Jun 4, 2018


ప్రకృతి వ్యవసాయానికి అపూర్వ స్పందన
Ø   పర్యావరణానికి, భూసారానికి రక్షణ          
Ø   దిగుబడి ఎక్కువ  రైతుకు ఆదాయం అధికం
Ø  వినియోగదారులకు ఆరోగ్యానికి రక్షణ  ఆస్పత్రి బిల్లు తక్కువ
Ø   ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతుల్లో ఉత్సాహం
Ø   జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధినేతల ప్రశంసలు
Ø   సుభాష్ పాలేకర్ ని దేవుడిగా అభివర్ణించిన రైతులు
        
      
   ఆంధప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడి తీవ్రంగా భూసారం దెబ్బతినడంతోపాటు తీవ్రంగా నష్టపోయిన రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్) వైపు మళ్లుతున్నారు. ఉద్యానవన పంటల రైతులు కూడా ఈ పద్దతిలోనే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల భూమికి, పర్యావరణానికి, ఆ ఉత్పత్తులు ఆహారంగా తీసుకునే మానవాళికి ప్రమాదం. ప్రకృతి వ్యవసాయం ఒక్కటే దీనికి పరిష్కారం.  అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు పెరుగుతోంది. ఈ పద్దతి సాగు చేయడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. సహజసిద్ధంగా భూమి నుంచి లభించే సారంతో దిగుబడులు పెరుగుతాయి. నీటి వినియోగం కూడా తక్కువే. నెల రోజుల పాటు వర్షం కురవకపోయినా పంట తట్టుకోగలుగుతుంది. ప్రతికూల వాతావరణంలో కూడా పంటలు పండుతాయి. తద్వారా మానవాళికి రసాయనికంగా కలుషితం కాని ఆహారం అందించగలుగుతాం. పర్యావరణానికి రక్షణ లభిస్తుంది. వినియోగదారులకు ఆస్పత్రి బిల్లు కూడా తగ్గుతుంది.  ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అనే అంతర్జాతయ సంస్థలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దానికి తోడు మన దేశంలో, రాష్ట్రంలో ఈ ప్రకృతి వ్యవసాయానికి పితామహుడైన సుభాష్ పాలేకర్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ విధానం వల్ల లాభాలను చెప్పి రైతులలో అవగాన కల్పించి, వారిని చైతన్యవంతులను చేసే బాధ్యతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయకుమార్ కు అప్పగించింది.  రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయన దీనిని  ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్నారు.

          రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో జడ్ బీఎన్ఎఫ్ ని ప్రవేశపెట్టి, 2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లలో మంచి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో లక్షా 63వేల మంది రైతులు 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నారు.  ప్రభుత్వం కూడా 2018ని  ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.     ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం దేశంలో నెంబర్ 1 గా నిలిచింది. 2021-22 నాటికి రాష్ట్రంలో  అన్ని మండలాలలోని 7.5 లక్షల మంది  రైతులకు దీనిని  చేర్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2023-24 నాటికి 12,924 అన్ని గ్రామ పంచాయతీలలో 60 లక్షల రైతు కుటుంబాలను ఈ కార్యక్రమం కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  2025-26 నాటికి ఏపీలో సాగుచేసే మొత్తం ప్రాంతం జడ్ బీఎన్ఎఫ్ పరిధిలోకి తీసుకురావాలన్న కృతనిశ్ఛయంతో ఉంది. ఈ క్రమంలోనే జూన్ 2 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగుచేసే రైతులు, రైతు మహిళలు 8వేల మందితో  సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే పలు సంస్థల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. వారంతా ఇక్కడ హాజరైన రైతులను, వారి పండించిన వివిధ రకాల ఉత్పత్తులను  చూసి ఆశ్చర్యపోయారు. ఇంత భారీ స్థాయిలో జరిగే ఉత్పత్తిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రత్యేక శ్రద్ధను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పలువురు  తమ అనుభవాలను, వారికి వచ్చిన లాభాలను వివరించారు.

