Jun 2, 2018



దేశానికి, ప్రపంచానికి ప్రకృతి సేద్యమే శరణ్యం

ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
            గుంటూరు, జూన్ 2: ఈ దేశానికి, ప్రపంచానికి ప్రకృతి సేద్యమే శరణ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బైబిల్ గ్రౌండ్స్ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రకృతి వ్వవసాయదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో పట్టుదలతో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న లక్షా 63 వేల మందిని అభినందించారు. ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసే డ్వాక్రా మహిళలపై ప్రశంసలు కురింపించారు. ఈ ఏడాది 5 లక్షల మంది రైతులను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ(జెడ్ బిఎన్ ఎఫ్)  విధానంలోకి తీసుకురావడానిక లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.ఇందుకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. దేశంలో మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
ప్రపంచంలో ఎక్కడా చేయని స్థాయిలో మనం ఇక్కడ ప్రకృతి సేద్యం చేస్తున్నామన్నారు. ఈ రోజు ఇక్కడ ఈ వ్యవసాయవిధానానికి సంబంధించి  ఏపీ ప్రభుత్వం, సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ (ఎస్ఐఎఫ్ఎఫ్) సంస్థ మధ్య జరిగిన ఒప్పందం  చరిత్రాత్మకం అని, రాష్ట్ర చరిత్రలో ఇది ఓ సువర్ణ అధ్యాయం అన్నారు.
ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల తాత్కాలికంగా దిగుబడి పెరిగినా, తరువాత ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు నష్టపోవడమే గాక భూసారం క్షీణించిందని, పూర్తిగా వాతావరణ కాలుష్య ఏర్పడిందని   చెప్పారు. క్రిమిసంహారక మందులు చల్లిన ఆహారం తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రకృతి సేద్యం వల్ల వ్యవసాయ ఖర్చులు తక్కువ, దిగుబడి ఎక్కువతోపాటు పర్యావరణం కూడా దెబ్బతినదని చెప్పారు. అంతేకాకుండా వినియోగదారుడికి కలుషితం కానటువంటి ఆహారం లభిస్తుందని తద్వారా ఆస్పత్రుల ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మనం దేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. రైతులు, మహిళలు ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మన రైతులు ఈ వ్యవసాయ విధానానికి రాయభారులుగా ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఐటీ రంగంలో నెంబర్ 1 గా ఉందని, ఇక ముందు ఈ ప్రకృతి సేద్యంలో నెంబర్ 1 ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సేద్యంలో ఇంత విజయం సాధించిన ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, వ్యవసాయ సిబ్బందిని, రైతులను, ముఖ్యంగా మహిళా రైతులను అభినందించారు. రాష్ట్రంలో ఆదర్శవంతులైన రైతులు ఉండటం వల్ల వ్యవసాయరంగంలో దేశంలో నెంబర్ 1 గా నిలిచామన్నారు. ఈ రంగంలో జాతీయ వృద్ధి రేటు 3 శాతం ఉంటే, రాష్ట్రంలో 18 శాతం ఉందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నారు. ప్రకృతి వ్వవసాయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇక్కడకు వచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  భవిష్యత్ లో రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. రైతులలో ఉత్సాహం నింపేవిధంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భవిష్యత్ లో మనం తినే ఆహారం ఏ పొలంలో, ఏ రైతు పండించాడో తెలుసుకునే టెక్నాలజీ వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయానకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని భావిస్తుందన్నారు.
అంతకు ముందు సీఎం చంద్రబాబు సమక్షంలో  ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు  సత్య త్రిపాఠి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణకు సంబంధించిన ఒప్పంద(ఎంఓయు) పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశానికి, ప్రపంచానికే ఆదర్శం
రెండున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందిందని, ఈ విషయంలో శ్రమించిన విజయకుమార్ ని, రైతులను దేశవిదేశీ నిపుణులు ప్రసంసించారు. హాజరైన రైతులలో ఉత్సాహాన్ని, వారు పండించిన పంటల ఎగ్జిబిషన్ ను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసాయరహిత ఆహారం అందించడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మనం అందించే ఓ గొప్ప వరంగా అభివర్ణించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నూతన విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. వీరి పట్టుదల, శ్రమ, చంద్రబాబు వంటి సమర్ధుడైన నాయకుడు ఉన్నందున ఈ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం, అంతర్జాతీయంగా వివిధ సంస్థల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారన్న   ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా రైతులు 21వ శతాబ్ధంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభిస్తారన్నారు. వీరు అనుసరించే విధానాలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అమలు చేయవచ్చని చెప్పారు.
 ఆనారోగ్యం కారణంగా రాలేకపోయిన ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ వీడియో ప్రసంగాన్ని ప్రసారం చేశారు. మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని పేర్కొన్నారు. ఈ వ్యవసాయ విధానానికి ఏపీలో ప్రభుత్వ మద్దతు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్ మాట్లాడుతూ విప్లవాత్మక మార్పుకు ఏపీలో నాంధి పలికారన్నారు. ఇక్కడ పాలేకర్ వ్యవసాయ విధానం ఒక సమూహ ఉద్యమంగా చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ఈ సదస్సుకు 8 వేల మంది హారజరు కావడం, ఈ వ్యవసాయ విధానాన్ని లక్షా 60 వేల మంది అనుసరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన సరైన తీరిలో ఖర్చు చేశారన్నారు.  ప్రపంచ  బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఫండ్ వంటి సంస్థలు ఏపీకి నిధులు సమకూర్చాలన్నారు.
ఇండోనేషియా  మాజీ మంత్రి డాక్టర్ కుంటోరో మాట్లాడుతూ ఈ విధానంలో సన్న, చిన్నకారు రైతులకు భద్రత ఉంటుందన్నారు. ఇండోనేషియాలో కూడా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థతో కలసి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్  సంస్థ చైర్మన్ సన్నీ వర్గీస్ మాట్లాడుతూ రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇక్కడ రైతులను, వారు పండించిన పంటలను స్వయంగా చూశానని, ఇక్కడ ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ ప్రంపంచాన్ని మారుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రైతులు శాస్త్రవేత్తలని, వారికి ప్రభుత్వం సహకారం అందిస్తే మంచి  ఫలితాలు వస్తాయన్నారు.
ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి మాట్లాడుతూ ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం చేయడంతోపాటు ఇక్కడకు 8 వేల మంది రైతులు రావడం చాల సంతోషంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమానికి సహకారం అందేంచే జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆయన అభినందించారు.


