్వయంగా చూశానని, ఇక్కడ ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ ప్రంపంచాన్ని మారుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రైతులు శాస్త్రవేత్తలని, వారికి ప్రభుత్వం సహకారం అందిస్తే మంచి  ఫలితాలు వస్తాయన్నారు. ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి మాట్లాడుతూ ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం చేయడంతోపాటు ఇక్కడకు 8 వేల మంది రైతులు రావడం చాల సంతోషంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమానికి సహకారం అందేంచే జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆయన అభినందించారు. యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ యూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల అంకిత భావం తనకు నచ్చిందన్నారు. హాజరైన రైతులకు అభినందనలు తెలిపారు. ప్రపంచ జనాభా 2050 నాటికి 900 కోట్లకు చేరుతుందని, వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార పదాలు అందించవలసిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అభినందించారు. ఇన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలకు తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పరిచయం చేయవలసి ఉందన్నారు. అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సీఈఓ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నమ్మలేకపోయామని, ఇప్పుడు స్వయంగా చూస్తున్నామన్నారు. నైరోబీకి చెందిన వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ డెప్యూటీ జనరల్ ఆప్ రిసెర్చ్ డాక్టర్ రవి ప్రభు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అభినందనలు తెలిపారు. జడ్ బీఎన్ఎఫ్ సాగులో శాస్త్రీయత ఉందని, దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం ఇవ్వలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తగా కొనియాడారు. ఎఫ్ఏఓ సంస్థ అధినేత శ్యామ్ గడ్కా మాట్లాడుతూ పాలేకర్ విధానానికి ఏపీ ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడం ఇందులో ముఖ్య అంశాలని, ఈ సాగులో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ లభిస్తుందని, భవిష్యత్ లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయిన చెప్పారు. బీఎన్ పీ పారిబాస్ గ్లోబల్ సభ్యుడు ఆంథోని సిరే మాట్లాడుతూ మంచి స్పూర్తిని ఇచ్చే కార్యక్రమం చేపట్టారని అభినందించారు. ఈ కార్యక్రమానికి వనరులు సేకరించడంలో తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పవన్ సుఖదేవ్ ప్రస్తుతం  రసాయన ఎరువులతో పండిన  ఆహార పదార్ధాలు ప్రమాదకరం అని, అవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బీటీ, డయాబిటీస్, ఒబిసిటీ, కేన్సర్ వంటి వ్యాధులకు కారణం ఈ ఆహారమేనని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.   ఈ వ్యవసాయం చేయడం అంటే మానవ జాతికి గొప్ప సేవచేసినట్లేనన్నారు. ప్రపంచంలోని ఇన్ని ముఖ్య సంస్థలు ఇక్కడ కలవడం, సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.

రైతుల అనుభవాలు, అభిప్రాయాలు
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గఢించిన  రైతులు రోశయ్య, పుష్పవతి, మహాలక్ష్ముడు, సిరిజ తమ అనుభవాలను, ఈ వ్యవసాయం ద్వారా గఢించిన లాభాలను వివరించారు. ఈ వ్యవసాయ విధానాలను తెలిపిన సుభాష్ పాలేకర్ ని దేవుడిగా అభివర్ణించారు.  విజయకుమార్ తమకు అన్ని విధాల సంపూర్ణంగా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

75 ఏళ్ల వృద్ధుడు రోశయ్య: 1960 నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. గాలి,వానలు, తుఫాలను ఎన్నిటినో చూశాను. వ్యవసాయంలో ఒడిదుడుకులు అన్నిటి ఎదుర్కొన్నాను. నాకు ప్రస్తుతం 75 సెంట్ల భూమి ఉంది. అందులో కొబ్బరి తోట వేశాను. నాలుగేళ్ల నుంచి పాలేకర్ చెప్పిన విధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. ఆ పొలంలోనే నిమ్మ, సపోటా, అరటి, పైనాపిల్ చెట్లు పెంచుతాను. అంతర్ పంటలు వేస్తాను. ఈ వయసులో కూడా ఇప్పటికీ నేనే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోస్తాను, నేనే అమ్ముతాను.  గత ఏడాది రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ భారీ కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు 24 ఏళ్ల వయసు వచ్చింది. పాలేకర్ నాకు దేవుడు. విజయకుమార్ గారు నాకు స్పూర్తినిస్తూ సీఆర్పీగా తీసుకొని ప్రోత్సహిస్తుననారు.