          ముఖ్య అతిధిగా విచ్చేసి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హైమ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నూతన విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. వీరి పట్టుదల, శ్రమ, చంద్రబాబు వంటి సమర్ధుడైన నాయకుడు ఉన్నందున ఈ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం, అంతర్జాతీయంగా వివిధ సంస్థల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారన్న   ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా రైతులు 21వ శతాబ్ధంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభిస్తారన్నారు. వీరు అనుసరించే విధానాలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అమలు చేయవచ్చని చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్ మాట్లాడుతూ విప్లవాత్మక మార్పుకు ఏపీలో నాంధి పలికారన్నారు. ఇక్కడ పాలేకర్ వ్యవసాయ విధానం ఒక సమూహ ఉద్యమంగా చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ఈ సదస్సుకు 8 వేల మంది హారజరు కావడం, ఈ వ్యవసాయ విధానాన్ని లక్షా 60 వేల మంది అనుసరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన సరైన తీరిలో ఖర్చు చేశారన్నారు.  ప్రపంచ  బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఫండ్ వంటి సంస్థలు ఏపీకి నిధులు సమకూర్చాలన్నారు. ఇండోనేషియా  మాజీ మంత్రి డాక్టర్ కుంటోరో మాట్లాడుతూ ఈ విధానంలో సన్న, చిన్నకారు రైతులకు భద్రత ఉంటుందన్నారు. ఇండోనేషియాలో కూడా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థతో కలసి ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్  సంస్థ చైర్మన్ సన్నీ వర్గీస్ మాట్లాడుతూ రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇక్కడ రైతులను, వారు పండించిన పంటలను స్వయంగా చూశానని, ఇక్కడ ఈ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ ప్రంపంచాన్ని మారుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రైతులు శాస్త్రవేత్తలని, వారికి ప్రభుత్వం సహకారం అందిస్తే మంచి  ఫలితాలు వస్తాయన్నారు. ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు సత్య త్రిపాఠి మాట్లాడుతూ ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం చేయడంతోపాటు ఇక్కడకు 8 వేల మంది రైతులు రావడం చాల సంతోషంగా ఉందన్నారు. జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమానికి సహకారం అందేంచే జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆయన అభినందించారు. యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ యూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల అంకిత భావం తనకు నచ్చిందన్నారు. హాజరైన రైతులకు అభినందనలు తెలిపారు. ప్రపంచ జనాభా 2050 నాటికి 900 కోట్లకు చేరుతుందని, వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార పదాలు అందించవలసిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అభినందించారు. ఇన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలకు తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పరిచయం చేయవలసి ఉందన్నారు. అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సీఈఓ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నమ్మలేకపోయామని, ఇప్పుడు స్వయంగా చూస్తున్నామన్నారు. నైరోబీకి చెందిన వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ డెప్యూటీ జనరల్ ఆప్ రిసెర్చ్ డాక్టర్ రవి ప్రభు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అభినందనలు తెలిపారు. జడ్ బీఎన్ఎఫ్ సాగులో శాస్త్రీయత ఉందని, దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం ఇవ్వలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తగా కొనియాడారు. ఎఫ్ఏఓ సంస్థ అధినేత శ్యామ్ గడ్కా మాట్లాడుతూ పాలేకర్ విధానానికి ఏపీ ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడం ఇందులో ముఖ్య అంశాలని, ఈ సాగులో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ లభిస్తుందని, భవిష్యత్ లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయిన చెప్పారు. బీఎన్ పీ పారిబాస్ గ్లోబల్ సభ్యుడు ఆంథోని సిరే మాట్లాడుతూ మంచి స్పూర్తిని ఇచ్చే కార్యక్రమం చేపట్టారని అభినందించారు. ఈ కార్యక్రమానికి వనరులు సేకరించడంలో తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పవన్ సుఖదేవ్ ప్రస్తుతం  రసాయన ఎరువులతో పండిన  ఆహార పదార్ధాలు ప్రమాదకరం అని, అవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బీటీ, డయాబిటీస్, ఒబిసిటీ, కేన్సర్ వంటి వ్యాధులకు కారణం ఈ ఆహారమేనని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.   ఈ వ్యవసాయం చేయడం అంటే మానవ జాతికి గొప్ప సేవచేసినట్లేనన్నారు. ప్రపంచంలోని ఇన్ని ముఖ్య సంస్థలు ఇక్కడ కలవడం, సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.

రైతుల అనుభవాలు, అభిప్రాయాలు
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గఢించిన  రైతులు రోశయ్య, పుష్పవతి, మహాలక్ష్ముడు, సిరిజ తమ అనుభవాలను, ఈ వ్యవసాయం ద్వారా గఢించిన లాభాలను వివరించారు. ఈ వ్యవసాయ విధానాలను తెలిపిన సుభాష్ పాలేకర్ ని దేవుడిగా అభివర్ణించారు.  విజయకుమార్ తమకు అన్ని విధాల సంపూర్ణంగా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

75 ఏళ్ల వృద్ధుడు రోశయ్య: 1960 నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. గాలి,వానలు, తుఫాలను ఎన్నిటినో చూశాను. వ్యవసాయంలో ఒడిదుడుకులు అన్నిటి ఎదుర్కొన్నాను. నాకు ప్రస్తుతం 75 సెంట్ల భూమి ఉంది. అందులో కొబ్బరి తోట వేశాను. నాలుగేళ్ల నుంచి పాలేకర్ చెప్పిన విధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. ఆ పొలంలోనే నిమ్మ, సపోటా, అరటి, పైనాపిల్ చెట్లు పెంచుతాను. అంతర్ పంటలు వేస్తాను. ఈ వయసులో కూడా ఇప్పటికీ నేనే కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోస్తాను, నేనే అమ్ముతాను.  గత ఏడాది రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ భారీ కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు 24 ఏళ్ల వయసు వచ్చింది. పాలేకర్ నాకు దేవుడు. విజయకుమార్ గారు నాకు స్పూర్తినిస్తూ సీఆర్పీగా తీసుకొని ప్రోత్సహిస్తుననారు.

