Jun 12, 2018


ఎమ్మార్పీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా మార్పు రావాలి
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

                 సచివాలయం, జూన్ 12: ధరల నియంత్రణకు తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని,  అయితే వ్యాపారులు ఎమ్మార్పీ(గరిష్ట చిల్లర ధర) పెంచేస్తున్నారని, అందువల్ల దేశవ్యాప్తంగా ఎమ్మార్పీ వ్యవస్థలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో అర లీటర్ మంచినీరు బాటిల్ పై ఎమ్మార్పీ రూ.40ల ధర ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో ఓ మారు మూల గ్రామంలో కూడా లీటర్ మంచినీటి బాటిల్ పైన రూ.100 ధర ఉందని తెలిపారు. వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు 13 మందికి ఫ్రీ బస్ పాస్ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అయిదున్నర ఏళ్ల తరువాత ఈ మండలి సమావేశం ఏర్పాటు చేసినందుకు సభ్యులు అభినందనలు తెలిపారు.  సభ్యులు కొన్ని ప్రధానమైన అంశాలను లేవనెత్తారు. బస్టాండ్లలో యూరినల్స్ కు వెళ్లడానికి రూ.5లు వసూలు చేస్తున్నారని, దానిని ఉచితం చేయాలని, లేదా ఒక రూపాయి మాత్రమే వసూలు చేయాలని కోరారు. మచిలీపట్నంలో ఒక ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్ కట్ చేస్తున్నారని చెప్పారు. చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ లలో తూనికలు తక్కువగా తూస్తున్నారని, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కర్ర కాటాలు వాడుతున్నారని తెలిపారు. జనరిక్ మందుల ధరలు ఎక్కువగా తీసుకుంటున్నారని, బస్టాండ్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటున్నారని చెప్పారు. మందులకు సంబంధించి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రతి జిల్లాకు ఓ వినియోగదారుల అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీవారు పండుగల సందర్భంగా ఛార్జీలు పెంచి, బస్సులు మాత్రం పల్లె వెలుగు బస్సులు నడుపుతున్నారని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద కొన్ని ప్రాంతాల్లో కోడి గుడ్డు ఇవ్వడంలేదని చెప్పారు. డాక్టర్లు మందుల పేర్లు స్పష్టంగా రాయడంలేదని, జనరిక్ మందుల పేర్లు రాయడంలేదని తెలిపారు. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులపై ఫిర్యాదు చేశారు.  స్టెమ్ సెల్ బ్యాంక్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారని, సెల్స్ ని నిల్వ చేయడానికి తగిన రక్షణ కేంద్రాలు లేవని చెప్పారు. కొన్ని చోట్ల జీఎస్టీ నెంబర్ లేకుండా అదనంగా జీఎస్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. నర్సరీలలో నకిలీ మొక్కలు అమ్ముతున్నారని, రైతులు నష్టపోతున్నారని తెలిపారు. చీరలు, రెడీమేడ్ దుస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు జరపడానికి డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ పైన 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. పట్టణాలలో మంచినీటి పైప్ లైన్లు 40 నుంచి 60 ఏళ్ల క్రితం వేసినవి కావడంతో మధ్యమధ్యలో లీకై మురుగు నీరు వస్తుందని చెప్పారు. అనుమతి లేకుండా ప్రతి సందులో, గొందులో మంచినీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల మీ సేవలో అదనంగా రూ.10లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలో ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారని, 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వడంలేదని, కనీస సౌకర్యాలు లేవని, షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నారని, గుర్తింపులేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారని వివరించారు. జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పుల అమలుకు పోలీసు శాఖ సహకారం కావాలని కోరారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, లీగల్ మెట్రాలజీ ఐజీపీ ఈ.దామోదర్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఇన్ చార్జి అధ్యక్షులు డాక్టర్ ఏ.రవి శంకర్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, డాక్టర్ మంజరీ, 13 జిల్లాలకు చెందిన  వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు, తూనికలు, కొలతలు, ఆర్టీసీ, రైల్వే, పంచాయతీరాజ్, మునిసిపల్, పట్టణాభివృద్ధి, ప్రాథమిక విద్య, వాణిజ్య పన్నులు, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన, డ్రగ్ కంట్రోల్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...