పుష్పవతి : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 13 ఏళ్లకే పెళ్లి అయింది. ఆమెకు 18 ఏళ్లు వయసు వచ్చేసరికి భర్త చనిపోయారు. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. అనుభవాలు ఆమె మాటల్లోనే.....నాకు 65 సెంట్లు భూమి ఉండేది. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడి వ్యవసాయం చేశాను. చాలా నష్టపోయాను. అప్పుల పాలయ్యాను. ఆ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాను. కాకినాడలో జరిగిన పాలేకర్ గారి శిక్షణా శిబిరానికి హాజరయ్యాను. ఒక ఎకరంలో వంగ, టమోటా పండించాను. ఎకరానికి రూ.6వేల పెట్టుబడి పెడితే, లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది.  రు.12 లక్షల అప్పులు తీర్చాను. ఆరు ఎకరాలు పొలం కొన్నాను. సొంతం ఆరు ఎకరాలు, ఎకరంన్నర కౌలుకు తీసుకున్నాను. మొత్తం ఏడున్నర ఎకరాలు సాగు చేస్తున్నాను. మొక్కజొన్న, వేరుశనగ, కంది వంటి పలు పంటలు పండిస్తాను. రూ.50 వేలు ఖర్చు చేస్తే, రూ.3.5 లక్షల ఆదాయం వచ్చింది. పాలేకర్ కి తల వంచి నమస్కరిస్తున్నాను. నా కూతురు డిగ్రీ చదువుతోంది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు.  నేను మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. ప్రతి పేద కుంటుంబం నెలకు పది వేల రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. అది ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుంది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా పురుష స్వయం సహాయక సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి.

మహాలక్ష్మణుడు:  నేను గతంలో లెక్చరర్ గా పని చేసేవాడిని. మాకు ఎకరంన్నర మామిడి తోట ఉండేది. మా నాన్న ఆ తోట పనులు చూసేవారు. రసాయన ఎరువులు, పురుగులు మందులు వాడటం వల్ల తోటలోని చెట్లు నిర్జీవమయ్యాయి. అప్పుడు నేను ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. జీవామృతం, ఘనజీవామృతం వంటి వాటిని వాడాను. మామిడి చెట్లు చిగురించాయి. అంతర్ పంటలుగా ఆకు కూరలు వేశాను. మామిడి దిగుబడి పెరిగింది. నికర ఆదాయం రూ.1.50లక్షలు వచ్చింది. ఆ తరువాత రూ.1.80 లక్షలు వచ్చింది. వంగలో అంతర్ పంటగా క్యాజేసీ వేశాను. ఆదాయం పెరిగింది. నన్ను సీఆర్పీ(కమ్మునిటీ రిసోర్స్ పర్సన్)గా ఎంపిక చేశారు. ఢిల్లీ సెమినార్ కు కూడా వెళ్లాను. కృష్ణా జిల్లాలోని మా పొలం చూడటానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి అధికారులు మా పొలం వరకు రోడ్డు వేశారు.  నీటి సదుపాయం కల్పించారు. ఆ తరువాత రైతులు కూడా జడ్ బీఎన్ఎఫ్ సాగు చేయడానికి ముందుకు వచ్చారు. మీడియా ప్రచారం ద్వారా మా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగింది. డ్వాక్రా మహిళల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. నేను లెక్చరర్ ఉద్యోగం మానివేశాను. ఇదే లాభదాయకంగా ఉంది.

