Jun 11, 2018


కన్నా ఆధారాలు చూపి ఆరోపించు

మంత్రి కళా వెంకట్రావు
                    సచివాలయం, జూన్ 11: కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి విమర్శించడం, ఆరోపించడం, టీడీపీని తిట్టడం అలవాటైపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్  పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు చూపించి ఆరోపణలు చేయాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో కొన్ని పద్దతులు ఉంటాయని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ విధానాలు, ఎన్నికల హామీలు, నాలుగేళ్లు ఎవరితో కలిసి ఉన్నారు వంటి విషయాలను తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఏదో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దుమ్ముదులుపుకొని వెళ్లడం సరికాదన్నారు. చట్టపరంగా, రాజ్యాంగపరంగా చేయవలసినవి ఉన్నాయని, వాటిని దృష్ఠిలోపెట్టుకొని మాట్లాడాలన్నారు. 2019లో గెలుస్తామని చెబుతున్నారు, ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తోరో చెప్పగలరా? అని అడిగారు. 2014లో టీడీపీతో కలవడం వల్లే ఆ సీట్లైనా గెలిచారన్నారు. నాలుగు ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ సీపీ నేత జగన్మోహన రెడ్డితో స్నేహం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ప్రశ్నకు ప్రశ్న ఉండదని, సమాదానం ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ వంటి నేతతో స్నేహం చేస్తూ మీరు అవినీతి గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో ఒకసారి ఆలోచించాలన్నారు. బీజేపీని 4 ఏళ్లు నమ్మామని చెప్పారు.

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటని ప్రశ్రించారు. చట్టబద్దంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అడిగారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పగటి కలలు కంటున్నారన్నారు.  ప్రస్తుత బీజేపీ ఎమ్యెల్యేలంతా ఎవరి అండతో గెలిచారో మరిచిపోయారా అని ప్రశ్నించారు.  2014 సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తులేకుండా పోటీ చేసిన బీజేపీ ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా గెలవలేదని గుర్తు చేశారు.    కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేంటో ప్రజల్లోకి వెళ్లి చెప్పే దమ్ముందా? ప్రత్యేక హోదా సహా విభజన హామీల గురించి ప్రజలు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించే మీకు నిన్నటి వరకు ఆ అవినీతి కనిపించలేదా?,   అధికారం పంచుకున్నపుడు లేని అవినీతి విడిపోయిన తర్వాత, పదవులు కోల్పోయిన తర్వాతే కనిపిస్తోందా? అని అడిగారు. అవినీతి అవినీతి అంటున్న మీకు.. చిత్తూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, నెలకొల్పుతున్న పరిశ్రమలు కనిపించటంలేదా అని అడిగారు. అవినీతి ఆరోపణలు నిజమైతే అన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ఎలా  వస్తున్నాయో చెప్పాలన్నారు.    కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని, 24 గంటలు విద్యుత్ అందించడంతో పరిశ్రమలు స్థాపిస్తున్నారని, వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని, నదుల అనుసందానంతో వ్యవసాయ దిగుబడులు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.5 శాతం ఉందని ఇవి మీకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
 ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు పనిచేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. వైసీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న బీజేపీ ప్రజలను తప్పుదారిపట్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 12 అవినీతి కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్ పై బీజేపీ నాయకులు ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. ఈడీ అటాచ్ మెంట్లను కూడా వెనక్కి తీసుకున్నారని, దీనిని బట్టి వీరి రహస్య బంధం తేటతెల్లమవుతోందన్నారు.    అవినీతి కేసుల విషయంలో సత్వర విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని 2014 ఎన్నికల సమయంలో చెప్పిన బీజేపీ ఆ విషయాన్ని విస్మరించి దోషులతోనే దోస్తీ చేస్తోందన్నారు. ఏ-1, ఏ-2 ముద్దాయిలు జగన్, విజయసాయిరెడ్డిలతో కలిసి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో చెప్పాలన్నారు.
ప్రధానిని ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు
ప్రధాన మంత్రిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై గవర్నర్ కు కన్నాతో సహా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని 135 కోట్లకు సేవకుడని, సేవలో లోపాలు ఉంటే ప్రశ్నిస్తారన్నారు.  ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని 18 హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా? అని అడిగారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వమని కోరడం మీకు కించపరిచినట్లు కనిపిస్తోందా? అని అడిగారు.  విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన, ప్రత్యేక హోదా ఇస్తానని నమ్మించి మోసం చేసిన ప్రధానిని నిలదీయవద్దంటారా? వైకాపా నాయకుల్లా భయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు.  
సంస్కారవంతమైన భాష గురించి, ప్రజాస్వామ్యం గురించి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు   కుటుంబరావు  లేవనెత్తిన అంశాలకు సమాధానమివ్వలేక ఆయన పైన వ్యక్తిగత దూషణలకు దిగజారారన్నారు. కుటుంబరావు లెక్కలు తెలిసిన వ్యక్తని, ఆయన స్పష్టంగా లెక్కలు చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ 1982లో  పుట్టినప్పటి నుంచి శాంతిభద్రతలకు వంద శాతం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిషా వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు గానీ నిరసన ప్రదర్శనలు ఇవ్వమని పార్టీ పిలుపు ఇవ్వలేదని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో బీజేపీ వంచించిందని ప్రజల్లో బాగా ఉందని, ప్రజాస్వామ్యంలో చిన్నచిన్న సంఘటనలు జరుగుతాయని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...