పుష్పవతి : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 13 ఏళ్లకే పెళ్లి అయింది. ఆమెకు 18 ఏళ్లు వయసు వచ్చేసరికి భర్త చనిపోయారు. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. అనుభవాలు ఆమె మాటల్లోనే.....నాకు 65 సెంట్లు భూమి ఉండేది. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడి వ్యవసాయం చేశాను. చాలా నష్టపోయాను. అప్పుల పాలయ్యాను. ఆ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాను. కాకినాడలో జరిగిన పాలేకర్ గారి శిక్షణా శిబిరానికి హాజరయ్యాను. ఒక ఎకరంలో వంగ, టమోటా పండించాను. ఎకరానికి రూ.6వేల పెట్టుబడి పెడితే, లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది.  రు.12 లక్షల అప్పులు తీర్చాను. ఆరు ఎకరాలు పొలం కొన్నాను. సొంతం ఆరు ఎకరాలు, ఎకరంన్నర కౌలుకు తీసుకున్నాను. మొత్తం ఏడున్నర ఎకరాలు సాగు చేస్తున్నాను. మొక్కజొన్న, వేరుశనగ, కంది వంటి పలు పంటలు పండిస్తాను. రూ.50 వేలు ఖర్చు చేస్తే, రూ.3.5 లక్షల ఆదాయం వచ్చింది. పాలేకర్ కి తల వంచి నమస్కరిస్తున్నాను. నా కూతురు డిగ్రీ చదువుతోంది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు.  నేను మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. ప్రతి పేద కుంటుంబం నెలకు పది వేల రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. అది ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుంది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా పురుష స్వయం సహాయక సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి.

మహాలక్ష్మణుడు:  నేను గతంలో లెక్చరర్ గా పని చేసేవాడిని. మాకు ఎకరంన్నర మామిడి తోట ఉండేది. మా నాన్న ఆ తోట పనులు చూసేవారు. రసాయన ఎరువులు, పురుగులు మందులు వాడటం వల్ల తోటలోని చెట్లు నిర్జీవమయ్యాయి. అప్పుడు నేను ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. జీవామృతం, ఘనజీవామృతం వంటి వాటిని వాడాను. మామిడి చెట్లు చిగురించాయి. అంతర్ పంటలుగా ఆకు కూరలు వేశాను. మామిడి దిగుబడి పెరిగింది. నికర ఆదాయం రూ.1.50లక్షలు వచ్చింది. ఆ తరువాత రూ.1.80 లక్షలు వచ్చింది. వంగలో అంతర్ పంటగా క్యాజేసీ వేశాను. ఆదాయం పెరిగింది. నన్ను సీఆర్పీ(కమ్మునిటీ రిసోర్స్ పర్సన్)గా ఎంపిక చేశారు. ఢిల్లీ సెమినార్ కు కూడా వెళ్లాను. కృష్ణా జిల్లాలోని మా పొలం చూడటానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి అధికారులు మా పొలం వరకు రోడ్డు వేశారు.  నీటి సదుపాయం కల్పించారు. ఆ తరువాత రైతులు కూడా జడ్ బీఎన్ఎఫ్ సాగు చేయడానికి ముందుకు వచ్చారు. మీడియా ప్రచారం ద్వారా మా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగింది. డ్వాక్రా మహిళల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. నేను లెక్చరర్ ఉద్యోగం మానివేశాను. ఇదే లాభదాయకంగా ఉంది.

వెంకటలక్ష్మి : విజయనగరం జిల్లాకు చెందిన వెంకట లక్ష్మి శ్రీకాకుళం జిల్లా కొండప్రాంతాల్లో గిరిజనులు నివశించే చోట జడ్ బీఎన్ఎఫ్ సీఆర్పీసీ గా వ్యవహరిస్తున్నారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే..... కొండ ప్రాంతానికి, భాష తెలియని ప్రాంతానికి పంపారు. మొదట్లో భయపడ్డాను. విజయ కుమార్ గారు మా గురువు. నాకు ధైర్యం చెప్పారు. దాంతో గిరిజనులకు నచ్చజెప్పి 163 మందిని ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాను. అక్కడ పైనాపిల్ ఎక్కువగా పండిస్తారు. అంతర్ పంటలు వేయడం మొదలు పెట్టాం. ఎకరానికి రూ.1.80లక్షల ఆదాయం వస్తోంది. పసుపు,మామిడి అన్ని పంటలు ప్రకృతి వ్యవసాయం పద్దతిలో సాగుచేస్తున్నాం. ప్రకృని కాపాడే సైనికురాలిలా పని చేస్తున్నాను. చివరి వరకు ఇలాగే కొనసాగుతాను.

ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయత గురించి విజయ కుమార్ ని ప్రశ్నిస్తే ‘‘మా రైతులు శాస్త్రవేత్తలు, రసాయనాలు, పురుగుల మందులు వాడకుండా పంటలు పండిస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. ఆ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్నాను. నేను, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంతకు మించిన శాస్త్రీయత ఏమి ఉంటుంది.’’ అని సమాధానం చెప్పారు. రైతుల సంక్షేమానికి, భూసారం,పర్యావరణ పరిరక్షణకు, మానవాళి ఆరోగ్య సంరక్షణకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...