వెంకటలక్ష్మి : విజయనగరం జిల్లాకు చెందిన వెంకట లక్ష్మి శ్రీకాకుళం జిల్లా కొండప్రాంతాల్లో గిరిజనులు నివశించే చోట జడ్ బీఎన్ఎఫ్ సీఆర్పీసీ గా వ్యవహరిస్తున్నారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే..... కొండ ప్రాంతానికి, భాష తెలియని ప్రాంతానికి పంపారు. మొదట్లో భయపడ్డాను. విజయ కుమార్ గారు మా గురువు. నాకు ధైర్యం చెప్పారు. దాంతో గిరిజనులకు నచ్చజెప్పి 163 మందిని ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాను. అక్కడ పైనాపిల్ ఎక్కువగా పండిస్తారు. అంతర్ పంటలు వేయడం మొదలు పెట్టాం. ఎకరానికి రూ.1.80లక్షల ఆదాయం వస్తోంది. పసుపు,మామిడి అన్ని పంటలు ప్రకృతి వ్యవసాయం పద్దతిలో సాగుచేస్తున్నాం. ప్రకృని కాపాడే సైనికురాలిలా పని చేస్తున్నాను. చివరి వరకు ఇలాగే కొనసాగుతాను.

ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయత గురించి విజయ కుమార్ ని ప్రశ్నిస్తే ‘‘మా రైతులు శాస్త్రవేత్తలు, రసాయనాలు, పురుగుల మందులు వాడకుండా పంటలు పండిస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. ఆ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్నాను. నేను, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంతకు మించిన శాస్త్రీయత ఏమి ఉంటుంది.’’ అని సమాధానం చెప్పారు. రైతుల సంక్షేమానికి, భూసారం,పర్యావరణ పరిరక్షణకు, మానవాళి ఆరోగ్య సంరక్షణకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Jun 2, 2018