స్వాగతోపన్యాసం చేసిన విజయకుమార్ సీఆర్పీ(కమ్యునిటీ రిసోర్స్ పర్సన్)లను,  రైతులను హీరోలుగా పేర్కొన్నారు. దేశంలో ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రం ఏపీ కాబోతుందని ప్రకటించారు. ఇక్కడి రైతుల శ్రమ గుర్తుంచుకోదగినదన్నారు. వారు రోల్ మోడల్ గా నిలిచారని చెప్పారు. మహిళా రైతులను, సీఆర్పీలను ప్రత్యేకంగా అభినందించారు. 2024 నాటికి 60 మందిని ఈ వ్యవసాయం వైపు మార్చడానికి సీఆర్ పీలు  సైనికుల్లా పని చేయాలని, ఒక్కక్కరు అయిదుగురు సీఆర్పీలను, వంద మంది రైతులను మార్చాలని కోరారు.
వ్యవసాయ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ రాజశేఖర్  మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక దినం అని, రైతులు నవ నిర్మాణ దీక్ష చేపట్టారని అన్నారు. అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో గుర్తింపు తీసుకువచ్చారని రైతులను ప్రశంసించారు. ఈ వ్యవసాయ పద్దతితో రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం  మెరుగు పడుతాయని, పర్యావరణ సమతౌత్యత ఏర్పడుతుందన్నారు. కాలుష్యానికి ఇదే పరిష్కారం అని చెప్పారు.
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్ది చంద్రమోహన రెడ్డి అమెరికా వెళ్లినందున సదస్సుకు రాలేకపోయారు. ఆయన సందేశాన్ని విజయకుమార్ చదివి వినిపించారు.
 ఈ సదస్సులో బీఎన్ పీ పారిబాస్ గ్లోబల్ సభ్యుడు ఆంథోని సిరే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పవన్ సుఖదేవ్, అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సీఈఓ అనంత పద్మనాభన్, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ డెప్యూటీ జనరల్ ఆప్ రిసెర్చ్ డాక్టర్ రవి ప్రభు, యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ యూరి, ఎఫ్ఏఓ సంస్థ అధినేత శ్యామ్ గడ్కా తదితరులు ప్రసంగించారు.
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గఢించిన  రైతులు రోశయ్య, పుష్పవతి, మహాలక్ష్ముడు, సిరిజ తమ అనుభవాలను, ఈ వ్యవసాయం వల్ల గఢించిన లాభాలను తెలిపారు. ఈ సదస్సులో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పలు  కార్యక్రమాలు నిర్వహించారు.

ఎరిక్ సోల్ హైమ్ నూతక్కి సందర్శన
ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్, ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి శనివారం సాయంత్రం నూతక్కి గ్రామం సందర్శించారు. అక్కడ సాగు చేస్తున్న జడ్ బీఎన్ఎఫ్ పంటలను పరిశీలించారు. సుదీర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని చూశారు. ఆ తరువాత మహిళా సంఘాల సభ్యులను కలసి ఖరీఫ్ ప్లాన్ ఎలా చేశారో అడిగి తెలుసుకున్నారు. ఉషా రాణి నిర్వహించే ఎన్ పీఎం షాపుని పరిశీలించారు. అక్కడ అమ్మే ఘనద్రవాలను, కషాయాలను పరిశీలించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...