Jun 11, 2018


బీసీ,బడుగు,బలహీనవర్గాల పార్టీ టీడీపీ

మంత్రి కాలవ శ్రీనివాసులు

                    సచివాలయం, జూన్ 11: వెనుకబడిన తరగతులు, బడుగు, బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి బీసీల సంక్షేమానికి ఒక డిక్లరేషన్ ప్రకటిస్తానని చెప్పారని, వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే బీసీలకు తీరని అన్యాయం జరిందన్నారు. ఆయన పాలనలో బీసీల అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. 2008లో 8 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. 26 కులాలను బీసీల జాబితాలో చేర్చారని, దామాషా పద్దతిలో వారికి లబ్ది చేకూర్చలేదన్నారు. వారి పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని మండిపడ్డారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని, పార్టీకి వారు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీని దెబ్బతీయడానికి ఆనాడు బీసీల అణచివేతకు పూనుకున్నారని విమర్శించారు. ఆనాడు బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు వేల కోట్లలో పేరుకుపోతే వారు రక్తం అమ్ముకొని ఫీజులు చెల్లించారని చెప్పారు. రాజకీయంగా కూడా వారిని ప్రోత్సహించలేదన్నారు. వారిని దరిదాపులకు కూడా రానివ్వలేదని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం తొలి నుంచి టీడీపీ కృషి చేస్తోందన్నారు. కీలకమైన పదవుల్లో  బీసీలే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రి వర్గంలో 8 మంది మంత్రులు బీసీలే ఉన్నారని, టీటీడీ చైర్మన్ గా కూడా బీసీనే నియమించారని వివరించారు. గతంలో కూడా ఎర్రన్నాయుడు, దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణ మూర్తి వంటి బీసీలే కీలక పదవులు అలంకరించారని చెప్పారు. అత్యంత వెనుకబడిన గాండ్ల సామాజిక వర్గానికి చెందిన గౌనివాని శ్రీనివాసులుకు శాసన మండలి సభ్యుని చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు.
జగన్ వెంట కేసుల్లో, రాజకీయాల్లో ఉన్నది ఆయన సామాజిక వర్గం వారేనని తెలిపారు. ఏ1 ముద్దాయి ఆయన అయితే, ఏ2 ముద్దాయి ఆయన సామాజిక వర్గానికి చెందినవారేనన్నారు. 2014లో ఎంతమంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. అనంతపురంలో రెండు లోక్ సభ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పి చివరికి ఆయన సామాజిక వర్గానికే ఇచ్చారన్నారు. ఆయన కుడి, ఎడమ, ముందు, వెనుక ఉన్నది ఎవరో, మొన్న ఒక్క రాజ్యసభ స్థానం ఎవరికి ఇచ్చారో అందరికి తెలుసన్నారు. ఏ బీసీ నాయకుడినైనా ప్రోత్సహించారా? ఏ బీసీ నాయకుడి భుజం మీదనైనా చేయి వేసి మాట్లాడావా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో 63 కీలకమైన స్థానాల్లో ఆయన సామాజిక వర్గం వారే ఉన్నారని చెప్పారు. జగన్ తాతగారు దగ్గర నుంచి వెంకట సుబ్బయ్య హత్య దగ్గర నుంచి బీసీలకు జరిగిన నష్టాలు ఒక పుస్తకమే రాయవచ్చన్నారు.

బీసీ సబ్ ప్లాన్ ని అమలు చేసింది టీడీపీ అని చెప్పారు. వైఎస్ హయాంలో 5 ఏళ్లో ఫెడరేషన్లకు రూ.152.27 కోట్లు కేటాయిస్తే, గత నాలుగేళ్లలో రూ.1376 కోట్లు ఖర్చు చేయగా, 2 లక్షల 70 వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. 2004-09 మధ్య కాలంలో ఉపకార వేతనాల ద్వారా 19 లక్షల 49వేల మంది లబ్ది పొందితే, తమ హయాంలో ఈ నాలుగేళ్లలో రూ.2,963 కోట్లు ఖర్చు చేయగా, 36 లక్షల 51వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. అంతేకాకుండా విదేవి విద్య పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీల సంక్షేమం, వారి అభివృద్ధి, వారికి రాజకీయ అవకాశాల గురించి జగన్ మాట్లాడకుండా ఉండటమే మంచిదన్నారు. జగన్ రోజుకు 13 కిలో మీటర్లు తలక్రిందలుగా పాదయాత్ర చేసినా బీసీలు ఆయన దగ్గరకు చేరరన్నారు. తెలుగు దేశం పార్టీ ఆనాడు పెట్టకతోపే బీసీలు కనీసం గుర్తింపునకు కూడా నోచుకునేవారు కాదని కాలవ శ్రీనివాసులు అన్నారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...