దేశానికి, ప్రపంచానికి ప్రకృతి సేద్యమే శరణ్యం

ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
            గుంటూరు, జూన్ 2: ఈ దేశానికి, ప్రపంచానికి ప్రకృతి సేద్యమే శరణ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బైబిల్ గ్రౌండ్స్ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రకృతి వ్వవసాయదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో పట్టుదలతో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న లక్షా 63 వేల మందిని అభినందించారు. ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసే డ్వాక్రా మహిళలపై ప్రశంసలు కురింపించారు. ఈ ఏడాది 5 లక్షల మంది రైతులను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ(జెడ్ బిఎన్ ఎఫ్)  విధానంలోకి తీసుకురావడానిక లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.ఇందుకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. దేశంలో మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
ప్రపంచంలో ఎక్కడా చేయని స్థాయిలో మనం ఇక్కడ ప్రకృతి సేద్యం చేస్తున్నామన్నారు. ఈ రోజు ఇక్కడ ఈ వ్యవసాయవిధానానికి సంబంధించి  ఏపీ ప్రభుత్వం, సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ (ఎస్ఐఎఫ్ఎఫ్) సంస్థ మధ్య జరిగిన ఒప్పందం  చరిత్రాత్మకం అని, రాష్ట్ర చరిత్రలో ఇది ఓ సువర్ణ అధ్యాయం అన్నారు.
ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల తాత్కాలికంగా దిగుబడి పెరిగినా, తరువాత ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు నష్టపోవడమే గాక భూసారం క్షీణించిందని, పూర్తిగా వాతావరణ కాలుష్య ఏర్పడిందని   చెప్పారు. క్రిమిసంహారక మందులు చల్లిన ఆహారం తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రకృతి సేద్యం వల్ల వ్యవసాయ ఖర్చులు తక్కువ, దిగుబడి ఎక్కువతోపాటు పర్యావరణం కూడా దెబ్బతినదని చెప్పారు. అంతేకాకుండా వినియోగదారుడికి కలుషితం కానటువంటి ఆహారం లభిస్తుందని తద్వారా ఆస్పత్రుల ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మనం దేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. రైతులు, మహిళలు ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మన రైతులు ఈ వ్యవసాయ విధానానికి రాయభారులుగా ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఐటీ రంగంలో నెంబర్ 1 గా ఉందని, ఇక ముందు ఈ ప్రకృతి సేద్యంలో నెంబర్ 1 ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సేద్యంలో ఇంత విజయం సాధించిన ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, వ్యవసాయ సిబ్బందిని, రైతులను, ముఖ్యంగా మహిళా రైతులను అభినందించారు. రాష్ట్రంలో ఆదర్శవంతులైన రైతులు ఉండటం వల్ల వ్యవసాయరంగంలో దేశంలో నెంబర్ 1 గా నిలిచామన్నారు. ఈ రంగంలో జాతీయ వృద్ధి రేటు 3 శాతం ఉంటే, రాష్ట్రంలో 18 శాతం ఉందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నారు. ప్రకృతి వ్వవసాయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇక్కడకు వచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  భవిష్యత్ లో రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. రైతులలో ఉత్సాహం నింపేవిధంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భవిష్యత్ లో మనం తినే ఆహారం ఏ పొలంలో, ఏ రైతు పండించాడో తెలుసుకునే టెక్నాలజీ వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయానకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని భావిస్తుందన్నారు.
అంతకు ముందు సీఎం చంద్రబాబు సమక్షంలో  ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు  సత్య త్రిపాఠి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణకు సంబంధించిన ఒప్పంద(ఎంఓయు) పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశానికి, ప్రపంచానికే ఆదర్శం
రెండున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందిందని, ఈ విషయంలో శ్రమించిన విజయకుమార్ ని, రైతులను దేశవిదేశీ నిపుణులు ప్రసంసించారు. హాజరైన రైతులలో ఉత్సాహాన్ని, వారు పండించిన పంటల ఎగ్జిబిషన్ ను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసాయరహిత ఆహారం అందించడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మనం అందించే ఓ గొప్ప వరంగా అభివర్ణించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నూతన విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. వీరి పట్టుదల, శ్రమ, చంద్రబాబు వంటి సమర్ధుడైన నాయకుడు ఉన్నందున ఈ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం, అంతర్జాతీయంగా వివిధ సంస్థల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారన్న   ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా రైతులు 21వ శతాబ్ధంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభిస్తారన్నారు. వీరు అనుసరించే విధానాలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అమలు చేయవచ్చని చెప్పారు.
 ఆనారోగ్యం కారణంగా రాలేకపోయిన ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ వీడియో ప్రసంగాన్ని ప్రసారం చేశారు. మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని పేర్కొన్నారు. ఈ వ్యవసాయ విధానానికి ఏపీలో ప్రభుత్వ మద్దతు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్ మాట్లాడుతూ విప్లవాత్మక మార్పుకు ఏపీలో నాంధి పలికారన్నారు. ఇక్కడ పాలేకర్ వ్యవసాయ విధానం ఒక సమూహ ఉద్యమంగా చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ఈ సదస్సుకు 8 వేల మంది హారజరు కావడం, ఈ వ్యవసాయ విధానాన్ని లక్షా 60 వేల మంది అనుసరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన సరైన తీరిలో ఖర్చు చేశారన్నారు.  ప్రపంచ  బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఫండ్ వంటి సంస్థలు ఏపీకి నిధులు సమకూర్చాలన్నారు.
ఇండోనేషియా  మాజీ మంత్రి డాక్టర్ కుంటోరో మాట్లాడుతూ ఈ విధానంలో సన్న, చిన్నకారు రైతులకు భద్రత ఉంటుందన్నారు. ఇండోనేషియాలో కూడా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థతో కలసి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్  సంస్థ చైర్మన్ సన్నీ వర్గీస్ మాట్లాడుతూ రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇక్కడ రైతులను, వారు పండించిన పంటలను స్వయంగా చూశానని, ఇక్కడ ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ ప్రంపంచాన్ని మారుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రైతులు శాస్త్రవేత్తలని, వారికి ప్రభుత్వం సహకారం అందిస్తే మంచి  ఫలితాలు వస్తాయన్నారు.
ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి మాట్లాడుతూ ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం చేయడంతోపాటు ఇక్కడకు 8 వేల మంది రైతులు రావడం చాల సంతోషంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమానికి సహకారం అందేంచే జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆయన అభినందించారు.


స్వాగతోపన్యాసం చేసిన విజయకుమార్ సీఆర్పీ(కమ్యునిటీ రిసోర్స్ పర్సన్)లను,  రైతులను హీరోలుగా పేర్కొన్నారు. దేశంలో ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రం ఏపీ కాబోతుందని ప్రకటించారు. ఇక్కడి రైతుల శ్రమ గుర్తుంచుకోదగినదన్నారు. వారు రోల్ మోడల్ గా నిలిచారని చెప్పారు. మహిళా రైతులను, సీఆర్పీలను ప్రత్యేకంగా అభినందించారు. 2024 నాటికి 60 మందిని ఈ వ్యవసాయం వైపు మార్చడానికి సీఆర్ పీలు  సైనికుల్లా పని చేయాలని, ఒక్కక్కరు అయిదుగురు సీఆర్పీలను, వంద మంది రైతులను మార్చాలని కోరారు.
వ్యవసాయ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ రాజశేఖర్  మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక దినం అని, రైతులు నవ నిర్మాణ దీక్ష చేపట్టారని అన్నారు. అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో గుర్తింపు తీసుకువచ్చారని రైతులను ప్రశంసించారు. ఈ వ్యవసాయ పద్దతితో రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం  మెరుగు పడుతాయని, పర్యావరణ సమతౌత్యత ఏర్పడుతుందన్నారు. కాలుష్యానికి ఇదే పరిష్కారం అని చెప్పారు.
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్ది చంద్రమోహన రెడ్డి అమెరికా వెళ్లినందున సదస్సుకు రాలేకపోయారు. ఆయన సందేశాన్ని విజయకుమార్ చదివి వినిపించారు.
 ఈ సదస్సులో బీఎన్ పీ పారిబాస్ గ్లోబల్ సభ్యుడు ఆంథోని సిరే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పవన్ సుఖదేవ్, అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సీఈఓ అనంత పద్మనాభన్, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ డెప్యూటీ జనరల్ ఆప్ రిసెర్చ్ డాక్టర్ రవి ప్రభు, యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ యూరి, ఎఫ్ఏఓ సంస్థ అధినేత శ్యామ్ గడ్కా తదితరులు ప్రసంగించారు.
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గఢించిన  రైతులు రోశయ్య, పుష్పవతి, మహాలక్ష్ముడు, సిరిజ తమ అనుభవాలను, ఈ వ్యవసాయం వల్ల గఢించిన లాభాలను తెలిపారు. ఈ సదస్సులో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పలు  కార్యక్రమాలు నిర్వహించారు.

ఎరిక్ సోల్ హైమ్ నూతక్కి సందర్శన
ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్, ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి శనివారం సాయంత్రం నూతక్కి గ్రామం సందర్శించారు. అక్కడ సాగు చేస్తున్న జడ్ బీఎన్ఎఫ్ పంటలను పరిశీలించారు. సుదీర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని చూశారు. ఆ తరువాత మహిళా సంఘాల సభ్యులను కలసి ఖరీఫ్ ప్లాన్ ఎలా చేశారో అడిగి తెలుసుకున్నారు. ఉషా రాణి నిర్వహించే ఎన్ పీఎం షాపుని పరిశీలించారు. అక్కడ అమ్మే ఘనద్రవాలను, కషాయాలను పరిశీలించారు.

Jun 1, 2018


ఎవరు ఎక్కడ ఉన్నా ఉదయం 9 గంటలకు దీక్ష
జన్మభూమి కోసం పురంకితం కావాలని సీఎం చంద్రబాబు పిలుపు

కేంద్రం సహకారం  అందించకపోయినా అభివృద్ధి పనులు ఆగవు
7 రోజుల పాటు అభివృద్ధిపై సమీక్ష, చర్చ

           సచివాలయం, జూన్ 1: రాష్ట్ర ప్రజలు ఎవరు ఎక్కడ ఉన్నా జూన్ 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు నవనిర్మాణ దీక్ష చేపట్టాలని, జన్మభూమి కోసం పురంకితం కావాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని, నవ్యాంధ్రప్రదేశ్ జూన్ 2న ఏర్పడినా ఆ రోజుని ఉత్సాహంగా జరుపుకోలేమని అన్నారు. అలా అని బాధపడి ప్రయోజనం లేదన్నారు. మహా సంకల్పంతో, కసితో 5 కోట్ల మంది ఆంధ్రులు కలిసి మహాసంకల్సంతో నవనిర్మాణ దీక్ష చేపట్టాలని చెప్పారు. పుట్టిన గడ్డ, తెలుగు జాతి, భావితరాల భవిష్యత్ కోసం పునరంకితమై ముందుకు సాగాలన్నారు. రాష్ట్రం ఏర్పడి రేపటికి 4 ఏళ్లు పూర్తి అవుతుందని, 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు సమీక్షించుకోవాలని, అందుకే ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

       మొదటిరోజైన జూన్ 2న నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలన్నారు.  ఏపి పునర్వవస్థీకరణ చట్టం, పార్లమెంట్ హామీలు అమలు తీరుపై చర్చించాలని చెప్పారు. జూన్ 3న నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం, తాగునీరు-సాగునీరు-పారిశ్రామిక నీరు-పోలవరం-ప్రాధాన్య ప్రాజెక్టులు-జలవనరులపై చర్చించాలని చెప్పారు.  4వ తేదీన రైతు సంక్షేమం-ఆహార భద్రత, వ్యవసాయ, అనుబంధ రంగాలు-పౌరసరఫరాలపై చర్చించాలన్నరు.  5న సంక్షేమం-సాధికారత, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వర్చువల్ క్లాసులు, ఫైబర్ గ్రిడ్,   వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసంపై చర్చించాలని చెప్పారు. 6న జ్ఞానభూమి-ఉపాధి కల్పన, పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించాలన్నారు.  7న మౌలిక సదుపాయాలు-మెరుగైన జీవనం, అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. 8వ తేదీన మహా సంకల్పం, సుపరిపాలన-అవినీతి రహితపాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌, ఈ-ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌరసేవలు, సుస్థిర వృద్ధి, విజన్‌ పై చర్చలు నిర్వహించాలన్నారు. అనంతరం మహా సంకల్పం తీసుకోవాలని, ఉత్తమ సేవలు అందించినవారిని సత్కరించాలని చెప్పారు. నాలుగేళ్ల ప్రగతిపై విశ్లేషణ, అభివృద్ధి, సంక్షేమంపై అధ్యయనం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఈ వారం రోజులు అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాలని చెప్పారు. ఈ వారం రోజులూ అందరూ ఇవే విషయాలు మాట్లాడాలన్నారు. అవతలివారు ఆశ్చర్యం, అసూయపడేవిధంగా మనం అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనేక అంశాల్లో రాష్ట్రం 1, 2 స్థానాల్లో ఉందని తెలిపారు. కేంద్రం సహాయం చేసి ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్లి ఉండేవారమన్నారు.

        విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆనాడు బీజేపీ కూడా పార్లమెంటులో గట్టిగా అడిగిందని, ఆ విధంగా  నమ్మకాన్ని ఇచ్చిన బిజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అయితే ఆ పార్టీ నమ్మకం ద్రోహం చేసిందన్నారు. కేంద్రం సహాయ సహకారాలు అందించకపోయినా అభివృద్ధి పనులు ఆగవన్నారు. నిలదీస్తే కుట్రలు చేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ద్రోహం చేశారని విమర్శించారు. గ్రామీణ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అననుకూల వాతావరణంలో కూడా ఉద్యోగులు బాగా పని చేసి ఫలితాలను సాధించారని చెప్పారు. పార్టీ నాయకులు కూడా అంకితభావంతో పని చేశారన్నారు. అభివృద్ధిపై  ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా కూడా స్పందించాలని హితవు పలికారు.

               కేంద్రాన్ని వదిలిపెట్టం అని, ధర్మపోరాటం, న్యాయపోరాలం చేస్తామన్నారు. ప్రజలు కూడా పరిస్థితులను గమనించాలని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, ఏడిబీ ఇచ్చిన డబ్బుతోనే పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో అవినీతి తగ్గిందని చెప్పారు. జాతీయ రాజకీయాలు తనకు కొత్తకాదని, 1984 నుంచి ఆ రాజకీయాలతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. 1994,95లో థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉంటుదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఎంతో అనుభవం గఢించిన తాను హుందాగా వ్యవహరిస్తానని చెప్పారు. ఈ సారి బీజేసీకి రాదని, ప్రాంతీయ పార్టీలకు అవకాశం వస్తుందన్నారు. నాయకుడు సరిగాలేకపోతే ప్రజలకు వరిగేది ఏమీ ఉండదన్నారు. అపార్ధాలకు తావివ్వకూడదని చెప్పారు. అందరూ కలిసి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. తాను ఎవరికీ పోటీదారుని కాదని చెప్పారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మమత బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ అందరితో బాగుంటానని వివరించారు. నరేంద్ర మోదీతో గానీ, సోనియా గాంధీతోగానీ తనకు వ్యక్తిగత వైరం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ సైనికునిలా పని చేస్తానని చెప్పారు. తనకు గాని, తమ పార్టీకి గాని పదవులు ముఖ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి వై. మధుసూధన రెడ్డి పాల్గొన్నారు.

జూన్ 2న వ్యవసాయ సదస్సు సందర్భంగా
ప్రకృతి  వ్యవసాయంపై ప్రభుత్వ దృష్టి
నేడు లక్ష్యాలు ప్రకటించనున్న సీఎం చంద్రబాబు

Ø నాగార్జునా విశ్వవిద్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు
Ø పరస్పరం రైతుల అనుభవాలు వెల్లడి
Ø ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ - రైతులకు లాభాల పంట
Ø ఖర్చు రూపాయి, ఆదాయం 13 రూపాయలు
Ø వినియోగదారులకు రసాయన రహిత ఆహారం అందించే వ్యవసాయం
Ø 2018-19లో 3 వేల గ్రామాల్లో 1.25 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం

               వాతావరణ కాలుష్యం తగ్గించి, భూసారం పరిరక్షించి, అటు ప్రజలకు ఇటు రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రకృతి  వ్యవసాయసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రోజురోజుకు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో పక్క రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం క్షీణిస్తోంది. వాతావరణం, నీరుతోపాటు ఆహార ఉత్పత్తులు పురుగుల మందులు, రసాయనాలతో కలుషితమవుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు విషపూరితమైన,  క్రిమి సంహారక మందులు విపరీతంగా చల్లిన ఆహార పదార్ధాలను తింటూ రోగాల బారిన పడుతున్నారు.  ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగిస్తే  పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాసులు అంతరించిపోతున్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ పోతే వచ్చే 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది.  ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ప్రపంచానికి మనుగడ ఉండదు.  2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కలుషితంకాని పౌష్టికాహారం అందించడానికి, రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల సంక్షేమాన్ని దృష్టిపెట్టుకొని తక్కువ వ్యవసాయ ఖర్చులు, ఎక్కువ దిగుబడులు సాధించే జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్)పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని రైతులు  ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం  పెద్దఎత్తున జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమం చేపట్టింది.  
             రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో దీనిని ప్రవేశపెట్టారు.  2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయం గణనీయంగా విస్తరించింది. 2018 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో 2018ని ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.   జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్  భారత దేశంలో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. 2016 నుంచి  ఆయన రాష్ట్రంలో మూడు సార్లు భారీస్థాయిలో రైతు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. 20వేల మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారు. అనేక వేల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించడానికి  ప్రేరణ కలిగించారు. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయంలో చేయడంలో దేశంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
            ఈ విధానంలో వ్యవసాయ ఖర్చులు తక్కువ. రసాయన ఎరువుల వాడకం తక్కువ. భూసారాన్ని పెంచుతుంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా అధికోత్పత్తులు సాధించవచ్చు. వివిధ రకాల పంటల ద్వారా ప్రతికూల వాతావరణాలను తట్టుకుంటుంది. ఒక నెల రోజులపాటు వర్షాలు కురవకపోయినా ఈ వ్యవసాయ పద్దతిలో పంటలకు నష్టం ఉండదు. ఈ విధానంలో రైతు రూపాయి ఖర్చు పెడితే  13 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  వీటన్నిని దృష్టిలో పెట్టుకొని 2018-19లో మూడు వేల గ్రామాల్లో 5 లక్షల మంది రైతుల చేత 1.25 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్ కెవీవై), పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) పథకాల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఈ కార్యక్రమానికి రూ.1250 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన అజీం ప్రేమ్ జీ ఫిలాంథ్రోపిక్ ఇనిషియేటివ్స్ (ఏపీపీఐ) సంస్థ రైతు సాధికార సంస్థకు సహకరించడానికి ముందుకు వచ్చింది. సాంకేతిక సహాకార కేంద్రం ఏర్పాటుకు రూ.100 కోట్ల సహాయం అందించనుంది. భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పద్దతిని ప్రవేశపెడతారు.

నేడు ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల ప్రకటన
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఎదురుగా బైబిల్ గ్రౌండ్స్ లో  జూన్ 2వ తేదీ శనివారం జరిగే ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 నాటికి ప్రకృతి వ్యవసాయ లక్ష్యాలను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ(ఎస్ఐఎఫ్ఎఫ్) మధ్య ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక ఒప్పందం(ఎంఓయు)పై సంతకాలు చేస్తారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి, 80 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ సాగు పద్దతులను అవలంబించడానికి  ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 నాటికి రాష్ట్రమంతటా ఈ పద్దతిని అవలంభించేట్లు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
              ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డితోపాటు విదేశీ అతిధులు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎరిక్ సోల్హెమ్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నాచుర్ అంతర్జాతీయ అధ్యక్షుడు పవన్ సుఖ్ దేవ్, సమ్మిళిత అభివృద్ధి ప్రపంచ వ్యాపార మండలి (శాశ్విత అభివృద్ధి) అధ్యక్షులు  సన్నీ వర్గీస్ తోపాటు దేశవిదేశాలకు చెందిన వ్యవసాయం, ఆర్థిక రంగ నిపుణులు  హాజరవుతారు. ప్రకృతి వ్యవసాయం, ఆహారభద్రత, పచ్చదనం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రసంగిస్తారు.   ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గడించిన 8 వేల మంది రైతులు హాజరవుతారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 వరకు జరిగే ఈ సదస్సులో ఉత్తమ రైతులు తమతమ అనుభవాలను తెలియజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారు. ప్రముఖులతోనూ, రైతులతోనూ ఆయన మాట్లాడతారు. 2.05 గంటలకు ఆయన ప్రసంగిస్తారు.

అనుభవాలు వివరించిన రైతులు
ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు సందర్భంగా నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు సందర్భంగా శుక్రవారం రైతుల చర్చా వేదిక నిర్వహించారు. వివిధ పంటల ద్వారా గడించిన అనుభవాలను రైతులు తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు టి. విజయకుమార్ కు పంటలు, దిగుబడుల వివరాలు చెప్పారు. సాగులో వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జీడిపప్పు అధిక దిగుబడి రావడం ద్వారా ఆదాయం పెరిగినట్లు గిరిజన రైతులు చెప్పారు. అన్నపూర్ణ నమూనాలపై పరి నాయుడు, గిరిలక్ష్మి నమూనాలపై కృష్ణారావు, అయిదు పొరల నమూనాలపై అవినాష్, దేశీయ విత్తనాల గురించి దేవుళ్లు, వాసన్, రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంపై డి.వి.రాయుడు ప్రసంగించారు. చంద్రశేఖర్, ప్రభాకర్ లు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జీ.మురళీధర్ 2018 ఐ-సీఆర్ పీలు, సీఆర్పీలు, ఎన్ఎఫ్ఎఫ్ ల అజెండాలు తెలిపారు. రైతులు ఖరీఫ్ లో మిశ్రమ పంటల గురించి, తమ అనుభవాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఖరీఫ్ తరువాత తీసుకోవలసిన చర్యల గురించి రైతులు చర్చించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులతో ప్రాంగణంలో పండుగ వాతావరణ నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.   ఎన్ బీఎన్ఎఫ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.